న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్‌లో నెలవారీగా మందగమన ధోరణి కనబడుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం, ఆగస్టు (జూలైతో పోల్చితే) మొదటి 15 రోజుల కాలంలో డీజిల్ డిమాండ్ తగ్గింది. పెట్రోల్ డిమాండ్ దాదాపు అక్కడక్కడే ఉంది. జూన్‌తో పోల్చితే జూలైలో అటు పెట్రోల్ ఇటు డీజిల్ డిమాండ్ రెండూ తగ్గిన సంగతి తెలిసిందే. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వినియోగం భారీగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రుతుపవనాల ప్రారంభకాలం, ఎడతెరిపిలేని వర్షాలు, వరదల ఎఫెక్ట్ దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కాలంలో రవాణా, ట్రావెల్ రంగాలు సహజంగా నెమ్మదిస్తాయి. తీవ్ర వర్షాలు వ్యవసాయ రంగం కార్యకలాపాలకు సైతం అడ్డంకిగా నిలుస్తుంది. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
► జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ డీజిల్ డిమాండ్ 3.17 మిలియన్ టన్నులు. అయితే ఆగస్టు ఇదే కాలంలో డిమాండ్ 11.2 శాతం పడిపోయి 2.82 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది.
► ఇక జూలై మొదటి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు 1.28 మిలియన్ టన్నులు. ఆగస్టు ఇదే రోజుల్లో ఈ పరిమాణం దాదాపు అక్కడక్కడే 1.29 మిలియన్ టన్నులుగా ఉంది.
► జూన్‌తో పోల్చితే జూలై నెలలో డీజిల్ వినియోగం 13.1 శాతం తగ్గి 6.44 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో డీజిల్ విక్రయాలు 7.39 మిలియన్ టన్నులు. ఇక పెట్రోల్ వినియోగం జూలైలో 5 శాతం తగ్గి 2.66 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో పెట్రోల్ వినియోగం 2.8 మిలియన్ టన్నులు.
► వార్షికంగా చూస్తే పెట్రోల్, డీజిల్ డిమాండ్‌లో గణనీయమైన వృద్ధిరేటు నమోదవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment