రీస్టార్ట్ !
రీస్టార్ట్ !
Published Sun, Sep 18 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
ప్రభుత్వ పాఠశాలల్లో మూలనపడిన కంప్యూటర్ విద్యను పునఃప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా ఏడునెలల కాలవ్యవధికి ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రకటన విడుదల చేశారు. విద్యాసంవత్సరం మొదలైన మూడునెలల తర్వాత తాపీగా ప్రారంభించిన ఈ ప్రక్రియనూ సజావుగా చేయడం లేదు. కంప్యూటర్ విద్యకు పునరుజ్జీవం పోసే దిశగా శాశ్వత చర్యలు చేపట్టడం లేదు.
కొవ్వూరు : దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులందరికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్న సంకల్పంతో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు.
అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 6,300 పాఠశాలల్లో రెండు విడతలుగా ఈ విద్యను ప్రవేశపెట్టారు. అప్పట్లో నియమించిన కాంట్రాక్టు సంస్థ గడువు 2013 సెప్టెంబర్‌తో ముగియడంతో అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కంప్యూటర్ విద్యను అటకెక్కించింది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండున్నరేళ్లు గడిచినా దీనిపై దష్టి సారించలేదు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చొరవతో స్పందించిన అధికార యంత్రాంగం కంప్యూటర్ విద్య పునఃప్రారంభానికి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా 283 పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియమాకానికి రంగం సిద్ధం చేసింది. సర్వశిక్షాభియాన్ నిధులతో వీరికి గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. ఏడునెలలకు రూ.1,18,86,000 నిధులు వెచ్చించనుంది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమై మూడునెలలు గడిచిన తర్వాత తాపీగా నియామక ప్రక్రియ చేపట్టిన అధికారులు ఏడునెలల కాల వ్యవధికి మాత్రమే తాత్కాలిక పద్ధతిలో ప్రకటన విడుదల చేయడం, గతంలో ఐదేళ్లు ఇన్‌స్ట్రక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉన్నవారిని పక్కనబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరమ్మతులూ భారమే!
మూడేళ్ల నుంచి కంప్యూటర్లు మూలనపడి ఉండడంతో చాలాచోట్ల అవి పాడైపోయాయి. యూపీఎస్‌లు, బ్యాటరీలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల ఫోన్ బిల్లులు చెల్లించకపోవడంతో నెట్ కనెక్షన్లను తొలగించారు. జనరేటర్లూ మూలనపడ్డాయి. కంప్యూటర్ విద్యను పునఃప్రారంభించాలనే యోచనతో జిల్లా అధికారులు కంప్యూటర్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించే బాధ్యతను ఎన్యూవల్ మేనేజ్‌మెంట్ కాంట్రాక్టు(ఏఎంసీ) ఆధ్వర్యంలో వీఎల్ మార్కెటింగ్ అనే సంస్థకు అప్పగించారు.
ఆ సంస్థ వీటి మరమ్మతులకు సుమారు రూ.10 లక్షల ఖర్చవుతుందని ప్రాథమికంగా నిర్ధారించి జిల్లా అధికారులకు నివేదిక పంపింది. పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ నిధులతో వీటి మరమ్మతులు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిని ప్రధానోపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. నిర్వహణ నిధులు కంప్యూటర్ల మరమ్మతులకు వెచ్చిస్తే పాఠశాలల్లో కరెంటు, తాగునీటి సరఫరా, నెలవారీగా వచ్చే నెట్ బిల్లులు వంటి చెల్లింపులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్నారు.
నేడు దరఖాస్తుకు ఆఖరు తేదీ
జిల్లాలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారమే ఆఖరు తేదీ. మ«ధ్యాహ్నాం 12 గంటల వరకూ మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈనెల 20న ఏలూరులో దరఖాస్తుదారులందరికీ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. హాల్ టì కెట్, పరీక్ష కేంద్రం వివరాలు, ఇతర అన్ని వివరాలను ఎప్పటికప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వెస్ట్ గోదావరి.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో ఆప్‌డేట్ చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తునూ ఇదే వెబ్‌సైట్‌లో చేసుకోవాలి.
మండలాలవారీగా పోస్టుల వివరాలివీ..
జిల్లాలో తాడేపల్లిగూడెం మండలంలో 13, పాలకొల్లు, నరసాపురం మండలాల్లో 11 చొప్పున, చింతలపూడి, భీమవరం మండలాల్లో తొమ్మిది చొప్పున, యలమంచిలి మండలంలో పది, కాళ్లలో 8, మొగల్తూరు, ఉండి, ఏలూరు, జంగారెడ్డిగూడెం, గణపవరం, ఉంగుటూరు, పెరవలి మండలాల్లో ఏడేసి చొప్పున, పాలకోడేరు, భీమడోలు, పెంటపాడు, దేవరపల్లి, కొయ్యలగూడెం, కొవ్వూరు, నిడదవోలు,అత్తిలి, పెనుమంట్ర, తణుకు మండలాల్లో ఆరేసి చొప్పున పోస్టులు భర్తీచేయనున్నారు. వీరవాసరం, చాగల్లు,దెందులూరు, గోపాలపురం, నిడమర్రు, పెంటపాడు, ఆచంట, ఇరగవరం, ఉండ్రాజవరం మండలాల్లో ఐదేసి చొప్పున, ఆకివీడు, ఏలూరు రూరల్, లింగపాలెం,పెదవేగి, నల్లజర్ల, తాళ్లపూడి, పెనుగొండ, పోడూరు మండలాల్లో నాలుగేసి చొప్పున, కామవరపు కోట, బుట్టాయిగూడెం, కుక్కునూరు మండలాల్లో మూడేసి చొప్పున, జీలుగుమిల్లి, పోలవరంలో రెండేసి చొప్పున, ద్వారకా తిరుమల, వేలేరుపాడు మండలాల్లో ఒక్కోక్క ఇన్‌స్ట్రక్టర్ పోస్టును భర్తీచేయనున్నారు.
గతంలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి
గతంలో పనిచేసిన కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లకు నియామకంలో ప్రాధాన్యం ఇవ్వాలి.అప్పట్లో ఏదైనా డిగ్రీ చేసి, కంప్యూటర్ విద్యలో ఏడాదిపాటు శిక్షణ ఉండాలన్న నిబంధన ఉంది. పీజీడీసీఏ, డీసీ కోర్సులు చేసిన వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు డిగ్రీలో కంప్యూటర్ ఒక సబ్జెక్టు ఉండాలని నిబంధన పెట్టడం వల్ల మాలాంటి వాళ్లకు అన్యాయం జరుగుతోంది. ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉన్నా మమ్మలను పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణం. మళ్లీ పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదు.
–వై.నరసింహరాజు, ఏపీ కంప్యూటర్ టీచర్స్ అసోయోషియేషన్ అధ్యక్షుడు
దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయాం
నేను ఎంఏ చదివా. కంప్యూటర్‌లో పీజీడీసీఏ చేశా. గతంలో మూడేళ్లు ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశా. ప్రస్తుతం నెట్ సెంటర్ నడుపుకుంటున్నా. కంప్యూటర్ విద్యా బోధనపై అవగాహన ఉన్న వాళ్లను పక్కనపెట్టి ఏదైనా డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్టు ఉండాలని నిబంధన పెట్టారు.గతంలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పనిచేస్తూనే ఏదైనా టీచర్ సెలవు పెట్టిన సమయంలో ఇతర సబ్జెక్టులూ చెప్పేవాళ్లం. కొత్త నిబంధనతో దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయాం.–అంబటి సుహాసిని, కొవ్వూరు
740 దరఖాస్తులు వచ్చాయి
కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ నియామకానికి శనివారం మధ్యాహ్నానికి 740 దరఖాస్తులొచ్చాయి. ఈనెల 20న అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తాం. ఎంపికైన అభ్యర్థుల నుంచి మెరిట్ ఆధారంగా రోస్టర్ విధానంలో ఎంపిక చేస్తాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న అన్ని కంప్యూటర్లను బాగుచేసేందుకు యత్నిస్తున్నాం. వీఎల్ మార్కెటింగ్ సంస్థ ఏడాది పొడవునా మరమ్మతులు బాధ్యత తీసుకుంటుంది. ఆర్‌ఎంఎస్‌ఏ గ్రాంటు ద్వారా మరమ్మతులు చేయిస్తాం.–డి.మధుసుధనరావు, జిల్లా విద్యాశాఖ అధికారి
Advertisement
Advertisement