పాఠశాల విద్యలో ‘అభ్యసన పునరుద్ధరణ’ | Special financial assistance to students and teachers | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యలో ‘అభ్యసన పునరుద్ధరణ’

Mar 9 2022 6:02 AM | Updated on Mar 9 2022 6:02 AM

Special financial assistance to students and teachers - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా పాఠశాలలు మూతపడి అత్యధిక కాలం ఇళ్లకే పరిమితమై అభ్యసన సామర్థ్యాలను నష్టపోయిన విద్యార్థులకు తిరిగి వాటిని అలవర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర అభ్యసన పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టింది. 2022–23 విద్యాసంవత్సరం నుంచి దీన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా అమలు చేయనుంది. ఇందుకోసం సమగ్ర శిక్ష ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రోత్సాహకంగా అందించాలని నిర్ణయించింది. కరోనా వల్ల పాఠశాలల మూసివేతతో పిల్లల అభ్యాస ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ఉండేలా 2021–22లో విద్యాశాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో నోడల్‌ గ్రూపులు ఏర్పాటుచేసి ప్రత్యేక కార్యాచరణను అమలు చేయించింది.

ప్రత్యేక యాప్‌ ద్వారా బడిబయట పిల్లలను గుర్తించడానికి సర్వే చేయించడంతోపాటు వారిని తిరిగి స్కూళ్లలో చేర్పించారు. విద్యార్థులు అభ్యసనం (లెర్నింగ్‌)లో ఏమేరకు వెనుకబడి ఉన్నారో తెలుసుకోవడానికి 2021 నవంబర్‌ 12న దేశవ్యాప్తంగా నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే కూడా నిర్వహించారు. ఈ సర్వే ద్వారా పాఠశాలల ఫలితాల ఆధారంగా ప్రత్యేక ప్రణాళికలను అమలు చేయించారు. ఇంకా అభ్యసన అంతరాలున్న నేపథ్యంలో తాజాగా ఈ సమగ్ర అభ్యసన పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. రాష్ట్రాలకు ఇందుకు తగిన ఆర్థిక సహకారాన్ని అందించాలని నిర్ణయించింది.

2022–23కి సంబంధించిన సమగ్ర శిక్ష ప్రణాళికల్లో ఆయా రాష్ట్రాలు తమ ప్రణాళికలను సమర్పించాలని కేంద్రం సూచించింది. 2022–23లో విద్యార్థుల అభ్యసన మెరుగుదల ప్రక్రియల కోసం ఆర్థిక ప్యాకేజీలను అందించనుంది. అప్పర్‌ ప్రైమరీ, సెకండరీ స్థాయిలోని విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇవ్వనుంది. ప్రైమరీకి సంబంధించిన 1–5 తరగతులకు ఇప్పటికే నిపుణ్‌ భారత్‌ మిషన్‌ కింద కేంద్రం సహకారం అందించింది. 

25 లక్షల మంది టీచర్లకు..
విద్యార్థుల్లో అభ్యసన ప్రక్రియలను మెరుగుపర్చడానికి కేంద్రం టీచర్‌ రిసోర్స్‌ ప్యాకేజీ ఇవ్వనుంది. బోధనాభ్యసన ప్రక్రియలు హైబ్రిడ్‌ లెర్నింగ్‌ మోడ్‌తో కొనసా గించడానికి వీలుగా టీచర్లకు ట్యాబ్‌లు అందించనున్నారు. ఉపాధ్యాయులు వివిధ డిజిటల్‌ పోర్టళ్లలోని వనరులు, కంటెంట్‌ను ఉపయోగించుకోవడానికి వీటిని అందిస్తారు. ప్రాథమిక స్థాయిలో 25 లక్షల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌ల కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఇదేకాకుండా విద్యార్థుల్లో ఓరల్‌ రీడింగ్‌ ఫ్లూయెన్సీ, గ్రహణశక్తి పెంచడానికి చేపట్టే కార్యక్రమాల కోసం ప్రతి రాష్ట్రానికి రూ.20 లక్షల చొప్పున ఇవ్వనున్నారు.

బ్లాక్‌ రిసోర్సు సెంటర్లలో ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రానికి ట్యాబ్‌లతోపాటు రూ.8.8 లక్షల చొప్పున సహాయం అందిస్తారు. అలాగే క్లస్టర్‌ రిసోర్సు సెంటర్లను మరింత బలోపేతం చేయడానికి ఒక్కో సెంటర్‌కు రూ.వెయ్యి కేటాయించనున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 2022–23 విద్యాసంవత్స రానికి సంబంధించి సమగ్ర శిక్ష ద్వారా తమ ప్రణాళికలను ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు (పీఏబీ)కి పంపిస్తే కేంద్రం ఈ ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement