సెప్టెంబరు ఒకటి నుంచి బడులు! | Schools Mostly Restarts On September 1St In Telangana | Sakshi
Sakshi News home page

Telangana: సెప్టెంబరు ఒకటి నుంచి బడులు!

Published Sat, Aug 14 2021 2:02 AM | Last Updated on Sat, Aug 14 2021 8:08 AM

Schools Mostly Restarts On September 1St In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతినిస్తే విద్యా సంస్థల్లో వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి దశల వారీగా ప్రత్యక్ష బోధన విధానాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. తొలుత తొమ్మిది, పది, ఇంటర్మీడియెట్‌ తరగతులను పునః ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపింది. సీఎం సూచనల మేరకు విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకుని..
కోవిడ్‌ కారణంగా 2020 నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. మధ్యలో కొంతకాలం మినహా దాదాపు 18 నెలలుగా డిజిటల్‌ పద్ధతిలోనే బోధన జరుగుతోంది. అయితే గత కొంతకాలంగా ప్రత్యక్ష బోధనకు అనుమతించాలని విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు కోవిడ్‌ తీవ్రత తగ్గిందని, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు సరైన వాతావరణం నెలకొందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. పలు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన ప్రారంభించాయి. ఆన్‌లైన్‌ పాఠాలు ఫలితాన్ని ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో కొందరు తల్లిదండ్రులు కూడా ప్రత్యక్ష బోధన వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిశీలించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.

ఒకేసారి ఓపెన్‌ చేస్తే ఇబ్బందులు..
ఒకటి నుంచి ఎనిమిది తరగతుల్లో ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై విద్యాశాఖ ఒకింత విముఖంగానే ఉంది. థర్డ్‌ వేవ్‌పై ఊహాగానాల నేపథ్యంలో ఈ దిశగా చర్యలు సరైనవి కావని అభిప్రాయపడుతోంది. చిన్న తరగతుల విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవడం కష్టమనే విషయంలో అధికారులు ఏకాభిప్రాయంతో ఉన్నారు. మరోవైపు అన్ని క్లాసులను ఒకేసారి ఓపెన్‌ చేయడం వల్ల విద్యా సంస్థలు కిక్కిరిసే అవకాశాన్నీ గమనంలో ఉంచుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తొలుత 9, 10 తరగతులతో పాటు, ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి అనుమతులివ్వడం మేలని ప్రభుత్వానికి నివేదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి, అవసరమైతే మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని కింది తరగతులకు అనుమతులిస్తే శ్రేయస్కరమని భావిస్తున్నట్టు విద్యాశాఖ తెలిపింది.

అవసరమైతే అదనపు సెక్షన్లు..
క్లాసుకు 30 మందికి మించకుండా ప్రత్యక్ష తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంతకు మించి విద్యార్థులు ఉండే అవకాశం లేదని, ఎటొచ్చీ ప్రైవేటు సంస్థలతోనే ఇబ్బందని పేర్కొంది. ప్రైవేటు సంస్థల విషయంలో సరైన పర్యవేక్షణ అవసరమని, ఈ మేరకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నివేదించింది. 30కి మించి విద్యార్థులు ఉంటే సెక్షన్లు పెంచేలా చూడాలని సూచించింది. ఈ నేపథ్యంలో పలు కార్పొరేట్‌ పాఠశాలల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కూడా విద్యాశాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ఒక గదిలో టీచర్‌ ప్రత్యక్ష బోధన చేసినప్పటికీ, మిగతా సెక్షన్లలో టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని కొన్ని సంస్థలు ప్రతిపాదిస్తున్నాయి.

సర్కారు దృష్టికి ‘ఆన్‌లైన్‌’ ఇబ్బందులు
విద్యాశాఖ తాజా ప్రతిపాదనల మేరకు.. 1–8 తరగతుల విద్యార్థులకు మరికొంత కాలం ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు కొందరి నుంచి వ్యతిరేకత వస్తోందని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో పిల్లలు ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అలవాటు పడుతున్నారని, దీనివల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయనే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోందని ఆయన తెలిపారు. దీంతో ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామన్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఇప్పటికే అనధికారికంగా ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయని, కేవలం ప్రభుత్వ సంస్థల విద్యార్థులకే నష్టం జరుగుతోందని మరోఅధికారి చెప్పారు. ఏదేమైనా కోవిడ్‌ దృష్ట్యా చిన్న పిల్లల విషయంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కన్పించడం లేదని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement