చిన్న పరిశ్రమలు కళకళ | MSME Sector is in progress with AP Government subsidies | Sakshi
Sakshi News home page

చిన్న పరిశ్రమలు కళకళ

Published Sun, Jun 28 2020 5:29 AM | Last Updated on Sun, Jun 28 2020 5:29 AM

MSME Sector is in progress with AP Government subsidies - Sakshi

సాక్షి, అమరావతి: పదేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు రాష్ట్రంలో తిరిగి ఊపిరి పోసుకుంటున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఆదుకునే విధంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టినప్పటి నాటినుంచీ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. బ్యాంకు రుణాలను చెల్లించలేక ఎన్‌పీఏలుగా మారిపోయిన యూనిట్లను ఆదుకోవడానికి ‘వైఎస్సార్‌ నవోదయం’ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు లేక, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ రంగాన్ని రక్షించేందుకు తక్షణం రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద గత ప్రభుత్వం బకాయిపడ్డ రాయితీలతో పాటు ఈ ఏడాది ఇవ్వాల్సిన రాయితీలు కలిపి రూ.905 కోట్లు విడుదల చేయడం ద్వారా వెంటిలేటర్‌పై ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ఆక్సిజన్‌ అందించినట్టయ్యిందని పారిశ్రమికవేత్తలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా ఏపీ ప్రభుత్వం ఒక్క ఏడాది బకాయి కూడా లేకుండా చెల్లించిదంటున్నారు. 

ప్రయోజనాలు కల్పించారిలా..
రూ.188 కోట్ల స్థిర విద్యుత్‌ డిమాండ్‌ చార్జీల భారాన్ని మాఫీ చేయడం, వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం రూ.200 కోట్లు కేటాయించడం, ప్రభుత్వ శాఖలు చేసే కొనుగోళ్లలో 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచి తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం ఎంఎస్‌ఎంఈలకు కొండంత భరోసానిచ్చింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న 78,634 యూనిట్లకు రూ.2,079.23 కోట్ల రుణాన్ని మంజూరు చేయనున్నారు. ఇప్పటికే 33,574 యూనిట్లకు రూ.1,269.91 కోట్ల రుణాలు అందించారు.

పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలను నిరంతరం పర్యవేక్షించే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఎంఎస్‌ఎంఈలకు పరిశ్రమ ఆధార్‌ ఇవ్వడం ద్వారా పూర్తిస్థాయిలో డేటాబేస్‌ను తయారు చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జె.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే విధంగా ఏపీఐఐసీ ప్లగ్‌ అండ్‌ పే విధానంలో వినియోగించుకునే విధంగా 31 ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

ఆశలు వదిలేసుకున్న సమయంలో..
పొలం అమ్మేసి రూ.3.50 కోట్లతో కృష్ణా జిల్లా కొండపర్రు గ్రామంలో ‘ఒలేనో’ పేరుతో ఫ్యాన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పా. మూడేళ్ల నుంచి ఇవ్వాల్సిన రాయితీ బకాయిలు కోసం అధికారులు చుట్టూ తిరిగినా ఉపయోగం లేకపోయింది. కరోనా దెబ్బతో పూర్తిగా ఆశలు వదిలేసుకున్న సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద మొత్తం బకాయిలను విడుదల చేశారు. దీనివల్ల మాకు రూ.50.45 లక్షలు వచ్చాయి. తక్కువ వడ్డీ రేటుపై రూ.7 లక్షల అదనపు రుణం తీసుకున్నాం. ఓడిపోయా అనుకుంటున్న తరుణంలో సీఎం నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు.
– పి.సుధాకర్, ఎలైట్‌ ఆప్‌ట్రానిక్స్‌

మహిళలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారు
సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. ఆసమయంలో పరీక్షల నోటిఫికేషన్‌ రాకపోవడంతో కృష్ణా జిల్లా సూరంపల్లిలో రూ.80 లక్షలతో పాదరక్షల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేశా. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు రాకపోగా కరోనా దెబ్బతో రావాల్సిన మొత్తాలూ ఆగిపోయాయి. ఉద్యోగులకు బంగారం తాకట్టు పెట్టి జీతాలు చెల్లించా. చేతిలో చిల్లిగవ్వ లేక పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఈ తరుణంలో రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద నాకు రెండో విడతలో జూన్‌ 29న రూ.11 లక్షలు రానున్నాయి. ప్రస్తుత రుణంపై అదనంగా రూ.7 లక్షల రుణం లభించింది. 
– షైనీ, షైనీ వాక్‌ ఫుట్‌వేర్‌ ప్రోపెరిటెక్స్‌

మూడు నెలలకోసారి ఎస్‌ఎల్‌బీసీ పెట్టాలి
సీఎం ప్రకటించిన ప్యాకేజీతో ఎంఎస్‌ఎంఈలు నిలదొక్కుకోవడానికి ఊతం లభించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల ముడి సరుకు లభించకపోవడం, కార్మికుల కొరత, లాజిస్టిక్, బకాయిల చెల్లింపులు వంటి అనేక సమస్యలున్నాయి. ఎంఎస్‌ఎంఈలు సాధారణ స్థితికి చేరుకునే వరకు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. పారిశ్రామిక అవసరాలు తీర్చడం కోసం ప్రత్యేక ఎస్‌ఎల్‌బీసీ సమావేశాన్ని ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాలి.
– ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షులు, ఎఫ్‌ఎస్‌ఎంఈ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement