‘గ్రీన్‌ఫీల్డ్’ పునః ప్రారంభం | re-began greenfield blind residential school | Sakshi
Sakshi News home page

‘గ్రీన్‌ఫీల్డ్’ పునః ప్రారంభం

Published Sat, Jul 26 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

re-began greenfield blind  residential school

కాకినాడ క్రైం : వివాదాస్పదమైన సామర్లకోట రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ అంధుల ఆశ్రమ పాఠశాల శుక్రవారం నుంచి పునఃప్రారంభమైంది. ప్రత్యేకాధికారి పాలనలో పాఠశాల కొనసాగుతోంది. శిక్షణ పొందిన ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు డిప్యుటేషన్‌పై మరో ఉపాధ్యాయురాలిని అధికారులు నియమించారు. ఈ నెల 18న పాఠశాలలో ఉంటున్న కూర్తి జాన్సన్, పాముల సురేంద్ర, పులప సాయిని ప్రిన్సిపాల్ టేకుమూడి శ్రీనివాస్, కరస్పాండెంట్ కోలకొండ వెంకటేశ్వర రావు అమానుషంగా దాడి చేసి, గాయపరిచిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పాఠశాలకు అటు విద్యాశాఖ నుంచి కాని, ఇటు ఐసీడీఎస్ నుంచి కాని అనుమతులు లేవని గుర్తించారు. స్థలానికి కూడా పూర్తి స్థాయిలో అనుమతి లేకపోవడంతో భవనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డి పాఠశాల స్థితిగతులపై విచారణ నిర్వహించారు. పాఠశాలలో 53 మంది అంధ బాలలు ఆశ్రయం పొంది, విద్యనభ్యసిస్తున్నారు. పూర్తిగా అనుమతులు లేకుండా నడుస్తుండడంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి పదో తరగతి విద్యార్థులను సమీపంలోని హైస్కూల్‌లో తాజాగా ఎన్‌రోల్ చేశారు.

 విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా బియ్యం, కూరగాయలు ప్రభుత్వం సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థులకు గాయాలు కావడం, అది చూసిన మరికొంత మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను ఇళ్లకు తీసుకుపోవడంతో, 39 మంది మాత్రమే మిగిలారు. మిగిలిన తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను తీసుకుపోతారేమోనని భావించిన అధికారులు వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.


 పాఠశాలను పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని, రాజీవ్ విద్యామిషన్‌లోని విలీన విద్య జిల్లా కో-ఆర్డినేటర్ లక్ష్మణ్ కుమార్ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారని అధికారులు భరోసా కల్పించారు. శుక్రవారం నుంచి పాఠశాల పునఃప్రారంభం కావడంతో 39 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారికి విద్యబోధించేందుకు వికలాంగుల విద్యలో ప్రత్యేక శిక్షణ పొందిన ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. గంగనాపల్లి పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలిని డిప్యుటేషన్‌పై ఇక్కడకు తీసుకొచ్చారు.

ఇంతకుముందే ఆ పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి మొత్తం తొమ్మిది మంది ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించేలా అధికారులు చర్యలు చేపట్టారు. పాఠశాల స్థలం తిమ్మాపురం పంచాయతీకి చెందిన సామాజిక స్థలం కావడంతో దానితో పాటు భవనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశాల మేరకు విద్య, వికలాంగ సంక్షేమ శాఖలు, ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వారి పేర్లను నమోదు చేయించారు. ప్రస్తుతానికి గతంలో పనిచేసే ఉపాధ్యాయులు, ఆయాలనే కొనసాగిస్తున్నారు. త్వరలోనే అంధుల ఆశ్రమ పాఠశాలకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించనున్నట్టు అధికారులు తెలిపారు.

 వికలాంగ పెన్షన్లూ స్వాహా?
 గ్రీన్‌ఫీల్డ్ అంధుల ఆశ్రమ పాఠశాలకు చెందిన 24 మంది అంధ విద్యార్థులకు ప్రతి నెలా రూ.500 చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తున్న పెన్షన్ కూడా నిర్వాహకులు స్వాహా చేస్తున్నారు. పాఠశాలలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉండడంతో, వారిలో 24 మంది ఇక్కడే ఉంటున్నందున పెన్షన్లను తిమ్మాపురం పంచాయతీ పరిధిలోకి మార్చాలని నాలుగేళ్ల క్రితం అధికారుల నుంచి అనుమతులు పొందారు. పెన్షన్లను పాఠశాలకు అందజేయాల్సిందిగా అధికారులు సూచించడంతో, వాటిని కూడా నిర్వాహకులు తమ ఖాతాలో వేసుకుంటున్నారు.

 ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకుని, స్వగ్రామాలకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం 22 మందికి చెందిన పెన్షన్లు రూ.11 వేలు పాఠశాలకు అందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇవి తల్లిదండ్రులకు చేరడం లేదు. మిగిలిన విద్యార్థులు మాత్రం ప్రతి నెలా వారి ఇళ్ల వద్ద పెన్షన్ తీసుకుంటున్నందున, ఆ సొమ్ము వారి తల్లిదండ్రులకు అందుతోంది. దీనిపై జిల్లా అధికారులు విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement