ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌లైన్: జాతీయ వ్యవసాయ భీమా పథకం 2000-01 నుంచి కేంద్ర, రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్నప్పటికీ దానికి కొత్త ఊపిరినిచ్చింది మాత్రం దివంగత మహానేత వైఎస్ రాజశే ఖరరెడ్డే. ఎప్పుడైతే వైఎస్‌ఆర్ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఈ పథకాన్ని దేశంలోనే తొలిసారి మనరాష్ట్రంలో అమలు చేశారో అప్పటి నుంచి ఈ పథకం సత్ఫలితాలు ఇవ్వసాగింది. నేటి పాలకులు ఈ బీమా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కరువుకాటకాలొచ్చినా బీమా పొందలేని స్థితికి ఈ పథకాన్ని దిగజార్చారు.
గ్రామం యూనిట్‌గా చేసిన తర్వాత లక్షలాది మంది రైతులు అదనంగా బీమా పరిహారం పొందారు. బ్యాంకులు, కో-ఆపరేటివ్ సంఘాల నుంచి పంటల బీమా పథకంలో ప్రతిపాదించిన పంటలకు రుణం తీసుకున్న రైతులందరికీ బీమా వర్తిస్తుంది. పంట రుణం మంజూరు చేసేటప్పుడు బీమా ప్రీమియం మినహాయిస్తారు. పంట రుణం తీసుకోని రైతులు, కౌలు రైతులు కూడా పంటల బీమా చేసుకోసుకునే విధంగా నిర్ణయించారు. తొలుత మండలం యూనిట్‌గా బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ విధానంలో ప్రతిపాదించిన ప్రకారం కనీసం 2000 హెక్టార్లలో పంట సాగు చేయాలి. అప్పుడే దాన్ని ఒక యూనిట్‌గా పరిగణలోకి తీసుకునేవారు. అంతకన్నా తక్కువ ఉంటే పక్క మండలాన్ని కలుపుకొని బీమా యూనిట్‌గా నిర్ణయించారు.
ఈ విధానంతో పంట నష్టపోయిన రైతులకు సరైన న్యాయం జరిగేది కాదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పథకంలో విధానపరమైన మార్పులు తెచ్చారు. పంట బీమా చేసుకున్న రైతు ఆ బీమాపై నమ్మకం ఉండే విధంగా గ్రామాన్ని యూనిట్‌గా చేస్తూ పథకంలో మార్పు తీసుకువచ్చారు. ఈ పథకం అమలులో దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. మహానేత కృషి ఫలితంగా పథకం అమల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. బీమా చేసిన పంటల విస్తీర్ణంలోనూ తొలిస్థానాన్ని ఆక్రమించింది. అత్యధిక మొత్తం బీమా పరిహారం చెల్లింపుల్లోనూ మొదటిస్థానమే. మహానేత మరణం తరువాత పథకానికి తూట్లు పడ్డాయి. 2010-11 సంవత్సరంలో ఈ పథకంలో సవరణలు చేశారు. బీమా వర్తింపునకు అనేక ని‘బంధనాలు’ విధించారు.
జిల్లాలో ఒక ముఖ్యమైన పంటను గ్రామం యూనిట్‌గా అమలు చేయాలని నిర్ణయించారు. అదికూడా అనావృష్టి సంభవిసే..్త పంట వేయలేక పోతే కేవలం 25 శాతం బీమా వర్తింప చేసే విధానాన్ని ముందుకు తెచ్చారు. ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టం సంభవిస్తే వచ్చే పరిహారంలో 25 శాతం రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని పథకంలో మార్పు తెచ్చారు. పంట నష్టాలను గత ఏడు సీజన్లకు సంబంధించి సరాసరి దిగుబడులను తీసుకొని లెక్కించే విధానాన్ని అమలు చేసే విధంగా మార్పులు తీసుకొచ్చారు.
జాతీయ వ్యవసాయ బీమా పథకం పరిధిలోని పంటలు..
ఖరీఫ్: వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, మినుములు, కందులు, పెసలు, సోయాచిక్కుడు, వేరుశనగ (నీటి ఆధారం), వేరుశనగ వర్షాధారం, పొద్దుతిరుగుడు, ఆముదం, చెరకు (మొక్క), చెరకు (కార్శి), పత్తి (వర్షాధారం), పత్తి (నీటి ఆధారం), మిరప (వర్షాధారం), మిరప (నీటి ఆధారం), పసుపు, కొర్ర రబీ: వరి, జొన్న, మొక్కజొన్న, మినుములు, పెసలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఎర్ర మిరప, ఉల్లి, శనగలు
గ్రామం యూనిట్‌గా బీమా పథకాన్ని వర్తింప చేయకుండా జిల్లాలో ప్రధాన పంటను మాత్రమే గ్రామం యూనిట్‌గా పరిగణలోకి తీసుకొని మిగిలిన పంటలను గతంలో మాదిరిగానే మండలం యూనిట్‌గా అమలు చేసేలా పథకాన్ని సవరించారు.
