సాక్షి, అమరావతి: రబీ పంట చేతికొచ్చే సమయంలోనే కరోనా ముంచుకొచ్చింది. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్ ప్రకటించినా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలోని రైస్ మిల్లులు పూర్తిస్థాయిలో పనిచేశాయి. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైస్ మిల్లులను అత్యవసర సేవలు పరిధిలోకి తీసుకు రావడంతో పూర్తిస్థాయిలో ధాన్యాన్ని మిల్లింగ్ చేయగలిగాయి. లాక్‌డౌన్ ప్రకటించిన తొలి 10 రోజుల్లో చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టర్లు, తహసీల్దార్లు రైస్ మిల్లులు పని చేయడానికి వీలుగా సిబ్బంది, కార్మికుల రాకపోకలకు అనుమతులు ఇవ్వడంతోపాటు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసింది.
వైఎస్ తర్వాత జగనే..
గతంలో రైస్ మిల్లులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదుకోగా.. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రంగాన్ని ఆదుకున్నారని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ హయాంలో రైస్ మిల్లులకు ఇండస్ట్రియల్ ఎల్‌టీ విద్యుత్ పరిమితిని 100 హెచ్‌పీకి పెంచితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఏప్రిల్ నుంచి ఎల్‌టీ పరిమితిని 150 హెచ్‌పీకి పెంచారు. లాక్‌డౌన్ సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం చిన్న రైస్ మిల్లులకు పెద్ద ఊరటనిచ్చింది. ఇదే సమయంలో మూడు నెలల పాటు మినిమమ్ డిమాండ్ చార్జీలను రద్దు చేయడంతో అనేక మిల్లులు లబ్ధి పొందాయి. ఒక్కొక్క మిల్లుకు కనీసం రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ప్రయోజనం కలిగింది.
బియ్యం రీసైక్లింగ్‌కు చెక్
ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని రేషన్ కార్డులపై అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిస్తోంది. గతంలో రేషన్ బియ్యం మిల్లులకు వచ్చేవి. వాటిని రీసైక్లింగ్ చేసి తిరిగి మార్కెట్‌లోకి వెళ్లేవి. ప్రభుత్వ చర్యలతో రీసైక్లింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు మిల్లర్లు సార్టెక్స్ మెషిన్లను సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 800 మిల్లుల్లో సార్టెక్స్ మెషిన్లు ఉన్నాయి. ఒక్కో మెషిన్ ఏర్పాటుకు రూ.60 లక్షల వరకు అవుతుందని అంచనా. ఎల్‌టీ పరిమితిని 150 హెచ్‌పీకి పెంచడం, ప్రభుత్వం గ్యారెంటీతో రుణాలు ఇస్తుండటంతో చాలా మంది మిల్లర్లు సార్టెక్స్ మెషిన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
పాతికేళ్ల డిమాండ్ నెరవేరింది
రైస్ మిల్లులకు ఇండస్ట్రియల్ ఎల్‌టీ పరిమితిని 150 హెచ్‌పీకి పెంచాలని 25 ఏళ్లుగా కోరుతున్నాం. రాజశేఖరరెడ్డి హయాంలో 100 హెచ్‌పీకి తీసుకెళితే.. ఆయన తనయుడు సీఎం జగన్ 150 హెచ్‌పీకి పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ కింద రుణాలకు గ్యారెంటీ ఇస్తుండటంతో బ్యాంకులు రుణాలివ్వడం ప్రారంభించాయి.
– గుమ్మడి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్
ఇబ్బందుల్లేకుండా చేశారు
లాక్‌డౌన్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పూర్తిస్థాయిలో 14 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేశాం. తూర్పు గోదావరి జిల్లాలో 350 మిల్లులు ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు.
– అంబటి రామకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్
ప్రభుత్వ ధరే ఎక్కువగా ఉంది
లాక్‌డౌన్ సమయంలో ప్రారంభంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమకు చిన్నపాటి ఇబ్బందులొచ్చినా ఆ తర్వాత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. కృష్ణా జిల్లాలో 250 వరకు మిల్లులు ఉన్నాయి. విదేశాలకు ఎగుమతి చేసే ధర కంటే ప్రభుత్వం కొనుగోలు ధరే ఎక్కువగా ఉంది. అందుకని మొత్తం బియ్యాన్ని ప్రభుత్వానికే సరఫరా చేస్తున్నాం.
– పి.వీరయ్య, పిన్నమనేని వీరయ్య అండ్ కంపెనీ
Comments
Please login to add a commentAdd a comment