new loans
-
హోమ్‌లోన్‌పై గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రుణాలు
HDFC Bank Home Loans : దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హోమ్ లోన్‌పై గుడ్‌న్యూస్ చెప్పింది. కస్టమర్లకు త్వరలో రెండు కొత్త లోన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో ‘హోమ్ సేవర్ ప్రొడక్ట్’ పేరిట ఓ లోన్‌ను ఏప్రిల్‌లో, హోమ్ రిఫర్బిష్మెంట్ లోన్లను రాబోయే నెలల్లో ప్రారంభించాలని యోచిస్తోందని బ్యాంక్ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. హోమ్ సేవర్ ప్రొడక్ట్ అనేది ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లాంటిది. ఎస్బీఐ అందిస్తున్న మ్యాక్స్గెయిన్ హోమ్ లోన్ స్కీమ్‌కి పోటీగా దీన్ని భావించవచ్చు. ఇక హోమ్ రీఫర్బిష్మెంట్ లోన్ విషయానికి వస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఈ లోన్‌ను అందించేది. ఇప్పుడు ఈ లోన్‌ను త్వరలో పునఃప్రారంభిస్తున్నారు. ఈ రెండు లోన్లు ఇప్పటికే ఉన్న కస్టమర్లతోపాటు కొత్త కస్టమర్లకు అందించనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్టగేజ్ బ్యాంకింగ్, హోమ్ లోన్, ల్యాప్ కంట్రీ హెడ్ అరవింద్ కపిల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే బ్యాంకు గృహ రుణాలపై వసూలు చేసే రేటు కంటే హోమ్ రిఫర్బిష్మెంట్ లోన్ 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుతం ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటుతో లింక్ అయిన గృహ రుణాలపై 8.55 నుంచి 9.10 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. కాగా ఇప్పటివరకూ ఉన్న హెచ్డీఎఫ్సీ సర్వీస్ సెంటర్లను దశలవారీగా బ్యాంక్ బ్రాంచ్‌లుగా మార్చబోతున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. -
చిన్న పట్టణాల్లోనే రుణాలకు అధిక డిమాండ్
ముంబై: కొత్తగా రుణాలు తీసుకునే ప్రతి ముగ్గురిలో ఇద్దరు గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచే ఉంటున్నారని ట్రాన్స్ యూనియన్ సిబిల్ సంస్థ తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునే వారిలో మహిళలు, రైతులు, యువత ఉంటున్నట్టు తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్థిక సేవల విస్తృతికి ఇది కీలకమని పేర్కొంది. 2021లో తొలిసారి రుణాలు తీసుకున్నవారు 3.5 కోట్లుగా ఉంటే, 2022లో జనవరి–సెప్టెంబర్ మధ్య కొత్తగా 3.1 కోట్ల మంది పెరిగినట్టు వెల్లడించింది. కొత్త రుణ ఖాతాదారులు (ఎన్టీసీ) అంటే అప్పటి వరకు ఎలాంటి రుణం తీసుకోకుండా, రుణ చరిత్ర లేని వారు అని అర్థం. కన్జ్యూమర్ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వ్యవసాయ రుణాలు, ద్విచక్ర వాహన రుణాలు, బంగారం రుణాలను వీరు తీసుకున్నారు. 2022 మొదటి తొమ్మిది నెలల్లో కొత్తగా రుణ చరిత్ర ఆరంభించిన కస్టమర్లలో 30 శాతం మేర కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాలు తీసుకున్న వారు కావడం గమనార్హం. అంటే ఇంట్లో ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్మార్ట్‌ఫోన్ తదితర ఉత్పత్తుల కోసం తీసుకున్న రుణాలుగా వీటిని భావించొచ్చు. వీటి తర్వాత 16 శాతం మంది వ్యవసాయ రుణాలు తీసుకుంటే, 13 శాతం మేర వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్టు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక వివరించింది. -
రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
-
రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలను మాఫీ చేయకుండా వేధిస్తున్న సీఎం కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రాష్ట్రమే ముందుండటం బాధాకరమన్నారు. మాఫీ వడ్డీకే సరిపోతోందని, రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడంలేదని చెప్పారు. మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేమని క్షమాపణ కోరిన సీఎం.. రుణమాఫీ చేయనందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. సీఎం దగ్గర ఉన్న 4,700 కోట్ల ఎస్డీఎఫ్ నిధులను రుణమాఫీ కోసం విడుదల చేయాలని కోరారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు. -
చేనేత కార్మికులకు కొత్త రుణాలు ఇవ్వాలి
దుబ్బాక రూరల్: చేనేత కార్మికుల రుణ మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ర్ట కార్యదర్శి జి.భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రుణ మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కొరుతూ దుబ్బాక తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన పనికి కూలి సరిపోక పోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో రుణాలు చెల్లించలేక పోతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా చేనేత కార్మికులకు డబుల్‌బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తొలగించిన అంత్యోదయ కార్డులను పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు నర్సింలు, బాల్‌రాజ్, సత్యనారాయణ, జి.బాల్‌రాజ్, విఠల్, జనార్ధన్, రఘుపతి, శశిరేఖ, సుశీల, మంజుల, సరస్వతి, నీలవ్వ తదితరులు పాల్గొన్నారు. -
రుణమాపీ ఒకేసారీ చేపట్టాలి
కేంద్రసహకార బ్యాంకు ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా రామాయంపేట: రైతు రుణమాఫీని ఒకేసారి చేపట్టి కొత్త రుణాలు మంజూరు చేయాలంటూ అఖిలపక్షం ఆధర్యంలో మంగళవారం కేంద్ర సహకార బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, టీటీడీపీ, బీజేపీ కార్యకర్తలు బ్యాంకు వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ఈసందర్భగా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సరాపు యాదగిరి, బీజేపీ జిల్లా నాయకుడు వెల్ముల సిద్దరాంలు మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వ విధానం సరిగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులపాలవుతున్నారన్నారు. ఇప్పటివరకు మూడో విడత రుణమాఫీ నిధులు మంజూరు కాకపోడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడంలేదన్నారు. అనంతరం బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు సుధాకర్‌రెడ్డి, రఘుపతిగౌడ్, శీలం క్రిష్ణారెడ్డి, చింతల క్రిష్ణ, చింతల శ్రీనివాస్, ఎనిశెట్టి అశోక్, నవాత్ నగేశ్, రమేశ్‌రెడ్డి, హస్నొద్దీన్, విప్లవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఫైనాన్షియల్ బేసిక్స్..
జీవిత బీమాను సమీక్షించాల్సిందే.. మార్పు సహజం. ప్రపంచంలో ప్రతి ఒక్కటీ మార్పు చెందుతూనే ఉంటుంది. మన విషయానికి వస్తే.. మన కోరికలు, అవసరాలు, లక్ష్యాలు, కాలాన్ని బట్టి మారుతూనే ఉంటాయి. జీవితంలో జరిగే మార్పులు జీవిత బీమా పాలసీని కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే పాలసీని తీసుకుని ఉంటే దాన్ని ఏడాదికొకసారైనా సమీక్షించుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు పెళ్లికి ముందు, తర్వాత జీవితం చాలా మారిపోతుంది. కొద్ది కాలానికి పిల్లలు వస్తారు. కుటుంబం ఏర్పడుతుంది. అప్పుడు మనపై ఆధారపడ్డ వారి సంఖ్య పెరుగుతుంది. అలాగే ఇంటి/కారు రుణం తీరడం వంటి అంశాలు జీవిత బీమా పాలసీని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సందర్భాలు ఏం జరిగినా... అప్పుడు బీమా పాలసీని సమీక్షించుకోవడం తప్పనిసరి. పాలసీ సమీక్ష ఎప్పుడు జరగాలి? ⇒ రిలేషన్షిప్ ఏర్పాటు: పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత జీవితం మారుతుంది. అప్పుడు పాలసీ సమీక్ష అవసరం. అలాగే పెళ్లైన తర్వాత విడాకులు తీసుకుంటే అప్పుడు కూడా పాలసీ సమీక్ష జరగాలి. ⇒ కుటుంబం పెరుగుదల: పెళ్లైన తర్వాత కొంత కాలానికి కుటుంబంలోకి పిల్లలు వస్తారు. అప్పుడు కూడా పాలసీని సమీక్షించుకోవాలి. ఎందుకంటే భార్యభర్తలు ఉన్నప్పుడు ఖర్చులు ఒకరకంగా ఉంటాయి. అలాగే పిల్లలు పుట్టే కొద్ది అయ్యే వ్యయాలు మరోలా ఉంటాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకుని పాలసీలో మార్పులు చేసుకోవాలి. ⇒ రుణాలు: కొత్త రుణాలు తీసుకున్నప్పుడు కూడా పాలసీని సమీక్షించుకోవాలి. ఇంటి రుణం, కారు రుణం వంటి అంశాలు కుటుంబ ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేస్తాయి. అలాగే ఆ రుణాలు తీరినప్పుడు కూడా పాలసీ సమీక్ష జరగాలి. ⇒ ఆదాయం: వచ్చే సంపాదనలో మార్పులు జరిగినప్పుడు కూడా పాలసీ సమీక్ష జరగాలి. ఆదాయాన్ని అనుసరించే లైఫ్‌స్టైల్ ఉంటుంది. ⇒లబ్ధిదారుడి మార్పు: మీరు పాలసీ తీసుకునే సమయంలో ఒక వ్యక్తి పేరును లబ్ధిదారునిగా సిఫార్సు చేశారు. కొద్ది కాలానికి అతను మరణించాడు/ సత్సంబంధాలు లేవు / రిలేషన్షిప్ చెడింది అనుకోండి. అప్పుడు కూడా పాలసీని సమీక్షించుకోవాలి. -
విత్తు లేదు... ‘విత్తం’ రాదు!
⇒ రబీ సాగుకు చర్యలు చేపట్టని సర్కారు ⇒ వర్షాభావంతో దెబ్బకొట్టిన ఖరీఫ్.. రబీపైనే అన్నదాత ఆశలు ⇒ ‘ముందస్తు రబీ’కి అంతా సిద్ధం చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ రెండింతల సాగుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటన ⇒ మరో వారంలో ప్రారంభంకానున్న రబీ సీజన్ ⇒ విత్తన సరఫరాలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం ⇒ అప్పులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న బ్యాంకులు ⇒ పూర్తి రుణమాఫీ చేయలేదని కొత్త రుణాలు ఇవ్వని బ్యాంకులు ⇒ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి - ఖరీఫ్ రుణ లక్ష్యం (రూ. కోట్లలో) 18,000 - బ్యాంకర్లు ఇచ్చింది (రూ. కోట్లలో) 7,000 - అవసరమైన విత్తనాలు (క్వింటాళ్లలో) 3,80,000 - ప్రభుత్వం సిద్ధం చేసింది (క్వింటాళ్లలో) 40,000 సాక్షి, హైదరాబాద్: ఇటు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు... వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుచేసి పెట్టుబడి తెచ్చుకున్నా అటు విత్తనాలు లేవు... ఎరువులు వస్తాయో రావో తెలియదు... ఖరీఫ్ నిండా ముంచిన ఆవేదనలో ఉన్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం మరో శాపంగా మారుతోంది. ఖరీఫ్ దెబ్బను తట్టుకోవడానికి రబీ సాగును భారీగా పెంచుతామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయి. మరో వారంలో రబీ సీజన్ మొదలుకానున్నా వ్యవసాయశాఖ ఇంకా సన్నద్ధమే కాలేదు. రైతులకు విత్తనాలను సమకూర్చలేదు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు ఇప్పించేలా గట్టి ప్రయత్నమూ జరగడం లేదు. పంట రుణమాఫీ సొమ్ము రెండు వాయిదాలు చెల్లించినా... పూర్తిగా చెల్లించేవరకూ రుణాలివ్వబోమని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. బ్యాంకుల మొండిచెయ్యి: అసలే వర్షాభావంతో అల్లాడుతున్న రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. నిర్దేశించుకున్న రుణ మంజూరుకు దూరంగా ఉండిపోతున్నాయి. బ్యాంకులను ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. 2015-16 ఖరీఫ్‌కు రూ.18,032 కోట్లు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యం గా పెట్టుకోగా... ఇచ్చింది రూ.7 వేల కోట్లే. ఇక పంట రుణమాఫీ అర్హులకు రుణాలు ఇచ్చేం దుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. మొత్తం 36 లక్షల మంది రైతులు రుణమాఫీ పొందగా... తిరిగి బ్యాంకు రుణాలు అందింది 15 లక్షల మందికే. వారిలోనూ ఎక్కువ మంది బంగారం తనఖా పెట్టి రుణం తీసుకున్నారని బ్యాంకర్లే చెబుతున్నారు. మిగతా 21 లక్షల మంది వ్యవసాయ పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ‘ప్రభుత్వం హామీ ఇచ్చినంత మాత్రాన రైతులు తీసుకున్న రుణం మాఫీ అయినట్టు కాదు. మి గతా రెండు విడతల బకాయిలు చెల్లిస్తే తప్ప రుణాలు ఇవ్వకూడదని ఆదేశాలున్నాయి. లీడ్ బ్యాంకు సూచనల మేరకు ముందుకు వెడుతున్నాం..’ అని ఆంధ్రా బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. నిలువు దోపిడీ.. బ్యాంకులు రుణాలిచ్చేందుకు ససేమిరా అంటుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల దోపిడీ పెరిగిపోయింది. వందకు రూ.4 నుంచి 6 రూపాయల దాకా వడ్డీ వసూలు చేసుకునే అవకాశం ఉండటంతో ఆర్థికంగా కలిగిన కుటుంబాల వారు గ్రామీణ ప్రాంతాల్లో ‘వ్యాపారం’ మొదలుపెడుతున్నారు. భూమి పాస్ పుస్తకాలు తనఖా పెట్టుకుని అప్పులు ఇస్తున్నారు. ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ‘‘మా బ్యాంక్ నుంచి నిత్యం వంద మంది రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు చెక్కులు జారీ చేస్తున్నారు. ఆ రైతులు బ్యాంకుకు వచ్చినప్పుడు అడిగితే 5 రూపాయల వడ్డీ అని చెబుతున్నారు. వారికి రుణాలు ఇచ్చేందుకు మాకేమో అనధికార ఆంక్షలున్నాయి..’’ అని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ బ్యాంక్ అధికారి పేర్కొనడం గమనార్హం. మరోవైపు రైతులు వ్యవసాయంతో పాటు ఇతర అవసరాల కోసం కూడా బ్యాంకు కొంత అదనంగా రుణాలు తీసుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేక ప్రతీదానికి వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడుతున్నారు. ఆ అప్పులు, వడ్డీలు తీర్చలేకే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఖరీఫ్‌లో ఇప్పటివరకు రైతులు సుమారు రూ.6 వేల కోట్ల దాకా వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్నట్లు బ్యాంకర్ల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వడ్డీ వ్యాపారులు గ్యారెంటీ కోసం చెక్కుల ద్వారానే రుణాలు ఇస్తున్నారని, అందువల్ల ఈ అంచనాకు రాగలిగామని ఎస్బీహెచ్ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. విత్తనాలు, ఎరువులేవీ? ఖరీఫ్‌లో పంటలు చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో రబీలోనైనా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం భావించింది. గతేడాది రబీలో 12.37 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా... ఈసారి రబీలో 20.45 లక్షల ఎకరాల్లో చేపట్టాలని నిర్ణయించారు. మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం కూడా పెంచాలని, నూనె గింజలను గతేడాది 4.62 లక్షల ఎకరాల్లో సాగుచేయగా... ఇప్పుడు 6.57 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. కానీ ఇందుకు తగినట్లుగా విత్తనాల సరఫరా లేదు. రబీ కోసం అన్నిరకాల విత్తనాలు కలిపి 3.80 లక్షల క్వింటాళ్ల వరకు అవసరమని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకున్నా... అందులో 40 వేల క్వింటాళ్లు (10.52%) మాత్రమే సిద్ధంగా ఉంచినట్లు ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. ఇక ఎరువులదీ అదే పరిస్థితి. రబీలో 16.20 లక్షల టన్నుల ఎరువులు కావాలని కేంద్రాన్ని కోరడమే తప్ప.. ఇప్పటిదాకా సాధించింది చాలా తక్కువ. యూరియా కొరతను సృష్టించేందుకు వ్యాపారులు ఇప్పటి నుంచే నిల్వలు పెంచుకుంటున్నారు. -
లోకేష్‌పై ప్రమాణం చేయగలరా?
ఓటుకు కోట్లు కేసులో ఫోన్ సంభాషణలలో ఉన్న గొంతు చంద్రబాబుదేనని దేవుడి ముందు తన కొడుకుపై ప్రమాణం చేస్తానని వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. తిరుపతి వెంకన్న, కాణిపాకం వినాయకుడి ముందు తాను ఆ ప్రమాణాలు చేస్తానని, అదే.. ఆ గొంతు మీది కాదని మీరు లోకేష్‌పై ప్రమాణం చేయగలరా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు మకాం మార్చగానే అక్కడ పిడుగులు పడి.. 20 మంది చనిపోయారని తమ్మినేని అన్నారు. ఏపీలో ఉన్న అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తక్షణం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు.. రైతు రుణమాఫీ పేరు చెప్పి రైతులకు ఒక్క రూపాయి కూడా కొత్త రుణాలు ఇవ్వలేదని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతర సందర్భాలలో రైతులకు మీరిస్తున్న హామీలు ఏ మేరకు అమలయ్యాయో ఒక్కసారైనా సమీక్షించుకున్నారా అని ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ్మినేని ఇంకా ఏమన్నారంటే.. మీరు రుణమాఫీ చేశానని చెబుతున్నారు గానీ, రైతులు గుండెమంటలతో రగిలిపోతున్నారు మీరు చాలా హామీలిచ్చారు.. వాటిని ప్రస్తుతానికి వదిలేద్దాం. సమయం వచ్చినప్పుడు వాటి విషయం చూద్దాం రుణమాఫీ పేరుతో కొత్తరుణాలు లేకుండా చేశారు దానికి బాధ్యత మీరు వహిస్తారా.. సింగపూర్ లాంటి ఏజెన్సీ ఏదైనా బాధ్యత వహిస్తుందా ఈ సంవత్సరం పీఈసీఎస్ల నుంచి ఒక్కరూపాయి కూడా రైతుకు కొత్త రుణం ఇవ్వలేదు దీనికి మంత్రులు గానీ, సీఎం గానీ సమాధానం ఇవ్వాలి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించకపోతే ఏం చేస్తారు? 692 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అన్నారు.. ఒక్కరూపాయైనా విడుదల చేశారా? మీరు చేసిన సందర్భం ఉంటే చెప్పండి.. శ్రీశైలం డ్యామ్‌కు సంబంధించి నీటిమట్టం డెడ్ స్టోరేజి లెవెల్ కంటే కిందకు పడిపోయింది. దాంతో ఎక్కడా పంటలకు చుక్క నీరిచ్చే పరిస్థితి లేదు పైనున్న కర్ణాటక దామాషా ప్రకారం నీరు వదలడం లేదు. కేంద్రంలో కూడా మీ మంత్రులున్నారు కాబట్టి ఢిల్లీ వెళ్లి రైతుల దుస్థితి గురించి, నీళ్ల సమస్య గురించి మాట్లాడారా దానివల్ల ప్రకాశం బ్యారేజిలో నీళ్లు లేవు, ఏలేరు రిజర్వాయర్, తుంగభద్ర నుంచి వచ్చే కాలువలకు కూడా నీళ్లు లేవు. వంశధారలో నీళ్లు లేవు, తోటపల్లిలోకూడా నీళ్లు లేని పరిస్థితి. -
ఒక్క రూపాయైనా కొత్త రుణాలు ఇచ్చారా?
-
రుణ మాయ
ఊబకాయిల వసూలుకు బ్యాంకుల ఎత్తుగడ ఊకొత్త రుణాలిస్తామంటూ ప్రచారం ఊరెన్యువల్స్ మాటున పాత బకాయిల జమ ఊజిల్లా వ్యాప్తంగా *7 వేల కోట్ల వసూలుకు సిద్ధం చిత్తూరు: రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రుణాలు ఇవ్వని బ్యాంకులు ఇప్పుడు పాత బకాయిలు వసూలుకు కొత్త రుణాలు ఇస్తామంటూ సరికొత్త ప్రచారానికి తెరలేపాయి. రూ.7వేల కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నాయి. దీనికి కలెక్టర్ సహకారం కోరాయి. కరువు పరిస్థితుల్లో రైతులు పాత బకాయిలు చెల్లించే పరిస్థితి లేదన్న సంగతి తెలుసుకున్న బ్యాంకులు రుణ వసూలు కోసం కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారుల మద్దతు కోరాయి. అందరూ కలిసి వారం రోజుల పాటు చర్చించిన అనంతరం రుణ వసూళ్ల కోసం సరికొత్త వ్యూహం రచించారు. పాతబకాయిలున్న వారికి కొత్త రుణాలు మంజూరు చేసి ఆ మొత్తాన్ని జమ చేసుకోవాలని నిర్ణయించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న సామెతగా ఇటు కొత్త రుణాలిచ్చినట్లు, అటు పాత బకాయిలు వసూలు చేసినట్లు ఉంటుందని భావించారు. కలెక్టర్ సూచన మేరకు తొలుత బ్యాంకు అధికారులతో పాటు ప్రభుత్వ శాఖలైన డీఆర్డీఏ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వివిధ శాఖల అధికారులతో జిల్లా నుంచి మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలిస్తాయి.. రమ్మంటూ ఈ కమిటీలు ప్రచారం చేయనున్నాయి. దీనికి మనబ్యాంకు పేరుతో స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కరపత్రాలు, బ్రోచర్లు సైతం సిద్ధం చేశారు. రైతులను మభ్యపెట్టి అప్పులను వసూలు చేయడమే తరువాయి. ‘ఈ ఖర్మ మాకేంటి’ అంటూ ఓ ప్రభుత్వ అధికారి ‘సాక్షి’తో వాపోయారు. జిల్లా వ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఇందుకోసం * 500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. సీఎం చంద్రబాబు రుణమాఫీ హామీ పుణ్యమా అని గత ఏడాది బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతుల పాత బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఈ సీజన్‌కైనా బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చి ఆదుకుంటాయనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. రూ.7వేలకోట్ల పాత బకాయిలు.. జిల్లాలో ప్రస్తుతం వివిధ బ్యాంకుల పరిధిలో * 7 వేలకోట్లకు పైనే పాత బకాయిలు ఉన్నట్లు సమాచారం. 2011-12లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి రూ.2,763.36 కోట్ల రుణాలివ్వడం లక్ష్యం కాగా బ్యాంకులు రూ.2,985.33 కోట్లు ఇచ్చాయి. 2012-13 ఏడాదికిగాను రూ.3,556.06 కోట్లు లక్ష్యం కాగా రూ.3,784.22 కోట్లు ఇచ్చాయి. 2013-14 గాను రూ.4,267.57 కోట్లు లక్ష్యం కాగా రూ.5,368.54 కోట్లు ఇచ్చాయి. 2014 -15 సంవత్సరానికి గాను రూ.6,138.72 కోట్లు లక్ష్యం కాగా రూ.3,791.83 కోట్లు మాత్రమే రుణాలిచ్చారు. మొత్తంగా నాలుగేళ్లలో రూ.18,919.92 కోట్లు రుణాలు ఇచ్చాయి. ఇందులో రూ.7వేల కోట్ల పైగా రుణం పాతబకాయి కింద నిలిచిపోయింది.. -
గ్రీస్.. గుబుల్!
అప్పుకోసం తిప్పలు షరతుల వద్దే అసలు పేచీ వడ్డీలు కట్టడానికి కొత్త రుణాలు నేడు రుణం అందకపోతే దివాలా! ఈ రుణంపై జూలై 5న రిఫరెండం ఇది చూసి ప్రపంచ మార్కెట్లలో ఆందోళన అప్పు తీర్చడానికి మరో అప్పు. వడ్డీ కట్టడానికి మరో అప్పు. కొత్త అప్పు కోసం ఏ షరతుకైనా ఓకే!! అంతలోనే రాజకీయ మార్పు. షరతులకు లొంగేది లేదని బింకాలు పోయిన పార్టీకి ప్రజల పగ్గాలు!. తీరా ఇప్పుడేమైంది? బింకాలు పోయినా ఆ నాయకుడు చేతులెత్తేశాడు. షరతులకు లొంగాలో వద్దో మీరే తేల్చుకోండంటూ ప్రజల కోర్టులోకే బంతి విసిరేశాడు! అదీ క్లుప్తంగా గ్రీస్ సంక్షోభం. ఈ సంక్షోభం పూర్వాపరాలు... అది చూపించబోయే ప్రభావంపై ‘సాక్షి బిజినెస్’ ప్రత్యేక కథనమిది... ఇప్పటివరకూ 19 సభ్యదేశాల యూరోజోన్‌కే పరిమితమైన గ్రీసు సంక్షోభం... సోమవారం ప్రపంచాన్నంతటినీ చుట్టుముట్టడంతో ఈక్విటీ, బాండు మార్కెట్లు పతనమయ్యాయి. ఇందుకు దారితీసిన కారణమేంటంటే... ఐదేళ్ల క్రితం యూరప్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం గ్రీసునూ చుట్టుముట్టింది. బయటపడటానికి ఆ దేశం ఎడాపెడా అప్పులు చేసింది. ఒక రుణాన్ని, వడ్డీని చెల్లించేందుకు మరో రుణాన్ని, దానికోసం ఇంకో రుణాన్ని....ఇలా తీసుకుని అప్పుల కుప్పలా మారింది. 566 బిలియన్ డాలర్లకు చేరిన అప్పు... ఆ దేశపు జీడీపీ 242 బిలియన్ డాలర్లతో పోలిస్తే రెట్టింపునకు పైనే. ఈ రుణాలు తీర్చడానికి గ్రీసు కనీసం 130 ఏళ్లు వాయిదాలు కట్టాలి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి, యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్ తదితర ధనిక దేశాల నుంచి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ద్వారా ఇప్పటివరకూ 480 బిలియన్ డాలర్లు తీసుకుంది. ఇదికాక గ్రీసు బ్యాంకులు ఇతర దేశాల బ్యాంకుల నుంచి 43 బిలియన్ డాలర్లవరకూ రుణాలు తీసుకున్నాయి. అంతేమొత్తం ఐఎంఎఫ్కూ బకాయి పడింది. ఈ ఐఎంఎఫ్ వాయిదా చెల్లింపులు దగ్గరే సంక్షోభం ముదిరి, ప్రస్తుతం ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను అల్లకల్లోలం చేస్తోంది. వాయిదా సమస్య... ఐఎంఎఫ్ వద్ద తీసుకున్న రుణానికి, ఇతర రుణాలకు ప్రతినెలా వాయిదా చెల్లించాలి. ఇందుకోసం యూరప్ దేశాలు గ్రీసుకు కొత్త అప్పులిస్తున్నాయి. ఇలా ఏ నెలకు ఆ నెల గ్రీసు డిఫాల్ట్ కాకుండా నెట్టుకొస్తోంది. ఇదేరీతిలో ఈ నెల 30కల్లా ఐఎంఎఫ్‌కు గ్రీసు 1.6 బిలియన్ యూరోల (1.8 బిలియన్ డాలర్ల) రుణ వాయిదాను చెల్లించాల్సి ఉంది. చెల్లించకపోతే గ్రీసు దివాలా తీసినట్లు లెక్క. దివాలా తీస్తే గ్రీసుకు కొత్త అప్పు పుట్టదు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇప్పటికే 25 శాతం వున్న నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించడం కష్టమైపోతుంది. ఆస్తుల ధరలు కుప్పకూలి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అందుకని ఐఎంఎఫ్ వాయిదా చెల్లించడానికి యూరోపియన్ యూనియన్ నుంచి తాజా అప్పు కోసం గ్రీసు ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ రోజుల తరబడి చర్చలు జరిపారు. ఈ అప్పు కోసం యూనియన్ విధిస్తున్న షరతుల్ని అంగీకరించలేక, ఆ బాధ్యతను ప్రజలకే అప్పగించేందుకు జూలై 5న రిఫరెండం ప్రకటించారు. వాయిదా చెల్లింపునకు చివరి తేదీ జూన్ 30. కానీ ఐదురోజుల తర్వాత రిఫరెండం నిర్వహించేందుకు నిర్ణయించడంతో యూరోపియన్ యూనియన్ భగ్గుమంది. గ్రీసుతో చర్చల్ని నిలిపివేసింది. ఇదే ఇప్పటి సంక్షోభానికి మూలకారణం. కఠిన షరతులతో ప్రధాని హ్యాండ్సప్ తాజాగా రుణాలకు ఈయూలోని ఇతర దేశాలు గ్రీసుకు కొన్ని షరతులు విధించాయి. పెన్షన్లను మరింత తగ్గించాలని, ఆహారోత్పత్తులు, రెస్టారెంట్లపై పన్నులు పెంచాలని, టాక్స్‌ఫ్రీ టూరిజం స్పాట్లపై పన్నులు వేయాలన్నవి వీటిలో కొన్ని. ఇప్పటికే ఐదేళ్ల నుంచి ఇలాంటి షరతులతో అక్కడి ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఆ దేశంలో మూడోవంతు పెన్షన్ల మీద ఆధారపడిన నేపథ్యంలో ఇప్పటికే పెన్షన్లు 40 శాతం మేర తగ్గిపోయాయి. ప్రజలు విసిగిపోయి ఉన్న ఇలాంటి సమయంలో వామపక్ష సిరిజా పార్టీ ఈ ఏడాది జనవరిలో అక్కడ అధికారంలోకి వచ్చింది. అంతర్జాతీయ రుణ దాతల కఠిన షరతుల్ని పునఃచర్చించి, ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తామనే హామీతో ఆ పార్టీ పగ్గాలు చేపట్టింది. కానీ అంతర్జాతీయ రుణదాతలు దిగిరాకపోవడంతో ఇప్పుడు సమస్యను రిఫరెండమ్ పేరుతో ప్రధాని ప్రజల ముందుకే తోసి, చేతులెత్తేశారు. సంక్షోభ తీవ్రత ఎందాకా... అంతాకలిసి గ్రీసు ఇప్పుడు కట్టాల్సిన వాయిదా 1.6 బిలియన్ యూరోలు. గ్రీసు జనాభా కోటి. జీడీపీ 242 బిలియన్ డాలర్లు. ఈ సమస్య మొత్తం యూరప్‌ను, ప్రపంచాన్ని తిరిగి ఆర్థిక సంక్షోభంలో ముంచేసేంతటి పెద్దది కాదన్నది కొందరు విశ్లేషకుల మాట. అయితే 2007లో అమెరికాలో బ్యాంకుల రుణ సంక్షోభాన్నీ అలానే తక్కువ చేశారన్నది మరికొందరి వాదన. ప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమన్ బ్రదర్స్ దివాలా తీసినా పెద్ద ఇబ్బందేమీ కాదనే భరోసాతో చిక్కుల్లో వున్న ఆ సంస్థను 2008లో అమెరికా అధికార యంత్రాంగం ముంచేసింది. ఎనిమిదేళ్లైయినా ఆ ప్రభావం నుంచి ఇప్పటికీ అమెరికాతో సహా ప్రపంచమంతా కోలుకోలేకపోతోంది. లేమన్ కుప్పకూలటంతో ఒక సంస్థను మరో సంస్థ, ఒక బ్యాంకును మరో బ్యాంకు నమ్మని పరిస్థితి వచ్చింది. గ్రీసు సమస్య కూడా అదే పరిస్థితికి దారితీసి సంక్షోభాన్ని తీవ్రం చేస్తుందన్న భయాలు ఫైనాన్షియల్ మార్కెట్లను వణికిస్తున్నాయి. సంక్షోభం... సంక్షిప్తంగా యూరోజోన్ అంటే...? ఈ దేశాలన్నిటా ఒకటే కరెన్సీ (యూరో) చెలామణిలో ఉంది. దీన్లోని మొత్తం దేశాలు - 19(ఆస్ట్రియా, బెల్జియం, సైప్రస్, ఎస్తోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐర్లాండ్, ఇటలీ, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్లొవేకియా, స్లొవేనియా, స్పెయిన్) గ్రీస్ అప్పుల కథేంటి? ఆ దేశ జీడీపీ 242 బిలియన్ డాలర్లు. అప్పులు మాత్రం 566 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు 36,79,000 కోట్లు. దీన్లో ఐఎంఎఫ్ ఇచ్చినవి 43 బిలియన్ డాలర్లు. దీనికి నెలకు చెల్లించాల్సిన వాయిదా 1.8 బి. డాలర్లు. మరి చెల్లించొచ్చుగా! గొడవేంటి? ఈ వాయిదాల కోసం నెలనెలా గ్రీస్ కొత్త అప్పులు చేస్తోంది. కొత్త అప్పులొస్తేనే అక్కడ జీతాలతో సహా బండి నడుస్తుంది. కానీ ఈ అప్పులకోసం ఐఎంఎఫ్, ఈయూ షరతులు పెడుతున్నాయి. మంగళవారంలోగా ఇవ్వాల్సిన అప్పుకు ఇలాగే షరతులు పెడితే గ్రీస్ ఒప్పుకోలేదు. 5న జనానికి రిఫరెండం పెట్టి చెబుతానంది. అందుకే సంక్షోభం. గ్రీస్ పాలకులెవరు? అధ్యక్షుడు ప్రొకోపిస్ పౌలోపొలస్, ప్రధాని అలెక్సిస్ సిప్రాస్. కొత్త అప్పు రాకపోతే ఏం జరుగుతుంది? నిరుద్యోగం మరింత పెరుగుతుంది. పెన్షన్లు చెల్లించలేరు. ఆర్థిక సంస్థలు ఒకదాన్ని మరొకటి నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. గ్రీస్ లాంటి దేశం డిఫాల్ట్ అయితే ఆ ప్రభావం యూరోజోన్‌కు, అక్కడి నుంచి యూరోపియన్ యూనియన్‌కు వ్యాపిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేయొచ్చు. అయితే... మనకేంటట? గ్రీస్ దేశమనేది మనకు చాలా దూరంలో ఉంది. అలాంటి దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగితే మనకొచ్చే నష్టమేంటి? అని చాలామంది అనుకుంటారు. వారు చెల్లింపులు చేయలేరు కనక ఆర్థిక సంస్థలు దివాలా తీస్తాయని, నగదు రాక తగ్గిపోతుందని నిపుణులు చెబుతుంటారు. కానీ ఇది సామాన్యులపైనా ప్రభావం చూపిస్తుంది. అదెలాగంటే... పెట్టుబడులకు విఘాతమే: 2008లో అమెరికాలో ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ లేమన్ బ్రదర్స్ కుప్పకూలటంతో ప్రపంచమంతా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. విదేశాల నుంచి వచ్చిన భారీ సొమ్ముతో అప్పటిదాకా కొన్ని సంవత్సరాల పాటు మన స్టాక్‌మార్కెట్లు పరుగులు తీశాయి. సంక్షోభం దెబ్బకు ఇన్వెస్టర్లు అంతా డబ్బు వెనక్కి తీసుకెళ్లిపోవడంతో మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల షేర్లు వారి కొనుగోలు ధరకన్నా తక్కువకు పడిపోయాయి. నష్టానికి అమ్మలేక చాలామంది దీర్ఘకాలం అలాగే కొనసాగారు. ఈ ఏడాది కూడా మార్కెట్లలోకి భారీ విదేశీ పెట్టుబడులొచ్చాయి. నిపుణులైతే లాభాల్లో ఉన్నపుడు వైదొలగటమే మంచిదని సూచిస్తున్నారు. ► జీతాలూ తగ్గొచ్చు: లేమన్ బ్రదర్స్ కుప్పకూలిన సమయంలో అంతర్జాతీయంగా వ్యాపారాలు సరిగా సాగలేదు. కంపెనీల లాభాలు కూడా తగ్గాయి. ఫలితంగా వారు ఉద్యోగుల జీతాలూ పెద్దగా పెంచలేదు. పలు భారతీయ కంపెనీలు కొత్త నియామకాలు నిలిపేసి కొందరిని తొలగించాయి. జీతాల్లో కోతలు వేశాయి కూడా. సంక్షోభ సమయాల్లో జీతాలు పెరిగే అవకాశాలు తక్కువ. ► పసిడి ధర పెరుగుతుంది!: ఇది కాస్త శుభవార్తే. భారతీయుల దగ్గర బంగారం ఎక్కువ. సంక్షోభం ముదిరితే దాని ధర పెరగొచ్చు. ఎందుకంటే సురక్షిత పెట్టుబడిగా అంతా బంగారంవైపు పరుగుపెడతారు కాబట్టి. ► విదేశీ డిగ్రీలు ప్రియం!: సంక్షోభం వల్ల భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి నిధులు వెనక్కెళతాయి. దీంతో రూపాయి బలహీనమవుతుంది. అందుకని విదేశాల్లో చదువుకోవాలంటే డాలర్లలో చెల్లింపు చేయాలి కనక మునుపటికన్నా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ► ఇంధన బిల్లు తగ్గుతుంది!: అంతర్జాతీయంగా ఏ సంక్షోభం వచ్చినా ఆర్థిక కార్యకలాపాలు తగ్గుతాయి. ఫలితంగా చమురు సహా ఆర్థిక వ్యవస్థను నడిపే వస్తువులన్నిటికీ డిమాండ్ పడిపోతుంది. దీంతో క్రూడ్ ధరలు తగ్గుతాయి. దీంతో ఇంధన బిల్లూ తగ్గుతుంది. -
డ్వాక్రాకు శాపం
- కనిపించని కార్పస్‌ఫండ్ - పెచ్చుమీరిన ‘పది’ వేల అబద్ధాలు! - కొత్తరుణాలు ఇవ్వని బ్యాంకులు - బలవంతపు వసూళ్లలో సక్సెస్ - బాబు ఏడాది పాలనలో డ్వాక్రా కకావికలం చంద్రబాబు ఏడాది పాలన చిత్తూరు జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు శాపంగా మారింది. ఎన్నికల హామీలు.. రుణమాఫీ దేవుడెరుగు ఒక్కో సభ్యురాలికి ఇస్తామన్న రూ.10వేల హామీ ఇప్పటికీ నెరవేరలేదు. కొత్తరుణాలు పుట్టక.. ఉన్న రుణాలు కట్టలేక డ్వాక్రా మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. సాక్షి,చిత్తూరు: జిల్లాలో డ్వాక్రా సంఘాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. బాబు ఎన్నికల హామీల పుణ్యమా అని గత ఏప్రిల్ నుంచి బ్యాంకు లావాదేవీలు నిలిచిపోయాయి. కొత్త రుణాలు పుట్టక.. పాత రుణాలు కట్టలేక డ్వాక్రా మహిళలు కుమిలిపోతున్నారు. మాఫీ మాయలో.. జిల్లాలో మొత్తం 62,792 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇందులో 58,602 గ్రూపులు బ్యాంకుల లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ప్రతినెలా జిల్లాలో 89 శాతం గ్రూపులు * 100 కోట్లు కడుతున్నాయి. చంద్రబాబు రుణమాఫీ ఆశతో చాలా గ్రూపులు బ్యాంకులకు రుణాలు సక్రమంగా చెల్లించక పోవడంతో వడ్డీలు పేరిగాయి. నిబంధనల మేరకు మూడు నెలలపాటు బకాయిలు చెల్లించకపోతే అధిక వడ్డీ పడడమేగాక వడ్డీలేని రుణానికి అర్హత కోల్పోతారు. ప్రస్తుతం చాలా గ్రూపులు ఇదేపరిస్థితినెదుర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10,484 గ్రూపులకు సంబంధించి * 58 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 7,436 గ్రూపులు 3 నెలలుగా *147 కోట్లను కట్టలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బలవంతపు వసూళ్లు రుణమాఫీ సంగతి పక్కన పెట్టిన ప్రభుత్వం జిల్లాలో బలవంతంగా రుణవసూళ్లకు పాల్పడుతోంది. వెలుగు అధికారులు, బ్యాంకర్లు కలిసి రుణాలు చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తామని నమ్మబలికి డ్వాక్రా మహిళలను బోల్తా కొట్టిస్తున్నారు. కొన్నిగ్రూపుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పాతబకాయిలకు సంబంధించి రీపేమెంట్ చేయకపోతే అధికవడ్డీలు వసూళ్లు చేయాల్సివస్తుందని, కొత్తరుణానికి జీరో వడ్డీ వర్తించదంటూ భయపెట్టేందుకు తెగబడ్డారు. రూ.5 లక్షలకు నెలకు రూ.5వేల వడ్డీ చెల్లించాల్సందేనంటూ బెదిరింపులకు సైతం దిగి 98 శాతం రుణాలను ముక్కుపిండి వసూలు చేశారు. బకాయిల‘కొండ’ జిల్లాలో మొత్తం 7 లక్షల 80 వేలమంది సభ్యులున్నారు. 2014-15 కుంబంధించి రూ.1513 కోట్లు ఇవ్వగా 2013-14లకు రూ.1387 కోట్లు ఇచ్చారు. ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో రూ.157 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గడువులోపు చెల్లించక నిలిచిపోయిన బకాయిలు మరో రూ.55 కోట్లు ఉంది. మొత్తంగా పాత బకాయిలు 1,596 కోట్లు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. రూ.10వేలు ఏమైంది బాబూ.. సీఎం హామీలు.. నీటిమూటల్లా మారాయి. ఒక్కో మహిళకు రూ.10 వేలు ఇస్తామని నమ్మబలికారు. ఆయనపాలన ఏడాదిగడుస్తున్నా పైసా ఇవ్వలేదు. జిల్లాలో 7లక్షల 80 వేల మంది సభ్యులకు ఒక్కొక్కరికీ రూ.10 వేల వంతున మొత్తం రూ.780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చెల్లించలేక టీడీపీ ప్రభుత్వం చతికిల పడింది. పైసా పుడితే ఒట్టు గత ఏడాది జిల్లాలోని 39,225 గ్రూపులకు రూ.1,513 కోట్లు రుణాలు మంజూరు చేశారు. మిగిలిన 19,377 గ్రూపులకు రుణాలు ఇవ్వలేదు. ఏప్రిల్ తరువాత ఈ ఏడాదికిగాను బ్యాంకులు ఒక్క పైసా రుణం ఇవ్వలేదు. డ్వాక్రా మహిళలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. గత ఏడాది జిల్లాలోని 39,225 గ్రూపులకు రూ.1,513 కోట్లు రుణాలు మంజూరు చేశారు. మిగిలిన 19,377 గ్రూపులకు రుణాలు ఇవ్వలేదు. ఏప్రిల్ తరువాత ఈ ఏడాదికి గాను బ్యాంకులు ఒక్క పైసా రుణం ఇవ్వలేదు. -
లక్ష్యం కష్టమే..
ఇవ్వాల్సింది బారెడు.. ఇచ్చింది మూరెడు రుణాలందక అల్లాడుతున్న మహిళా సంఘాలు బకాయిలు చెల్లిస్తేనే కొత్తరుణాలంటున్న బ్యాంకర్లు లక్ష్యం అధిగమించలేక చతికలపడిన యంత్రాంగం ఇవ్వాల్సింది బారెడు.. ఇచ్చింది మూరెడు అన్న చందంగా తయారైంది జిల్లాలో డ్వాక్రా సంఘాల రుణలక్ష్యం తీరు. రుణమాఫీ మహిళాసంఘాలనే కాదు అధికారులను సైతం ముప్పుతిప్పలు పెడుతోంది. అప్పులుపుట్టక మహిళలు గగ్గోలు పెడుతుంటే లక్ష్యం చేరే పరిస్థితి లేక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరొక పక్క కొండలా పేరుకు పోయిన బకాయిలు వసూలు కాక బ్యాంకర్లు ఇబ్బందులపాలవుతున్నారు. విశాఖపట్నం: పొదుపు ఉద్యమాన్ని రుణమాఫీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చింది. గద్దెనెక్కి ఎనిమిది నెలలైనా మాఫీకాదు కదా కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఊసెత్తకుండా కాలయాపన చేస్తు న్న ప్రభుత్వం.. ఏది ఏమైనా రుణలక్ష్యం చేరాలంటూ అధికారుల మెడపై కత్తి పెడుతోంది. వడ్డీలతో పేరుకుపోయిన బకాయిలు చెల్లిస్తే తప్ప కొత్త రుణాలివ్వలేమని బ్యాంకర్లు తెగేసి చెబుతుండగా.. కనీసం కొత్త సంఘాలకైనా రుణాలివ్వాలంటూ వారి కాళ్లా వేళ్లాపడుతున్నారు అధికారులు. గ్రామీణ జిల్లాలోని 44,211 సంఘాల్లో 5,08,782 మంది సభ్యులున్నారు. వీటిలో 21,386సంఘాలకు రూ.641.42కోట్లుఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం 5వేల సంఘాలకు రూ.195కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు.జీవీఎంసీపరిధిలోని 21,660 డ్వాక్రా సంఘాల్లో 2,30,656 మంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్విశాఖలో 7468సంఘాలకు రూ.175.96కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటి వ రకు కేవలం 2045సంఘాలకు రూ.65 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. ఇక యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల్లోని 2032 సంఘాల్లో 23వేల మంది సభ్యులున్నారు. ఈ రెండు మున్సిపాల్టీల్లో 732 సంఘాలకు రూ.19.05కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటి వరకుకేవలం 185 సంఘాలకు కేవలం రూ.6.36కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇలా మొత్తమ్మీద జిల్లాలో నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 32 శాతం మాత్రమే చేరుకోగలిగారు. గతంలో ఏటా నూరుశాతం లక్ష్యాన్ని చేరుకోవడమేకాదు.. లక్ష్యానికి మించి రుణాలిచ్చేవారు. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అతికష్టమ్మీద రూ.270కోట్లకు మించి అప్పులివ్వలేని దుస్థితిలో బ్యాంకర్లు ఉన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీపుణ్యమే పొదుపు సంఘాల నేటి దుస్థితికి కారణమని అధికారులే బాహాటంగా చెబుతున్నారు. వడ్డీ లేని రుణ పథకం కింద పొందే రాయితీతో పాటు పావలా వడ్డీ రాయితీని కూడాసంఘాలు కోల్పోయాయి. మరొక పక్క 14 శాతం వడ్డీతో బకాయిలు తడిసిమోపెడయ్యాయి. ఒక్కో సంఘానికి గడిచిన ఏడాదిలో వడ్డీయే 50 వేల వరకు పడినట్టుగా బ్యాంకర్లు చెబుతున్నారు. వడ్డీతో అసలు చెల్లించ లేక ఇంకా లక్షలాది సంఘాలు ప్రభుత్వ రుణమాఫీకోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. సంక్రాంతికి ప్రతీ మహిళకు రూ.10వేల చొప్పునసంఘానికి లక్ష చొప్పున జమ చేస్తామని గతేడాది విశాఖ పునరుద్ధరణ వేడుకల్లో చంద్రబాబు ప్రకటించిన హామీ నేటికీ అమలుకు నోచుకోక పోవడం పట్ల డ్వాక్రా సంఘాల సభ్యులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చేతకానప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారంటూ మండిపడుతున్నారు. బ్యాంకర్లు ముఖం చాటేయడంతో వడ్డీలకు అప్పులు తె చ్చుకోలేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నామని వాపోతున్నారు. -
నమ్మించి..నిండా ముంచారు
మండపేట :రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది తానేనని గొప్పలు చెప్పుకొన్న చంద్రబాబు నాయుడే.. వాటిని ముప్పుతిప్పల పాలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని గాలికొదిలి సంఘాలను నిండా ముంచారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తామన్న వాగ్దానంతో వారి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక మాట మార్చారు. ఫలితంగా.. సంఘాలకు పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు రాని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.1,316 కోట్ల రుణాలు అందజేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.135 కోట్లు మాత్రమే. జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు సంబంధించి మెప్మా పరిధిలో 18 వేల డ్వాక్రా సంఘాలు ఉండగా, డీఆర్డీఏ పరిధిలో గ్రామాల్లో 77,819 సంఘాలు ఉన్నాయి. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా తిరిగి కొత్త రుణాలను తీసుకోవడం సంఘాలకు పరిపాటి. ఈ మేరకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రుణాలు నూరుశాతం లక్ష్యానికి చేరుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 5,581 గ్రూపులకు రూ.143 కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా 5,284 గ్రూపులకు రూ.148.37 కోట్లు రుణాలుగా అందజేశారు. అలాగే గ్రామాల్లోని 28,247 గ్రూపులకు రూ.715.11 కోట్ల రుణ లక్ష్యానికి 25,178 గ్రూపులకు రూ.808.61 కోట్లను రుణాలుగా అందజేశారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. చిన్నబోయిన లక్ష్యాలు.. ఎన్నికల సందర్భంగా డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తాం, రుణాలు ఎవరూ చెల్లించనవసరంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం ఈ ఏడాది లక్ష్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చంద్రబాబు హామీని నమ్మిన డ్వాక్రా మహిళలు ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు నుంచే రుణాలు చెల్లించడం మానేశారు. తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు.. ‘రుణాలన్నీ రద్దు కాదు.. ఒక్కో సంఘానికి రూ.లక్ష వరకు భారం మాత్రమే తగ్గిస్తా’మంటూ మాట మార్చారు. బాబు హామీని నమ్మి పాత రుణాలు చెల్లించనందున సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త రుణాలు అందని దుస్థితి దాపురించింది. పట్టణ ప్రాంతాల్లో 7,432 గ్రూపులకు రూ.150 కోట్లు రుణాలుగా అందజేయాలన్నది ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 1,519 గ్రూపులకు రూ.45.63 కోట్లు మాత్రమే రుణాలుగా అందజేశారు. గ్రామాల్లో 36,855 గ్రూపులకు రూ.1,166 కోట్లు రుణాలు అందజేయాల్సి ఉండగా కేవలం 2,882 గ్రూపులకు రూ.90.96 కోట్లు మాత్రమే ఇచ్చారు. నెలల తరబడి రుణాలు చెల్లించక వడ్డీలతో రుణాలు తడిసి మోపెడయ్యాయని డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి నిండా మునిగి పోయామని, అలా కాక గతంలో లాగే ముందు నుంచీ క్రమం తప్పకుండా రుణాలు చెల్లించి ఉంటే కొత్త రుణాలు రావడంతో పాటు వడ్డీ భారం ఉండేది కాదని ఆక్రోశిస్తున్నారు. అంతవరకూ అభివృద్ధిపథంలో పయనిస్తున్న సంఘాల పరిస్థితి.. చంద్రబాబు నమ్మకద్రోహం వల్ల అగాధంలో పడినట్టయిందని నిట్టూరుస్తున్నారు. కొత్త రుణం దూరం.. నేను పడమర ఖండ్రిక విఘ్నేశ్వర మహిళా సంఘంలో సభ్యురాలిని. మా సంఘం తరఫున తీసుకున్న రూ.మూడు లక్షల రుణాన్ని తీర్చేసి, కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకూ మంజూరు చేయలేదు. గెలిపిస్తే ఆదుకుంటానన్న చంద్రబాబు గెలిచాన ఒరిగింది లేదు. - ఆలపాటి చక్రమ్మ, డ్రాక్రా సంఘం సభ్యురాలు, పడమర ఖండ్రిక సమయమొచ్చినపుడు సత్తా చూపుతాం చంద్రబాబు చేసిన రుణమాఫీ వాగ్దానాన్ని నమ్మి మోసపోయాం. ఇప్పుడు వడ్డీతో సహా రుణాలు చెల్లించాల్సి వస్తోంది. టీడీపీ అధినేత మాట నమ్మినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. అయితే.. మేమూ సమయం వచ్చినప్పుడు, సత్తా చూపి తగిన రీతిలో బదులిస్తాం. - సీహెచ్ సౌభాగ్యవతి, రామచంద్రపురం -
రెన్యువల్ లేదు..కొత్త రుణాలు రావు
ఎస్ఎల్బీసీ స్పష్టీకరణ పూర్తిస్థాయి రుణమాఫీ చేయని ఫలితం మిగతా రుణాలను సర్కారు లేదా రైతులు కడితేనే కొత్త రుణాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయనందున రైతుల రుణాలు రెన్యువల్‌కు నోచుకోవడం లేదని, అలాగే కొత్త రుణాలు మంజూరు కావడం లేదని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) స్పష్టం చేసింది. రైతులకు వ్యవసాయ రుణాల మంజూరులో బ్యాంకులు ముందుండేవని, లక్ష్యాలకు మించి రుణాలును మంజూరు చేసేవని ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన 188వ ఎస్ఎల్బీసీ పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయని కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపింది. తొలి దశ రుణ మాఫీని రాష్ట్ర ప్రభుత్వం కేవలం 20 శాతానికే పరిమితం చేయడంతో ఆ సొమ్ము మెజారిటీ రైతుల వడ్డీకి కూడా సరిపోవడం లేదని, దీంతో ఆయా రైతుల రుణాలు రెన్యువల్ కావడం లేదని పేర్కొంది. తొలి దశలో మాఫీ కొద్ది మొత్తంలోనే ఉన్నందున మిగతా రుణ బకాయిలు చెల్లించే వరకు రైతులకు కొత్త రుణాలను మంజూరు చేయలేమని కూడా బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది. రుణాలు రెన్యువల్ కావాలంటే మిగతా వడ్డీ మొత్తాన్ని రైతులైనా చెల్లించాలి లేదా ప్రభుత్వమైనా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలంటే తొలి దశలో ప్రభుత్వ మాఫీ చేయగా మిగిలిన రుణ బకాయిలను రైతులు లేదా ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, అలా చెల్లిస్తే గానీ రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయడం సాధ్యం కాదని వివరించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేదంటే రైతులు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలకు దూరం అవుతారని, అంతే కాకుండా పంటల బీమా కూడా దొరకదని సూచించింది. మరోవైపు బకాయిలు అలాగే కొనసాగితే రైతులపై ఏటేటా వడ్డీ భారం పెరిగిపోవడమే కాకుండా కొత్త రుణం పుట్టదని స్పష్టం చేసింది. -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్
వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలకు ఏడాదిపాటు మారటోరియం జనవరి 12 నాటికల్లా కొత్త రుణాలు మంజూరు రుణాల చెల్లింపు 5-7ఏళ్ల ల్లోపు చెల్లించేందుకు అంగీకారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రత్యేక కమిటీ సమావేశంలో నిర్ణయాలు హైదరాబాద్: హుద్ హుద్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రలోని కోస్తా జిల్లాల్లో పంట, పరిశ్రమలకోసం తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేయడంతోపాటు కొత్త రుణాలను మంజూరు చేసేందుకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నిర్ణయిం చింది. తుపాను వల్ల నాలుగు జిల్లాల్లో, మొత్తం 120 మండలాలు నష్టపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళంలో 38, విశాఖపట్టణంలో 43, విజయనగరంలో 34, తూర్పు గోదావరిలో ఐదు మండలాల్లో జనవరి 12 నాటికల్లా రుణాలను రీ షెడ్యూల్, కొత్త రుణాలను ఇచ్చేం దుకు బ్యాంకర్లు తమ అంగీ కారం తెలిపారు. మూడు నెల ల్లోగా బాధితులకు అందాల్సిన సహాయ, తోడ్పాటు కార్యక్రమాలన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రత్యేక సమావేశం తీర్మానించింది. వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలకు ఏడాది పాటు మారిటోరియం విధిస్తూ ఎస్ఎల్బీసీ నిర్ణయం తీసుకుంది. రుణాలను రైతులు 5-7 ఏళ్లలో తిరిగి చెల్లించవచ్చని పేర్కొంది. హుద్‌హుద్ తుపాను కారణంగా నష్టపోయిన జిల్లాల్లో సహాయక చర్యలపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ప్రత్యేక సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సమావేశానికి ఎస్ఎల్బీసీ కన్వీనరు సి.దొరస్వామి అధ్యక్షత వహించారు. ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు, ఆంధ్రాబ్యాంకు సీఎండీ సివిఆర్ రాజేంద్రన్ ప్రారంభోపన్యాసం చేశారు. జిల్లా కలెక్టర్ల ధ్రువీ కరించిన అన్నవారీ సర్టిఫికెట్లు పొందాలని, బ్యాంకర్లు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు. తుఫాను బాధితుల సహాయార్థం బ్యాంకర్ల కమిటీ తరఫున రూ.2.50 కోట్లను శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుకు కలిసి అందించామని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి బ్యాంకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సీం చేసిన సూచనకు తాము సుముఖత వ్యక్తం చేశామన్నారు. ప్రభుత్వ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లాం మాట్లాడుతూ తుఫాను నష్టంపై గ్రామాలవారీగా నివేదికలు రూపొందించి కేంద్రానికి పంపామని, ఈ నెల 12 తర్వాత కేంద్ర బృందం పర్యటన ఉండొచ్చని తెలిపారు. తుపాను కారణంగా 3 వేలకుపైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలని ఆ సమాఖ్య అధ్యక్షుడు ఏపీకే రెడ్డి ఎస్ఎల్బీసీకి విన్నవించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఖరీఫ్ రుణాలు45 శాతం వరకు మంజూరు చేయగా, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రుణాల శాతం కేవలం 25గానే ఉందని ఆయన తెలిపారు. -
రుణ సంక్షోభంలో రైతన్న
వ్యవసాయ రుణాలు అందక విలవిల ఈ ఖరీఫ్‌లో రూ. 10 వేల కోట్లైనా అందలేదు గత పదేళ్లలో ఎన్నడూ లేని దుస్థితి ఖరీఫ్‌లో రుణ మంజూరు లక్ష్యం రూ. 25,888 కోట్లు.. ఇచ్చింది రూ. 9,808 కోట్లు టర్మ్, అనుబంధ రుణాల లక్ష్యం రూ. 14,041 కోట్లు.. ఇచ్చింది రూ. 2,569 కోట్లు సర్కారు తీరుతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత మళ్లీ ప్రయివేటు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు.రైతులకు బ్యాంకులందించే వ్యవసాయ రుణాలు గత పదేళ్లలో లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. గత ఏడాది రాష్ట్ర రైతులకు బ్యాంకులు రూ. 37,058 కోట్ల రుణాలు ఇవ్వగా.. ఈ ఏడాది కేవలం రూ. 9,808 కోట్లు మాత్రమే ఇచ్చాయి. కౌలు రైతులకు కేవలం రూ. 42 కోట్లు మాత్రమే అంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 25,888 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించుకున్నారు.అందులో మూడో వంతు రుణాలు ఇవ్వడమే గగనమైంది. టర్మ్ రుణాలు, అనుబంధ రంగ రుణాలు కూడా ఈ ఏడాది రూ. 14,041 కోట్లు మంజూరు లక్ష్యం కాగా ఇప్పటికి అందులో ఐదో వంతు ఇవ్వలేదు.దీంట్లో తమ తప్పేమీ లేదని.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బ్యాంకర్ల మాట. రుణాలన్నీటినీ మాఫీ చేస్తామన్న టీడీపీ సర్కారు హామీ అమలు చేయకపోవటం,రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పటం వల్ల రైతులు డిఫాల్టర్లుగా మారారని.. దీంతో కొత్త రుణాలు ఇవ్వటం సాధ్యం కాదని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగు పెట్టుబడుల కోసం రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వారి అధిక వడ్డీ మరింత కుంగదీస్తోంది. ఇంకోవైపు సర్కారు నిర్వాకం వల్ల పంటల బీమా దక్కలేదు. అన్నదాత దశాబ్ద కాలం తర్వాత మళ్లీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. కొత్త రుణాలు దొరకని దయనీయ పరిస్థితి... రాష్ట్రంలో రైతాంగానికి వ్యవసాయం కోసం బ్యాంకు రుణాలు లభించేదే చాలా కొద్ది మందికి. అత్యధికులు ప్రయివేటు అప్పులపైనే అధారపడి సాగుచేస్తుంటారు. కానీ.. ఈ ఏడాది ఆ కొద్ది మంది రైతులకు కూడా వ్యవసాయ రుణాలు అందకుండా పోయాయి. రుణాలు చెల్లించొద్దని ఏకంగా సీఎం పిలుపునివ్వడం వంటి కారణాలతో రైతులు ఖరీఫ్ కాలంలో కష్టాలను ఎదుర్కొనాల్సి వచ్చింది. కొత్త అప్పులు పుట్టక రైతులు సంక్షోభం ఎదుర్కొంటారని.. ప్రయివేటు అప్పుల్లో కూరుకుపోతారని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గత ఐదు నెలలుగా వ్యక్తం చేస్తున్న ఆందోళన ఇప్పుడు వాస్తవరూపం దాలుస్తోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేని దుస్థితి... వ్యవసాయ రంగంలో బ్యాంకులు ఇచ్చే పంట రుణాలు ఏటేటా పెరగాల్సిందిపోయి.. ఈ ఏడాది కనీస స్థాయిలో కూడా అప్పులు ఇవ్వలేదు. గత పదేళ్లతో పోల్చితే రైతులకు ఏనాడూ ఇంత తక్కువగా రుణాలిచ్చిన పరిస్థితి లేదు. నిజానికి గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యానికి మించి బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో స్వల్ప కాలిక, టర్మ్, అనుబంధ రంగాల రుణ లక్ష్యం రూ. 31,877 కోట్లుగా ఉండగా.. దాదాపు రూ. 4,000 కోట్లు అధికంగా మంజూరు చేశారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ. 35,654 లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. లక్ష్యాన్ని దాటిపోయి రూ. 50,060 కోట్లు మంజూరు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 47,017 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా.. అదికూడా అధిగమించి రూ. 49,774 కోట్లు మంజూరు చేశారు. కానీ ఈ ఏడాది పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 25,888.01 కోట్ల స్వల్పకాలిక పంట రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా.. ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్టంగా కేవలం రూ. 9,808 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక వ్యవసాయ టర్మ్, అనుబంధ రంగాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 14,041.41 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు కేవలం రూ. 2,569.27 కోట్లు (18 శాతం) మాత్రమే మంజూరు చేశారు. అసలే సీజన్ అనుకూలించక రైతులు అనేక ఇబ్బందులు పడగా కనీస పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి నామమాత్రంగా కూడా రుణాలు అందకపోవడంతో రైతాంగం ఈసారి ఎక్కువగా అధిక వడ్డీకి ప్రైవేటు రుణాలపై ఆధారపడ్డారు. ఇక రాబోయే సీజన్లో రైతులకు ఆ మాత్రం అప్పులు దొర కడం కూడా కష్టంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
బ్యాంకుల కొంప ముంచిన బాబు
రుణమాఫీ హామీ అమలుకాక పేరుకుపోయిన అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్లగా మారిన రైతులు అన్ని సహకార బ్యాంకులను డిఫాల్టర్లుగా ప్రకటించిన నాబార్డు గృహ, విద్యా రుణాలు ఇచ్చేందుకు సైతం బ్యాంకుల విముఖత గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ కారణంగా రైతులే కాదు బ్యాంకర్లూ డిఫాల్టర్లు అయ్యారు. ప్రతీ ఏటా సకాలంలో రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసు కుంటున్న రైతులు ఎన్నికలకు ముందు చంద్రబాబు రుణమాఫీ హామీ నమ్మి రుణాలు చెల్లించలేదు. దీంతో రైతుల్ని బ్యాంకులు డిఫాల్టర్లుగా ప్రకటించాయి. అంతే కాకుండా 14 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. సహకార బ్యాంకులు, సంఘాలకు రుణాలు ఇవ్వడానికి నాబార్డు నుంచి ఆప్కాబ్ రుణాలు తీసుకున్నది. రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో సహకార సంఘాలు, బ్యాంకులు నాబార్డుకు రుణాలను చెల్లించలేక పోయాయి. దీంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఆప్కాబ్ డిపాల్టరుగా ప్రకటించింది. ఆప్కాబ్ కూడా ఇదే రీతిలో రుణాలు చెల్లించలేకపోవడంతో నాబార్డు దానిని డిఫాల్టరుగా ప్రకటించింది.చంద్రబాబు రుణమాఫీ కారణంగా సహకార రంగం పూర్తిగా నిర్వీర్యమై పోయిందని చెప్పడానికి ఈ ప్రక్రియను ఉదాహరణగా చెబుతున్నారు.ప్రతీ ఏటా (ఖరీఫ్,రబీ సీజనులకు) ఆప్కాబ్ రూ.4 వేల కోట్ల వరకు రుణాలను నాబార్డు నుంచి తీసుకుంటున్నది. అదే విధంగా ఆప్కాబ్ ప్రతీ జిల్లా సహకార బ్యాంకుకు సగటును రూ.300 నుంచి రూ.500 కోట్ల వరకు రుణాలు ఇస్తోంది. ఈ మొత్తం ఆర్థిక వ్యవహారాలన్నీ రుణమాఫీ కారణంగా నిలిచిపోవడంతో పాటు అటు రైతులు, ఇటు బ్యాంకులు డిఫాల్టర్లు అయ్యారు. నిండా మునిగిన రైతులు రుణ మాఫీ హామీతో ఆర్థిక వెసులుబాటు కలిగిన రైతులు కూడా సహకార సంఘాలు, బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. అప్పటి వరకు సక్రమంగా చెల్లిస్తూ మంచి ట్రాక్ రికార్డు కలిగిన రైతులు కూడా ఈ రుణమాఫీ కారణంగా డిఫాల్టర్లు అయ్యారు. దీంతో ఇతర రుణాలు తీసుకోలేకపోతున్నారు. గృహ,విద్యా రుణాలు తీసుకోవాలన్నా వాణిజ్య బ్యాంకులు రైతుల ట్రాక్ రికార్డు చూసి కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేసిన చంద్రబాబు రుణమాఫీకి రూ.5 వేలకోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో రైతుల రుణాలు పూర్తిగా తీరే అవకాశాలు లేకపోవడంతో అప్పటి వరకు డిఫాల్టర్లుగానే మిగిలిపోనున్నారు. -
ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు బ్యాంకర్లు షాక్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బ్యాంకర్లు షాక్ ఇచ్చారు. ఇరవై శాతం మాత్రమే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు స్పష్టం చేశారు. అది కూడా 20 శాతమే నిధులు చెల్లించాకే రుణాలు ఇస్తామని తెలిపాయి. ఈ నేపథ్యంలో రూ.20వేల అప్పు ఉన్న రైతులకు రూ.4వేలు మాత్రమే కొత్త రుణం రానుంది. ఇక రూ.లక్షన్నర అప్పు ఉన్న రైతుకు కేవలం రూ.30వేలు మేరకు కొత్త రుణం పుట్టే అవకాశం ఉంది. దీంతొ రైతులకు ఖరీఫ్ రుణాల్లో భారీ కోత పడనుంది. మరోవైపు గడువు ముంచుకొస్తున్నా రుణమాఫీ లబ్దిదారుల ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ నెల 22న నిధులు చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. దాంతో ఈ నెలాఖరు వరకూ ఖరీఫ్ రుణాల మంజూరు గడువు పెంచాలని విజ్ఞప్తి చేసింది. అయితే వారం రోజుల్లో కొత్త రుణాల ప్రక్రియ ఎలా సాధ్యమని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. -
ఏదీ బీమా..?
పంట రుణాల మాఫీపై ప్రభుత్వ వైఖరితో బీమా కోల్పోయిన రైతులు బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రీమియం చెల్లించలేని దుస్థితి కరవుతో ఖరీఫ్ పంటలను నష్టపోయిన రైతులు ఆందోళనలో అన్నదాతలు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది రైతుల పరిస్థితి..! పంట రుణాల మాఫీపై ప్రభుత్వం రోజుకో విధానం పూటకో మాట చెబుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో వాతావరణ, పంటల బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితి రైతులది. తీవ్ర దుర్భిక్షం వల్ల ఖరీఫ్ పంటను నష్టపోయిన రైతులకు బీమా ధీమా లేకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. తిరుపతి: జిల్లాలో ఖరీఫ్‌లో వర్షాధారంగా 1.85 లక్షల హెక్టార్లలో వేరుశెనగ, మరో 1.5 లక్షల హెక్టార్లలో వరి, చెరకు, కంది తదితర పం టలు సాగుచేశారు. వేరుశెనగకు వాతావరణ బీమా.. వరి, కంది, చెరకు పంటలకు సవరించిన పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు సెప్టెంబర్ 15, సవరించిన పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 30గా జాతీయ వ్యవసాయ బీమా సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.2,793 కోట్ల ను పంట రుణాలుగా పంపిణీ చేయాలని బ్యాంకర్లు నిర్ణయిం చారు. పంట రుణాలను పంపిణీ చేసేటపుడే బీమా ప్రీమియంను బ్యాంకర్లు మినహాయించుకుని జాతీయ వ్యవసాయ బీమా సంస్థకు చెల్లిస్తారు. అయితే, జిల్లాలో రూ.11,180.25 కోట్లను బ్యాంకులకు పంట రుణాల రూపంలో 8.15 లక్షల మంది రైతులు బకాయిపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆ రుణాలన్నీ మాఫీ అవుతాయని రైతులు చెల్లించలేదు. అధికారంలోకి వచ్చాక పంట రుణాల మాఫీపై చంద్రబాబు స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడంతో ఏ ఒక్క రైతుకు కొత్తగా రుణాలను బ్యాంకర్లు పంపిణీ చేయలేదు. వేరుశెనగ పంటకు హెక్టారుకు రూ.1375ను ప్రీమియంగా జాతీయ వ్యవసాయ బీమా సంస్థ నిర్ణయించింది. ఈ ప్రీమియంలో రూ.687.50 రైతు చెల్లిస్తే.. తక్కిన రూ.687.50 ప్రభుత్వం చెల్లిస్తుంది. వరి పంటకు సవరించిన పంటల బీమా పథకం ప్రీమియంగా పంట రుణం మొత్తంలో 3.3 శాతం చెల్లించాలి. ఇందులో ప్రభుత్వం 1.30 శాతం.. రైతు రెండు శాతం చెల్లించాలి. కందికి రైతు 5.6 శాతం.. ప్రభుత్వం 8.40 శాతం, చెరకుకు ప్రభుత్వం 1.6 శాతం.. రైతు రూ.2.4 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా పంటల రుణాల మాఫీపై చంద్రబాబు స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. ఫలితంగా బ్యాంకర్లు రుణం ఇవ్వకపోవడంతో రైతులు వాతావరణ బీమా, సవరించిన పంటల బీమా పథకం ప్రీమియంలను చెల్లించలేకపోయారు. కేవలం 2,318 మంది రైతులు మాత్రమే సొంతంగా బ్యాంకర్ల ద్వారా జాతీయ వ్యవసాయ బీమా సంస్థకు ప్రీమియం చెల్లించారు. తీవ్రమైన దుర్భిక్షం వల్ల ఖరీఫ్‌లో సాగుచేసిన వేరుశెనగ పంట తీవ్ర నష్టాలను మిగిల్చింది. కంది పంటదీ అదే దుస్థితి. చెరకు, వరి దిగుబడులపై దుర్భిక్షం తీవ్ర ప్రభావం చూపనుంది. వరుస కరవులతో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఖరీఫ్ పంటలు ముంచాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైతుకు కనీసం బీమా ధీమా కూడా దక్కకుండా పోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. -
రిక‘వర్రీ’
జిల్లాలో పావలా వడ్డీ రుణాలందించిన బ్యాంకులకు రికవరీ బెడద పట్టుకుంది. తీసుకున్న లింకేజీ రుణాలు తిరిగి చెల్లించేందుకు మహిళా సంఘాలు వెనకడుగు వేస్తున్నాయి. దీంతో కొత్త రుణాలు మంజూరు ఆగిపోగా.. రుణాలు చెల్లించిన సంఘాలకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రైతుల రుణమాఫీ తరహాలోనే పావలా వడ్డీ రుణాలు మాఫీ అవుతాయన్న ఉద్దేశంతో సంఘాలు రుణాలు చెల్లించకుండా మొండికేసినట్టు తెలుస్తోంది. నీలగిరి : జిల్లా వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు 59,600 ఉన్నాయి. ఈ మొత్తం సంఘాల్లో 2013-14కు గాను 29 వేల సంఘాలకు రూ.519 కోట్లు రుణాలు బ్యాంకర్లు ఇచ్చారు. దీంట్లో ఇప్పటి వరకు రూ.200 కోట్ల రుణాలను తిరిగి చెల్లించారు. మిగిలిన రుణాలను సంఘాలు చెల్లించడం లేదు. రుణాలు తిరిగి చెల్లించాల్సిందిగా బ్యాంకర్లు సంఘాలకు నోటీసులు కూడా జారీ చేశారు. డీఆర్డీఏ పీడీ అయితే ఏకంగా ‘సంఘదర్శిని’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా రుణాలు చెల్లించాల్సిందిగా సంఘాలను కోరుతున్నారు. గామ సంఘాలు మొదలుకుని జిల్లా సమాఖ్య వరకు అన్ని సమావేశాల్లోనూ రుణాలు చెల్లించాల్సిందిగా కోరుతున్నా, ఫలితం కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో సంఘాల రుణాలు మాఫీ చేశారు కాబట్టి... ఇక్కడి ప్రభుత్వం కూడా మాఫీ చేస్తుందన్న ఆశతో సంఘాలు ఎదురుచూస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం సంఘాల రుణమాఫీ సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు నెత్తినోరు బాదుకుంటున్నా సంఘాలు మాత్రం పెడచెవిన పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికైనా పావలా వడ్డీ రుణాలు మాఫీ చేస్తాయన్న ధీమాను సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. కొత్త రుణాలు ఇవ్వని బ్యాంకర్లు.. గతంలో తీసుకున్న రుణాలు సంఘాలు చెల్లించకపోవడంతో కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. 2014-15కు గాను 32,506 సంఘాలకు రూ.803 కోట్ల రుణాల లక్ష్యాన్ని ఖరారు చేశారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు మాసాలు కావస్తున్నా, ఇప్పటివరకు కేవలం 4 వేల సంఘాలకు రూ.130 కోట్లు మాత్రమే ఇచ్చారు. డీఆర్డీఏ లెక్కల ప్రకారం ఇప్పటికే 6 వేల సంఘాలకు రూ.180 కోట్లు మంజూరు చేయాలి. కానీ రుణాల రికవరీ పడిపోవడంతో ఆ ప్రభావం కొత్త రుణాలపై పడింది. ఊసేలేని వడ్డీ బకాయిలు... వడ్డీలేని రుణాల పథకం కాబట్టి సంఘాల తరఫున ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 10వతేదీలోగా సంఘాలకు ఖాతాలకు వడ్డీ జమకావాల్సి ఉంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు నయాపైసా కూడా ప్రభుత్వం వడ్డీ విడుదల చేయలేదు. ఈ మొత్తం సుమారూ. 20 కోట్లు వరకు ఉంటుందని అధికారుల అంచనా. ఇదిగాక వడ్డీలేని పథకం ప్రారంభమైన కొత్తలో పాత బకాయి తాలుకు రూ.24 కోట్లు రావాల్సి ఉంది. బకాయిల మొత్తాన్ని సంఘాల నుంచి బ్యాంకర్లు బలవంతంగా రాబట్టుకున్నారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న కాలానికి గాను ప్రభుత్వం వడ్డీ విడుదల చేయకపోవడంతో సంఘాలపై బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. పట్టించుకోని జిల్లా యంత్రాంగం గతంలో జిల్లా యంత్రాంగం డీఆర్డీఏ పనితీరు పట్ల ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండేది. ప్రసుత్తం ఆ భారం మొత్తాన్ని ప్రాజెక్టు డెరైక్టర్ మీదకు నెట్టివేయడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. సంఘాలు రుణాలు చెల్లించే విషయంలో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం జిల్లా యంత్రాంగం బిజీబిజీగా ఉండడంతో డీఆర్డీఏ పట్ల అంత ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రికవరీ కావట్లేదు ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలో కూడా రుణా లు మాఫీ అవుతాయన్న ఉద్దేశంతో సంఘాలు రుణా లు చెల్లించడం లేదు. కొన్ని సంఘాలు తిరిగి చెల్లింపులు చేస్తున్నా...మిగిలిన సంఘాలు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం మిగతా వాటి మీద పడుతోంది. దీనిపై సంఘాలతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు ఫర్వాలేదు. - చిర్రా సుధాకర్, డీఆర్డీఏ, ప్రాజెక్టు డెరైక్టర్ -
పాతవి చెల్లిస్తేనే కొత్త రుణాలు
* బ్యాంకర్ల స్పష్టీకరణ * రుణమాఫీపై ఏమీ మాట్లాడలేమని వ్యాఖ్య * గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్థిక సాక్షరత్పై ప్రచారం ప్రారంభం సాక్షి, హైదరాబాద్: పాత రుణాలు చెల్లించినవారికే కొత్త రుణాలు మంజూరు చేస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) వర్గాలు స్పష్టంచేశాయి. రుణమాఫీపై ఇప్పుడు తాము ఏమీ మాట్లాడలేమని పేర్కొన్నాయి. బ్యాంకింగ్ రంగంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్థిక సాక్షరత (ఫైనాన్స్ లిటరసీ) ప్రచార కార్యక్రమాన్ని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గోల్కోండ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రారంభించింది. అంతకుముందు నాబార్డు ప్రాంతీయ కార్యాలయంలో ఆర్థిక సాక్షరతపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రాబ్యాంకు జనరల్ మేనేజర్, ఎస్ఎల్బీసీ-ఏపీ కన్వీనర్ సి.దొరైస్వామి మాట్లాడుతూ.. రిజర్వ్‌బ్యాంకు మార్గదర్శకాల మేరకు పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలను మంజూరు చేయగలమని స్పష్టంచేశారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి ప్రతీ ఇంట్లో ఒకరికి బ్యాంకు ఖాతా ఉండేలా చూడాలని కేంద్రం భావిస్తోం దని.. ఇందుకోసం ఆగస్టు 28న ప్రధాని నరేంద్రమోడీ ‘జన్ ధన్ యోజన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని నాబార్డు సీజీఎం మమ్మెన్ తెలిపారు. ఇందులో భాగంగానే నాబార్డు ఆర్థిక సాక్షరత ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోందని వెల్లడించారు. ఏపీలో 93 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండగా.. తెలంగాణలో ఇది 95 శాతానికిపైగానే ఉందన్నారు. -
కరువు మండలాలు రెండేనట !
సాక్షి, నెల్లూరు: గత ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో కేవలం వెంకటగిరి, డక్కిలి మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ రెండు మండలాల్లో మాత్రమే బ్యాంకులు రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయనున్నాయి. మిగిలిన 44 మండలాలలో కరువు లేదని తేల్చిన ప్రభుత్వం అక్కడ తిరిగి రుణాలిచ్చేందుకు అంగీకరించలేదు. రిజర్వ్‌బ్యాంకు నిబంధనల మేరకు ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో వర్షపాతం, పంట దిగుబడులను పరిగణలోకి తీసుకొని 50 శాతానికి పైగా పంటనష్టం జరిగితే ప్రభుత్వ నివేదికల ఆధారంగా అక్కడ కరువుగా ప్రకటిస్తారు. అక్కడి రైతు రుణాలను బ్యాంకులు టర్మ్లోన్లుగా మార్చి తిరిగి రుణాలిస్తాయి. పాత రుణాలను మూడు ధపాలుగా చెల్లించే అవకాశం ఇస్తాయి. 2013 నవంబర్‌లో అధికారులు జిల్లాలోని వరికుంటపాడు, బోగోలు, ఏఎస్‌పేట, చేజర్ల, పొదలకూరు, డక్కిలి, వెంకటగిరిని కరువు మండలాలుగా ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ నివేదికలు పంపారు. అయితే ప్రభుత్వం వెంకటగిరి, డక్కిలినే మాత్రమే కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉత్తర్వులు ఇచ్చింది. రబీ సీజన్‌కు సంబంధించి వింజమూరు, మర్రిపాడు, ఏఎస్‌పేట, చేజర్ల, అనంతసాగరం, వరికుంటపాడు, కలిగిరి, ఆత్మకూరు, గూడూరు, కొండాపురం, దుత్తలూరు, డక్కిలి, ఓజిలి, ఉదయగిరి, వెంకటగిరి, డీవీసత్రం, కావలి, కలువాయి,పొదలకూరు, రాపూరు, సైదాపురంను కరువు మండలాలుగా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వీటిలో ఒక్క మండలాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో వెంకటగిరి, డక్కిలి మండలాల్లోనే పాతరుణాలను టర్మ్ లోన్లుగా మార్చనున్నారు. గతంలో తీసుకున్న రుణం చెల్లింపును మూడేళ్లకు పొడిగిస్తారు. మొదటి సంవత్సరం మారటోరియంగా పరిగణిస్తారు. దీంతో తొలి ఏడాది రైతులు రుణానికి సంబంధించి వాయిదా చెల్లించాల్సిన అవసరంలేదు. ఆతరువాత రెండేళ్లలో మొత్తం బకాయిని చెల్లించాలి. ఇక టర్మ్‌లోన్‌గా కన్వర్షన్ చేసిన నేపథ్యంలో ఆ రైతులకు తిరిగి కొత్తగా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. అయితే ఇందుకు పంట దిగుబడి 50 శాతంలోపే ఉందని కలెక్టర్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. -
రెంటికీ చెడ్డ రైతు
రుణమాఫీ లేదు, కొత్త రుణాలు రావు ఐదు నెలల వరకూ బకాయిలు చెల్లించలేమని బ్యాంకులకు తేల్చిచెప్పిన చంద్రబాబు 30 కాలమ్స్‌లో రైతుల వివరాలు పంపాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు వివరాల సేకరణ పేరుతో నాన్చుడు ధోరణి బకాయిలు చెల్లిస్తేనే రుణాలంటున్న బ్యాంకులు కరువు మండలాలకే రీషెడ్యూల్ ఆందోళనలో అన్నదాతలు సాక్షి, నెల్లూరు: రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయింది. రుణాలు మాఫీకాకపోగా కొత్త రుణాలు వచ్చే పరిస్థితి లేదు. ఐదు నెలల వరకూ రైతుల బకాయిలను చెల్లించలేమని సీఎం చంద్రబాబు బ్యాంకులకు తేల్చి చెప్పారు. ఈలోపు బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల జాబితా అక్రమమా? సక్రమమా? అనేది తేల్చాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఇందుకోసం 30 కాలమ్స్ ఫార్మెట్‌ను ఉపయోగించాలని చంద్రబాబు ఆదేశాలతో కలెక్టర్లు, బ్యాంకు అధికారులు ఆ పనిలో పడ్డారు. నానా రకాల కొర్రీలు పెట్టి వీలైనంత వరకూ రైతుల బకాయిల జాబితా తగ్గించాలని సీఎం మౌఖిక ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంతో కలెక్టర్లు ఆ పనిలోనే ఉన్నట్టు తెలి సింది. ఇందులో భాగంగా సోమవారం కలెక్టర్ శ్రీకాంత్ జూబ్లీ సమావేశ మందిరంలో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ నెల 28 నాటికి 30 అంశాల్లో ఫార్మెట్లో రైతుల ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్, రైతు ఫోన్ నంబర్, పాసు పుస్తకంతో పాటు పొలం సర్వేనంబర్ తదితర 30 వివరాలతో కూడిన జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు రెండునెలలకు పైగా పట్టే పరిస్థితి ఉంది. ఐదు నెలల కిందట ప్రారంభమైన ఆధార్ ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదని, ఈ లెక్కన 30 అంశాల ఫార్మెట్ సైతం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని అధికారులే పేర్కొనడం విశేషం. మరోవైపు ఐదు నెలల వరకూ బ్యాంకులకు రైతుల బకాయిలు చెల్లించే పరిస్థితి ఉండదని స్వయానా ముఖ్యమంత్రే చెప్పడంతో ఇటు ఖరీఫ్,అటు రబీతో కలిపి ఈ ఏడాది మొత్తం రైతులకు తిరిగి రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండదని సోమవారం సమావేశంలో పాల్గొన్న బ్యాంకు అధికారులే స్పష్టం చేయడం విశేషం. మరోవైపు ఆర్బీఐ రీషెడ్యూల్ వీలుకాదని తేల్చిచెప్పడం తెలిసిందే. దీంతో అన్నదాతలు అబోదిబోమంటున్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలను తుంగలో తొక్కి రైతులను వంచిచడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా... ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా సీఎం నానా ఫీట్లు వేస్తున్నారు. రూ.1.50 లక్ష రైతులకు, రూ.లక్ష వరకు డ్వాక్రా సంఘాల రుణాలు రద్దు చేస్తానని సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. అయినా ఇది అమలుకు నోచుకోవడం లేదు. తొలుత 80 వేల కోట్ల వరకు రైతురుణాలు మాఫీ చేస్తున్నట్టు బాబు చెప్పినా అది చివరకు రూ.30 వేల కోట్లకు కుదించారు. పోనీ అదైనా చేస్తాడని ఆశించిన వారికి నిరాశ ఎదురవుతోంది. మాఫీ నుంచి తప్పించుకునేందుకు బాబు నానా రకాల గారడీలకు దిగారు. ఇందులో భాగంగానే రైతుల వివరాల సేకరించాలని ఈ నెల 14న కలెక్టర్టను సీఎం ఆదేశించడం. అంతేకాదు ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 31ని అగ్రికల్చర్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లు, జీఓ నంబర్ 164ను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జారీ చేశాయి. 30 కాలమ్స్‌లో వివరాలను 14 రోజుల్లో ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. జిల్లాలో ఇంకా 20 శాతం మందికి ఆధార్‌కార్డులు అందాల్సి ఉంది. అంత సులభం కాదు ఈ లెక్కన 30 కాలమ్స్ వివరాలు ప్రభుత్వానికి చేరడం ఆషామాషీ కాదు. మొత్తం వివరాలు అందిన వెంటనే వాటిలో నకిలీలు,పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఉంటే వారి వివరాలు,రెండు రేషన్ కార్డులుంటే వాటి వివరాలు ఇలా మొత్తాన్ని తేల్చి నానా రకాల కొర్రీలు పెడతారు. ఆ తర్వాత రుణమాఫీ జాబితాను ప్రభుత్వం బ్యాంకులకు అందచేయాలన్నదే ఉద్దేశం. ఈ మొత్తం తంతు పూర్తయ్యేలోపు పుణ్యకాలం కాస్తా ముగుస్తుంది. ఈ లోపు ప్రభుత్వం బ్యాంకులకు బకాయిలు చెల్లించదు. అలాగే బ్యాంకులు రైతులకు తిరిగి రుణాలు ఇవ్వవు. దీంతో రైతులు అటు ఖరీప్ ఇటు రబీ మొత్తం ఏడాదంతా బ్యాంకు రుణాలు అందే పరిస్థితి లేకుండా పోతుంది. ప్రభుత్వం రైతుల బకాయిలను చెల్లించందే ఒక్కరూపాయి రుణం కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని సోమవారం కలెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన బ్యాంకు అధికారుల సమావేశంలో వివిధ బ్యాంకుల అధికారులు స్పష్టం చేశారు. అలాగే రైతులకు రీషెడ్యూల్ వర్తించే అవకాశం కూడా లేకుండా పోయింది. కేవలం సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదై కరువు పరిస్థితులు నెలకొన్నపుడే రుణాల రీషెడ్యూల్ ఉంటుదని రిజర్వ్‌బ్యాంకు స్పష్టంగా చెప్పింది. ఈ లెక్కన రాష్ట్రంలో విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా,నెల్లూరు జిల్లాల్లో మాత్రమే 2013 ఖరీఫ్‌లో కరువు పరిస్థితులు నెలకున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఒక్క డక్కిలి, వెంకటగిరి మండలాల్లో మాత్రమే కరువు పరిస్థితి నెలకొంది. ఈ లెక్కన కరువు మండలాల్లో మాత్రమే రుణాల రీషెడ్యూల్ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అదికూడా కేవలం పంటరుణాలు మాత్రమేనని, వాటిలో కూడా ఒక్కో రైతుకు రూ.లక్ష రుణం మాత్రమే ఇస్తామని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన ఈ ఏడాదంతా రైతులకు రుణాలు లేనట్లేనన్నది స్పష్టమౌతోంది. ఒక వేల రైతులే బకాయిలు చెల్లిస్తే వెంటనే రుణాలు ఇస్తామని వారు పేర్కొంటున్నారు. రుణమాఫీకి మెలిక పెట్టి బకాయిలు చెల్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పట్లో అంగీకరించే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలహామీని తుంగలో తొక్కి తమను వంచించిన చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రుణాలు చెల్లించకపోతే మీకే నష్టం!
రైతులకు బ్యాంకుల హెచ్చరికలు విజయవాడ బ్యూరో: పాత అప్పులు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతులకు ఇచ్చిన సలహాను బ్యాంకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారుు. మొన్నటి వరకు నోటీసులకే పరిమితమైన వివిధ బ్యాంకులు తాజాగా అప్పులు చెల్లించాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. విజయవాడ ఆంధ్రాబ్యాంకు జోనల్ అధికారులు ఈ మేరకు తమ విధానాలను స్పష్టం చేశారు. 2014 మార్చి 31కి ముందు రుణాలు పొందిన రైతులందరూ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం వర్తింపునకు అర్హులేననీ, అయితే వారు తీసుకున్న రుణాలను ముందుగా చెల్లించాలని కృష్ణా జిల్లా ఆంధ్రాబ్యాంకు డీజీఎం కృష్ణారావు స్పష్టం చేశారు. పాత అప్పులు చెల్లించకపోతే కొత్త రుణాల మంజూరులో ఆలస్యం కావటంతోపాటు ప్రభుత్వం ఇచ్చే 7 శాతం వడ్డీ రాయితీని నష్టపోతారని చెప్పారు. పావలా వడ్డీ రుణాలు పొందే అవకాశాన్నీ, పంట రుణాల బీమా సదుపాయాన్ని నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. పలు ఇతర బ్యాంకులు కూడా ఇదే పద్దతిని అనుసరించేందుకు సిద్ధమవుతున్నాయి. -
కొత్త రుణాలివ్వం
-
సెప్టెంబర్‌లోగా కొత్త రుణాలు
కరీంనగర్: రుణమాఫీపై రైతులకు ఆందోళన వద్దని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్త రుణాలు సెప్టెంబర్‌లోగా ఇస్తామని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని పోచారం స్పష్టం చేశారు. కాగా ఎస్ఐబీ (పాత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) భవనం ఫర్నిచర్ లూటీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తామూ కూడా అలా చేస్తే సీమాంధ్ర కార్యాలయాల్లో ఒక్కటి కూడా మిగలదని పోచారం వ్యాఖ్యానించారు. కాగా పాత స్పెషల్ ఇంటెలిజెన్ఓస్ బ్యూరో కార్యాలయంలో లక్షల విలువైన ఫర్నీచర్ మాయమైన విషయం తెలిసిందే. ఫర్నీచర్‌తో పాటు ఏసీలు, ట్యూబులైట్లు, స్విచ్ బోర్డులు, ఫ్యూజుల, తలుపులు, కిటీల ఫ్రేములతో పాటు వాష్ బెసిన్లు, టాయిలెట్ ఫ్లష్లతో సహా మాయం చేశారు. ఈ ఘటనపై పోచారం పైవిధంగా స్పందించారు. -
వాగ్దానం మాఫీ
రుణాల రద్దు కష్టమని తేల్చి చెప్పిన ప్రభుత్వం రూ.1050 కోట్లు మాఫీ లేనట్టే! 20 శాతం మందికే రీషెడ్యూల్ ఆందోళనలో జిల్లా రైతాంగం ఊహించినట్టే జరిగింది. తప్పుడు హామీలతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం మాట మార్చింది. రుణ మాఫీ సాధ్యం కాదని చెప్పకనే చెప్పింది. రుణాల రీషెడ్యూల్‌తో చేతులు దులుపుకోవాలని చూస్తోంది. ఇందులోనూ షరతులు, ఆంక్షలంటూ వీలైనంత తక్కువ మందికి వర్తింప చేయాలని యోచిస్తోంది. విశాఖ రూరల్: రుణమాఫీపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. గతేడాది వరదలు, కరువు మండలాల్లోని రైతులకు మాత్రమే రీషెడ్యూల్ అంటూ ప్రకటించింది. ఈ నిర్ణయం జిల్లా రైతులకు అశనిపాతమే. కనీసం 20 శాతం మందికి కూడా రీషెడ్యూల్ అమలుకాదు. ఖరీఫ్ ప్రారంభమై నారుపోతలు పూర్తయ్యాయి.. ఇప్పటికీ కొత్త రుణాలు లేవు. రుణ మాఫీ ఆశతో అన్నదాతలు ప్రైవేటు ఫైనాన్సర్ల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగు పనులు ప్రారంభించారు. తీరా ఇప్పుడు రుణాల రద్దు కష్టమని సాక్షాత్తూ సీఎం ప్రకటించడంతోదిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. రూ.1050 కోట్లు రుణాలు మాఫీ లేనట్టే! : గత ఖరీఫ్‌లో జిల్లాలో 1,32,375 మంది రైతులకు రూ.640 కోట్లు రుణాలు అందజేశారు. అలాగే రబీలో 14,548 మంది రైతులకు రూ.104 కోట్లు అప్పులిచ్చారు. గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హతకార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1లు మాత్రమే పంట రుణాలు కింద ఇచ్చారు. పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. దీంతో పాటు లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు 11.73 కోట్లు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చారు. వీటితో పాటు రూ.150 కోట్లు వరకు బంగారంపై రుణాలు అందించారు. రుణ మాఫీ జరిగితే అన్ని రకాల రుణాలు కలిపి మొత్తం రూ.1050 కోట్లు రద్దవుతాయని రైతులు భావించారు. 20 శాతం మందికే రీషెడ్యూల్! : జిల్లాలో గతేడాది వర్షాభావం కారణంగా 30 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ప్రభుత్వం ఒక మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. దీని ప్రకారం ఒక్క రైతుకు కూడా రీషెడ్యూల్ వర్తించే అవకాశం లేదు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో అల్పపీడనం, తుపాను కారణంగా భారీగా పంటలు నీటమునిగాయి. జిల్లాలో 34 మండలాల్లో మొత్తంగా 52,426 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం వీరికి మాత్రమే రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశముంది. వీరిలో కూడా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రుణాలు పొంది ఉంటే వారికి కూడా రీషెడ్యూల్ వర్తించదు. అలాగే బంగారంపై రుణాలు పొందిన వారు 50 శాతానికి పైనే ఉన్నారు. దీని ప్రకారం జిల్లాలో 20 శాతం మంది రైతులకు కూడా రుణాలు రీషెడ్యూల్ జరిగే అవకాశం కనిపించడం లేదు. రీషెడ్యూలైన రైతులకు కూడా వడ్డీ భారం పడనుంది. కొత్త రుణాలు కష్టమే.. : జిల్లాలో 2,27,400 హెక్టార్లలో పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్దేశించారు. జిల్లాలో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు, రెన్యువల్స్‌గా 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలే దని అధికారులు చెబుతున్నారు. -
కొత్త రుణాలు కష్టమే!
* రుణాల రీ-షెడ్యూల్‌తో తీవ్ర నగదు కొరత * గతేడాది రుణాల మొత్తం రూ. 7,600 కోట్లు సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాలు రీ-షెడ్యూల్ అయినప్పటికీ కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రధానంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)ల ద్వారా రీ-షెడ్యూల్ తర్వాత కొత్త రుణాలు అందే పరిస్థితి లేదు. ఇందుకు అవసరమయ్యే మొత్తాన్ని పీఏసీఎస్, ఆర్ఆర్బీలకు అందించలేమని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకేసారి మొత్తం నగదు చెల్లిస్తే తప్ప రుణ మాఫీకి రిజర్వ్ బ్యాంకు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రుణాలను రీ-షెడ్యూల్ చేసి కొత్త రుణాలు అందించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆర్బీఐని కోరుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇరు ప్రాంతాల రైతులకు పరపతి సంఘాలు, గ్రామీణ బ్యాంకుల నుంచి రూ. 7,600 కోట్ల పంట రుణాలు అందాయి. ఇప్పుడు ఇరు రాష్ట్రాలూ రుణ మాఫీ ప్రకటన చేయడంతో రైతులు బకాయిలు చెల్లించడం లేదు. దీంతో కొత్త రుణాల మంజూరుకు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి సహకరించే పరిస్థితి లేదని నాబార్డు సీజీఎం మమ్మెన్ తెలిపారు. ‘ రీ-షెడ్యూల్‌తో స్వల్పకాలిక రుణాలు కాస్తా మధ్యకాలిక రుణాలుగా మారతాయి. రూ. 7,600 కోట్లలో నాబార్డు వాటా 60 శాతం అంటే రూ. 4,560 కోట్లు. ఈ మొత్తం రైతుల నుంచి తిరిగి రాకపోతే కొత్త రుణాల కోసం పీఏసీఎస్, ఆర్ఆర్బీలకు నాబార్డు నుంచి నిధులు అందించే పరిస్థితి ఉండదు’ అని ఆయన వివరించారు. రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ ఓకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంగీకరించింది. ఈ మేరకు సోమవారం నాడు రిజర్వ్‌బ్యాంకు రీ షెడ్యూల్‌కు సంబంధించి విధివిధానాలను కూడా ప్రకటించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఏపీలోని 13 జిల్లాలకు సంబంధించి రీషెడ్యూల్ మొత్తం సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వమే మాఫీ చేస్తే మంచిది వరదలు,కరువు వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిందేనని.. రుణమాఫీని ప్రభుత్వమే నేరుగా చేస్తే బాగుంటుందని నాబార్డు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయ సీజీఎంజీజీ మమ్మెన్ అభిప్రాయపడ్డారు. రుణమాఫీ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. నాబార్డు 33వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.అవి.. - ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా గోదాముల నిర్మాణానికి రుణాలిస్తాం. - రెండురాష్ట్రాల్లోని 257 మార్కెట్ కమిటీలకు నేరుగా రూ. 500 కోట్ల రుణాలను ఇవ్వనున్నాం. మార్కెట్ కమిటీలను కూడా గుర్తించాం. ఇందులో రూ.300 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు, రూ.200 కోట్లు తెలంగాణలోని మార్కెట్ కమిటీలకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో మొత్తం రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 17,500 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. - రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు కలిపి ప్రాంతీయ కార్యాలయం ఇక్కడే ఉంది. కొత్త రాజధాని ఏర్పాటైన తర్వాత అక్కడ నాబార్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. -
రుణ మాఫీ... తలనొప్పి!
ఏదీ తేల్చని టీడీపీ ప్రభుత్వం పీఏసీఎస్‌ల్లో నిలిచిపోయిన లావాదేవీలు ఐదు నెలలుగా జీతాలందని సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో లబోదిబోమంటున్న వైనం స్పందించని డీసీసీబీ, ప్రభుత్వం తుమ్మపాల : ‘ఎంకిపెళ్లి సుబ్బిచావుకి వచ్చింది’ అన్న చందంగా తయారయింది ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) పరిస్థితి. ఓట్ల గేలంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణమాఫీ హామీ పీఏసీఎస్ ఉద్యోగులకు జీతాల్లేకుండా చేసింది. ప్రభుత్వం రుణాన్ని మాఫీ చేస్తుందన్న ఉద్దేశంతో రైతులెవరూ బకాయిలు కట్టేందుకు ముందుకు రాకపోవడంతో చాలా పీఏసీఎస్‌ల్లో ఐదు నెలల నుంచి జీతాల చెల్లింపు కూడా నిలిచిపోయింది. మాఫీపై ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండడం, స్పష్టమైన వైఖరి లేకుండా దాటవేత యత్నాలు చేస్తుండడం, పూటకో ప్రకటనతో గందరగోళానికి గురి చేస్తుండడంతో అసలు మాఫీ అవుతుందో లేదో అన్న బెంగ రైతుల్ని వేధిస్తోంది. కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం కూడా వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు సహకార సంఘాలు కూడా ఇదే సందిగ్ధంతో కొనసాగుతున్నాయి. రుణాలపై వచ్చే వడ్డీపైనే పీఏసీఎస్‌ల మనుగడ ఆధారపడి ఉంది. బకాయిలు వసూలు మేరకే సిబ్బందికి జీతాభత్యాల చెల్లింపు ఆనవాయితీగా వస్తున్న ప్రక్రియ. మాఫీ హామీ ప్రకటన నుంచే బకాయిలు వసూలు గణనీయంగా తగ్గిపోయింది. ‘ఇప్పుడు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అసలు లావాదేవీలే లేవు. సంఘాల మెట్లెక్కే రైతు కనిపించడం లేదు. సిబ్బంది వసూలు వెళితే ముఖాలు చాటేస్తున్నారు. ఇక మాకు జీతాలు వస్తాయన్న నమ్మకం లేదు’ అని ఓ ఉద్యోగి వాపోయాడు. ఫిబ్రవరి నుంచి రైతులకు జీతాలు అందడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే నెలరోజులు గడిచిపోయింది. ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో ఈనెల కూడా జీతాలు అందే పరిస్థితి లేదని సిబ్బంది వాపోతున్నారు. ఐదు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో నానాపాట్లు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్లే... జిల్లాలో 98 పీఏసీఎస్‌లున్నాయి. వీటిలో 78 పీఏసీఎస్‌ల్లో సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. దీంతో దాదాపు 250 మంది ఉద్యోగుల పరిస్థితి ఇబ్బందిగా తయారయింది. మిగిలిన 20 పీఏసీఎస్‌ల్లో బంగారంపై రుణాలు ఇవ్వడం, డిపాజిట్లు బాగుండడం, పరపతి, పరపతేతర సేవలు అందిస్తుండడంతో సిబ్బంది జీతాలకు ఢోకాలేకుండా పోయింది. అనకాపల్లి మండలంలోని తుమ్మపాల పీఏసీఎస్ సిబ్బందికి జీతాలందుతుండగా, సిహెచ్.ఎన్.అగ్రహారం సిబ్బందికి జీతాలు లేవు. ‘గతంలో ఆర్థిక ఇబ్బందులున్న సొసైటీలకు ఒక శాతం వడ్డీకి కేంద్ర బ్యాంకు రుణాలు ఇచ్చేది. వసూళ్లు జరిగాక రికవరీ చేసుకునేది. ఇప్పుడా పరిస్థితి లేదు. సొసైటీ తీర్మానం చేస్తే ఐదు శాతం వడ్డీపై మాత్రమే ఇస్తున్నారు’ అని ఉద్యోగులు వాపోతున్నారు. మూడు నాలుగు నెలల నుంచి డీసీసీబీ కార్యాలయం చుట్టూ జీతాల కోసం ప్రదక్షిణ చేస్తున్నా ఇదిగో అదిగో అనడమే తప్ప స్పష్టతలేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. దీంతో అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ నిధులూ హుళక్కి జీతాల్లేక పోవడంతో పీఎఫ్ ఖాతాలకు నిధులు జమ చేయడం లేదు. దీంతో పదవీ విరమణ పొందిన, మృతి చెందిన ఉద్యోగులకు పింఛన్, ఇతర సౌకర్యాలు అందని పరిస్థితి నెలకొంది. ప్రతినెలా ఐదో తేదీలోగా పీఎఫ్ బకాయి చెల్లించాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఐదు నెలలైంది ఐదు నెలలుగా జీతం అందలేదు. బ్యాంకులో లావాదేవీలు నిలిచిపోవడంతో ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. దీంతో జీతాలందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం, డీసీసీబీ అధికారులు స్పందించి జీతాలు చెల్లించాలి. - సిహెచ్.మధుసూదనరావు, కార్యదర్శి, సిహెచ్.ఎన్.అగ్రహారం పీఏసీఎస్ ఉద్యమం తప్పదు ప్రభుత్వం, డీసీసీబీ స్పందించి 20 రోజుల్లోగా పీఏసీఎస్‌ల సిబ్బందికి జీతాలు చెల్లించకుంటే ఉద్యమం చేపడతాం. ఈనెల 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సమావేశంలో పీఏసీఎస్ ఉద్యోగుల జీతాల విషయమై చర్చించి కార్యాచరణ రూపొందిస్తాం. అవసరమైతే జీతాలు చెల్లించే వరకు ఉద్యమిస్తాం. - పి.నాగభూషణం, సహకార సంఘాల యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
మాఫీపై తర్వాత చెప్తాం!
