Restart
-
Neha Bagaria: ఉద్యోగ పర్వం..రీస్టార్ట్
ఉద్యోగం ఊరకే ఎవరూ మానెయ్యరు. సవాలక్ష కారణాలు ఉండవచ్చు. ఉద్యోగం మానేయడం ఎంత తేలికో, తిరిగి ఉద్యోగంలో చేరడం అంత కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు తమ కెరీర్‌ను రీస్టార్ట్ చేయడానికి బెంగళూరు కేంద్రంగా ‘జాబ్స్ ఫర్ హర్’ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది నేహా బగరియా, ఆ ప్లాట్‌ఫామ్‌ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసి రెండడుగులు ముందుకు వేసింది నేహా... రకరకాల కారణాల వల్ల ఉద్యోగాలు మానేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. కరోన కరకు కాలంలో ఉద్యోగం మానేసిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అలా ఉద్యోగాలు మానేసిన వారు కెరీర్ రీస్టార్ట్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది నేహా బగరియా. అమెరికాలోని వార్టన్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసిన నేహా హెచ్ ఆర్‌లో ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాలలో పనిచేసింది. 2010లో తన కెరీర్‌కు బ్రేక్ వచ్చింది. తిరిగి మూడు సంవత్సరాల తరువాత ఉద్యోగంలో చేరింది. ‘కెరీర్ రీస్టార్ట్ చేయకపోతే ఎంతో నష్టపోయేదాన్ని’ అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళా ఉద్యోగులు గుర్తుకు వచ్చారు. వారు అనాసక్తతతోనో, వ్యతిరేకతతోనో ఉద్యోగాలు మానేసి ఉండరు. ఒకానొక నిర్దిష్టమైన సమయంలో తప్పనిసరి పరిస్థితులలో ఉద్యోగం మానేసి ఉంటారు. వారు తిరిగి ఉద్యోగంలో చేరాలకుంటున్నా దారి కనిపించి ఉండదు. ‘పురుషులతో పోల్చితే మహిళలకు ఉద్యోగ అవకాశాలు అనే కిటికీ చాలా చిన్నది’ అంటుంది నేహా. కొన్ని కంపెనీలు అప్పుడే కాలేజీ విద్యను పూర్తి చేసుకున్న అమ్మాయిలకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగ విధులు సరిగ్గా నిర్వహించలేరేమో అనే భయం వల్ల పెళ్లయిన మహిళలకు ఉద్యోగం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అయితే అది అపోహే అని చరిత్ర చెబుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జాబ్స్ ఫర్ హర్’ అనే ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసింది నేహా. ఉద్యోగం మానేసిన ఎంతోమంది మహిళలు తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఈ ప్లాట్‌ఫామ్ ఎంతో ఉపయోగపడింది. కంపెనీలకు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మధ్య వారధిగా మారింది. ‘తమను తాము తిరిగి నిరూపించుకోవాలనే పట్టుదల చాలామంది మహిళలలో కనిపించింది’ అంటుంది నేహా. ‘జాబ్స్ ఫర్ హర్’ ద్వారా ఉద్యోగంలో చేరిన మహిళలలో ముంబైకి చెందిన శ్రీప్రియ ఒకరు. ‘వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేసిన నేను కాస్త ఆలస్యంగా అయినా తిరిగి ఉద్యోగం చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. అయితే అది అంత సులువైన విషయం కాదని తెలిసిపోయింది. ఈ పరిస్థితులలో జాబ్స్ ఫర్ హర్ చుక్కానిలా కనిపించింది’ అంటుంది శ్రీప్రియ. కొంత కాలం తరువాత... ‘జాబ్స్ ఫర్ హర్’ వెంచర్‌ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసింది నేహా. ‘హర్ కీ’కి కలారీ క్యాపిటల్, 360 వన్ ఎసెట్... మొదలైన సంస్థలు ఫండింగ్ చేశాయి. ‘ఉద్యోగం మానేసిన మహిళలలో ఎనభై శాతం మంది తిరిగి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి హర్ కీ కొత్త దారి చూపుతుంది’ అంటోంది ‘360 వన్ ఎసెట్’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిధి గుమాన్. -
రెండేళ్ల తర్వాత రంజీ ఆట
అహ్మదాబాద్: కరోనా మహమ్మారి దెబ్బకు మూలన పడిన ప్రముఖ దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత మైదానంలోకి దిగుతోంది. నాలుగు రోజుల సంప్రదాయ ఆట నేటి నుంచి జరుగనుంది. మొత్తం 38 జట్లను బయో బబుల్‌లో ఉంచి ఈ టోర్నమెంట్‌ను సాఫీగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 10, 16 జట్లను బుడగలో ఉంచడం వేరు ఏకంగా 38 జట్లను ఆడించడం వేరు. ఇదంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే బోర్డు పెద్ద కసరత్తే చేసి నిర్వహిస్తోంది. చాన్నాళ్లుగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న భారత స్టార్ క్రికెటర్లు అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీలో ఆడనున్నారు. ఇందుకోసం ఇద్దరు నెట్ ప్రాక్టీస్‌లో తలమునకలై చెమటోడ్చుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ సౌరాష్ట్ర తరఫున పుజారా, ముంబై తరఫున రహానే బరిలోకి దిగుతుండగా... ఇరు జట్ల మధ్య ఎలైట్ గ్రూప్ ‘డి’ మ్యాచ్ అహ్మదాబాద్‌లో గురువారం నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. తన్మయ్ అగర్వాల్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు ఎలైట్ ‘బి’ గ్రూప్‌లో తమ తొలి మ్యాచ్‌ను భువనేశ్వర్ వేదికగా చండీగఢ్‌తో ఆడనుంది. ఆంధ్ర జట్టు ఎలైట్ ‘ఇ’ గ్రూప్‌లో తిరువనంతపురం వేదికగా రాజస్తాన్‌తో తమ పోరును ఆరంభించనుంది. బరిలో ఉన్న 38 జట్లలో ఆరు జట్లు ప్లేట్ గ్రూప్‌లో తలపడతాయి. 32 జట్లు ఎనిమిది ఎలైట్ గ్రూప్‌ల్లో పోటీపడతాయి. మ్యాచ్ సందర్భంగా ఏ జట్టయినా కోవిడ్ బారిన పడితే కనీసం తొమ్మిది మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా మ్యాచ్‌ను కొనసాగిస్తామని బీసీసీఐ తెలిపింది. -
హరిహర వీరమల్లు పునఃప్రారంభం !.. స్క్రిప్ట్ పనులపై చర్చ
Pawan Kalyan Hari Hara Veera Mallu Restart With Action Sequence: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా వేవ్స్ కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని భారీ యాక్షన్ సీన్లతో పుఃనప్రారంభించనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెన్స్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పవన్ కల్యాణ్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనువిందు చేయనున్నట్లు సమాచారం. -
సెప్టెంబరు ఒకటి నుంచి బడులు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతినిస్తే విద్యా సంస్థల్లో వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి దశల వారీగా ప్రత్యక్ష బోధన విధానాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. తొలుత తొమ్మిది, పది, ఇంటర్మీడియెట్ తరగతులను పునః ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపింది. సీఎం సూచనల మేరకు విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకుని.. కోవిడ్ కారణంగా 2020 నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. మధ్యలో కొంతకాలం మినహా దాదాపు 18 నెలలుగా డిజిటల్ పద్ధతిలోనే బోధన జరుగుతోంది. అయితే గత కొంతకాలంగా ప్రత్యక్ష బోధనకు అనుమతించాలని విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు కోవిడ్ తీవ్రత తగ్గిందని, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు సరైన వాతావరణం నెలకొందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. పలు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన ప్రారంభించాయి. ఆన్లైన్ పాఠాలు ఫలితాన్ని ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో కొందరు తల్లిదండ్రులు కూడా ప్రత్యక్ష బోధన వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిశీలించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఒకేసారి ఓపెన్ చేస్తే ఇబ్బందులు.. ఒకటి నుంచి ఎనిమిది తరగతుల్లో ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై విద్యాశాఖ ఒకింత విముఖంగానే ఉంది. థర్డ్ వేవ్‌పై ఊహాగానాల నేపథ్యంలో ఈ దిశగా చర్యలు సరైనవి కావని అభిప్రాయపడుతోంది. చిన్న తరగతుల విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవడం కష్టమనే విషయంలో అధికారులు ఏకాభిప్రాయంతో ఉన్నారు. మరోవైపు అన్ని క్లాసులను ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల విద్యా సంస్థలు కిక్కిరిసే అవకాశాన్నీ గమనంలో ఉంచుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తొలుత 9, 10 తరగతులతో పాటు, ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి అనుమతులివ్వడం మేలని ప్రభుత్వానికి నివేదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి, అవసరమైతే మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని కింది తరగతులకు అనుమతులిస్తే శ్రేయస్కరమని భావిస్తున్నట్టు విద్యాశాఖ తెలిపింది. అవసరమైతే అదనపు సెక్షన్లు.. క్లాసుకు 30 మందికి మించకుండా ప్రత్యక్ష తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంతకు మించి విద్యార్థులు ఉండే అవకాశం లేదని, ఎటొచ్చీ ప్రైవేటు సంస్థలతోనే ఇబ్బందని పేర్కొంది. ప్రైవేటు సంస్థల విషయంలో సరైన పర్యవేక్షణ అవసరమని, ఈ మేరకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నివేదించింది. 30కి మించి విద్యార్థులు ఉంటే సెక్షన్లు పెంచేలా చూడాలని సూచించింది. ఈ నేపథ్యంలో పలు కార్పొరేట్ పాఠశాలల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కూడా విద్యాశాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ఒక గదిలో టీచర్ ప్రత్యక్ష బోధన చేసినప్పటికీ, మిగతా సెక్షన్లలో టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని కొన్ని సంస్థలు ప్రతిపాదిస్తున్నాయి. సర్కారు దృష్టికి ‘ఆన్లైన్’ ఇబ్బందులు విద్యాశాఖ తాజా ప్రతిపాదనల మేరకు.. 1–8 తరగతుల విద్యార్థులకు మరికొంత కాలం ఆన్లైన్లోనే విద్యాబోధన జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు కొందరి నుంచి వ్యతిరేకత వస్తోందని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో పిల్లలు ఎలక్ట్రానిక్ వస్తువులకు అలవాటు పడుతున్నారని, దీనివల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయనే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోందని ఆయన తెలిపారు. దీంతో ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికే అనధికారికంగా ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయని, కేవలం ప్రభుత్వ సంస్థల విద్యార్థులకే నష్టం జరుగుతోందని మరోఅధికారి చెప్పారు. ఏదేమైనా కోవిడ్ దృష్ట్యా చిన్న పిల్లల విషయంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కన్పించడం లేదని అన్నారు. -
ఫోన్ హ్యాకింగ్ భయమా?.. సింపుల్‌గా రీస్టార్ట్ చేయండి
ఈ మధ్య కాలంలో పెగాసస్ పేరు బాగా వినిపిస్తోంది. సొసైటీలో హై ప్రొఫైల్ వ్యక్తుల ఫోన్ డేటా, కాల్ రికార్డింగ్‌లు మొత్తం హ్యాకర్లకు అందుబాటులో పెట్టిందంటూ ఈ కుంభకోణం కుదిపేసింది. అయితే తాము పెగాసస్ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతామని ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో ప్రకటనతో వివాదం రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. అయితే హ్యాకింగ్‌కు ఎవరూ అతీతులు కాదు. ఈ తరుణంలో హ్యాకింగ్ భయాలు-అనుమానాలు సాధారణ ప్రజల్లోనూ వెంటాడొచ్చు. కాబట్టి, హ్యాకర్ల ముప్పు తీవ్రతను తగ్గించుకునేందుకు ఓ సింపుల్ టిప్ చెబుతున్నారు సెన్ అంగస్ కింగ్. సెన్ అంగస్ కింగ్(77).. అమెరికా జాతీయ భద్రతా సంస్థ విభాగం(NSA) ‘సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ’ సభ్యుడు. ఇంతకీ ఆయన ఏం సలహా ఇస్తున్నాడంటే.. ఫోన్‌ను రీబూట్ చేయమని. రోజుకు ఒకసారి కాకపోయినా.. కనీసం వారానికి ఒకసారి రీస్టార్ట్ చేసినా చాలని ఆయన చెప్తున్నాడు. యస్.. కేవలం ఫోన్‌ను ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా హ్యాకర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆయన అంటున్నాడు. ఇదేం కొత్తది కాదని డిజిటల్ ఇన్సెక్యూరిటీ కోసం ఎన్నో ఏళ్లుగా కంప్యూటర్ల మీద వాడుతున్న ట్రిక్కేనని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే.. పూర్తిగా కాకున్నా.. బోల్తా స్మార్ట్ ఫోన్ రీబూట్ అనేది సైబర్ నేరగాళ్లను పూర్తిగా కట్టడి చేయలేదని, కానీ, అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించే హ్యాకర్లకు సైతం హ్యాకింగ్ పనిని కష్టతరం చేస్తుందనేది నిరూపితమైందని ఆయన అంటున్నాడు. ఇక NSA గత కొంతకాలంగా చెప్తున్న ఈ టెక్నిక్‌పై నిపుణులు సైతం స్పందిస్తున్నారు. కొన్ని ఫోన్లలో సెక్యూరిటీ బలంగా ఉంటుంది. హ్యాకింగ్ అంత ఈజీ కాదు. కాబట్టే హ్యాకర్లు యాక్టివిటీస్ మీద నిఘా పెడతారు. అదను చూసి ‘జీరో క్లిక్’ పంపిస్తారు. అయితే ఫోన్ రీస్టార్ట్ అయిన ఎలాంటి ఇంటెరాక్షన్ ఉండదు. కాబట్టి, ‘జీరో క్లిక్’ ప్రభావం కనిపించదు. దీంతో హ్యాకర్లు సదరు ఫోన్‌ను తమ టార్గెట్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇలా హ్యాకర్లను బోల్తా కొట్టించవచ్చు. జీరో క్లిక్ అంటే.. జీరో క్లిక్ అంటే నిఘా దాడికి పాల్పడే లింకులు. సాధారణంగా అనవసరమైన లింకుల మీద క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని చాలామందికి తెలుసు. కానీ, ఇది మనిషి ప్రమేయం లేకుండా, మానవ తప్పిదంతో సంబంధం లేకుండా ఫోన్లోకి చొరబడే లింక్స్. హ్యాకర్లు చాలా చాకచక్యంగా ఇలాంటి లింక్స్‌ను ఫోన్లోకి పంపిస్తుంటారు. అంటే మనం ఏం చేసినా.. చేయకపోయినా ఆ లింక్స్ ఫోన్లోకి ఎంటర్ అయ్యి.. హ్యాకర్లు తమ పని చేసుకుపోతుంటారన్నమాట. పైగా ఈ లింకులను గుర్తించడం కష్టం. అందుకే వాటిని నివారించడం కూడా కష్టమే. అయితే ఫోన్ రీబూట్ సందర్భాల్లో హ్యాకర్లు.. తెలివిగా మరో జీరో క్లిక్ పంపే అవకాశమూ లేకపోలేదు. కానీ, ఫోన్‌ను రీస్టార్ట్ చేయడమనే సింపుల్ ట్రిక్‌తో హ్యాకింగ్ ముప్పు చాలావరకు తగ్గించగలదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. -
తాజ్, ఎర్రకోటల వద్ద మళ్లీ టూరిస్టుల సందడి!
సాక్షి, న్యూఢిల్లీ : అన్‌లాక్ 2.0లో భాగంగా తాజ్‌మహల్, ఎర్రకోట సహా దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాలు జులై 6 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా కట్టడితో విధించిన సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం పూర్తి భద్రతతో చారిత్రక, సాంస్కృతిక కట్టడాలు మళ్లీ ప్రారంభం కానున్నాయని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వెల్లడించారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మార్చి చివరి వారం నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించినా ఇప్పటివరకూ తెరుచుకోని చారిత్రక కట్టడాల వద్ద జులై 6 నుంచి తిరిగి పర్యాటకుల సందడి మొదలవనుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)తో సంప్రదింపులు జరిపిన మీదట కేంద్ర ప్రభుత్వం చారిత్రక కట్టడాలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. చదవండి : తాజ్ అందాలు ఆస్వాదించా -
ఏపీలో మళ్లీ సాధారణ స్థితికి జీవనచక్రం
పారిశ్రామిక రంగం.. పట్టాలపైకి.. సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో స్తంభించిన రాష్ట్ర పారిశ్రామిక రంగం క్రమంగా ఊపందుకుంటోంది. పరిశ్రమలను పునఃప్రారంభించడానికి ఏప్రిల్ 19న ‘రీస్టార్ట్’ పేరుతో ప్రకటించిన కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలిస్తోంది. ఇప్పటికే 6,582 యూనిట్లు ప్రారంభం కాగా, మిగిలిన యూనిట్లు తమతమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ యూనిట్లు 20 శాతం సిబ్బందితో భౌతిక దూరం పాటిస్తూ పనులు కొనసాగిస్తున్నాయి. ఈ యూనిట్లు తిరిగి ప్రారంభించడం ద్వారా సుమారు 70,000 మందికి ఉపాధి లభించిందని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే, పరిశ్రమల శాఖ వద్ద గుర్తింపు పొందిన కంపెనీలే కాకుండా.. అసంఘటిత రంగంలో ఉన్న చిన్న తరహా యూనిట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే రీస్టార్ట్ ద్వారా ఇంకా అనేక సంస్థలు ఇప్పటికే పనులు ప్రారంభించాయి. వీటిని కూడా కలుపుకుంటే లక్షలాది మందికి ఉపాధి లభించింది. ముఖ్యంగా గనులు తిరిగి ప్రారంభం కావడం.. నిర్మాణ రంగంలో పనులు మొదలు కావడంతో లక్షలాది మందికి పనులు లభిస్తున్నాయి. కానీ, రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటివరకు 6,939 యూనిట్లు అనుమతులకు దరఖాస్తు చేసుకోగా, అందులో 6,582 సంస్థలు పనులు ప్రారంభించాయి. ఇందులో 3,555 యూనిట్లు రీస్టార్ట్ నిబంధనలు పాటిస్తున్నామంటూ సొంత ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాయి. మరో 1,893 యూనిట్లను అధికారులు స్వయంగా తనిఖీ చేసి పనులు ప్రారంభించడానికి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. ఇక అత్యవసర సేవల కింద 1,134 యూనిట్లు లాక్డౌన్లో కూడా కార్యకలాపాలు కొనసాగించాయి. రీస్టార్ట్‌లో ‘ప్రకాశం’ వెలుగులు రీస్టార్ట్ కార్యక్రమం కింద అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 658 యూనిట్లు పనులు ప్రారంభించాయి. ఆ తర్వాత చిత్తూరు 632, విశాఖ 591, గుంటూరు 577, అనంతపురం 544, కృష్ణాలో 513 యూనిట్లు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు పరిశ్రమల శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇవి కాకుండా.. నిర్మాణ రంగ పనులు ప్రారంభం కావడంతో బ్రిక్ యూనిట్లు సగానికి పైగా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 1,943 ఇటుక బట్టీలు ఉండగా అందులో 60 శాతం యూనిట్లు పనులు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. ఇదే సమయంలో 53,786 నిర్మాణ రంగ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని.. ఇందులో 10 శాతం పనులు ఇప్పటికే ప్రారంభించామని బిల్డర్లు చెబుతున్నారు. ఈ రంగానికి సంబంధించిన దుకాణాలు కూడా తెరుచుకోవడంతో నిర్మాణ రంగ పనులు కూడా ఇక వేగం పుంజుకుంటాయని వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. వలస కార్మికులను రప్పించేందుకు టాస్క్‌ఫోర్స్ ఇదిలా ఉంటే.. లాక్డౌన్ వల్ల సొంత గ్రామాలకు వెళ్లిపోయిన వలస కార్మికులను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చాలా పరిశ్రమలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడానికి కార్యాచరణ సిద్ధంచేసుకున్నా కార్మికుల సమస్య వీటికి అవరోధంగా మారింది. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరిశ్రమల్లో పనిచేస్తున్న వలస కూలీల వివరాలను సేకరించి, వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దీని అమలుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేయాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నేడే రీస్టార్ట్ ప్యాకేజీ లాక్డౌన్ వల్ల దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి రీస్టార్ట్ ప్యాకేజీని ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్యాకేజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1,110 కోట్లు అందించనుంది. ముందుగా రూ.993.97 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. బడ్జెట్ కేటాయింపులకు అదనంగా ఈ నిధులు విడుదల చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో ఎంఎస్ఎంఈల బలోపేతానికి గత ప్రభుత్వం పెట్టిన రూ.827.5కోట్ల బకాయిలతో సహా సుమారు రూ.905 కోట్ల మేరకు ప్రోత్సాహకాలు విడుదల చేయనుంది. అంతేకాక.. మూడు నెలల విద్యుత్ బిల్లులపై రూ.187.80కోట్ల మేర స్థిర విద్యుత్ చార్జీల మాఫీ.. 6–8 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక పాత బకాయిలు విడుదలవల్ల 11,238 ఎంఎంస్ఎంఈ యూనిట్లు లబ్ధిపొందనున్నాయి. అలాగే, మొత్తం పాత బకాయిలు విడుదల, విద్యుత్ డిమాండ్ చార్జీలు రద్దు, రూ.200కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుతో సుమారు 98వేల యూనిట్లకు లబ్ధిచేకూరుతుంది. సందడిగా మార్కెటు రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు ఒకొక్కటిగా సడలిస్తుండటంతో వ్యాపార సంస్థలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. ప్రజలు రోడ్ల మీదకు రావడంతో అన్ని రకాల మార్కెట్లలో సందడి వాతావరణం కనిపించింది. నిబంధనలకు లోబడి వ్యాపారులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. దీంతో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. కంటైన్మెంట్ ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రధాన పట్టణాల్లో బంగారం, వస్త్రదుకాణాలు, సెలూన్లు, హార్డ్‌వేర్ షాపులు, గృహోపకరణాలు, సిమెంట్, స్టీల్, బేకరీ, బుక్స్ అండ్ స్టేషనరీ దుకాణాలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. తోపుడు బండ్ల వ్యాపారులు ఎప్పటిలా రోడ్లపక్కన వ్యాపారాలు సాగించారు. అలాగే, అన్ని జిల్లాల్లోనూ చిన్నచిన్న పరిశ్రమలు కూడా ఇప్పటికే తెరుచుకున్నాయి. చేనేత కార్మికులు కూడా పనులు ప్రారంభించారు. వెల్డింగ్, టైలరింగ్, ట్రాక్టర్ రిపేర్లు వంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి. గ్రానైట్ ఫ్యాక్టరీలు, లేత్ మిషన్లు కూడా తెరచుకోవడంతో కార్మికులకు ఉపాధి లభిస్తోంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యం ♦ ఉద్యోగ అవకాశాలలో రాష్ట్ర యువతకే పెద్ద పీట ♦ 25 నైపుణ్య కళాశాలలకు స్థల ఇబ్బంది ఉండొద్దు ♦ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఉద్యోగ అవకాశాలలో రాష్ట్ర యువతకే పెద్దపీట వేసేలా ముందుకెళ్లాలని పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని తెలిపారు. పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో యువతను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలోని నాల్గవ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఐటీ, మౌలిక వసతుల శాఖల ఉన్నతాధికారులతో మంత్రి మేకపాటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 నైపుణ్య శిక్షణా కళాశాలల ఏర్పాటుకు సన్నద్ధం కావాలన్నారు. ప్రతి చోట కనీసం 5 ఎకరాలకు తగ్గకుండా నైపుణ్య కళాశాలల నిర్మాణం కోసం భూమిని సేకరించాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. శుక్రవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ఇవ్వనున్న ఎమ్ఎస్ఎమ్ఈల ప్రోత్సాహకాల చెల్లింపులకు అవసరమైన ఏర్పాట్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక రంగం త్వరలో కొత్త పుంతలు తొక్కడం ఖాయమని మంత్రి అన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ♦ ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి అధికారులంతా సమాయత్తం కావాలి. ♦ పరిశ్రమలు, నైపుణ్య, ఐటీ రంగాల పురోగతిని తెలియజేసేలా ప్రజెంటేషన్ రూపొందించాలి. ♦ రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా పలు కార్యక్రమాల రూపకల్పనకు అధికారులు కృషి చేయాలి. ♦ ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలలో ఉన్న కార్మికుల అవసరం, ప్రస్తుతం ఉన్నవారి జాబితాలను సిద్ధం చేయాలి. ♦ కోవిడ్ కారణంగా మూత పడ్డ పరిశ్రమలు, సొంత ప్రాంతాలకు తరలి పోయిన వలస కూలీల వివరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు వివరాలను సేకరించాలి. ♦ నైపుణ్య కొరత గల నిరుద్యోగులను గుర్తించి వారికి శిక్షణ అందించడం, ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలపై స్పష్టత వచ్చేలా చూడాలి. ♦ పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలి. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి, శిక్షణా శాఖ డైరెక్టర్ లావణ్యవేణి, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ సీఈవో అర్జా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు సడలించడంతో గురువారం ఉదయం7 గంటలకే డిపోల నుంచి బస్సులు బయటకు వచ్చాయి. మొత్తం 900 పల్లెవెలుగు బస్సులు నడిచాయి. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌లు వీటికి అదనం. మొత్తం మీద మొదటిరోజు 50 శాతం ఆక్యుపెన్సీతో ఇవి నడిచాయి. 1,125 బస్సులకు ప్రయాణికులు గ్రౌండ్ బుకింగ్ చేసుకోగా, 255 సర్వీసులకు ఆన్లైన్ రిజర్వేషన్ చేయించుకున్నారు. 7,143 మంది ప్రయాణీకులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ ఆన్లైన్ బుకింగ్ ద్వారా రూ.19.50లక్షల ఆదాయం వచ్చింది. ఇదిలా ఉంటే.. అన్ని జిల్లాల నుంచి సర్వీసులు నడిపిన ఆర్టీసీ.. గుంటూరు జిల్లా, ఒంగోలులో మాత్రం నడపలేదు. కంటైన్మెంట్ క్లస్టర్ల కారణంగానే ఈ జిల్లాల్లో బస్సులను తిప్పే ఆలోచనను ఆర్టీసీ విరమించుకుంది. కాగా, తొలిరోజు మొత్తం 1,683 బస్సు సర్వీసులు తిప్పాలని ఆర్టీసీ భావించినప్పటికీ 1,483 సర్వీసులు మాత్రమే నడిచాయి. దీంతో శుక్రవారం సర్వీసుల్ని తగ్గిస్తూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 1,375 సర్వీసుల్ని, 5,500 ట్రిప్పుల్ని తిప్పేలా ఆర్టీసీ గురువారం రాత్రి నిర్ణయం తీసుకుంది. అలాగే, గుంటూరు జిల్లాలో శుక్రవారం 28 బస్సుల ద్వారా 112 ట్రిప్పులను తిప్పనున్నారు. ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్నదే సీఎం లక్ష్యం లాక్‌డౌన్‌వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూత పడకూడదన్నదే సీఎం జగన్ లక్ష్యం. సంక్షోభ సమయంలో ప్రస్తుతం పరిశ్రమలను ఆదుకుంటే ఆ నమ్మకంతో కొత్త పెట్టుబడులు వస్తాయి. అందుకే ఎవ్వరూ ఊహించని విధంగా గత ప్రభుత్వ పారిశ్రామిక బకాయిలను విడుదల చేయడం ద్వారా సీఎం జగన్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచారు. పరిశ్రమలు తిరిగి ప్రారంభించడానికి ఏర్పడుతున్న సమస్యలను అధిగమించేందుకు జిల్లాస్థాయిలో కమిటీలు వేశాం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేశాం. – గౌతమ్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి ఇది ఊహించని సాయం లాక్‌డౌన్‌తో సంక్షోభం ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రీస్టార్ట్ పేరుతో పరిశ్రమలు ప్రారంభించడానికి అనుమతించారు. ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో పాత పారిశ్రామిక బకాయిలను తీరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ప్రధానమంత్రికి సవివరంగా లేఖ రాశారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో పారిశ్రామిక వర్గాలన్నీ సంతోషంగా ఉన్నాయి. – ముత్తవరపు మురళీకృష్ణ, మాజీ అధ్యక్షులు, ఏపీ చాంబర్స్ పరుగులు పెట్టిన ఆర్టీసీ ♦ రాష్ట్రవ్యాప్తంగా తిరిగిన బస్సులు ♦ బస్స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు ♦ వారం రోజులు ముందుగా రిజర్వేషన్లు ♦ ప్రయాణికులకు శానిటైజేషన్.. థర్మల్ స్క్రీనింగ్ ♦ మాస్కులు ఉంటేనే బస్సుల్లోకి అనుమతి లాక్డౌన్ కారణంగా రెండు నెలలపాటు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల కారణంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కాయి. బస్స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల చేతులకు శానిటైజర్‌తో శుద్ధిచేయించారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే అనుమతించారు. థర్మల్ స్క్రీనింగ్ కూడా చేశారు. పలుచోట్ల ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో ముందు అనుకున్న దానికంటే ఎక్కువగా సర్వీసులు నడిపారు. జిల్లాల వారీగా చూస్తే.. ♦ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలోని ఆర్టీసీ.. నార్త్ ఈస్ట్ కోస్ట్ (నెక్) రీజియన్‌కి చెందిన తొమ్మిది డిపోల నుంచి 139 షెడ్యూల్స్‌ను తొలిరోజు ప్రారంభించింది. 30 ప్రధాన రూట్లలో 801 ట్రిప్స్‌కు ప్రణాళిక వేశారు. పక్క జిల్లాల ప్రధాన పట్టణాలకూ 96 ఎక్స్‌ప్రెస్, 41 ఆల్ట్రా డీలక్స్, రెండు సూపర్ లగ్జరీ సర్వీసులను నడిపారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు హెల్త్ చెకప్ చేసిన తరువాతనే ప్రయాణానికి అనుమతించారు. అలాగే, శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కూడా బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ♦ తూర్పు గోదావరి వ్యాప్తంగా 9 డిపోల నుంచి 147 బస్సులు బయల్దేరాయి. రాజమహేంద్రవరం డిపో నుంచి విజయవాడ, విశాఖ డిపోలకు రెండేసి బస్సులు చొప్పున ముందుగా ప్రకటించారు. అయితే, ప్రయాణికులు అధికంగా బస్టాండ్‌కు చేరుకోవడంతో విశాఖకు ఐదు బస్సులు.. విజయవాడకు ఆరు బస్సులు ఏర్పాటుచేశారు. ♦ పశ్చిమగోదావరి జిల్లాలో ఎనిమిది ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు నడిచాయి. జిల్లా వ్యాప్తంగా 130 బస్సులు తిరిగాయి. ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా బస్సుల్లో సీట్ల ఏర్పాటు, బస్టాండులో ధర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. బస్సు ఎక్కేముందే ప్రయాణికులకు టిక్కెట్లను జారీచేశారు. ♦ ఇక ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 106 సర్వీసులు నడిచాయి. ముందుగా 152 సర్వీసులను నడపాలని నిర్ణయించినప్పటికీ ఒంగోలు నగరపాలక సంస్థ మొత్తం కంటైన్మెంట్ జోన్లో ఉన్నందున 106 సర్వీసులకు మాత్రమే అనుమతించారు. రిజర్వేషన్ కౌంటర్లు, గ్రౌండ్ బుకింగ్ వద్ద టికెట్లను పొందేలా అధికారులు చర్యలు చేపట్టారు. ♦ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట డిపో మినహా మిగిలిన తొమ్మిది డిపోలకు చెందిన 109 బస్సులు మొదటి రోజు నడిచాయి. 652 ట్రిప్పులు నడపాలని అనుకున్న అధికారులు 463 ట్రిప్పులకు పరిమితం చేశారు. ప్రధానంగా జిల్లా నుంచి తిరుపతి, కడప, ఒంగోలు, విజయవాడకు బస్సులు నడిచాయి. ♦ అనంతపురం జిల్లా పరిధిలోని 12 డిపోల నుంచి 111 సర్వీసులు తిప్పారు. అనంతపురం నుంచి కర్నూలు, వైఎస్సార్ కడప, మదనపల్లి, గుంతకల్, రాయదుర్గం ప్రాంతాలకు 13 బస్సులు నడిచాయి. ధర్మవరం నుంచి కర్నూలుకు రెండు బస్సులు నడిపారు. అదే విధంగా వివిధ డిపోల నుంచి ఇతర జిల్లాలకు 96 బస్సులు నడిపారు. ♦ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 29 రూట్లలో 126 బస్సులను 632 ట్రిప్పులను తిప్పారు. ♦ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 191 బస్సులను నడపాలని భావించారు. అయితే, సత్యవేడు, శ్రీకాళహస్తి బస్సులకు బ్రేక్ పడడంతో 165 సర్వీసులు మాత్రమే రోడ్డెక్కాయి. ♦ వైఎస్సార్ జిల్లాలో మొదటిరోజు జిల్లా వ్యాప్తంగా 98 బస్సులు రాకపోకలు సాగించాయి. దూర ప్రాంతాల ప్రయాణీకులు ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోగా, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు బస్సుల వద్దే టికెట్లను కొనుగోలు చేశారు. -
రీస్టార్ట్ !
ప్రభుత్వ పాఠశాలల్లో మూలనపడిన కంప్యూటర్ విద్యను పునఃప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా ఏడునెలల కాలవ్యవధికి ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రకటన విడుదల చేశారు. విద్యాసంవత్సరం మొదలైన మూడునెలల తర్వాత తాపీగా ప్రారంభించిన ఈ ప్రక్రియనూ సజావుగా చేయడం లేదు. కంప్యూటర్ విద్యకు పునరుజ్జీవం పోసే దిశగా శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. కొవ్వూరు : దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులందరికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్న సంకల్పంతో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 6,300 పాఠశాలల్లో రెండు విడతలుగా ఈ విద్యను ప్రవేశపెట్టారు. అప్పట్లో నియమించిన కాంట్రాక్టు సంస్థ గడువు 2013 సెప్టెంబర్‌తో ముగియడంతో అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కంప్యూటర్ విద్యను అటకెక్కించింది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండున్నరేళ్లు గడిచినా దీనిపై దష్టి సారించలేదు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చొరవతో స్పందించిన అధికార యంత్రాంగం కంప్యూటర్ విద్య పునఃప్రారంభానికి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా 283 పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియమాకానికి రంగం సిద్ధం చేసింది. సర్వశిక్షాభియాన్ నిధులతో వీరికి గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. ఏడునెలలకు రూ.1,18,86,000 నిధులు వెచ్చించనుంది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమై మూడునెలలు గడిచిన తర్వాత తాపీగా నియామక ప్రక్రియ చేపట్టిన అధికారులు ఏడునెలల కాల వ్యవధికి మాత్రమే తాత్కాలిక పద్ధతిలో ప్రకటన విడుదల చేయడం, గతంలో ఐదేళ్లు ఇన్స్ట్రక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉన్నవారిని పక్కనబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరమ్మతులూ భారమే! మూడేళ్ల నుంచి కంప్యూటర్లు మూలనపడి ఉండడంతో చాలాచోట్ల అవి పాడైపోయాయి. యూపీఎస్‌లు, బ్యాటరీలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల ఫోన్ బిల్లులు చెల్లించకపోవడంతో నెట్ కనెక్షన్లను తొలగించారు. జనరేటర్లూ మూలనపడ్డాయి. కంప్యూటర్ విద్యను పునఃప్రారంభించాలనే యోచనతో జిల్లా అధికారులు కంప్యూటర్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించే బాధ్యతను ఎన్యూవల్ మేనేజ్మెంట్ కాంట్రాక్టు(ఏఎంసీ) ఆధ్వర్యంలో వీఎల్ మార్కెటింగ్ అనే సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ వీటి మరమ్మతులకు సుమారు రూ.10 లక్షల ఖర్చవుతుందని ప్రాథమికంగా నిర్ధారించి జిల్లా అధికారులకు నివేదిక పంపింది. పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ నిధులతో వీటి మరమ్మతులు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిని ప్రధానోపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. నిర్వహణ నిధులు కంప్యూటర్ల మరమ్మతులకు వెచ్చిస్తే పాఠశాలల్లో కరెంటు, తాగునీటి సరఫరా, నెలవారీగా వచ్చే నెట్ బిల్లులు వంటి చెల్లింపులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్నారు. నేడు దరఖాస్తుకు ఆఖరు తేదీ జిల్లాలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారమే ఆఖరు తేదీ. మ«ధ్యాహ్నాం 12 గంటల వరకూ మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈనెల 20న ఏలూరులో దరఖాస్తుదారులందరికీ ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. హాల్ టì కెట్, పరీక్ష కేంద్రం వివరాలు, ఇతర అన్ని వివరాలను ఎప్పటికప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వెస్ట్ గోదావరి.ఓఆర్జీ వెబ్సైట్లో ఆప్డేట్ చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తునూ ఇదే వెబ్సైట్లో చేసుకోవాలి. మండలాలవారీగా పోస్టుల వివరాలివీ.. జిల్లాలో తాడేపల్లిగూడెం మండలంలో 13, పాలకొల్లు, నరసాపురం మండలాల్లో 11 చొప్పున, చింతలపూడి, భీమవరం మండలాల్లో తొమ్మిది చొప్పున, యలమంచిలి మండలంలో పది, కాళ్లలో 8, మొగల్తూరు, ఉండి, ఏలూరు, జంగారెడ్డిగూడెం, గణపవరం, ఉంగుటూరు, పెరవలి మండలాల్లో ఏడేసి చొప్పున, పాలకోడేరు, భీమడోలు, పెంటపాడు, దేవరపల్లి, కొయ్యలగూడెం, కొవ్వూరు, నిడదవోలు,అత్తిలి, పెనుమంట్ర, తణుకు మండలాల్లో ఆరేసి చొప్పున పోస్టులు భర్తీచేయనున్నారు. వీరవాసరం, చాగల్లు,దెందులూరు, గోపాలపురం, నిడమర్రు, పెంటపాడు, ఆచంట, ఇరగవరం, ఉండ్రాజవరం మండలాల్లో ఐదేసి చొప్పున, ఆకివీడు, ఏలూరు రూరల్, లింగపాలెం,పెదవేగి, నల్లజర్ల, తాళ్లపూడి, పెనుగొండ, పోడూరు మండలాల్లో నాలుగేసి చొప్పున, కామవరపు కోట, బుట్టాయిగూడెం, కుక్కునూరు మండలాల్లో మూడేసి చొప్పున, జీలుగుమిల్లి, పోలవరంలో రెండేసి చొప్పున, ద్వారకా తిరుమల, వేలేరుపాడు మండలాల్లో ఒక్కోక్క ఇన్స్ట్రక్టర్ పోస్టును భర్తీచేయనున్నారు. గతంలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి గతంలో పనిచేసిన కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లకు నియామకంలో ప్రాధాన్యం ఇవ్వాలి.అప్పట్లో ఏదైనా డిగ్రీ చేసి, కంప్యూటర్ విద్యలో ఏడాదిపాటు శిక్షణ ఉండాలన్న నిబంధన ఉంది. పీజీడీసీఏ, డీసీ కోర్సులు చేసిన వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు డిగ్రీలో కంప్యూటర్ ఒక సబ్జెక్టు ఉండాలని నిబంధన పెట్టడం వల్ల మాలాంటి వాళ్లకు అన్యాయం జరుగుతోంది. ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉన్నా మమ్మలను పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణం. మళ్లీ పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదు. –వై.నరసింహరాజు, ఏపీ కంప్యూటర్ టీచర్స్ అసోయోషియేషన్ అధ్యక్షుడు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయాం నేను ఎంఏ చదివా. కంప్యూటర్లో పీజీడీసీఏ చేశా. గతంలో మూడేళ్లు ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశా. ప్రస్తుతం నెట్ సెంటర్ నడుపుకుంటున్నా. కంప్యూటర్ విద్యా బోధనపై అవగాహన ఉన్న వాళ్లను పక్కనపెట్టి ఏదైనా డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్టు ఉండాలని నిబంధన పెట్టారు.గతంలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పనిచేస్తూనే ఏదైనా టీచర్ సెలవు పెట్టిన సమయంలో ఇతర సబ్జెక్టులూ చెప్పేవాళ్లం. కొత్త నిబంధనతో దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయాం.–అంబటి సుహాసిని, కొవ్వూరు 740 దరఖాస్తులు వచ్చాయి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ నియామకానికి శనివారం మధ్యాహ్నానికి 740 దరఖాస్తులొచ్చాయి. ఈనెల 20న అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తాం. ఎంపికైన అభ్యర్థుల నుంచి మెరిట్ ఆధారంగా రోస్టర్ విధానంలో ఎంపిక చేస్తాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న అన్ని కంప్యూటర్లను బాగుచేసేందుకు యత్నిస్తున్నాం. వీఎల్ మార్కెటింగ్ సంస్థ ఏడాది పొడవునా మరమ్మతులు బాధ్యత తీసుకుంటుంది. ఆర్‌ఎంఎస్‌ఏ గ్రాంటు ద్వారా మరమ్మతులు చేయిస్తాం.–డి.మధుసుధనరావు, జిల్లా విద్యాశాఖ అధికారి -
మార్కెట్లోకి మళ్లీ గెలాక్సీ నోట్7
సియోల్ :బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఇటు శాంసంగ్ కంపెనీకి అటు వినియోగదారులకు వణుకుపుట్టించిన గెలాక్సీ నోట్ 7 అమ్మకాలు పునఃప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి దక్షిణ కొరియాలో మళ్లీ అమ్మకాలు చేపట్టనున్నట్టు స్మార్ట్ఫోన్ల దిగ్గజం శాంసంగ్ ప్రకటించింది. లాంచ్ అయిన కొద్ది రోజులకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన గెలాక్సీ నోట్7 ఫోన్లు, పేలుళ్ల ఘటనలతో తన పాపులారిటీని, మార్కెట్‌ను రెండింటిని చేజార్చుకున్నాయి. ప్రస్తుతం ఆ నష్టాన్ని పూరించుకోవడానికి శాంసంగ్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త, సురక్షితమైన బ్యాటరీలతో గెలాక్సీ నోట్7 అమ్మకాలను తిరిగి ప్రారంభించనున్నట్టు శాంసంగ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. స్వదేశంలో సెప్టెంబర్ 28 నుంచి ఈ అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపిన కంపెనీ ప్రతినిధి అమెరికా సహా మిగతా దేశాల్లో ఆయా మార్కెట్ల పరిస్థితులకు అనుగుణంగా ఈ డివైజ్ అమ్మకాలను చేపడతామని తెలిపారు. అక్టోబర్ మొదట్లో ఆస్ట్రేలియాలో చేపడతామన్నారు. ఇప్పటివరకు ఉన్న సామ్సంగ్ ఫోన్లలోని తెలుపు రంగు బ్యాటరీ ఇండికేటర్ కాకుండా.. కొత్త నోట్7 ఫోన్లలో ఆకుపచ్చ రంగు బ్యాటరీ ఇండికేటర్ ఉంటుందని సామ్సంగ్ తెలిపింది. కొత్త గెలాక్సీ నోట్ 7 ఫోన్ భద్రమైందో కాదో తెలుసుకునేందుకు రీటేల్ బాక్స్‌పై లేబుల్ ఉంటుందని సంస్థ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో రారాజుగా వెలిగిన శాంసంగ్‌కు గెలాక్సీ నోట్7 కోలుకోలేని దెబ్బతగిలించింది. ఒక్కసారిగా పేలుడు వార్తలు రావడంతో అంతర్జాతీయ విమానాల్లో ఈ ఫోన్ల నిషేధం, రీకాల్ వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 2న కంపెనీ దక్షిణ కొరియా, అమెరికా వంటి 10 దేశాల నుంచి ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు అధికారికంగా అధికారికంగా ప్రకటించింది. చార్జీ చేసేటప్పుడు, కాల్ ఆన్షర్ చేసేటప్పుడు పేలుళ్లు సంభవిస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా గెలాక్సీ నోట్7కు రీప్లేస్‌మెంట్‌గా సురక్షితమైన బ్యాటరీతో మరోఫోన్ను అందించనున్నట్టు తెలిపింది. -
అలా మొదలైంది ...
పాఠశాలలు పునఃప్రారంభం అయిష్టంగా పిల్లలు బడిబాట ప్రైవేట్ స్కూళ్లలో తాయిలాలతో స్వాగతం భవిష్యత్‌కు పునాది బడి అది నీ జీవితానికి అవ్వాలి ఒరవడి మారాం చేయకురా కన్నా..బడికి వెళ్లరా నాన్నా.. జిల్లాలో సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పిల్లలు పలకాబలపం పట్టుకుని, బ్యాగును చంకన ఎత్తుకుని బడిబాట పట్టడం కనిపించింది. రెండు నెలల పాటు మూగబోయిన తరగతి గదుల్లో మళ్లీ సందడి నెలకొంది. దుమ్ముదులిపి, పాఠాలు వళ్లించే పనుల్లో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. కొందరు చిన్నారులు బడికి వెళ్లక మారాం చేయడంతో తల్లిదండ్రులు వారిని బుజ్జగించే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. బడి గంటలు మో గాయి. వేసవిలో ఆటా పాటలతో గడిపిన గడుగ్గాయిల గుండెల్లు జల్లు మన్నాయి. మేము పాఠశాల కెళ్లమని మారాం చేశారు. అమ్మా నాన్నలు తమ బుజ్జాయిలను బుజ్జగించి, బడిబాట పట్టించడానికి బండెడు బాధలు పడ్డారు. ఎలాగోలా సర్ధిచెప్పి స్కూలులో వదిలారు. అక్కడా చిన్నారులను ఆకట్టుకోవడానికి మిఠాయిలు పంచారు. అయినా కొందరు కన్నీళ్లు పెట్టక మానలేదు. సోమవారం జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభం అలా మొదలైంది. చిత్తూరు(ఎడ్యుకేషన్) : జిల్లాలో బడిగంటలు మోగాయి. సుమారు 43 రోజుల పాటు వేసవి సెలవులకు అలవాటుపాడిన విద్యార్థులు సోమవారం పాఠ శాలకు వెళ్లడానికి మారం చేశారు. మొదటిరోజు పాఠశాలకు వెళితే చదువు బాగా వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు బుజ్జగించి పంపా రు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. హైస్కూల్ విద్యార్థులు తొలి రోజు స్నేహితులతో వేసవి విశేషాలను చర్చించుకున్నారు. సాధారణ దుస్తులతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫామ్ అందజేయకపోవడంతో వారు సాధారణ దుస్తులతో పాఠశాలకు హాజరయ్యారు. ఏటా యూనిఫామ్ పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. గత ఏడాది ఇచ్చిన యూనిఫామ్ చిరిగిపోవడంతో చాలా మంది విద్యార్థులు మొదటి రోజు రంగుల దుస్తులను ధరించి పాఠశాలకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. అమలుకాని సంప్రదాయదుస్తులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లో హాజరు కావాలని రాష్ట్ర విద్యాశాఖ గత మే నెలలో ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాలో ఆ ఆదేశాలు ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. దీంతో ఉపా ధ్యాయులు తొలిరోజున ఎప్పటిలాగే యథాతథంగానే పాఠశాలలకు హాజరయ్యారు. అడ్మిషన్లు తక్కువే ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన మేరకు విద్యార్థులు హాజరుకాకపోగా, నూతనంగా చేరే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిందని తెలిసింది. గత మూడు సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. బడి గంట మోగిన వేళ.. తిరుపతి ఎడ్యుకేషన్ : వేసవి సెలవులు అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలలో చేర్పించేందుకు, తమ పిల్లలను పాఠశాలల్లో వదిలి పెట్టేందుకు విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులూ బడిబాట పట్టారు. పాఠశాలకు వెళ్లనంటూ మారాం చేస్తూ పిల్లలు, చిన్నారులను బుజ్జగిస్తూ తల్లిదండ్రులు పాఠశాలకు తీసుకొచ్చారు. కొత్తగా బడిబాట పట్టిన చిన్నారులను తల్లిదండ్రులు, తరగతిలో ఉపాధ్యాయులు ఓదార్చారు. బడికి వెళ్లనంటూ మారాం చేస్తున్న చిన్నారులకు దుకాణంలో చిరుతిండ్లు కొని ఇచ్చి పాఠశాలకు పంపించారు. వేసవి సెలవులకు టాటా చెబుతూ బడికి వచ్చిన పిల్లలకు చాక్లెట్లతో స్వాగతం పలికారు. -
రేపటి నుంచి మినీరైలు సేవలు
సాక్షి, ముంబై: గత నాలుగు నెలలుగా నేరల్-మాథేరాన్ మధ్య నిలిచిపోయిన మినీ రైలుసేవలను బుధవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రకటనతో పర్యాటకుల్లో ఆనందం వెల్లువిరిసింది. నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో కొండపైగల మాథేరాన్ పర్యాటక ప్రాంతానికి నిత్యం వందలాది, సెలవు రోజుల్లో వేలాది మంది వెళ్తుంటారు. ఈ రైలు మార్గం దాదాపు 80 శాతం కొండ అంచుల మీదుగా సాగుతుంది. దీంతో వర్షా కాలంలో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఏటా జూన్ 15 నుంచి ఆక్టోబరు మొదటి లేదా రెండోవారం వరకు ఈ రైలు సేవలను నిలిపివేస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో రైల్వే మార్గంపై ఉన్న వంతెనలు, ట్రాక్‌లకు, ప్రమాదకర మలుపుల వద్ద మరమ్మతులు నిర్వహిస్తారు. బోగీలు, ఇంజిన్లను మరమ్మతుల నిమిత్తం రైల్వే వర్క్ షాపులకు తరలిస్తారు. ప్రస్తుతం వర్షాకాలం దాదాపు పూర్తికావడంతో రైళ్ల సేవలు పునరుద్ధరించేందుకు మార్గం సుగమమైంది. దీంతో బుధవారం నుంచి సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
‘గ్రీన్‌ఫీల్డ్’ పునః ప్రారంభం
కాకినాడ క్రైం : వివాదాస్పదమైన సామర్లకోట రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ అంధుల ఆశ్రమ పాఠశాల శుక్రవారం నుంచి పునఃప్రారంభమైంది. ప్రత్యేకాధికారి పాలనలో పాఠశాల కొనసాగుతోంది. శిక్షణ పొందిన ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు డిప్యుటేషన్‌పై మరో ఉపాధ్యాయురాలిని అధికారులు నియమించారు. ఈ నెల 18న పాఠశాలలో ఉంటున్న కూర్తి జాన్సన్, పాముల సురేంద్ర, పులప సాయిని ప్రిన్సిపాల్ టేకుమూడి శ్రీనివాస్, కరస్పాండెంట్ కోలకొండ వెంకటేశ్వర రావు అమానుషంగా దాడి చేసి, గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలకు అటు విద్యాశాఖ నుంచి కాని, ఇటు ఐసీడీఎస్ నుంచి కాని అనుమతులు లేవని గుర్తించారు. స్థలానికి కూడా పూర్తి స్థాయిలో అనుమతి లేకపోవడంతో భవనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డి పాఠశాల స్థితిగతులపై విచారణ నిర్వహించారు. పాఠశాలలో 53 మంది అంధ బాలలు ఆశ్రయం పొంది, విద్యనభ్యసిస్తున్నారు. పూర్తిగా అనుమతులు లేకుండా నడుస్తుండడంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి పదో తరగతి విద్యార్థులను సమీపంలోని హైస్కూల్లో తాజాగా ఎన్రోల్ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా బియ్యం, కూరగాయలు ప్రభుత్వం సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థులకు గాయాలు కావడం, అది చూసిన మరికొంత మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను ఇళ్లకు తీసుకుపోవడంతో, 39 మంది మాత్రమే మిగిలారు. మిగిలిన తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను తీసుకుపోతారేమోనని భావించిన అధికారులు వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాలను పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని, రాజీవ్ విద్యామిషన్‌లోని విలీన విద్య జిల్లా కో-ఆర్డినేటర్ లక్ష్మణ్ కుమార్ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారని అధికారులు భరోసా కల్పించారు. శుక్రవారం నుంచి పాఠశాల పునఃప్రారంభం కావడంతో 39 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారికి విద్యబోధించేందుకు వికలాంగుల విద్యలో ప్రత్యేక శిక్షణ పొందిన ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. గంగనాపల్లి పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలిని డిప్యుటేషన్‌పై ఇక్కడకు తీసుకొచ్చారు. ఇంతకుముందే ఆ పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి మొత్తం తొమ్మిది మంది ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించేలా అధికారులు చర్యలు చేపట్టారు. పాఠశాల స్థలం తిమ్మాపురం పంచాయతీకి చెందిన సామాజిక స్థలం కావడంతో దానితో పాటు భవనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశాల మేరకు విద్య, వికలాంగ సంక్షేమ శాఖలు, ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వారి పేర్లను నమోదు చేయించారు. ప్రస్తుతానికి గతంలో పనిచేసే ఉపాధ్యాయులు, ఆయాలనే కొనసాగిస్తున్నారు. త్వరలోనే అంధుల ఆశ్రమ పాఠశాలకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించనున్నట్టు అధికారులు తెలిపారు. వికలాంగ పెన్షన్లూ స్వాహా? గ్రీన్‌ఫీల్డ్ అంధుల ఆశ్రమ పాఠశాలకు చెందిన 24 మంది అంధ విద్యార్థులకు ప్రతి నెలా రూ.500 చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తున్న పెన్షన్ కూడా నిర్వాహకులు స్వాహా చేస్తున్నారు. పాఠశాలలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉండడంతో, వారిలో 24 మంది ఇక్కడే ఉంటున్నందున పెన్షన్లను తిమ్మాపురం పంచాయతీ పరిధిలోకి మార్చాలని నాలుగేళ్ల క్రితం అధికారుల నుంచి అనుమతులు పొందారు. పెన్షన్లను పాఠశాలకు అందజేయాల్సిందిగా అధికారులు సూచించడంతో, వాటిని కూడా నిర్వాహకులు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకుని, స్వగ్రామాలకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం 22 మందికి చెందిన పెన్షన్లు రూ.11 వేలు పాఠశాలకు అందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇవి తల్లిదండ్రులకు చేరడం లేదు. మిగిలిన విద్యార్థులు మాత్రం ప్రతి నెలా వారి ఇళ్ల వద్ద పెన్షన్ తీసుకుంటున్నందున, ఆ సొమ్ము వారి తల్లిదండ్రులకు అందుతోంది. దీనిపై జిల్లా అధికారులు విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.