మార్కెట్లోకి మళ్లీ గెలాక్సీ నోట్7
మార్కెట్లోకి మళ్లీ గెలాక్సీ నోట్7
Published Sat, Sep 17 2016 8:54 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
సియోల్ :బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఇటు శాంసంగ్ కంపెనీకి అటు వినియోగదారులకు వణుకుపుట్టించిన గెలాక్సీ నోట్ 7 అమ్మకాలు పునఃప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి దక్షిణ కొరియాలో మళ్లీ అమ్మకాలు చేపట్టనున్నట్టు స్మార్ట్ఫోన్ల దిగ్గజం శాంసంగ్ ప్రకటించింది. లాంచ్ అయిన కొద్ది రోజులకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన గెలాక్సీ నోట్7 ఫోన్లు, పేలుళ్ల ఘటనలతో తన పాపులారిటీని, మార్కెట్ను రెండింటిని చేజార్చుకున్నాయి. ప్రస్తుతం ఆ నష్టాన్ని పూరించుకోవడానికి శాంసంగ్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త, సురక్షితమైన బ్యాటరీలతో గెలాక్సీ నోట్7 అమ్మకాలను తిరిగి ప్రారంభించనున్నట్టు శాంసంగ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
స్వదేశంలో సెప్టెంబర్ 28 నుంచి ఈ అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపిన కంపెనీ ప్రతినిధి అమెరికా సహా మిగతా దేశాల్లో ఆయా మార్కెట్ల పరిస్థితులకు అనుగుణంగా ఈ డివైజ్ అమ్మకాలను చేపడతామని తెలిపారు. అక్టోబర్ మొదట్లో ఆస్ట్రేలియాలో చేపడతామన్నారు. ఇప్పటివరకు ఉన్న సామ్‌సంగ్ ఫోన్లలోని తెలుపు రంగు బ్యాటరీ ఇండికేటర్ కాకుండా.. కొత్త నోట్7 ఫోన్లలో ఆకుపచ్చ రంగు బ్యాటరీ ఇండికేటర్ ఉంటుందని సామ్‌సంగ్ తెలిపింది. కొత్త గెలాక్సీ నోట్ 7 ఫోన్ భద్రమైందో కాదో తెలుసుకునేందుకు రీటేల్ బాక్స్‌పై లేబుల్ ఉంటుందని సంస్థ పేర్కొంది.
స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో రారాజుగా వెలిగిన శాంసంగ్కు గెలాక్సీ నోట్7 కోలుకోలేని దెబ్బతగిలించింది. ఒక్కసారిగా పేలుడు వార్తలు రావడంతో అంతర్జాతీయ విమానాల్లో ఈ ఫోన్ల నిషేధం, రీకాల్ వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 2న కంపెనీ దక్షిణ కొరియా, అమెరికా వంటి 10 దేశాల నుంచి ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు అధికారికంగా అధికారికంగా ప్రకటించింది. చార్జీ చేసేటప్పుడు, కాల్ ఆన్షర్ చేసేటప్పుడు పేలుళ్లు సంభవిస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా గెలాక్సీ నోట్7కు రీప్లేస్మెంట్గా సురక్షితమైన బ్యాటరీతో మరోఫోన్ను అందించనున్నట్టు తెలిపింది.
Advertisement
Advertisement