న్యూఢిల్లీ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ఎంతో ప్రయోజనకరమని మెజారిటీ వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో పీఎల్‌ఐ కింద ఇతర రంగాలకూ ప్రోత్సాహకాలు లభిస్తాయన్న ఆశాభావం వారి నుంచి వ్యక్తమైంది. డిమాండ్ బలోపేతానికి వీలుగా బడ్జెట్‌లో ప్రకటించే చర్యలు అన్ని రంగాల్లో వృద్ధికి ఊతంగా నిలుస్తాయన్న అభిప్రాయం కంపెనీల ప్రతినిధుల్లో వ్యక్తమైంది. మూలధన వ్యయాలపైనా బడ్జెట్ దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నారు.
డెలాయిట్ సర్వే వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను తెలుసుకుంది. మూలధన వ్యయాలు, మౌలిక సదుపాయాలకు రుణాలను అందించడం వృద్ధికి కీలకమన్న అభిప్రాయం వ్యక్తమైంది. భారత ప్రభుత్వ బాండ్ల ద్వారా నిధులు సమీకరించాలని సర్వేలో 60 శాతం మంది సూచించారు. రానున్న బడ్జెట్ నుంచి పరిశ్రమ ఏమి ఆశిస్తుందో తెలుసుకునే ప్రయత్నం సర్వేలో భాగంగా డెలాయిట్ చేసింది. 10 రంగాల నుంచి 181 మంది ప్రతినిధులు సర్వేలో పాల్గొని అభిప్రాయాలు తెలియజేశారు.
పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు
►70 శాతానికి పైగా పరిశ్రమల ప్రతినిధులు పీఎల్‌ఐ పథకం తమ రంగం వృద్ధికి మేలు చేస్తుందని చెప్పారు.
► 60% మంది పీఎల్‌ఐ ప్రోత్సాహకాలను మరిన్ని రంగాలకు ప్రకటిస్తారని ఆశిస్తున్నారు.
►పన్నుల్లో మార్పులు తెస్తే అది పరిశ్రమల వృద్ధికి ప్రయోజనం కలిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. రానున్న బడ్జెట్‌లో ఎక్కువ మంది బలంగా దీన్ని కోరుకుంటున్నారు.
► ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు పెట్టుబడుల వృద్ధికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.
► ఎంఎస్‌ఎంఈలను జీవీసీ కిందకు తీసుకొస్తే పరిశ్రమల వృద్ధి స్థిరత్వానికి సాయపడుతుందని, వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయని చెప్పారు.
► 45 శాతం మంది పన్ను బాధ్యతలను ప్రభుత్వం తగ్గిస్తుందని అంచనా వేస్తుంటే, 44 శాతం మంది టీడీఎస్‌కు సంబంధించి స్పష్టత కోరుకుంటున్నారు.
► మూలధన లాభాల పన్ను నిర్మాణాన్ని మరింత సులభతరంగా మార్చాలని పరిశ్రమ కోరుతోంది.
► కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 14 రంగాలకు పీఎల్‌ఐ కింద రూ. 2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. తోలు, సైకిల్, టీకాల తయారీ, టెలికం ఉత్పత్తులకు పీఎల్‌ఐ విస్తరణ ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
చదవండి: స్టార్టప్‌లో పెట్టుబడులు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్లు!
Comments
Please login to add a commentAdd a comment