చంద్రునిపైకి ‘ఘోస్ట్‌’ ప్రయోగం | SpaceX launches two lunar landers; complete details here | Sakshi
Sakshi News home page

చంద్రునిపైకి ‘ఘోస్ట్‌’ ప్రయోగం

Published Wed, Jan 15 2025 12:29 PM | Last Updated on Wed, Jan 15 2025 3:59 PM

SpaceX launches two lunar landers; complete details here

హాథ్రోన్‌: అంతరిక్ష ప్రయోగాలకు ఈ మధ్యకాస్త గ్యాప్‌ వచ్చింది. అయితే 2025 ఆరంభంలోనే ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌(SpaceX) తన ప్రయోగాలను మొదలుపెట్టింది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా.. ఒకే రాకెట్‌తో ఏకంగా రెండు ల్యాండర్లను విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా ఒకేసారి రెండు మిషన్లను ప్రారంభించినట్లైంది!.  

భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం ఈ ప్రయోగం జరిగింది. ఫ్లోరిడాలోని నాసా(NASA) కెనెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌-9 రాకెట్‌ బ్లూ ఘోస్ట్‌-1, ఐస్పేస్‌కు చెందిన హకుటో-ఆర్‌2లను ల్యాండర్‌లను మోసుకెళ్లింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ స్పేస్‌ఎక్స్‌ వీటిని ప్రయోగించింది. ఈ రెండు వేర్వేరు దేశాలకు మాత్రమే కాదు.. వేర్వేరు టెక్నాలజీలకు చెందినవి కూడా. ఆయా నిర్ణీత రోజుల్లో అవి చంద్రుడి మీదకు దిగనున్నాయి. ఇంతకీ ఇవి స్విచ్ఛాఫ్‌ అయ్యేలోపు ఎలాంటి పనులు చేస్తాయంటే..  

ఘోస్ట్‌ ఏం చేస్తుందంటే.. 
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, కమర్షియల్‌ లూనార్‌ ప్లేలోడ్‌ సర్వీసెస్‌(CLPS)లో భాగంగా బ్లూ ఘోస్ట్‌-1ను రూపొందించారు. చంద్రుడిపై ఉన్న అతిపెద్ద పరివాహక ప్రాంతం మేర్‌ క్రిసియంలో ఇది దిగి.. పరిశోధనలు చేయనుంది. ఈ ల్యాండర్‌ చంద్రుడి మీదకు చేరుకోవడానికి 45 రోజలు టైం పడుతుంది. 

ఇది చంద్రుడిపై స్వతంత్రంగానే ల్యాండ్‌ అయ్యి.. రెండువారాలపాటు సైంటిఫిక్‌ ఆపరేషన్స్‌ నిర్వహిస్తుంది. అక్కడి పరిస్థితులను ఫొటోలు తీస్తుంది. అలాగే.. పది అడుగుల లోతులో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తుంది. అలాగే రెగోలిథ్‌(అక్కడి భూపొర)ను సేకరిస్తుంది. భూమికి చందద్రుడికి మధ్య లేజర్‌ కిరణాల సాయంతో దూరాన్ని కొలుస్తుంది. ఈ పనులన్నీ చేయడానికి పది సైంటిఫిక్‌ పరికరాలను మోసుకెళ్లింది. ఇది చంద్రుడిపై నిర్వహిస్తున్న అత్యాధునిక పరిశోధనగా నాసా చెబుతోంది. 

హకుటో చేసే పని ఇదే.. 
జపాన్‌కు చెందిన ఐస్పేస్‌ కంపెనీ హకుటో ఆర్‌2 అనే రీసైలెన్స్‌ ల్యాండర్‌ను రూపొందించింది. ఇది చంద్రుడి ఉత్తర గోళార్థంలోని మేర్‌ ఫ్రిగోరిస్‌లో అడుగుపెట్టనుంది. ఇందుకోసం ఈ ల్యాండర్‌కు 4 నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. కింది ఏడాది ఏప్రిల్‌లో ఐస్పేస్‌ ఇదే తరహా ప్రయోగాన్ని నిర్వహించినప్పటికీ.. సెన్సార్‌లు పనిచేయకపోవడంతో ల్యాండర్‌ క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. టెనాషియస్‌ అనే మైక్రోరోవర్‌ను హకుటో-ఆర్‌2 చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగిస్తుంది. అది అక్కడి రెగోలిత్‌ను సేకరిస్తుంది. 

చంద్రుడి మీద పరిశోధనలకు అంతరిక్ష పరిశోధన సంస్థలే కాదు.. ప్రైవేట్‌ కంపెనీలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రుడిపై మానవాన్వేషణలో మున్ముందు మరింత అత్యాధునిక ప్రయోగాలు జరిగే అవకాశం లేకపోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement