
అహ్మదాబాద్: కరోనా మహమ్మారి దెబ్బకు మూలన పడిన ప్రముఖ దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత మైదానంలోకి దిగుతోంది. నాలుగు రోజుల సంప్రదాయ ఆట నేటి నుంచి జరుగనుంది. మొత్తం 38 జట్లను బయో బబుల్‌లో ఉంచి ఈ టోర్నమెంట్‌ను సాఫీగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 10, 16 జట్లను బుడగలో ఉంచడం వేరు ఏకంగా 38 జట్లను ఆడించడం వేరు. ఇదంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే బోర్డు పెద్ద కసరత్తే చేసి నిర్వహిస్తోంది.
చాన్నాళ్లుగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న భారత స్టార్ క్రికెటర్లు అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీలో ఆడనున్నారు. ఇందుకోసం ఇద్దరు నెట్ ప్రాక్టీస్‌లో తలమునకలై చెమటోడ్చుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ సౌరాష్ట్ర తరఫున పుజారా, ముంబై తరఫున రహానే బరిలోకి దిగుతుండగా... ఇరు జట్ల మధ్య ఎలైట్ గ్రూప్ ‘డి’ మ్యాచ్ అహ్మదాబాద్‌లో గురువారం నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. తన్మయ్ అగర్వాల్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు ఎలైట్ ‘బి’ గ్రూప్‌లో తమ తొలి మ్యాచ్‌ను భువనేశ్వర్ వేదికగా చండీగఢ్‌తో ఆడనుంది. ఆంధ్ర జట్టు ఎలైట్ ‘ఇ’ గ్రూప్‌లో తిరువనంతపురం వేదికగా రాజస్తాన్‌తో తమ పోరును ఆరంభించనుంది. బరిలో ఉన్న 38 జట్లలో ఆరు జట్లు ప్లేట్ గ్రూప్‌లో తలపడతాయి. 32 జట్లు ఎనిమిది ఎలైట్ గ్రూప్‌ల్లో పోటీపడతాయి. మ్యాచ్ సందర్భంగా ఏ జట్టయినా కోవిడ్ బారిన పడితే కనీసం తొమ్మిది మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా మ్యాచ్‌ను కొనసాగిస్తామని బీసీసీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment