కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి
కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి
Published Wed, Aug 10 2016 9:35 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
మచిలీపట్నం (చిలకలపూడి) :
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కౌలు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు టీవీ లక్ష్మణస్వామి డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో డెల్టా ప్రాంతంలో 80 శాతం, మెట్ట ప్రాంతంలో 50 శాతానికి పైగా భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో 1.50 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఏప్రిల్‌లోనే గుర్తింపుకార్డులు ఇవ్వటం కోసం గ్రామసభలు నిర్వహించినప్పటికీ కార్డులు ఇవ్వలేదన్నారు. జిల్లాలోని కౌలు రైతులందరికీ గుర్తింపుకార్డులు, పంట రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు మిత్ర, జాయింట్ లయబులిటీ గ్రూప్, కౌలు దారులకు వెంటనే రుణమాఫీ చేయాలని కోరారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కౌలుదారులకు వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.నరసింహ, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.రామచంద్రరావు, సీహెచ్ భాస్కర్, పి.రంగారావు, జిల్లా కమిటీ సభ్యులు సలీం, రామారావు, చలపతిరావు, ఎం.హరిబాబు, జి.నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకుడు సీహెచ్ రవి, కేవీపీఎస్ నాయకుడు సాల్మన్‌రాజు పాల్గొన్నారు.
Advertisement