సాక్షి, నెల్లూరు: గత ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో కేవలం వెంకటగిరి, డక్కిలి మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ రెండు మండలాల్లో మాత్రమే బ్యాంకులు రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయనున్నాయి. మిగిలిన 44 మండలాలలో కరువు లేదని తేల్చిన ప్రభుత్వం అక్కడ తిరిగి రుణాలిచ్చేందుకు అంగీకరించలేదు.
రిజర్వ్‌బ్యాంకు నిబంధనల మేరకు ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో వర్షపాతం, పంట దిగుబడులను పరిగణలోకి తీసుకొని 50 శాతానికి పైగా పంటనష్టం జరిగితే ప్రభుత్వ నివేదికల ఆధారంగా అక్కడ కరువుగా ప్రకటిస్తారు. అక్కడి రైతు రుణాలను బ్యాంకులు టర్మ్‌లోన్లుగా మార్చి తిరిగి రుణాలిస్తాయి. పాత రుణాలను మూడు ధపాలుగా చెల్లించే అవకాశం ఇస్తాయి.
2013 నవంబర్‌లో అధికారులు జిల్లాలోని వరికుంటపాడు, బోగోలు, ఏఎస్‌పేట, చేజర్ల, పొదలకూరు, డక్కిలి, వెంకటగిరిని కరువు మండలాలుగా ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ నివేదికలు పంపారు. అయితే ప్రభుత్వం వెంకటగిరి, డక్కిలినే మాత్రమే కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉత్తర్వులు ఇచ్చింది. రబీ సీజన్‌కు సంబంధించి వింజమూరు, మర్రిపాడు, ఏఎస్‌పేట, చేజర్ల, అనంతసాగరం, వరికుంటపాడు, కలిగిరి, ఆత్మకూరు, గూడూరు, కొండాపురం, దుత్తలూరు, డక్కిలి, ఓజిలి, ఉదయగిరి, వెంకటగిరి, డీవీసత్రం, కావలి, కలువాయి,పొదలకూరు, రాపూరు, సైదాపురంను కరువు మండలాలుగా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వీటిలో ఒక్క మండలాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో వెంకటగిరి, డక్కిలి మండలాల్లోనే పాతరుణాలను టర్మ్ లోన్లుగా మార్చనున్నారు. గతంలో తీసుకున్న రుణం చెల్లింపును మూడేళ్లకు పొడిగిస్తారు.
మొదటి సంవత్సరం మారటోరియంగా పరిగణిస్తారు. దీంతో తొలి ఏడాది రైతులు రుణానికి సంబంధించి వాయిదా చెల్లించాల్సిన అవసరంలేదు. ఆతరువాత రెండేళ్లలో మొత్తం బకాయిని చెల్లించాలి. ఇక టర్మ్‌లోన్‌గా కన్వర్షన్ చేసిన నేపథ్యంలో ఆ రైతులకు తిరిగి కొత్తగా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. అయితే ఇందుకు పంట దిగుబడి 50 శాతంలోపే ఉందని కలెక్టర్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది.
కరువు మండలాలు రెండేనట !
Published Tue, Aug 19 2014 3:42 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement