ఏపీలో మళ్లీ సాధారణ స్థితికి జీవనచక్రం | Restart Program Started By The Andhra Pradesh Government | Sakshi
Sakshi News home page

ఏపీలో మళ్లీ సాధారణ స్థితికి జీవనచక్రం

Published Fri, May 22 2020 4:56 AM | Last Updated on Fri, May 22 2020 12:29 PM

Restart Program Started By The Andhra Pradesh Government - Sakshi

విజయవాడ బందరు రోడ్డులో ఉదయం సమయంలో లాక్‌డౌన్‌ సడలింపు రావటంతో వాహనాల సందడి

పారిశ్రామిక రంగం.. పట్టాలపైకి..
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో స్తంభించిన రాష్ట్ర పారిశ్రామిక రంగం క్రమంగా ఊపందుకుంటోంది. పరిశ్రమలను పునఃప్రారంభించడానికి ఏప్రిల్‌ 19న ‘రీస్టార్ట్‌’ పేరుతో ప్రకటించిన కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలిస్తోంది. ఇప్పటికే 6,582 యూనిట్లు ప్రారంభం కాగా, మిగిలిన యూనిట్లు తమతమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ యూనిట్లు 20 శాతం సిబ్బందితో భౌతిక దూరం పాటిస్తూ పనులు కొనసాగిస్తున్నాయి. ఈ యూనిట్లు తిరిగి ప్రారంభించడం ద్వారా సుమారు 70,000 మందికి ఉపాధి లభించిందని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే, పరిశ్రమల శాఖ వద్ద గుర్తింపు పొందిన కంపెనీలే కాకుండా.. అసంఘటిత రంగంలో ఉన్న చిన్న తరహా యూనిట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే రీస్టార్ట్‌ ద్వారా ఇంకా అనేక సంస్థలు ఇప్పటికే పనులు ప్రారంభించాయి. వీటిని కూడా కలుపుకుంటే లక్షలాది మందికి ఉపాధి లభించింది.

ముఖ్యంగా గనులు తిరిగి ప్రారంభం కావడం.. నిర్మాణ రంగంలో పనులు మొదలు కావడంతో లక్షలాది మందికి పనులు లభిస్తున్నాయి. కానీ, రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటివరకు 6,939 యూనిట్లు అనుమతులకు దరఖాస్తు చేసుకోగా, అందులో 6,582 సంస్థలు పనులు ప్రారంభించాయి. ఇందులో 3,555 యూనిట్లు రీస్టార్ట్‌ నిబంధనలు పాటిస్తున్నామంటూ సొంత ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాయి. మరో 1,893 యూనిట్లను అధికారులు స్వయంగా తనిఖీ చేసి పనులు ప్రారంభించడానికి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. ఇక అత్యవసర సేవల కింద 1,134 యూనిట్లు లాక్‌డౌన్‌లో కూడా కార్యకలాపాలు కొనసాగించాయి.

రీస్టార్ట్‌లో ‘ప్రకాశం’ వెలుగులు
రీస్టార్ట్‌ కార్యక్రమం కింద అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 658 యూనిట్లు పనులు ప్రారంభించాయి. ఆ తర్వాత చిత్తూరు 632, విశాఖ 591, గుంటూరు 577, అనంతపురం 544, కృష్ణాలో 513 యూనిట్లు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు పరిశ్రమల శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇవి కాకుండా.. నిర్మాణ రంగ పనులు ప్రారంభం కావడంతో బ్రిక్‌ యూనిట్లు సగానికి పైగా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 1,943 ఇటుక బట్టీలు ఉండగా అందులో 60 శాతం యూనిట్లు పనులు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. ఇదే సమయంలో 53,786 నిర్మాణ రంగ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని.. ఇందులో 10 శాతం పనులు ఇప్పటికే ప్రారంభించామని బిల్డర్లు చెబుతున్నారు. ఈ రంగానికి సంబంధించిన దుకాణాలు కూడా తెరుచుకోవడంతో నిర్మాణ రంగ పనులు కూడా ఇక వేగం పుంజుకుంటాయని వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

వలస కార్మికులను రప్పించేందుకు టాస్క్‌ఫోర్స్‌
ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్‌ వల్ల సొంత గ్రామాలకు వెళ్లిపోయిన వలస కార్మికులను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చాలా పరిశ్రమలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడానికి కార్యాచరణ సిద్ధంచేసుకున్నా కార్మికుల సమస్య వీటికి అవరోధంగా మారింది. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరిశ్రమల్లో పనిచేస్తున్న వలస కూలీల వివరాలను సేకరించి, వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దీని అమలుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేయాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

నేడే రీస్టార్ట్‌ ప్యాకేజీ 
లాక్‌డౌన్‌ వల్ల దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి రీస్టార్ట్‌ ప్యాకేజీని ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్యాకేజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1,110 కోట్లు అందించనుంది. ముందుగా రూ.993.97 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవన్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. బడ్జెట్‌ కేటాయింపులకు అదనంగా ఈ నిధులు విడుదల చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి గత ప్రభుత్వం పెట్టిన రూ.827.5కోట్ల బకాయిలతో సహా సుమారు రూ.905 కోట్ల మేరకు ప్రోత్సాహకాలు విడుదల చేయనుంది. అంతేకాక.. మూడు నెలల విద్యుత్‌ బిల్లులపై రూ.187.80కోట్ల మేర స్థిర విద్యుత్‌ చార్జీల మాఫీ.. 6–8 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక పాత బకాయిలు విడుదలవల్ల 11,238 ఎంఎంస్‌ఎంఈ యూనిట్లు లబ్ధిపొందనున్నాయి. అలాగే, మొత్తం పాత బకాయిలు విడుదల, విద్యుత్‌ డిమాండ్‌ చార్జీలు రద్దు, రూ.200కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుతో సుమారు 98వేల యూనిట్లకు లబ్ధిచేకూరుతుంది.

సందడిగా మార్కెటు
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఒకొక్కటిగా సడలిస్తుండటంతో వ్యాపార సంస్థలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. ప్రజలు రోడ్ల మీదకు రావడంతో అన్ని రకాల మార్కెట్లలో సందడి వాతావరణం కనిపించింది. నిబంధనలకు లోబడి వ్యాపారులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. దీంతో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. కంటైన్మెంట్‌ ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రధాన పట్టణాల్లో బంగారం, వస్త్రదుకాణాలు, సెలూన్లు, హార్డ్‌వేర్‌ షాపులు, గృహోపకరణాలు, సిమెంట్, స్టీల్, బేకరీ, బుక్స్‌ అండ్‌ స్టేషనరీ దుకాణాలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. తోపుడు బండ్ల వ్యాపారులు ఎప్పటిలా రోడ్లపక్కన వ్యాపారాలు సాగించారు. అలాగే, అన్ని జిల్లాల్లోనూ చిన్నచిన్న పరిశ్రమలు కూడా ఇప్పటికే తెరుచుకున్నాయి. చేనేత కార్మికులు కూడా పనులు ప్రారంభించారు. వెల్డింగ్, టైలరింగ్, ట్రాక్టర్‌ రిపేర్లు వంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి. గ్రానైట్‌ ఫ్యాక్టరీలు, లేత్‌ మిషన్లు కూడా తెరచుకోవడంతో కార్మికులకు ఉపాధి లభిస్తోంది.

పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యం
♦ ఉద్యోగ అవకాశాలలో రాష్ట్ర యువతకే పెద్ద పీట 
♦ 25 నైపుణ్య కళాశాలలకు స్థల ఇబ్బంది ఉండొద్దు 
♦ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి 

ఉద్యోగ అవకాశాలలో రాష్ట్ర యువతకే పెద్దపీట వేసేలా ముందుకెళ్లాలని పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమని తెలిపారు. పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో యువతను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలోని నాల్గవ బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఐటీ, మౌలిక వసతుల శాఖల ఉన్నతాధికారులతో మంత్రి మేకపాటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో 25 నైపుణ్య శిక్షణా కళాశాలల ఏర్పాటుకు సన్నద్ధం కావాలన్నారు. ప్రతి చోట కనీసం 5 ఎకరాలకు తగ్గకుండా నైపుణ్య కళాశాలల నిర్మాణం కోసం భూమిని సేకరించాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. శుక్రవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ఇవ్వనున్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల ప్రోత్సాహకాల చెల్లింపులకు అవసరమైన ఏర్పాట్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక రంగం త్వరలో

కొత్త పుంతలు తొక్కడం ఖాయమని మంత్రి అన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. 
♦ ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి అధికారులంతా సమాయత్తం కావాలి. 
♦ పరిశ్రమలు, నైపుణ్య, ఐటీ రంగాల పురోగతిని తెలియజేసేలా ప్రజెంటేషన్‌ రూపొందించాలి. 
♦ రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా పలు కార్యక్రమాల రూపకల్పనకు అధికారులు కృషి చేయాలి. 
♦ ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలలో ఉన్న కార్మికుల అవసరం, ప్రస్తుతం ఉన్నవారి జాబితాలను సిద్ధం చేయాలి. 
♦ కోవిడ్‌ కారణంగా మూత పడ్డ పరిశ్రమలు, సొంత ప్రాంతాలకు తరలి పోయిన వలస కూలీల వివరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు వివరాలను సేకరించాలి. 
♦ నైపుణ్య కొరత గల నిరుద్యోగులను గుర్తించి వారికి శిక్షణ అందించడం, ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలపై స్పష్టత వచ్చేలా చూడాలి. 
♦ పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలి.
ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి, శిక్షణా శాఖ డైరెక్టర్‌ లావణ్యవేణి, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ చల్లా మధుసూదనరెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ సీఈవో అర్జా శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

తొలిరోజు 50 శాతం ఆక్యుపెన్సీ
నిబంధనలు సడలించడంతో గురువారం  ఉదయం7 గంటలకే  డిపోల నుంచి బస్సులు బయటకు వచ్చాయి. మొత్తం 900 పల్లెవెలుగు బస్సులు నడిచాయి. సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌లు వీటికి అదనం. మొత్తం మీద మొదటిరోజు 50 శాతం ఆక్యుపెన్సీతో ఇవి నడిచాయి. 1,125 బస్సులకు ప్రయాణికులు గ్రౌండ్‌ బుకింగ్‌ చేసుకోగా, 255 సర్వీసులకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ చేయించుకున్నారు. 7,143 మంది ప్రయాణీకులు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు.

ఈ ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా రూ.19.50లక్షల ఆదాయం వచ్చింది. ఇదిలా ఉంటే.. అన్ని జిల్లాల నుంచి సర్వీసులు నడిపిన ఆర్టీసీ.. గుంటూరు జిల్లా, ఒంగోలులో మాత్రం నడపలేదు. కంటైన్మెంట్‌ క్లస్టర్ల కారణంగానే ఈ జిల్లాల్లో బస్సులను తిప్పే ఆలోచనను ఆర్టీసీ విరమించుకుంది. కాగా, తొలిరోజు మొత్తం 1,683 బస్సు సర్వీసులు తిప్పాలని ఆర్టీసీ భావించినప్పటికీ 1,483 సర్వీసులు మాత్రమే నడిచాయి. దీంతో శుక్రవారం సర్వీసుల్ని తగ్గిస్తూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 1,375 సర్వీసుల్ని, 5,500 ట్రిప్పుల్ని తిప్పేలా ఆర్టీసీ గురువారం రాత్రి నిర్ణయం తీసుకుంది. అలాగే, గుంటూరు జిల్లాలో శుక్రవారం 28 బస్సుల ద్వారా 112 ట్రిప్పులను తిప్పనున్నారు.

ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్నదే సీఎం లక్ష్యం
లాక్‌డౌన్‌వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూత పడకూడదన్నదే సీఎం జగన్‌ లక్ష్యం. సంక్షోభ సమయంలో ప్రస్తుతం పరిశ్రమలను ఆదుకుంటే ఆ నమ్మకంతో కొత్త పెట్టుబడులు వస్తాయి. అందుకే ఎవ్వరూ ఊహించని విధంగా గత ప్రభుత్వ పారిశ్రామిక బకాయిలను విడుదల చేయడం ద్వారా సీఎం జగన్‌ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచారు. పరిశ్రమలు తిరిగి ప్రారంభించడానికి ఏర్పడుతున్న సమస్యలను అధిగమించేందుకు జిల్లాస్థాయిలో కమిటీలు వేశాం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేశాం. – గౌతమ్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి

ఇది ఊహించని సాయం
లాక్‌డౌన్‌తో సంక్షోభం ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి సీఎం వైఎస్‌ జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రీస్టార్ట్‌ పేరుతో పరిశ్రమలు ప్రారంభించడానికి అనుమతించారు. ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో పాత పారిశ్రామిక బకాయిలను తీరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ప్రధానమంత్రికి సవివరంగా లేఖ రాశారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో పారిశ్రామిక వర్గాలన్నీ సంతోషంగా ఉన్నాయి. – ముత్తవరపు మురళీకృష్ణ, మాజీ అధ్యక్షులు, ఏపీ చాంబర్స్‌

పరుగులు పెట్టిన ఆర్టీసీ
♦ రాష్ట్రవ్యాప్తంగా తిరిగిన బస్సులు 
♦ బస్‌స్టేషన్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు 
♦ వారం రోజులు ముందుగా రిజర్వేషన్లు
♦ ప్రయాణికులకు శానిటైజేషన్‌.. థర్మల్‌ స్క్రీనింగ్‌
♦ మాస్కులు ఉంటేనే బస్సుల్లోకి అనుమతి

లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలపాటు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల కారణంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కాయి. బస్‌స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల చేతులకు శానిటైజర్‌తో శుద్ధిచేయించారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే అనుమతించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ కూడా చేశారు. పలుచోట్ల ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో ముందు అనుకున్న దానికంటే ఎక్కువగా సర్వీసులు నడిపారు. జిల్లాల వారీగా చూస్తే..
♦ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలోని ఆర్టీసీ.. నార్త్‌ ఈస్ట్‌ కోస్ట్‌ (నెక్‌) రీజియన్‌కి చెందిన తొమ్మిది డిపోల నుంచి 139 షెడ్యూల్స్‌ను తొలిరోజు ప్రారంభించింది. 30 ప్రధాన రూట్లలో 801 ట్రిప్స్‌కు ప్రణాళిక వేశారు. పక్క జిల్లాల ప్రధాన పట్టణాలకూ 96 ఎక్స్‌ప్రెస్, 41 ఆల్ట్రా డీలక్స్, రెండు సూపర్‌ లగ్జరీ సర్వీసులను నడిపారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు హెల్త్‌ చెకప్‌ చేసిన తరువాతనే ప్రయాణానికి అనుమతించారు. అలాగే, శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కూడా బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. 
♦ తూర్పు గోదావరి వ్యాప్తంగా 9 డిపోల నుంచి 147 బస్సులు  బయల్దేరాయి. రాజమహేంద్రవరం డిపో నుంచి విజయవాడ, విశాఖ డిపోలకు రెండేసి బస్సులు చొప్పున ముందుగా ప్రకటించారు. అయితే, ప్రయాణికులు అధికంగా బస్టాండ్‌కు చేరుకోవడంతో విశాఖకు ఐదు బస్సులు.. విజయవాడకు ఆరు బస్సులు ఏర్పాటుచేశారు. 
♦ పశ్చిమగోదావరి జిల్లాలో ఎనిమిది ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు నడిచాయి. జిల్లా వ్యాప్తంగా 130 బస్సులు తిరిగాయి. ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా బస్సుల్లో సీట్ల ఏర్పాటు, బస్టాండులో ధర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. బస్సు ఎక్కేముందే ప్రయాణికులకు టిక్కెట్లను జారీచేశారు.   
♦ ఇక ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 106 సర్వీసులు నడిచాయి. ముందుగా 152 సర్వీసులను నడపాలని నిర్ణయించినప్పటికీ ఒంగోలు నగరపాలక సంస్థ మొత్తం కంటైన్మెంట్‌ జోన్‌లో ఉన్నందున 106 సర్వీసులకు మాత్రమే అనుమతించారు. రిజర్వేషన్‌ కౌంటర్లు, గ్రౌండ్‌ బుకింగ్‌ వద్ద టికెట్లను పొందేలా అధికారులు చర్యలు చేపట్టారు. 
♦ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట డిపో మినహా మిగిలిన తొమ్మిది డిపోలకు చెందిన 109 బస్సులు మొదటి రోజు నడిచాయి. 652 ట్రిప్పులు నడపాలని అనుకున్న అధికారులు 463 ట్రిప్పులకు పరిమితం చేశారు. ప్రధానంగా జిల్లా నుంచి తిరుపతి, కడప, ఒంగోలు, విజయవాడకు బస్సులు నడిచాయి.  
♦ అనంతపురం జిల్లా పరిధిలోని 12 డిపోల నుంచి 111 సర్వీసులు తిప్పారు. అనంతపురం నుంచి కర్నూలు, వైఎస్సార్‌ కడప, మదనపల్లి, గుంతకల్, రాయదుర్గం ప్రాంతాలకు 13 బస్సులు నడిచాయి. ధర్మవరం నుంచి కర్నూలుకు రెండు బస్సులు నడిపారు. అదే విధంగా వివిధ డిపోల నుంచి ఇతర జిల్లాలకు 96 బస్సులు నడిపారు. 
♦ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 29 రూట్లలో 126 బస్సులను 632 ట్రిప్పులను తిప్పారు. 
♦ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 191 బస్సులను నడపాలని భావించారు. అయితే, సత్యవేడు, శ్రీకాళహస్తి బస్సులకు బ్రేక్‌ పడడంతో 165 సర్వీసులు మాత్రమే రోడ్డెక్కాయి. 
♦ వైఎస్సార్‌ జిల్లాలో మొదటిరోజు జిల్లా వ్యాప్తంగా 98 బస్సులు రాకపోకలు సాగించాయి. దూర ప్రాంతాల ప్రయాణీకులు ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేసుకోగా, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు బస్సుల వద్దే టికెట్లను కొనుగోలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement