సాక్షి, అమరావతి: కోవిడ్-19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు.. అదే విధంగా రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల తరలింపు విధానాలపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి పలువురు విమానాల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు చేరుకుంటారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వారికి అక్కడే మెడికల్ స్క్రీనింగ్ చేయిస్తామని.. అనంతరం మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్ చేసి పర్యవేక్షణ కొనసాగిస్తామని వెల్లడించారు. (మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్)
ఆ తర్వాతే వారిని స్వస్థలాలకు పంపిస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా విదేశాల నుంచి వస్తున్న వారిలో ఆయా దేశాల్లో కరోనా తీవ్రత ఆధారంగా వారిని వర్గీకరిస్తున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వారికి కూడా క్వారంటైన్ సదుపాయాలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇక మహారాష్ట్రలోని థానే నుంచి 1000 మందికి పైగా వలసకూలీలు గుంతకల్ వచ్చారని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. వీరందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. థానేలో కేసుల తీవ్రత అధికంగా ఉందని, వీరిని క్షుణ్ణంగా పర్యవేక్షించాల్సి ఉందని పేర్కొన్నారు. అదే విధంగా లాక్‌డౌన్ నేపథ్యంలో సరిహద్దుల్లో 9 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలీసులు, వైద్య బృందాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.(ప్రతి గ్రామంలో పది క్వారంటైన్ బెడ్స్)
ఆ ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది
ఈ నేపథ్యంలో వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ‘‘ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేసి వారికి భోజనం, తదితర సదుపాయాలు ఇవ్వండి. వివిధ పరిశ్రమల్లో పనులకు వెళ్తానంటే.. వారికి సహకారం అందించండి. తమ తమ రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే... వారికి కావాల్సిన ప్రయాణ ఏర్పాటు చేయండి. ఇందుకు అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విషయంలో సంకోచించాల్సిన అవసరం లేదు. చొరవ తీసుకుని వారికి తగిన విధంగా సహాయం చేయండి. వెళ్లేటప్పుడు దారి ఖర్చుల కింద రూ.500లు రూపాయలు ఒక్కో కూలీకి ఇవ్వండి’’ అని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర కూలీలు ఇక్కడకు వచ్చేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ముందుకు రాని పరిస్థితులు ఉంటే.. వెనకడుగు వేయవద్దన్నారు. అవసరమైన పక్షంలో వారికీ ప్రయాణ సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతేగాకుండా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారి ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో డిశ్చార్జి కేసుకు సంబంధించి పటిష్టమైన ప్రోటోకాల్ పాటిస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. వరుసగా రెండు పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే డిశ్చార్జి చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్-19 కేసుల డిశ్చార్జిలో దేశ సగటు 28.63 శాతం అయితే రాష్ట్రంలో 41.02 శాతం.. అలాగే పాజిటివిటీ రేటు రాష్ట్రంలో 1.26 శాతం అయితే దేశంలో 3.87 శాతం ఉందని వెల్లడించారు. ఇక టెలి మెడిసిన్‌లో భాగంగా సబ్ సెంటర్లకు మందులు పంపించి... డాక్టర్ల ఇచ్చిన ప్రిస్కిప్షన్ మేరకు వారికి పంపిణీ చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
వెంటనే స్పందించాలి..
రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని... వారికి ఎక్కడ సమస్యలు ఎదురైనా వెంటనే స్పందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సమస్యలను పరిష్కరించడంలో దూకుడు ప్రదర్శించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment