క్యూ2 వృద్ధికి వర్షాల ఊతం
న్యూఢిల్లీ: మెరుగైన వర్షపాతం, పారిశ్రామికోత్పత్తి, వినియోగ వ్యయాలు పెరగడం తదితర సానుకూల అంశాలతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి మెరుగుపడొచ్చని డాయిష్ బ్యాంక్, డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) సంస్థలు వేర్వేరు నివేదికల్లో అంచనా వేశాయి. క్యూ2లో వృద్ధి 5.5 శాతంగా ఉండొచ్చని డాయిష్ బ్యాంక్ లెక్కగట్టగా, ఇది 4.5 శాతం మేర ఉండొచ్చని డీఅండ్‌బీ పేర్కొంది. ముందుగా పెద్ద ఆశావహమైన అంచనాలు లేకపోయినప్పటికీ.. పలు సానుకూల అంశాల వల్ల క్యూ2లో ఏడాది కాలంలోనే అత్యుత్తమ వృద్ధి నమోదు కాగలదని భావిస్తున్నట్లు డాయిష్ బ్యాంక్ వివరించింది. పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, సేవా రంగం మందగించడం కారణాలతో.. తొలి త్రైమాసికంలో ఎకానమీ వృద్ధి కేవలం 4.4 శాతానికే పరిమితం అయింది. గత 17 త్రైమాసికాల్లో ఇది కనిష్టం. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఏకంగా పదేళ్ల కనిష్టమైన 5 శాతానికి క్షీణించిన సంగతి తెలిసిందే.
మెరుగుపడుతున్నా.. కొంత బలహీనం
పారిశ్రామికోత్పత్తి ధోరణిని బట్టి చూస్తే.. సెప్టెంబర్ త్రైమాసికంలో పారిశ్రామిక రంగం కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోందని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. క్యూ2లో పారిశ్రామిక రంగ వృద్ధి 1.8 శాతంగా ఉండొచ్చని తెలిపింది. క్రితం త్రైమాసికంలో ఇది 0.9 శాతంగా ఉంది. ఇక మొత్తం సర్వీసుల రంగం రెండో త్రైమాసికంలో 7 శాతం మేర వృద్ధి చెందవచ్చని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. క్రితం త్రైమాసికంలో ఇది 6.2 శాతంగా నమోదైంది. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ద్రవ్య లోటు తగ్గొచ్చని డాయిష్ బ్యాంక్ వివరించింది.
అటు, మిగతా త్రైమాసికాలకు సంబంధించి వృద్ధి బలహీనంగానే ఉండొచ్చని డీఅండ్‌బీ పేర్కొంది. ఇప్పటికీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతుండటం, ద్రవ్యలోటు అధికంగానే ఉండటం, తయారీ రంగం కోలుకోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తాయని తెలిపింది. భారీ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఇవి ఫలితాలిచ్చేందుకు సమయం పడుతుందని డీఅండ్‌బీ ఇండి యా సీనియర్ ఎకానమిస్టు అరుణ్ సింగ్ చెప్పారు. ఇవి ఎంతమేరకు వ్యాపార వర్గాల్లో విశ్వాసం నింపగలవో కూడా చూడాల్సి ఉంటుందన్నారు.
62.60కు రుపీ...
ఇక రూపాయి విషయానికొస్తే.. దేశీ కరెన్సీ మారకం విలువ నవంబర్‌లో 62.60-62.80 మధ్య తిరుగాడవచ్చని డీఅండ్‌బీ అంచనా వేసింది. సమీప భవిష్యత్‌లో ఇది 65కి క్షీణించినా మొత్తం మీద ఈఏడాది ఆఖరు నాటికి 63 స్థాయిలో నిలవొచ్చని డాయిష్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 62.87 వద్ద ఉంది.