సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ లాక్‌డౌన్ కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కరోనావల్ల ప్రభుత్వోద్యోగులకు పూర్తిగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో సర్కారు తమకు కొండంత అండ ఇచ్చినట్లుగా ఉందన్నారు. ఎంఎస్‌ఎంఈలకు గత ప్రభుత్వం బకాయిపడ్డ రాయితీల మొత్తం రూ.905 కోట్లు కూడా విడుదల చేయడం.. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రూ.188 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మాఫీ చేయడం, రుణాలు పుట్టని వేళ వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లు కేటాయించడం, జీఎస్టీ, ఇతర పన్ను మినహాయింపులను కోరుతూ ప్రధానికి లేఖ రాయడం చూస్తుంటే పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రికి ఉన్న శ్రద్ధను తెలియజేస్తోందన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తల స్పందన వారి మాటల్లోనే..
చిన్న సంస్థలకు పెద్ద సాయం
క్లిష్ట సమయంలో చిన్న సంస్థలను ఆదుకునేలా ప్రభుత్వం భారీ సాయాన్ని ప్రకటించింది. పాత బకాయిలను విడుదల చేయడం ద్వారా కార్మికులకు జీతాలు చెల్లించే వెసులుబాటు కల్పించింది. రూ.200 కోట్ల రుణాలకు గ్యారంటీ ఇవ్వడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది.
– డి.రామకృష్ణ, చైర్మన్, సీఐఐ ఏపీ చాప్టర్
సంక్షోభ సమయంలో చేయూతనందించారు
లాక్‌డౌన్‌తో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈ రంగానికి సీఎం వైఎస్ జగన్ చేయూతనందించారు. ఈ స్థాయిలో భారీ ఆర్థిక మద్దతు అందించడాన్ని అభినందిస్తున్నాం. సీఎం నేతృత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి, అధికారులు విశేష కృషిచేశారు.
– మనోహర్‌రెడ్డి, కో–చైర్మన్ ఫిక్కీ ఏపీ స్టేట్ కౌన్సిల్
బకాయిలు తీర్చడం మామూలు విషయం కాదు
గత పదేళ్లుగా రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. గత ప్రభుత్వ బకాయిలను తీర్చడం మామూలు విషయం కాదు. ఒక పారిశ్రామికవేత్తగా ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు సీఎంకు తెలియబట్టే కీలక నిర్ణయాలు తీసుకోగలిగారు. విద్యుత్ చార్జీలను మాఫీచేసే ధైర్యం ఏ రాష్ట్రం చేయలేదు. రాష్ట్ర పారిశ్రామిక రంగం 6 నెలల్లో కోలుకుంటుంది.
– ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షుడు, ఎఫ్‌ఎస్‌ఎంఈ
కచ్చితంగా మేలు జరుగుతుంది
ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇదో మంచి చేయూతగా పరిశ్రమల సీఈవోలు భావిస్తున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా శ్రీసిటీలోని ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు ఈ నిర్ణయం కచ్చితంగా మేలు చేస్తుంది. సీఎం వైఎస్ జగన్, పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డికి శ్రీసిటీ తరఫున కృతజ్ఞతలు.
– రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ ఎండీ
పరిశ్రమలు గాడిలోకి..
మూడు నెలల విద్యుత్ డిమాండ్ చార్జీలు రద్దుచేయడం, బకాయిలు విడుదల చేయడం, వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లు కేటాయించడంతో పరిశ్రమలు గాడిలో పడటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రధానికి సీఎం లేఖ రాయడం ఆనందదాయకం.
– వాసిరెడ్డి మురళీకృష్ణ, అధ్యక్షుడు, ఫ్యాప్సియా
ఇది నిజంగా ‘రీస్టార్టే’
రూ.905 కోట్ల పాత బకాయిలను విడుదల చేయడం.. విద్యుత్ భారాన్ని రద్దుచేయడం వంటి నిర్ణయాలు చిన్న సంస్థలకు పెద్ద చేయూతను అందిస్తాయి. లాక్‌డౌన్ తర్వాత పరిశ్రమలకు అనుకూలంగా మరిన్ని చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.
– కేవీఎస్ ప్రకాశరావు, అధ్యక్షుడు, ఏపీ చాంబర్స్
Comments
Please login to add a commentAdd a comment