బ్యాంకుల కొంప ముంచిన బాబు
రుణమాఫీ హామీ అమలుకాక పేరుకుపోయిన అప్పులు
తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్లగా మారిన రైతులు
అన్ని సహకార బ్యాంకులను డిఫాల్టర్లుగా ప్రకటించిన నాబార్డు
గృహ, విద్యా రుణాలు ఇచ్చేందుకు సైతం బ్యాంకుల విముఖత
గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ కారణంగా రైతులే కాదు బ్యాంకర్లూ డిఫాల్టర్లు అయ్యారు. ప్రతీ ఏటా సకాలంలో రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసు కుంటున్న రైతులు ఎన్నికలకు ముందు చంద్రబాబు రుణమాఫీ హామీ నమ్మి రుణాలు చెల్లించలేదు. దీంతో రైతుల్ని బ్యాంకులు డిఫాల్టర్లుగా ప్రకటించాయి. అంతే కాకుండా 14 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి.
సహకార బ్యాంకులు, సంఘాలకు రుణాలు ఇవ్వడానికి నాబార్డు నుంచి ఆప్కాబ్ రుణాలు తీసుకున్నది. రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో సహకార సంఘాలు, బ్యాంకులు నాబార్డుకు రుణాలను చెల్లించలేక పోయాయి. దీంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఆప్కాబ్ డిపాల్టరుగా ప్రకటించింది.
ఆప్కాబ్ కూడా ఇదే రీతిలో రుణాలు చెల్లించలేకపోవడంతో నాబార్డు దానిని డిఫాల్టరుగా ప్రకటించింది.చంద్రబాబు రుణమాఫీ కారణంగా సహకార రంగం పూర్తిగా నిర్వీర్యమై పోయిందని చెప్పడానికి ఈ ప్రక్రియను ఉదాహరణగా చెబుతున్నారు.ప్రతీ ఏటా (ఖరీఫ్,రబీ సీజనులకు) ఆప్కాబ్ రూ.4 వేల కోట్ల వరకు రుణాలను నాబార్డు నుంచి తీసుకుంటున్నది. అదే విధంగా ఆప్కాబ్ ప్రతీ జిల్లా సహకార బ్యాంకుకు సగటును రూ.300 నుంచి రూ.500 కోట్ల వరకు రుణాలు ఇస్తోంది. ఈ మొత్తం ఆర్థిక వ్యవహారాలన్నీ రుణమాఫీ కారణంగా నిలిచిపోవడంతో పాటు అటు రైతులు, ఇటు బ్యాంకులు డిఫాల్టర్లు అయ్యారు. నిండా మునిగిన రైతులు
రుణ మాఫీ హామీతో ఆర్థిక వెసులుబాటు కలిగిన రైతులు కూడా సహకార సంఘాలు, బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. అప్పటి వరకు సక్రమంగా చెల్లిస్తూ మంచి ట్రాక్ రికార్డు కలిగిన రైతులు కూడా ఈ రుణమాఫీ కారణంగా డిఫాల్టర్లు అయ్యారు. దీంతో ఇతర రుణాలు తీసుకోలేకపోతున్నారు. గృహ,విద్యా రుణాలు తీసుకోవాలన్నా వాణిజ్య బ్యాంకులు రైతుల ట్రాక్ రికార్డు చూసి కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేసిన చంద్రబాబు రుణమాఫీకి రూ.5 వేలకోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో రైతుల రుణాలు పూర్తిగా తీరే అవకాశాలు లేకపోవడంతో అప్పటి వరకు డిఫాల్టర్లుగానే మిగిలిపోనున్నారు.