కొత్త రుణాలివ్వండని బ్యాంకర్లను కోరనున్న బాబు నేడు బ్యాంకర్ల కమిటీతో ఆంధ్రప్రదేశ్ సీఎం భేటీ గత ఏడాది రైతులకు ఇచ్చిన రుణాల గడువు నేటితో పూర్తి బాబు స్పష్టత ఇస్తేనే.. రైతులకు కొత్త రుణాల చాన్స్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణాల మాఫీకి ఇచ్చిన హామీపై చంద్రబాబు ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోగా.. గత ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇచ్చిన వ్యవసాయ రుణాలు తీర్చడానికి గడువు సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేసి.. ఈ ఏడాది రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రైతు రుణ మాఫీపై కోటయ్య కమిటీ చర్చిస్తోందని.. మాఫీ ఎంత, ఎలా, ఎప్పుడు అనే అంశాలను త్వరలో తెలియజేస్తామని బ్యాంకర్లకు బాబు నివేదిస్తారని సమాచారం. అయి తే.. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. రుణమాఫీపై ఏర్పాటైన కోటయ్య కమిటీ కూడా ఇప్పటికే కేంద్ర రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)ని కోరినా.. అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదు. గత ఖరీఫ్, రబీల్లో కరువు, తుపానుల కారణంగా పంటలు దెబ్బతిన్న మండలాల్లో రైతుల రుణాలను రీషెడ్యూలు చేయాలన్న సర్కారు విజ్ఞప్తికి ఆర్బీఐ అంగీకరించినప్పటికీ.. అది కేవలం రూ. 12,000 కోట్లకు మాత్రమే వర్తిస్తుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. మిగతా మండలాలకు చెందిన రైతుల రుణాలు రూ. 13,000 కోట్లకు, బంగారం కుదువపెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలు రీషెడ్యూల్ పరిధిలోకి రావని ఆ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ అంశాలన్నిటిపై సీఎం చంద్రబాబు ఇచ్చే స్పష్టతపైనే.. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు కొత్త రుణాల మంజూరు ఆధారపడి ఉంటుందని బ్యాంకర్ల కమిటీ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో తొలి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సోమవారం జరగనుంది. చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రీషెడ్యూల్ చేస్తే రూ. 12,000 కోట్లకే..! గత ఖరీఫ్, రబీల్లో తుపాను, కరువుల కారణంగా 575 మండలాల్లో పంటలు కోల్పోయినట్లు ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటించడంతో ఆర్బీఐ అప్పట్లో ఆ రైతుల రుణాల రీషెడ్యూల్కు అనుమతించలేదు. ఇప్పుడు ఆ రుణాలను రీషెడ్యూల్కు అనుమతించాలని ఆర్బీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినా ఇప్పటి వరకు ఆర్బీఐ నుంచి స్పందన లేదు. ఒకవేళ ఆ 575 మండలాల్లో రైతుల రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ అనుమతించిన పక్షంలో రూ. 12,000 కోట్ల నుంచి రూ. 13,000 కోట్ల లోపు రుణాలు రీషెడ్యూల్ అవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో రూ. 13,000 కోట్ల పంట రుణాలు రీషెడ్యూల్ పరిధిలోకి రావని తెలిపాయి. ఇవికాక మరో రూ. 35,000 కోట్లు బంగారం కుదవ పెట్టి వ్యవసాయానికి రుణాలు తీసుకున్నారని.. వీటికి కూడా రీషెడ్యూల్ వర్తించదని ఆ వర్గాలు స్పష్టంచేశాయి. మొత్తం రూ. 48 కోట్ల వరకూ రైతు రుణాలకు రీషెడ్యూల్ వర్తించదని వివరించాయి. వీటన్నింటిపైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే స్పష్టతపైనే ఖరీఫ్‌లో రైతులకు బ్యాంకులు రుణాల మంజూరు ఆధారపడి ఉంటుందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఇక మహిళా సంఘాల రుణాల మాఫీ అంశం ఇప్పుడు ప్రాధాన్యత కాదని.. రైతుల రుణ మాఫీ అంశం ఒక కొలిక్కి వచ్చిన తరువాతనే మహిళా సంఘాల రుణాల గురించి ఆలోచిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలావుంటే.. తొలి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికను రూ. 70,000 కోట్లుగా ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇందులో కేవలం వ్యవసాయ రంగానికి రూ. 46,000 కోట్ల రుణ ప్రణాళిక ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి -
హలధారీ.. బీమా హరీ
సాక్షి, ఏలూరు : మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ బీమా పథకం ఈ ఖరీఫ్‌లో రైతులకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జూలై నెలాఖరులోపు పంటవేసి ప్రీమియం చెల్లిం చిన వారికే బీమా వర్తిస్తుందనే నిబంధన ఉంది. కానీ.. ఇప్పటివరకూ రైతులకు కొత్త రుణాలు ఇవ్వలేదు. మరోవైపు వర్షాలు కురవడం లేదు. ఈ పరిస్థితుల్లో పంట ఆలస్యం కాకతప్పదు. ఈ కారణంగారైతులకు బీమా పథకం దూరం కానుంది. గడువు కుదించారు జిల్లాలో 2012 ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. తొలి ఏడాది 1,93,044 మంది రైతులు రూ.31.31 కోట్లను ప్రీమియం రూపంలో బ్యాంకుల ద్వారా బీమా కంపెనీకి చెల్లించారు. వారికి రూ.805.39 కోట్ల పరిహారం అందేలా బీమా చేశారు. కానీ.. నిబంధనల పేరుతో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులకు దూరం చేయాలని చూసింది. బీమా ప్రీమియం దాదాపు 15 ఏళ్లుగా 2.25 శాతమే ఉండేది. అయితే 2012-13 కాలానికి దానిని 4 శాతం చేశారు. 2013-14 కాలానికి ప్రీమియంను 5 శాతానికి పెంచారు. అంటే రూ.లక్ష విలువ చేసే పంటకు బీమా చేయించాలంటే రూ.5 వేలు ప్రీమియం చెల్లించాలి. సాధారణంగా ప్రీమియం చెల్లించడానికి సెప్టెంబర్ నెలాఖరువరకూ గడువు ఉండేది. కానీ.. మన జిల్లాలో ప్రారంభంలోనే ఓ నెల తగ్గించి ఆగస్టు నెలాఖరు వరకే అవకాశం ఇచ్చారు. అప్పటికి పంటవేసి ఉండాలనే నిబంధన విధించారు. గతేడాది ఈ గడువును మరో నెల రోజులు కుదించారు. ప్రస్తుతం జూలై నెలాఖరులోగా ప్రీమి యం చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనకు టీడీపీ ప్రభుత్వం నిర్వాకం తోడై పంటల బీమా పథకం అన్నదాతలకు దూరమవుతోంది. ఇవీ కారణాలు బ్యాంకులు రుణాలు ఇచ్చేప్పుడు ఎకరా వరి పంటకు రూ.579, చెరకు పంటకు రూ.730 నుంచి రూ.974 చొప్పున బీమా ప్రీమియంగా మినహాయించుకుంటాయి. బ్యాంకుల నుంచి రుణం పొందని వారు వ్యవసాయ శాఖ ద్వారా నేరుగా బీమా ప్రీమియం చెల్లించవచ్చు. అరయితే, ఈ ఏడాది టీడీపీ ఇచ్చిన రుణమాఫీ హామీతో రైతులు పాత రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించలేదు. పాత బకాయిలు కడితే తప్ప కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకులు తెగేసి చెబుతున్నారుు. రుణాలు మంజూరు కాకపోవడంతో పంటల బీమా ప్రీమియం చెల్లించే అవకాశం లేకుండాపోరుుంది. మరోవైపు వర్షాలు మొహం చాటేయడంతో నారుమళ్లు వేసేందుకు సాహసించడం లేదు. దీంతో వచ్చే నె లాఖరు నాటికి నాట్లు వేయడం అసాధ్యం. ఆ తర్వాత నాట్లు వేసినా.. బ్యాంకులు రుణాలిచ్చినా ప్రీమియం చెల్లింపు గడువు తీరిపోతుంది. దీనివల్ల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం రైతులకు ఉండదు. నష్టం వాటిల్లితే అంతే.. గతేడాది ఖరీఫ్‌లో ఆగస్టు 20వ తేదీ వరకూ ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించారు. కానీ ఈ విషయం బ్యాంకర్లకు, రైతులకు సకాలంలో చేరలేదు. అయినప్పటికీ జిల్లాలో 1,53,457 మంది రైతులు 2,69,479 హెక్టార్లలో పంటలకు బీమా చేయించుకున్నారు. 2012 ఖరీఫ్‌లో 1,93,044 మంది రైతులు 84,675 హెక్టార్లలో పంటకు బీమా చేయించారు. నీలం తుపాను, వరదల కారణంగా జిల్లాలో 1,41,258 హెక్టార్లలో వరి, 600 హెక్టార్లలో చెరకు దెబ్బతిన్నాయి. నష్టపోరుున రైతులకు బీమా పరిహారం కింద రూ.213 కోట్లు దక్కింది. హెలెన్ తుపాను, అధిక వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు దాదాపు రూ.103 కోట్ల మేర బీమా పరిహారం రానుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కళ్లాల్లో ఉన్న ధాన్యం రాశులకు నష్టం వాటిల్లినప్పుడు, వర్షాభావ పరిస్థితుల్లో విత్తనం మొలకెత్తనప్పుడు, వడగండ్ల వానలు కురిసినప్పుడు ఏర్పడే పంట నష్టానికి బీమా వర్తిస్తుంది. ఈ ఆశతోనే రైతులు బీమా ప్రీమియం చెల్లిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో బీమా ప్రీమియం చెల్లించేందుకు తక్కువ రోజులే మిగిలి ఉండటం, నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి, రుణాలు అందకపోవడం వంటి కారణాల వల్ల జిల్లా రైతులు ఈ ఏడాది పంటల బీమా పథకానికి దూరమవుతున్నారు. -
తాకట్టు సీజన్!
ముంచుకొచ్చిన ఖరీఫ్ రుణాల మాఫీపై కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెడుతున్న రైతులు వరుస కరువులతో ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలు పంట పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కాస్తా తాకట్టు సీజన్‌గా మారిపోతోంది. పంట రుణాల మాఫీ, కొత్త రుణాల మంజూరుపై ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తుండడంతో రైతులు ఎటూ దిక్కుతోచక మిగిలిన బంగారాన్ని తాకట్టుపెడుతున్నారు. భార్య, కుటుంబ సభ్యుల బంగారు ఆభరణాలను బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి ఆ డబ్బుతో విత్తన వేరుశనగకాయలు సమకూర్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. గురువారం కూడేరులోని స్టేట్‌బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంక్, జల్లిపల్లిలోని గ్రామీణబ్యాంక్కు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మండల వ్యాప్తంగా ఖరీఫ్‌లో దాదాపు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేస్తారు. సాగు సమయం ఆసన్నమైంది. త్వరలో సబ్సిడీ విత్తన వేరుశనగకాయలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో చేతిలో చిల్లిగవ్వలేని రైతులు ఇదివరకు తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి కొత్తగా పంట రుణం మంజూరు చేస్తుందేమోనన్న ఆశతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ అందలేదని, తీసుకున్న రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని బ్యాంకర్లు చెబుతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు కొత్తగా అప్పులు ఇవ్వడానికి ఎవ్వరూ సాహసించడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో భార్య, కుటుంబ సభ్యుల వద్ద మిగిలి ఉన్న అరకొర బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి విత్తన వేరుశనగకాయలు కొనుక్కోవడానికి బ్యాంకుల బాట పట్టారు. కాగా రోజుకు పది మంది వరకు బంగారం తాకట్టుపై రుణ సదుపాయం కల్పిస్తున్నామని కూడేరు స్టేట్‌బ్యాంక్ మేనేజర్ విజయకుమారి తెలిపారు. బంగారు నాణ్యతను బట్టి తులంపై రూ.13 వేల నుంచి రూ.20 వేల వరకు మంజూరు చేస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. -
కొత్త రుణాలకు ఇబ్బందేం లేదు
రైతు రుణాలపై ఆదేశాలు జారీ చేశా: ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఉభయసభల్లో శుక్రవారం పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. తెలంగాణలో రైతులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య తదితర అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలు, సీఎం సమాధానాలు.. జీవన్‌రెడ్డి(కాంగ్రెస్): తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విద్యార్థులను తెలంగాణ సమరయోధులుగా గుర్తించి వారికి పింఛన్ లాంటి ఆర్థిక చేయూతనందించాలి. రుణమాఫీ పథకం విధివిధానాల కోసం ఎదురుచూడకుండా రైతులకు కొత్త రుణాలిచ్చేలా బ్యాంకర్లను ఆదేశించాలి. దళిత, బలహీనవర్గాలు, మైనారిటీలకు కేజీ టు పీజీ ఉచిత విద్యనందించాలి. కేసీఆర్: లక్షల్లో ఉన్న విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించటం సాధ్యం కాదు. ైరె తులకు కొత్త రుణాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. కేజీ టూ పీజీ అనేది బృహత్తర పథకం. తెల్లారేసరికల్లా అది అమలు చేయాలంటే జోక్ కాదు. ఏడాదిన్నరలో పక్కా ప్రణాళిక రూపొందించి అమలు ప్రారంభిస్తాం. ఈ విద్యాసంవత్సరం కుదరదు. రేవంత్‌రెడ్డి (టీడీపీ): తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే సిమెంట్ బస్తా ధర రూ.110 మేర పెరిగింది. పేదల ఇళ్ల నిర్మాణం పనులకు కంపెనీలు తక్కువ ధరకే సిమెంటు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వటం లేదు. సాగునీటి ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ధి కలిగించేలా గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును అమలు చేస్తే నష్టం తప్పదు. కేసీఆర్: సిమెంటు కంపెనీలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. ధరల పెరుగుదల తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉంది. అయినా సిమెంటు కంపెనీలతో మాట్లాడుతున్నాం. తొందరలోనే ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తా. పేదల సంక్షేమానికి ప్రభుత్వపరంగా చేపట్టే కార్యక్రమాలకు తక్కువ ధరకు సిమెంటు ఇచ్చే నిబంధన ఉంటే కచ్చితంగా అమలయ్యేలా చూస్తా. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ధి చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు అమలు చేసే ప్రసక్తే లేదు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు నష్టం కలగకుండా చూడాలని రేవంత్‌రెడ్డి అనగా అందుకు కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘బాబ్లీ విషయంలో మహారాష్ట్రతో పంచాయితీ పెట్టుకోం. ప్రస్తుతం దానితో సఖ్యత అవసరం. మన ప్రాజెక్టులకు ఆ రాష్ట్ర సహకారం కావాలి. బాబ్లీ వల్ల తెలంగాణకు నష్టం అతి తక్కువ ఉండేలా చూస్తాం. బాబ్లీ విషయంలో మహారాష్ట్రతో పోరాటం చేస్తున్నట్టు పేర్కొంటూ కొందరు అక్కడికి వెళ్లి అరెస్టయినట్టు నటించి పేపర్లకు పోజులిచ్చినట్టుగా (చంద్రబాబు, దేశం నేతలనుద్దేశించి) మా వ్యవహారం ఉండదు’’ అని అన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్ఎస్): ఎవరెస్టు అధిరోహించిన విద్యార్థులకు రూ.10 ల క్షలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలి. కేసీఆర్: వారిని త్వరలో సన్మానిస్తున్నాం. దాని గురించి ఆ సందర్భంగా మాట్లాడదాం. పాయం వెంకటేశ్వర్లు (వైఎస్సార్ కాంగ్రెస్-పినపాక): నా నియోజకవర్గం పరిధిలో 4 వేల మెగావాట్ల సామర్థ్యం క లిగిన ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కేసీఆర్: 4 వేల మెగావాట్ల సామర్థ్యం అని చెప్పలేనుగానీ ఖమ్మం జిల్లాలో ఎన్టీపీసీ కేంద్రం నిర్మితమవుతుంది. రవీంద్రకుమార్ (సీపీఐ): జూరాల-పాకాల ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే మణుగూరుకు లబ్ధి కలుగుతుంది. కేసీఆర్: ఎత్తిపోతల పథకాలకు ప్రత్యామ్నాయం చూద్దాం. డీఎస్: అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. అందుకు ఆర్థిక వనరులు గుర్తించారా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆపకూడదు. కేసీఆర్: రెవెన్యూ వనరులపై ఆలోచించాను. ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని పథకాలు అమలయ్యే విధంగా నా వద్ద ప్రణాళిక ఉంది. ఐదేళ్ల వరకు ఏ ఎన్నికలూ లేవు. కాబట్టి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా నిర్ణయం తీసుకుంటాను. ఐటీఐఆర్‌ను యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. 6 వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల రూపాయల వరకు కేంద్రమే దానికోసం ఖర్చు చేస్తుంది. 50 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ (ఎమ్మెల్సీ): ఐటీఐఆర్ ప్రాజెక్టు వల్ల 50 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగాలు కాబట్టి సామర్థ్యం ఉంటేనే ఉద్యోగాలు దొరుకుతాయి. లేకుంటే ఇతర ప్రాంతాల వారు తన్నుకెళ్లిపోతారు. కాబట్టి ఆ ప్రాజెక్టు వచ్చే లోపు మన ఇంజనీరింగ్ విద్యను అత్యంత నైపుణ్యంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రచించండి. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలి. త్వరలో ఓయూకు 100 ఏళ్లు నిండుతాయి. దాన్ని ఘనంగా నిర్వహించండి. కేసీఆర్: ఐటీఐఆర్‌లో మన పిల్లలు ఉద్యోగం సాధించాలంటే విద్యా సామర్థ్యాన్ని పెంచాలన్న నిర్ణయం మంచిది. దీనిపై మేం కూడా అనుకున్నాం. అందరం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులమే. కాబట్టి దాన్ని ఘనంగా నిర్వహిద్దాం. యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుదాం. -
విధాన నిర్ణయాలకు స్వస్తి!
రోజువారీ సాధారణ పాలనకే పరిమితం కొత్తగా మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం ఉండదు.. కొత్త రుణాలకు ఆస్కారం లేదు.. వచ్చే ఏడాది ఎవరి బడ్జెట్ వారిదే.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్తగా ఎటువంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోబోదని అధికార వర్గాలు తెలిపాయి. కొత్తగా సాగునీటి, మంచినీటి ప్రాజెక్టుల నిర్మాణాలు గానీ, మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణాన్ని గానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బడ్జెట్లో పేర్కొన్న మేరకు మాత్రమే రుణాలు తీసుకుంటారని, కొత్త రుణాలు కూడా తీసుకోరని అధికార వర్గాలు వివరించాయి. దీంతో, రోజువారీ సాధారణ పరిపాలనకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్యక్రమాలు మాత్రమే కొనసాగుతాయని, కొత్తగా ఎటువంటి కార్యక్రమాలనూ ప్రభుత్వం చేపట్టదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2 రాష్ట్రాలు ఏర్పాటయ్యాక ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇలాఉండగా, వచ్చే ఏడాది ఎవరి బడ్జెట్ వారే రూపొందించుకోనున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని, వేర్వేరు ముఖ్యమంత్రులు బాధ్యతలు చేపడతారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో రెండు రాష్ట్రాలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లను ప్రవేశపెడతారు. ఎన్నికల అనంతరం రెండు రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వాలు పూర్తిస్థాయి బడ్జెట్లను రూపొందించుకుంటాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.