
తొలి ప్రైవేట్ ల్యాండర్‌గా రికార్డు
కేవ్ కెనావెరల్ (యూఎస్): చంద్రుడిపై మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ల్యాండర్ సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించింది. ఆదివారం అమెరికాలోని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ ల్యాండర్ ఆటోపైలట్ విధానంలో నెమ్మదిగా చందమామపై దిగింది. చంద్రుని ఈశాన్య కొనవైపు పురాతన అగ్నిపర్వత సానువుల్లో ఇది దిగిందని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ చీఫ్ ఇంజనీర్ విల్ కోగన్ ప్రకటించారు. ‘‘దశాబ్దకాలం క్రితం పురుడుపోసుకున్న మా అంకుర సంస్థ చరిత్ర సృష్టించింది.
బ్లూ ఘోస్ట్ ల్యాండింగ్ పలు గండాలను తప్పించుకుంది. ఇప్పుడు చంద్రుని ఉపరితలంపై స్థిరంగా ఉంది’’ అని పేర్కొన్నారు. గతంలో పలు దేశాలకు చెందిన ప్రైవేట్ సంస్థలు చంద్రునిపై ల్యాండర్లను దింపేందుకు ప్రయతి్నంచి విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అదుపు తప్పడం, క్రాష్ ల్యాండింగ్, కూలిపోవడం, ఒరిగిపోవడం వంటి అపశ్రుతులకు తావులేకుండా ఒక ప్రైవేట్ సంస్థ తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా చంద్రునిపై ల్యాండర్‌ను దించడం ఇదే తొలిసారి. దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్ మాత్రమే ఇప్పటిదాకా ఈ ఘనత సాధించాయి.
బ్లూఘోస్ట్ ల్యాండయిన అరగంటకే చంద్రుని పరిసరాల ఫొటోలు తీసి అమెరికాలో ఆస్టిన్ నగరంలోని సంస్థ మిషన్ కంట్రోల్ కేంద్రానికి పంపింది. అమెరికాలో అరుదైన పేడపురుగు జాతి అయిన బ్లూ ఘోస్ట్ పేరును ఈ ల్యాండర్‌కు పెట్టారు. నాలుగు కాళ్ల ఈ ల్యాండర్ ఎత్తు 2 మీటర్లు. వెడల్పు 3.5 మీటర్లు. జనవరి 15న ఫ్లోరిడాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఇది చంద్రునిపై ధూళిని పరీక్షించనుంది. 10 అడుగుల లోతు రంధ్రం చేసి అక్కడి మట్టిని పరిశీలించనుంది. నాసా వ్యోమగాముల స్పేస్‌సూట్‌పై పేరుకుపోయే చంద్రధూళిని దులిపేసే పరికరం పనితీరును కూడా అక్కడ పరీక్షించనుంది.
గురువారం మరో ల్యాండర్
హూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థకు చెందిన నాలుగు మీటర్ల ఎత్తయిన ల్యాండర్‌ను గురువారం చంద్రునిపై దింపేందుకు కూడా శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో కిందివైపు దాన్ని ల్యాండ్ చేయాలని చూస్తున్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఒక ల్యాండర్‌ను విజయవంతంగా దించినా దాని కాలు విరిగి పక్కకు ఒరిగి నిరుపయోగంగా మారింది. రెండేళ్ల క్రితం ఈ సంస్థ ఒక ల్యాండర్‌ను ప్రయోగించినా అది వేగంగా ఢీకొని చంద్రునిపై కూలిపోయింది. జపాన్‌కు చెందిన ఐస్పేస్ సంస్థ ల్యాండర్ కూడా త్వరలో చంద్రునిపై కాలుమోపనుంది. దీన్ని కూడా బ్లూఘోస్ట్‌తో పాటే ప్రయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment