ఇదేం ప్లాన్ బాబూ !
ఎన్నికల్లో హామీల వర్షం కురిపించి.. నమ్మించి గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక అనేక ఆంక్షలను విధిస్తున్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ అంటూ అన్నదాతలు,మహిళలను ఏడిపిస్తున్నారు. అనర్హత వేటుతో పింఛన్‌దారులను నట్టేట ముంచారు. తాజాగా నిరుపేద విద్యార్థుల ఫీజు పథకానికి తూట్లు పొడిచేందుకు కొత్త ‘ప్లాన్’ అంటూ జీఓ నెం. 72ను జారీ చేశారు. పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు.
కడప రూరల్:
నిరుపేద ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈబీసీ మైనార్టీ విద్యార్థుల ‘ఉపకారం’ పథకంపై ఆంక్షల కొరడాను ఝళిపించడానికి రాష్ర్టప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నెం. 72 జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం విద్యార్థులు అనేక పత్రాలతోపాటు పాన్‌కార్డు సమర్పించాలి. ప్రస్తుతానికి పాన్ కార్డు తప్పనిసరి కాదని అధికారులు చెబుతున్నా.. ఒకవేళ భవిష్యత్తులో తప్పనిసరి అయితే అనర్హత వేటు కారణంగా తీవ్రంగా నష్టపోక తప్పదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
అసలు 72 జీవోలో ఏముంది..
జీఓ నెం. 72లో అనేక నిబంధనలు విధించారు. జీఓలో ఈబీసీ, ఓసీ, మైనార్టీ, ఓసీ ఫిజికల్ హ్యాండీ క్యాప్డ్ విద్యార్థులు 2014 జూన్ రెండో తేది తర్వాత నుంచి స్థానికత పత్రాన్ని మీ-సేవా కేంద్రం నుంచి పొందాలి. అలాగే ఫ్రెష్ విద్యార్థులందరూ ఆధార్ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. గడిచిన ఏడేళ్ల నుంచి ఎక్క డ చదివారో అందుకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ అందించా లి. ముఖ్యంగా జీఓలో పాన్‌కార్డు గురించి వివరించారు. సదరు విద్యార్థి కుటుంబానికి సంబంధించిన పాన్‌కార్డు ఉంటే సమర్పించాలని తెలిపారు.
భవిష్యత్తులో పాన్‌కార్డు తప్పనిసరైతే కష్టాలే!
ఇన్‌కం ట్యాక్స్, ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన పాన్ కార్డు చాలామంది వద్ద లేదు. ముఖ్యంగా పేదల వద్ద అస్సలు ఉండదు.. వారికి ఆ అవసరమూ రాలేదు. భవిష్యత్తులో పాన్‌కార్డు తప్పనిసరి చేస్తే దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, సన్న చిన్నకారు రైతులు పాన్‌కార్డును పొందాల్సి ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు ‘ఉపకారం’ పొం దాలంటే ఏడాది ఆదాయం రూ. 2 లక్షలకు, బీసీ, ఈబీసీ, మై నార్టీ విద్యార్థులకు రూ. లక్ష లోపు ఆదాయం కలిగి ఉండాలి.
ఆ ప్రకారం పాన్‌కార్డు ద్వారా ఏదైనా తేడా వచ్చినా, ఆదా యం ఎక్కువగా చూపినా సదరు విద్యార్థి స్కాలర్‌షిప్పులను నిలిపేస్తారు. అందులో భాగంగానే సాధ్యమైనంత మేరకు ఎక్కువ మంది విద్యార్థులపై అనర్హత వేటు వేయడానికి పాన్‌కార్డు తీసుకు వచ్చారని అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.