ఇక ప్రగతి పరుగులు
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సారథ్యంలోని నూతన కేంద్ర ప్రభుత్వం వాణిజ్య విశ్వాసాన్ని పెంపొందించి ఆర్థికాభివృద్ధిని పునరుద్ధరిస్తుందని దేశీయ వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఆర్థిక వ్యవస్థను మోడీ సర్కారు గాడిలో పెడుతుందనీ, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తుందనే విశ్వాసాన్ని ఆయా వర్గాలు వెలిబుచ్చాయి. ప్రధానిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన మోడీకి పారిశ్రామిక చాంబర్లు అభినందనలు తెలిపాయి.
వాణిజ్య విశ్వాసాన్ని పెంచాలి
సమాజ అవసరాలను, ఆశలను నెరవేర్చేలా యువతను, వాణిజ్యవేత్తలనూ ప్రేరేపించే పాలనను ప్రభుత్వం అందిస్తుందని భావిస్తున్నాం. వాణిజ్య విశ్వాసాన్ని, ఉద్యోగికతను పెంచడం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, పోషకాహారాన్ని అందించడం, పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం వంటి చర్యలకు మోడీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. - సిద్ధార్థ్ బిర్లా, ఫిక్కీ ప్రెసిడెంట్
చతురత చూపాలి
దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో వివేకవంతుడు, నిపుణుడు అయిన నరేంద్ర మోడీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నాం. దాదాపు 120 కోట్ల దేశ పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రధాని పదవిని మోడీ చేపట్టడం అత్యంత కీలక అంశం. స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటును పెంచడం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పించడం ఎంతో అవసరం.
- అజయ్ శ్రీరామ్, సీఐఐ ప్రెసిడెంట్
ఇది స్థిరమైన ప్రభుత్వం
సుదీర్ఘకాలం తర్వాత భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని మోడీ, ఆయన మంత్రి వర్గ సహచరులు దీక్షాదక్షులు. దేశంలో ఉద్యోగాలను కల్పించి, ఆదాయాన్నీ, సమాన వృద్ధినీ సాధించే దిశగా కొత్త ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మేం ఆశిస్తున్నాం.
- శ్రీనివాసన్, ఇండో అమెరికన్ చాంబర్ ప్రెసిడెంట్
రెండంకెలకు చేరనున్న జీడీపీ వృద్ధి
నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో జీడీపీ వృద్ధి రేటు 10 శాతానికి చేరుతుందని విశ్వసిస్తున్నాం. ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని నమ్ముతున్నాం. - రాణా కపూర్, అసోచామ్ అధ్యక్షుడు
ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం
అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిం చేందుకు కొత్త ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం. మోడీ కేబినెట్‌లో తక్కువ మందే ఉండడం వల్ల మరింత సమర్థమైన పాలన సాధ్యమవుతుంది. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్
హామీలు నెరవేర్చాలి
అత్యున్నత ప్రమాణాలతో పాలనను అందిస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను మోడీ సర్కారు మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాం. - శరద్ జైపూరియా, పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్