రేపటి నుంచి మినీరైలు సేవలు
సాక్షి, ముంబై: గత నాలుగు నెలలుగా నేరల్-మాథేరాన్ మధ్య నిలిచిపోయిన మినీ రైలుసేవలను బుధవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రకటనతో పర్యాటకుల్లో ఆనందం వెల్లువిరిసింది. నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో కొండపైగల మాథేరాన్ పర్యాటక ప్రాంతానికి నిత్యం వందలాది, సెలవు రోజుల్లో వేలాది మంది వెళ్తుంటారు.
ఈ రైలు మార్గం దాదాపు 80 శాతం కొండ అంచుల మీదుగా సాగుతుంది. దీంతో వర్షా కాలంలో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఏటా జూన్ 15 నుంచి ఆక్టోబరు మొదటి లేదా రెండోవారం వరకు ఈ రైలు సేవలను నిలిపివేస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో రైల్వే మార్గంపై ఉన్న వంతెనలు, ట్రాక్‌లకు, ప్రమాదకర మలుపుల వద్ద మరమ్మతులు నిర్వహిస్తారు.
బోగీలు, ఇంజిన్లను మరమ్మతుల నిమిత్తం రైల్వే వర్క్ షాపులకు తరలిస్తారు. ప్రస్తుతం వర్షాకాలం దాదాపు పూర్తికావడంతో రైళ్ల సేవలు పునరుద్ధరించేందుకు మార్గం సుగమమైంది. దీంతో బుధవారం నుంచి సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.