industrial sectors
-
ఇతర రంగాలకూ పీఎల్ఐ స్కీమ్
న్యూఢిల్లీ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ఎంతో ప్రయోజనకరమని మెజారిటీ వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో పీఎల్ఐ కింద ఇతర రంగాలకూ ప్రోత్సాహకాలు లభిస్తాయన్న ఆశాభావం వారి నుంచి వ్యక్తమైంది. డిమాండ్ బలోపేతానికి వీలుగా బడ్జెట్లో ప్రకటించే చర్యలు అన్ని రంగాల్లో వృద్ధికి ఊతంగా నిలుస్తాయన్న అభిప్రాయం కంపెనీల ప్రతినిధుల్లో వ్యక్తమైంది. మూలధన వ్యయాలపైనా బడ్జెట్ దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నారు. డెలాయిట్ సర్వే వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను తెలుసుకుంది. మూలధన వ్యయాలు, మౌలిక సదుపాయాలకు రుణాలను అందించడం వృద్ధికి కీలకమన్న అభిప్రాయం వ్యక్తమైంది. భారత ప్రభుత్వ బాండ్ల ద్వారా నిధులు సమీకరించాలని సర్వేలో 60 శాతం మంది సూచించారు. రానున్న బడ్జెట్ నుంచి పరిశ్రమ ఏమి ఆశిస్తుందో తెలుసుకునే ప్రయత్నం సర్వేలో భాగంగా డెలాయిట్ చేసింది. 10 రంగాల నుంచి 181 మంది ప్రతినిధులు సర్వేలో పాల్గొని అభిప్రాయాలు తెలియజేశారు. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు ►70 శాతానికి పైగా పరిశ్రమల ప్రతినిధులు పీఎల్ఐ పథకం తమ రంగం వృద్ధికి మేలు చేస్తుందని చెప్పారు. ► 60% మంది పీఎల్ఐ ప్రోత్సాహకాలను మరిన్ని రంగాలకు ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. ►పన్నుల్లో మార్పులు తెస్తే అది పరిశ్రమల వృద్ధికి ప్రయోజనం కలిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. రానున్న బడ్జెట్లో ఎక్కువ మంది బలంగా దీన్ని కోరుకుంటున్నారు. ► ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు పెట్టుబడుల వృద్ధికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ► ఎంఎస్ఎంఈలను జీవీసీ కిందకు తీసుకొస్తే పరిశ్రమల వృద్ధి స్థిరత్వానికి సాయపడుతుందని, వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయని చెప్పారు. ► 45 శాతం మంది పన్ను బాధ్యతలను ప్రభుత్వం తగ్గిస్తుందని అంచనా వేస్తుంటే, 44 శాతం మంది టీడీఎస్‌కు సంబంధించి స్పష్టత కోరుకుంటున్నారు. ► మూలధన లాభాల పన్ను నిర్మాణాన్ని మరింత సులభతరంగా మార్చాలని పరిశ్రమ కోరుతోంది. ► కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 14 రంగాలకు పీఎల్ఐ కింద రూ. 2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. తోలు, సైకిల్, టీకాల తయారీ, టెలికం ఉత్పత్తులకు పీఎల్ఐ విస్తరణ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. చదవండి: స్టార్టప్‌లో పెట్టుబడులు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్లు! -
దేశంలో తగ్గిన పెట్రోల్, డీజిల్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్‌లో నెలవారీగా మందగమన ధోరణి కనబడుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం, ఆగస్టు (జూలైతో పోల్చితే) మొదటి 15 రోజుల కాలంలో డీజిల్ డిమాండ్ తగ్గింది. పెట్రోల్ డిమాండ్ దాదాపు అక్కడక్కడే ఉంది. జూన్‌తో పోల్చితే జూలైలో అటు పెట్రోల్ ఇటు డీజిల్ డిమాండ్ రెండూ తగ్గిన సంగతి తెలిసిందే. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వినియోగం భారీగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రుతుపవనాల ప్రారంభకాలం, ఎడతెరిపిలేని వర్షాలు, వరదల ఎఫెక్ట్ దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కాలంలో రవాణా, ట్రావెల్ రంగాలు సహజంగా నెమ్మదిస్తాయి. తీవ్ర వర్షాలు వ్యవసాయ రంగం కార్యకలాపాలకు సైతం అడ్డంకిగా నిలుస్తుంది. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ డీజిల్ డిమాండ్ 3.17 మిలియన్ టన్నులు. అయితే ఆగస్టు ఇదే కాలంలో డిమాండ్ 11.2 శాతం పడిపోయి 2.82 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. ► ఇక జూలై మొదటి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు 1.28 మిలియన్ టన్నులు. ఆగస్టు ఇదే రోజుల్లో ఈ పరిమాణం దాదాపు అక్కడక్కడే 1.29 మిలియన్ టన్నులుగా ఉంది. ► జూన్‌తో పోల్చితే జూలై నెలలో డీజిల్ వినియోగం 13.1 శాతం తగ్గి 6.44 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో డీజిల్ విక్రయాలు 7.39 మిలియన్ టన్నులు. ఇక పెట్రోల్ వినియోగం జూలైలో 5 శాతం తగ్గి 2.66 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో పెట్రోల్ వినియోగం 2.8 మిలియన్ టన్నులు. ► వార్షికంగా చూస్తే పెట్రోల్, డీజిల్ డిమాండ్‌లో గణనీయమైన వృద్ధిరేటు నమోదవుతోంది. -
కష్టకాలంలో కొండంత ధైర్యమిచ్చారు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ లాక్డౌన్ కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కరోనావల్ల ప్రభుత్వోద్యోగులకు పూర్తిగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో సర్కారు తమకు కొండంత అండ ఇచ్చినట్లుగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈలకు గత ప్రభుత్వం బకాయిపడ్డ రాయితీల మొత్తం రూ.905 కోట్లు కూడా విడుదల చేయడం.. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రూ.188 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మాఫీ చేయడం, రుణాలు పుట్టని వేళ వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లు కేటాయించడం, జీఎస్టీ, ఇతర పన్ను మినహాయింపులను కోరుతూ ప్రధానికి లేఖ రాయడం చూస్తుంటే పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రికి ఉన్న శ్రద్ధను తెలియజేస్తోందన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తల స్పందన వారి మాటల్లోనే.. చిన్న సంస్థలకు పెద్ద సాయం క్లిష్ట సమయంలో చిన్న సంస్థలను ఆదుకునేలా ప్రభుత్వం భారీ సాయాన్ని ప్రకటించింది. పాత బకాయిలను విడుదల చేయడం ద్వారా కార్మికులకు జీతాలు చెల్లించే వెసులుబాటు కల్పించింది. రూ.200 కోట్ల రుణాలకు గ్యారంటీ ఇవ్వడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది. – డి.రామకృష్ణ, చైర్మన్, సీఐఐ ఏపీ చాప్టర్ సంక్షోభ సమయంలో చేయూతనందించారు లాక్‌డౌన్‌తో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ రంగానికి సీఎం వైఎస్ జగన్ చేయూతనందించారు. ఈ స్థాయిలో భారీ ఆర్థిక మద్దతు అందించడాన్ని అభినందిస్తున్నాం. సీఎం నేతృత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి, అధికారులు విశేష కృషిచేశారు. – మనోహర్‌రెడ్డి, కో–చైర్మన్ ఫిక్కీ ఏపీ స్టేట్ కౌన్సిల్ బకాయిలు తీర్చడం మామూలు విషయం కాదు గత పదేళ్లుగా రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. గత ప్రభుత్వ బకాయిలను తీర్చడం మామూలు విషయం కాదు. ఒక పారిశ్రామికవేత్తగా ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు సీఎంకు తెలియబట్టే కీలక నిర్ణయాలు తీసుకోగలిగారు. విద్యుత్ చార్జీలను మాఫీచేసే ధైర్యం ఏ రాష్ట్రం చేయలేదు. రాష్ట్ర పారిశ్రామిక రంగం 6 నెలల్లో కోలుకుంటుంది. – ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షుడు, ఎఫ్‌ఎస్‌ఎంఈ కచ్చితంగా మేలు జరుగుతుంది ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇదో మంచి చేయూతగా పరిశ్రమల సీఈవోలు భావిస్తున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా శ్రీసిటీలోని ఎంఎస్ఎంఈ యూనిట్లకు ఈ నిర్ణయం కచ్చితంగా మేలు చేస్తుంది. సీఎం వైఎస్ జగన్, పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డికి శ్రీసిటీ తరఫున కృతజ్ఞతలు. – రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ ఎండీ పరిశ్రమలు గాడిలోకి.. మూడు నెలల విద్యుత్ డిమాండ్ చార్జీలు రద్దుచేయడం, బకాయిలు విడుదల చేయడం, వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లు కేటాయించడంతో పరిశ్రమలు గాడిలో పడటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రధానికి సీఎం లేఖ రాయడం ఆనందదాయకం. – వాసిరెడ్డి మురళీకృష్ణ, అధ్యక్షుడు, ఫ్యాప్సియా ఇది నిజంగా ‘రీస్టార్టే’ రూ.905 కోట్ల పాత బకాయిలను విడుదల చేయడం.. విద్యుత్ భారాన్ని రద్దుచేయడం వంటి నిర్ణయాలు చిన్న సంస్థలకు పెద్ద చేయూతను అందిస్తాయి. లాక్డౌన్ తర్వాత పరిశ్రమలకు అనుకూలంగా మరిన్ని చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. – కేవీఎస్ ప్రకాశరావు, అధ్యక్షుడు, ఏపీ చాంబర్స్ -
సింగరేణి సిగలో మరో నగ
* భూపాలపల్లి కేంద్రంగా కొత్తగా ఏడు గనులు * ప్రతిపాదనలు సిద్ధం చేసిన సింగరేణి కాలరీస్ సాక్షి, హన్మకొండ: విద్యుత్, పారిశ్రామిక రంగాల నుంచి వస్తున్న డిమాండ్‌ను లక్ష్యంగా చేసుకుని సింగరేణి కాలరీస్ సంస్థ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా వరంగల్ జిల్లా భూపాలపల్లి కేంద్రంగా కొత్తగా ఏడు గనులు ప్రారంభించనుంది. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా భూపాలపల్లి కేంద్రంగా కొత్త ఏరియాను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం భూపాలపల్లిలో 5 భూగర్భ, ఒక ఉపరితల గని ఉంది. రాబోయే ఐదేళ్ల వ్యవధిలో భూపాలపల్లి చుట్టూ వెంకటాపురం, గోవిందరావుపేట, ఘణపురం మండలాల పరిధిలో కొత్తగా ఏడు గనులు ప్రారంభించాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పాలనపరమైన, పర్యావరణశాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. అనుమతుల ఆధారంగా ఘణపురం మండలం పెద్దాపూర్, వెంకటాపురం మండలకేంద్రంతో పాటు మల్లయ్యపల్లి, లక్ష్మీదేవిపేట, గోవిందరావుపేట మండలం పస్రా బ్లాక్‌లలో నూతన గనులు ప్రారంభిస్తారు. వీటితోపాటు కేటీకే 2 గనిని ఓపెన్‌కాస్ట్‌గా మారుస్తారు. ఇవన్నీ ఏర్పాటైతే.. పాలన సౌలభ్యం దృష్ట్యా భూ పాలపల్లి-2 పేరుతో కొత్త ఏరియాను ఏర్పాటు చేయాల్సి అవసరం ఏర్పడుతోంది. -
ఇక ప్రగతి పరుగులు
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సారథ్యంలోని నూతన కేంద్ర ప్రభుత్వం వాణిజ్య విశ్వాసాన్ని పెంపొందించి ఆర్థికాభివృద్ధిని పునరుద్ధరిస్తుందని దేశీయ వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఆర్థిక వ్యవస్థను మోడీ సర్కారు గాడిలో పెడుతుందనీ, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తుందనే విశ్వాసాన్ని ఆయా వర్గాలు వెలిబుచ్చాయి. ప్రధానిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన మోడీకి పారిశ్రామిక చాంబర్లు అభినందనలు తెలిపాయి. వాణిజ్య విశ్వాసాన్ని పెంచాలి సమాజ అవసరాలను, ఆశలను నెరవేర్చేలా యువతను, వాణిజ్యవేత్తలనూ ప్రేరేపించే పాలనను ప్రభుత్వం అందిస్తుందని భావిస్తున్నాం. వాణిజ్య విశ్వాసాన్ని, ఉద్యోగికతను పెంచడం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, పోషకాహారాన్ని అందించడం, పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం వంటి చర్యలకు మోడీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. - సిద్ధార్థ్ బిర్లా, ఫిక్కీ ప్రెసిడెంట్ చతురత చూపాలి దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో వివేకవంతుడు, నిపుణుడు అయిన నరేంద్ర మోడీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నాం. దాదాపు 120 కోట్ల దేశ పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రధాని పదవిని మోడీ చేపట్టడం అత్యంత కీలక అంశం. స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటును పెంచడం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పించడం ఎంతో అవసరం. - అజయ్ శ్రీరామ్, సీఐఐ ప్రెసిడెంట్ ఇది స్థిరమైన ప్రభుత్వం సుదీర్ఘకాలం తర్వాత భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని మోడీ, ఆయన మంత్రి వర్గ సహచరులు దీక్షాదక్షులు. దేశంలో ఉద్యోగాలను కల్పించి, ఆదాయాన్నీ, సమాన వృద్ధినీ సాధించే దిశగా కొత్త ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మేం ఆశిస్తున్నాం. - శ్రీనివాసన్, ఇండో అమెరికన్ చాంబర్ ప్రెసిడెంట్ రెండంకెలకు చేరనున్న జీడీపీ వృద్ధి నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో జీడీపీ వృద్ధి రేటు 10 శాతానికి చేరుతుందని విశ్వసిస్తున్నాం. ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని నమ్ముతున్నాం. - రాణా కపూర్, అసోచామ్ అధ్యక్షుడు ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిం చేందుకు కొత్త ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం. మోడీ కేబినెట్లో తక్కువ మందే ఉండడం వల్ల మరింత సమర్థమైన పాలన సాధ్యమవుతుంది. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్ హామీలు నెరవేర్చాలి అత్యున్నత ప్రమాణాలతో పాలనను అందిస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను మోడీ సర్కారు మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాం. - శరద్ జైపూరియా, పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ -
క్యూ2 వృద్ధికి వర్షాల ఊతం
న్యూఢిల్లీ: మెరుగైన వర్షపాతం, పారిశ్రామికోత్పత్తి, వినియోగ వ్యయాలు పెరగడం తదితర సానుకూల అంశాలతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి మెరుగుపడొచ్చని డాయిష్ బ్యాంక్, డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) సంస్థలు వేర్వేరు నివేదికల్లో అంచనా వేశాయి. క్యూ2లో వృద్ధి 5.5 శాతంగా ఉండొచ్చని డాయిష్ బ్యాంక్ లెక్కగట్టగా, ఇది 4.5 శాతం మేర ఉండొచ్చని డీఅండ్‌బీ పేర్కొంది. ముందుగా పెద్ద ఆశావహమైన అంచనాలు లేకపోయినప్పటికీ.. పలు సానుకూల అంశాల వల్ల క్యూ2లో ఏడాది కాలంలోనే అత్యుత్తమ వృద్ధి నమోదు కాగలదని భావిస్తున్నట్లు డాయిష్ బ్యాంక్ వివరించింది. పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, సేవా రంగం మందగించడం కారణాలతో.. తొలి త్రైమాసికంలో ఎకానమీ వృద్ధి కేవలం 4.4 శాతానికే పరిమితం అయింది. గత 17 త్రైమాసికాల్లో ఇది కనిష్టం. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఏకంగా పదేళ్ల కనిష్టమైన 5 శాతానికి క్షీణించిన సంగతి తెలిసిందే. మెరుగుపడుతున్నా.. కొంత బలహీనం పారిశ్రామికోత్పత్తి ధోరణిని బట్టి చూస్తే.. సెప్టెంబర్ త్రైమాసికంలో పారిశ్రామిక రంగం కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోందని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. క్యూ2లో పారిశ్రామిక రంగ వృద్ధి 1.8 శాతంగా ఉండొచ్చని తెలిపింది. క్రితం త్రైమాసికంలో ఇది 0.9 శాతంగా ఉంది. ఇక మొత్తం సర్వీసుల రంగం రెండో త్రైమాసికంలో 7 శాతం మేర వృద్ధి చెందవచ్చని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. క్రితం త్రైమాసికంలో ఇది 6.2 శాతంగా నమోదైంది. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ద్రవ్య లోటు తగ్గొచ్చని డాయిష్ బ్యాంక్ వివరించింది. అటు, మిగతా త్రైమాసికాలకు సంబంధించి వృద్ధి బలహీనంగానే ఉండొచ్చని డీఅండ్‌బీ పేర్కొంది. ఇప్పటికీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతుండటం, ద్రవ్యలోటు అధికంగానే ఉండటం, తయారీ రంగం కోలుకోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తాయని తెలిపింది. భారీ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఇవి ఫలితాలిచ్చేందుకు సమయం పడుతుందని డీఅండ్‌బీ ఇండి యా సీనియర్ ఎకానమిస్టు అరుణ్ సింగ్ చెప్పారు. ఇవి ఎంతమేరకు వ్యాపార వర్గాల్లో విశ్వాసం నింపగలవో కూడా చూడాల్సి ఉంటుందన్నారు. 62.60కు రుపీ... ఇక రూపాయి విషయానికొస్తే.. దేశీ కరెన్సీ మారకం విలువ నవంబర్‌లో 62.60-62.80 మధ్య తిరుగాడవచ్చని డీఅండ్‌బీ అంచనా వేసింది. సమీప భవిష్యత్‌లో ఇది 65కి క్షీణించినా మొత్తం మీద ఈఏడాది ఆఖరు నాటికి 63 స్థాయిలో నిలవొచ్చని డాయిష్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 62.87 వద్ద ఉంది.