ఆరోగ్య ఆసరా ఆర్థిక సాయం పెంపు: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Covid 19 Preventive Measures Today | Sakshi
Sakshi News home page

కోవిడ్‌-19 నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీపై సీఎం జగన్‌ సమీక్ష

Published Fri, Sep 18 2020 5:35 PM | Last Updated on Fri, Sep 18 2020 5:53 PM

CM YS Jagan Review Meeting On Covid 19 Preventive Measures Today - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైద్య సేవల్లో ఎక్కడా ఏ లోటు రాకూడదని, సిబ్బంది నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఆరోగ్య ఆసరాలో ఆర్థిక సహాయం పెంచామని, సాధారణ కాన్పుకు రూ.5 వేలు. సిజేరియన్‌కు రూ.3 వేలు అందించనున్నట్లు తెలిపారు. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో తప్పనిసరిగా హెల్ప్‌డెస్క్‌లు ఉండాలని, ఆరోగ్యమిత్రలు ఆరు రకాల బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొన్నారు. 

అదే విధంగా.. జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం సమన్వయ బాధ్యతలు జేసీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. మరింత సమగ్ర సమాచారంతో ఆరోగ్యశ్రీ క్యూఆర్‌ కోడ్‌ కార్డులు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్‌ తన క్యాంపు ఆఫీసులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, కోవిడ​ నిర్ధారణ పరీక్షలు,  వైద్య సదుపాయాలు తదితర అంశాల గురించి సమావేశంలో తెలిపారు. (చదవండి: కొత్త జిల్లాలతో సూక్ష్మ స్థాయికి చేరనున్న ‘రాజ్యం’)

ఈ క్రమంలో అన్ని ఆస్పత్రులలో ప్రమాణాలు పెరిగి, మంచి గ్రేడింగ్‌ వచ్చేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఐవీఆర్‌ఎస్‌లో అడిగే ప్రశ్నలు మరింత స్సష్టంగా ఉండాలని, ముఖ్యంగా వైద్య సేవలు, శానిటేషన్‌పై పూర్తి వివరాలు ఆరా తీయాలని, ఆ మేరకు ప్రశ్నలు మార్చాలని సూచించారు. ఇక హోం ఐసొలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కిట్లు ఇవ్వాలన్న సీఎం, ఆ మేరకు అధికారులు పక్కాగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో ప్లాస్మా థెరపీ నిర్వహించాలని, దాతలను ప్రోత్సహించే విధంగా రూ.5 వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆరోగ్యమిత్రలు–6 బాధ్యతలు
రాష్ట్రంలోని 540 ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో ఇప్పటికే హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు కాగా, మిగిలిన 27 ఆస్పత్రుల్లో కూడా త్వరలో ఏర్పాటు కానున్నాయని సమీక్షా సమావేశంలో ఆరోగ్యశ్రీ అధికారులు వివరించారు. ఇందుకు స్పందనగా.. రాష్ట్రంలోని అన్నిఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో వెంటనే ఆరోగ్యమిత్రలను ఏర్పాటు చేయాలన్నసీఎం జగన్ వారిని ఆదేశించారు. ఆరోగ్య మిత్రలు ప్రధానంగా 6 బాధ్యతలు నిర్వర్తించాలని నిర్దేశించారు.

ఆస్పత్రిలో వైద్య మౌలిక సదుపాయాలు, వైద్యుల అందుబాటు, ఆహారంలో నాణ్యత, శానిటేషన్, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా అందేలా చూడడం, పేషెంట్ కేరింగ్.. ఈ 6 అంశాలను ఆరోగ్యమిత్ర (హెల్ప్‌ డెస్క్‌)లు చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో విలేజ్‌ క్లినిక్‌లు ఆరోగ్యశ్రీకి రెఫరల్‌గా ఉంటాయని, ఆ తర్వాత కోవలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రులు రెఫరల్‌గా ఉంటాయని తెలిపారు. ఆరోగ్యమిత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆస్పత్రి బయట, లోపల తప్పనిసరిగా ప్రదర్శించాలని, రెండు వారాల్లోగా అన్ని ఆస్పత్రులలో వారి నియామకాలు పూర్తి కావాలని నిర్దేశించారు. 

ఆస్పత్రుల గ్రేడింగ్‌    
ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రికి గ్రేడింగ్‌ తప్పనిసరి అన్న సీఎం జగన్‌, అక్కడ సదుపాయాలు, సేవల ఆధారంగా వాటి నిర్ధారణ జరుగుతుందని, అన్ని ఆస్పత్రులు ఏ–కేటగిరీలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు 6 నెలల సమయం ఇవ్వాలని, ఆలోగా అవి ప్రమాణాలు పెంచుకోకపోతే జాబితా నుంచి తొలగించే అంశం పరిశీలించాలని సూచించారు. అదే విధంగా అన్ని ఏ–కేటగిరీ ఆస్పత్రులు ఏడాదిలోగా ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు పొందాలని నిర్దేశించారు. జిల్లా స్థాయిలో ఆరోగ్యశీ పథకం సమన్వయ బాధ్యతలను ఇక నుంచి ఒక జేసీకి అప్పగించాలని సీఎం ఆదేశించారు.

మెగా వైద్య శిబిరాలు
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో్ ఆరోగ్య ఆసరా కింద సాధారణ కాన్పుకు ఇక నుంచి రూ.5 వేలు, అదే విధంగా సిజేరియన్‌ కాన్పుకు రూ.3 వేలు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అదే విధంగా గతంలో మాదిరిగా మెగా వైద్య శిబిరాలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి, ప్రతి నియోజకవర్గంలో ఆ శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆ తర్వాత వైద్య సదుపాయాల కల్పనపై ఎస్‌ఓపీ రూపొందించాలని ఆదేశించారు.

ఇక రాష్ట్రంలో ఇప్పుడున్న 11 టీచింగ్‌ ఆస్పత్రులతో పాటు, కొత్తగా ఏర్పాటు కానున్న 16 ఆస్పత్రులు, ఇంకా ఐటీడీఏల పరిధిలో ఏర్పాటవుతున్న అని ఆస్పత్రులలో తప్పనిసరిగా ప్రమాణాలు ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, ఆహారం, శానిటేషన్‌తో పాటు, యాంబియెన్స్‌ (ఆస్పత్రి చూడగానే చక్కగా ఉండేలా) బాగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా అవే ప్రమాణాలు ఉండాలని ఆయన నిర్దేశించారు.

తగ్గుతున్న కేసులు
రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని అంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,84,371 కోవిడ్‌ పరీక్షలు చేయగా, ఇప్పుడు 94,453 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వారు తెలిపారు. ఇక పాజిటివిటీ రేటు 12.31 శాతం కాగా, రికవరీ రేటు 84.48 శాతంగా ఉందని, మరణాల రేటు కూడా కేవలం 0.86 శాతం మాత్రమే నమోదవుతోందని చెప్పారు.

బెడ్లు–రోగులు
రాష్ట్రంలో ఆక్సీజన్‌ బెడ్లు 18609 ఉండగా, వాటిలో 5723 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, ఆక్సీజన్‌ సదుపాయం లేని బెడ్లు 15060 ఉండగా, వాటిలో 9777 మంది రోగులు చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఐసీయూ బెడ్లు 4469 ఉండగా, వాటిలో 2246 మంది చికిత్స పొందుతున్నారని, 2,522 వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా, 178 రోగులు వాటిపై చికిత్స పొందుతున్నారని తెలిపారు.

కోవిడ్‌ పరీక్షలు
ఈనెల 16వ తేదీ నాటికి 11,01,625 శాంపిల్స్‌ సేకరించి పరీక్ష చేయగా, 1,56,323 కేసులు పాజిటివ్‌గా తేలాయన్న అధికారులు, 17వ తేదీన ఒక్క రోజే 75 వేల పరీక్షలు చేశామని చెప్పారు. కోవిడ్‌ చికిత్స కోసం అన్ని జిల్లాలలో పూర్తి సదుపాయాలు ఉన్నాయని, ఏ పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు పూర్తి సన్నద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

కోవిడ్‌ ఆస్పత్రులు–బెడ్లు    
రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ చికిత్స కోసం 268 ఆస్పత్రులను సిద్ధం చేయగా, వాటిలో 230 ఆస్పత్రులను ఇప్పటి వరకు వినియోగించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇక అన్ని ఆస్పత్రులలో 4469 ఐసీయూ బెడ్లు, ఆక్సీజన్‌ సదుపాయం ఉన్న నాన్‌ ఐసీయూ బెడ్లు 18,609, నాన్‌ ఐసీయూల్లో ఆక్సీజన్‌ సదుపాయం లేని బెడ్లు 15,060 ఉన్నాయని, ఆ విధంగా అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో 38,025 బెడ్లు అందుబాటులో ఉండగా, ఇప్పటి వరకు 36,232 బెడ్ల వినియోగం జరిగిందని తెలిపారు. కాగా, ఇప్పుడు కోవిడ్‌ ఆస్పత్రులలో 17,924 మంది రోగులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల (సీసీసీ)లో 15,625 మంది రోగులు చికిత్స పొందుతుండగా, హోం ఐసొలేషన్‌లో 60,905 మంది ఉన్నారని అధికారులు చెప్పారు.

సిబ్బంది–నియామకాలు
అన్ని ఆస్పత్రులలో మంజూరు చేసిన   పోస్టులన్నీ వెంటనే భర్తీ అయ్యేలా చూడాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  నర్సింగ్‌ ఆర్డర్లీస్‌ (మేల్, ఫిమేల్‌), శానిటేషన్‌ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శిక్షణ నర్సులకు సంబంధించి అని జిల్లాలలో 20,415 పోస్టులకు అనుమతి ఇవ్వగా, ఇప్పటి వరకు 12,014 మంది నియామకం జరిగిందని అధికారులు చెప్పారు.

సర్వీసుల ఇంటిగ్రేషన్‌–గ్రేడింగ్‌
ప్రజలకు అత్యంత మెరుగైన సేవలందించేలా 104, 108, 14410 కాల్‌ సెంటర్ల ఇంటిగ్రేషన్‌ చేయడం జరిగిందన్న వారు, ఆస్పత్రులు రేటింగ్‌ కోసం ప్రత్యేక మెథడాలజీ కూడా అనుసరిస్తున్నామని వెల్లడించారు. ఐసీయూ బెడ్లు మొదలు, వైద్యం, ఆహారం, శానిటేషన్ వంటి అన్ని అంశాల్లో ప్రమాణాలతో ఆ మెథడాలజీ అమలు చేస్తున్నట్లు చెప్పారు.

మాస్కులు-పీపీఈ కిట్లు
ఎన్‌-95 మాస్కులు 5,21,350. పీపీఈ కిట్లు 7,61,097 రాష్ట్రంలో అందుబాటులో (స్టాక్‌) ఉన్నాయని అధికారులు తెలిపారు. అదే విధంగా ప్లాస్మా థెరపీకి సంబంధించి, 9 జిల్లాలలోని ప్రధాన ఆస్పత్రులలో మొత్తం 308 కాన్వలసెంట్‌ ప్లాస్మా సేకరించగా, వాటిలో థెరపీ కోసం ఇప్పటి వరకు 265 వినియోగించినట్లు వివరించారు. 

ఆరోగ్యశ్రీ కార్డులు
ఆరోగ్యశ్రీ క్యూఆర్‌ కోడ్‌ కార్డులతో పాటు, యాప్‌పై సమావేశంలో అధికారులు వివరించారు. ఆ కార్డులో రోగి బ్లడ్‌ గ్రూప్‌ సమాచారం కూడా ఉండాలన్న సీఎం  జగన్, ఆ కార్డుల పంపిణీలో గ్రామ సచివాలయాల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement