సాక్షి, అమరావతి: కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోయేందుకు.. ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపడం సరికాదని.. ఇలాంటి వైఖరిలో మార్పుతీసుకురావాలన్నారు. వైరస్ లక్షణాలు ఉన్న వాళ్లు స్వయంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అదే విధంగా లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించుకునేలా దుకాణదారులే ముందుకు వచ్చే పరిస్థితిని తీసుకు రావాలన్నారు. కోవిడ్-19 నియంత్రణ చర్యలపై సీఎం జగన్ శనివారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.(నాలుగో విడత రేషన్ పంపిణీ ప్రారంభం)
విలేజ్ క్లినిక్స్ స్థాయికి కోవిడ్ పరీక్షలు..
‘‘కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియగానే ప్రజలు పరీక్షలతో పాటు... వైద్యం చేయించుకోవడానికి ముందుకు రావాలి. తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టగలుగుతాం. ఈ విషయం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇక కరోనా లక్షణాలు కనిపించగానే వైరస్ ఉన్నదీ లేనిదీ ఒక వ్యక్తి ఎలా నిర్ధారించుకోగలుగుతారు అన్నది కూడా చాలా ముఖ్యం. ఆ వ్యక్తి ఎవర్ని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలి? అన్న దానిపై ఒక పటిష్టమైన యంత్రాంగం అవసరం. ప్రతి ఇంటికీ ఒక కరపత్రం పంచాలి.
కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ సోకినట్లు అనుమానం వస్తే.. ఎవర్ని సంప్రదించాలన్న దానిపై పూర్తి వివరాలను కరపత్రంలో పొందుపరచాలి. ప్రజలు తమంతట వారే ముందుకు రావడం ద్వారా పరిస్థితిలో మార్పు వస్తుంది. కరోనా రావటం తప్పు కాదని, అది పాపం కాదనే విషయాన్ని ప్రజలకు గట్టిగా తెలియజేయాలి. వారి వైఖరిలో మార్పు రావాలి. ఇప్పుడు ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవి. భవిష్యత్‌లో విలేజ్ క్లినిక్స్ స్థాయికి కోవిడ్ పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి కార్యకలాపాలు
‘‘దుకాణాల్లో భౌతిక దూరం పాటించేలా చేయడానికి దుకాణదారులే ముందుకు వచ్చే పరిస్థితి రావాలి. తమ దుకాణం ముందు తామే వృత్తాలు గీసుకునేలా అవగాహన కల్పించాలి. కోవిడ్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలి. ఎక్కడెక్కడ ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ (ఎస్‌ఓపీ) తయారు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా బస్సుల్లో పాటించాల్సిన ప్రోటోకాల్స్‌ను రూపొందించాలని ఆదేశించారు. రెస్టారెంట్లు, మాల్స్‌లో క్రమ, క్రమంగా తిరిగి కార్యకలాలు మొదలయ్యేలా ఎస్‌ఓపీ తయారు చేయాలి’’ అని ఆదేశించారు.(ఆ గ్రామస్తులకు ఏ కష్టం రాకూడదు)
వలస కూలీలపై సీఎం జగన్ ఉదారత
మండుటెండలో పిల్లా, పాపలతో కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా నడుస్తున్న వలస కూలీల పరిస్ధితిని చూసి సీఎం జగన్ చలించిపోయారు. ఈ క్రమంలో.. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలో ప్రవేశించి... రహదారుల మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న ఇతర రాష్ట్రాల వలస కూలీల స్థితిగతులపై సమావేశంలో ఆయన చర్చించారు. మానవీయ కోణాన్ని కూడా మర్చిపోవద్దని.. రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలన్నారు. వలస కూలీలు కోసం బస్సులు తిప్పడానికి సిద్ధంకావాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం విధి, విధానాలు తయారు చేయాలని.. వలస కూలీలను టిక్కెట్టు కూడా అడగవద్దని ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా నడిచివెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ తారసపడినా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకువెళ్లాలని మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇదివరకు ఆదేశించిన విధంగా వలస కూలీలకు భోజనాలు, తాగు నీరు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రోటోకాల్స్ పాటిస్తూ నడిపే బస్సుల్లో వలస కూలీలకు 15 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఈ సందర్బంగా ఆయన ఆదేశించారు. (సీఎస్ చొరవతో స్వస్థలాలకు..)
పెరుగుతున్న డిశ్చార్జీలు
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 48 కేసులు నమోదైనట్లు అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. ‘‘కొత్తగా నమోదైన 48 కేసులలో 31 కేసులు కోయంబేడు మార్కెట్‌కు సంబంధించినవి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో డిశ్చార్జి సంఖ్య బాగా పెరిగింది. నిన్న ఒక్కరోజే 101 మంది డిశ్చార్జి అయ్యారు. కృష్ణా, కర్నూలులో టెస్టింగ్ కెపాసిటీని మరింత పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం’’అని పేర్కొన్నారు. ఇక లాక్‌డౌన్ ఎగ్జిట్ వ్యూహంగా వైద్య పరంగా ఎలాంటి విధానాలను అసరించాల్సిన దానిపై సమావేశంలో చర్చించారు.
సమర్థ యంత్రాంగం ఏర్పాటు చేయండి
‘‘వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. మార్కెట్ ఇంటెలిజెన్స్ విధానం, మార్కెట్ ఇంటర్‌వెన్షన్ విధానం ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ రెండు విషయాల్లో సమర్థవంతంగా రైతు భరోసా కేంద్రాలు పని చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం లోపాలు లేకుండా పనిచేసే సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి’’అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.(మా కష్టాలు తీరాయి..)
Comments
Please login to add a commentAdd a comment