పంటల బీమాకు స్పందన కరువు!
{పధాన పంటలకు రేపటితో ముగియనున్న గడువు
ఇప్పటివరకు ప్రీమియం చెల్లించని రైతులు
హైదరాబాద్: మరో రెండురోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ రైతుల నుంచి పంటల బీమా పథకాలకు కనీస స్పందన కరువైంది. జాతీయ పంటల బీమా పథకం(ఎన్‌సీఐపీ), సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎంఎన్‌ఏఐఎస్) కింద ప్రధాన పంటల బీమాకు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. వరి, పత్తి, టమాటా, ఎర్ర మిర్చి, కంది పంటలకు 31తో, బత్తాయి, ఆయిల్‌పామ్ పంటలకు ఆగస్టు 10తో, వేరుశనగకు ఆగస్టు 15తో బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగియనుంది. ఎన్‌సీఐపీ, ఎంఎన్‌ఏఐఎస్‌ల కింద జిల్లాల వారీగా వరి, కంది సహా వివిధ పంటలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పత్తి, గుంటూరులో మిర్చి, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో వేరుశనగ, చిత్తూరులో టమాటా, పశ్చిమ గోదావరిలో ఆయిల్‌పామ్, వైఎస్సార్ జిల్లాలో బత్తాయి పంటలను గుర్తించినట్టు పేర్కొంది.
గ్రామం ఒక యూనిట్‌గా పంటల బీమా సౌకర్యం కల్పించింది. వర్షాలు కురవక పంట నష్టపోయిన రైతులకు బీమా మొత్తాన్ని చెల్లించాలన్నది ఈ పథకాల ఉద్దేశం. అరుుతే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రైతులు బీమా ప్రీమియం చెల్లించలేదు. పంట, సాగు విస్తీర్ణం, ఎంత మొత్తానికి బీమా అనే అంశాలపై ఈ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇంతవరకు మాఫీ కాలేదు. రీ షెడ్యూల్ సైతం జరగలేదు. రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో రైతులు ఎప్పటినుంచో పాత బకారుులు చెల్లించడం మానుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎక్కడా పంటల బీమాకు స్పందన లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పంటల బీమా గడువును పొడిగించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.