ఈ విధానం అమల్లోనూ అనేక మార్పులు తీసుకురావటంతో పథకంపై రైతులకు నమ్మకం పోయింది. ఖరీఫ్ పంట విస్తీర్ణం దాదాపు నాలుగు లక్షల హెక్టార్లు కాగా 1.67 లక్షల హెక్టార్లలో పత్తి, 1.38 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. గ్రామం యూనిట్‌గా కేవలం వరి పంటను మాత్రమే ఎంపిక చేశారు. మండలం యూనిట్‌గా మొక్కజొన్న, కంది, పెసర, వేరుశనగ, చెరకు పంటలను ఎంపిక చేశారు. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చిని గ్రామం యూనిట్‌లో గానీ, మండలం యూనిట్‌లో గానీ పరిగణించలేదు. రబీ సీజన్‌లో గ్రామం యూనిట్‌గా ఏ ఒక్క పంటా లేదు. మండలం యూనిట్‌గా జిల్లాలో వరి, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, వేరుశనగ మిరప పంటలను మాత్రమే ఎంపిక చేశారు.
వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం
పంట దిగుబడి ఆధారంగా కాకుండా వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, గాలి ఉధృతి వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని వాతావరణ బీమా పథకాన్ని రైతు ప్రయోజనం కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ 2009 ఖరీఫ్ సీజన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ప్రస్తుత పాలకులు ఈ పథకంపై అంత శ్రద్ధ చూపటం లేదు. కాగితాల్లో మాత్రం లెక్కలు చూపుతోంది. వాతావరణ ఆధారిత పంటల బీమా కింద ఖరీఫ్‌కాలంలో జిల్లా నుంచి పత్తి, మిరప, ఆయిల్‌ఫామ్‌ను ఎంపిక చేశారు. ఇదే పథకం కింద మామిడిని రబీ సీజన్‌కు ఎంపిక చేశారు.
బీమా పథకం అమలు విధానం..
నష్ట పరిహారం అంచనాలను నిర్దేశించిన ప్రాంతాల (మండలం/గ్రామం) ఆధారంగా అంచనా వేస్తారు. బీమా చేసిన పంట హామీ దిగుబడి కన్నా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన సరాసరి దిగుబడి తగ్గితే..తగ్గుదల శాతాన్ని బట్టి ఆ మండలంలో బీమా చేసిన రైతుల పంటలకు నష్టపరిహారం లభిస్తుంది. ఈ నష్టపరిహారాలను బ్యాంకు ఖాతాలోనే వేయాలి.
జిల్లా సహకారబ్యాంక్, గ్రామీణ వికాసబ్యాంక్, వాణిజ్యబ్యాంక్‌ల నుంచి ప్రతిపాదిత పంటకు రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం తప్పనిసరిగా వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి 2005లో మహానేత ఈ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం రైతుల్లో మనోస్థైర్యాన్ని నింపింది. పంటనష్టాలు సంభవిస్తే రెండు నెలల్లో పంట నిర్దిష్టమైన హామీ దిగుబడి కన్నా తగ్గితే నష్టపరిహారం చెల్లించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బీమా చెల్లింపుల్లో కూడా అనేక మార్పులు వచ్చాయి. 2005 నుంచి 2009 వరకు నిర్దేశించిన విధంగా బీమా మొత్తాన్ని చెలించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది.
రైతుల నుంచి ప్రీమియం నిర్దేశించిన ప్రకారం వసూలు చేస్తున్నారు కానీ చెల్లింపులో వివిద సాకులు చూపుతూ తక్కువగా చెల్లిస్తున్నారు. బీమా చెల్లింపుల్లో బాగా జాప్యం అవుతోంది. 2008-09లో జిల్లాలో పంటనష్టాలు అంతగా లేవు. అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన వారికి బీమాను వర్తింపచేశారు. ఆ ఏడాది రూ.72.76 లక్షలు బీమా కింద పంట నష్టపోయిన రైతులకు అందించారు. 2009-10లో జిల్లాలో రూ.10.79 కోట్లు రైతులకు చెల్లించారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి మరణానంతరం 2011-12 లో అనావృష్టి నెలకొంది. అయినా జిల్లాలో పంటల బీమా నష్టాన్ని అతి తక్కువగా చేసి చూపించారు.
కేవలం 10,749 మంది రైతులను మాత్రమే బీమా పథకానికి ఎంపిక చేశారు. ఈ రైతులకు కూడా నిబంధనల ప్రకారం బీమా మొత్తాలు చెల్లించకుండా అందులో నాల్గో వంతును మాత్రమే చెల్లించారు. రూ.41.60 కోట్లు బీమా మొత్తం కాగా వీటిలో కేవలం రూ.12.55 కోట్లు మాత్రమే చెల్లించారు. 2012 తరువాత బీమా లెక్కలను ఇంకా తేల్చలేదు. పంట ఎండినా రైతు నష్టపోకుండా మహానేత గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని రూపొందించిన పంటల బీమా పథకం నీరుగారిపోతుంది.
ఏదీ ఆ ‘ధీమా’?
Published Fri, Apr 25 2014 2:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement