
కొత్త రుణాలకు ఇబ్బందేం లేదు
రైతు రుణాలపై ఆదేశాలు జారీ చేశా: ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉభయసభల్లో శుక్రవారం పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. తెలంగాణలో రైతులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య తదితర అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలు, సీఎం సమాధానాలు..
జీవన్‌రెడ్డి(కాంగ్రెస్): తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విద్యార్థులను తెలంగాణ సమరయోధులుగా గుర్తించి వారికి పింఛన్ లాంటి ఆర్థిక చేయూతనందించాలి. రుణమాఫీ పథకం విధివిధానాల కోసం ఎదురుచూడకుండా రైతులకు కొత్త రుణాలిచ్చేలా బ్యాంకర్లను ఆదేశించాలి. దళిత, బలహీనవర్గాలు, మైనారిటీలకు కేజీ టు పీజీ ఉచిత విద్యనందించాలి.
కేసీఆర్: లక్షల్లో ఉన్న విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించటం సాధ్యం కాదు. ైరె తులకు కొత్త రుణాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. కేజీ టూ పీజీ అనేది బృహత్తర పథకం. తెల్లారేసరికల్లా అది అమలు చేయాలంటే జోక్ కాదు. ఏడాదిన్నరలో పక్కా ప్రణాళిక రూపొందించి అమలు ప్రారంభిస్తాం. ఈ విద్యాసంవత్సరం కుదరదు.
రేవంత్‌రెడ్డి (టీడీపీ): తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే సిమెంట్ బస్తా ధర రూ.110 మేర పెరిగింది. పేదల ఇళ్ల నిర్మాణం పనులకు కంపెనీలు తక్కువ ధరకే సిమెంటు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వటం లేదు. సాగునీటి ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ధి కలిగించేలా గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును అమలు చేస్తే నష్టం తప్పదు.
కేసీఆర్: సిమెంటు కంపెనీలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. ధరల పెరుగుదల తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉంది. అయినా సిమెంటు కంపెనీలతో మాట్లాడుతున్నాం. తొందరలోనే ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తా. పేదల సంక్షేమానికి ప్రభుత్వపరంగా చేపట్టే కార్యక్రమాలకు తక్కువ ధరకు సిమెంటు ఇచ్చే నిబంధన ఉంటే కచ్చితంగా అమలయ్యేలా చూస్తా. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ధి చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు అమలు చేసే ప్రసక్తే లేదు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు నష్టం కలగకుండా చూడాలని రేవంత్‌రెడ్డి అనగా అందుకు కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘బాబ్లీ విషయంలో మహారాష్ట్రతో పంచాయితీ పెట్టుకోం. ప్రస్తుతం దానితో సఖ్యత అవసరం. మన ప్రాజెక్టులకు ఆ రాష్ట్ర సహకారం కావాలి. బాబ్లీ వల్ల తెలంగాణకు నష్టం అతి తక్కువ ఉండేలా చూస్తాం. బాబ్లీ విషయంలో మహారాష్ట్రతో పోరాటం చేస్తున్నట్టు పేర్కొంటూ కొందరు అక్కడికి వెళ్లి అరెస్టయినట్టు నటించి పేపర్లకు పోజులిచ్చినట్టుగా (చంద్రబాబు, దేశం నేతలనుద్దేశించి) మా వ్యవహారం ఉండదు’’ అని అన్నారు.
బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్‌ఎస్): ఎవరెస్టు అధిరోహించిన విద్యార్థులకు రూ.10 ల క్షలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలి.
కేసీఆర్: వారిని త్వరలో సన్మానిస్తున్నాం. దాని గురించి ఆ సందర్భంగా మాట్లాడదాం.
పాయం వెంకటేశ్వర్లు (వైఎస్సార్ కాంగ్రెస్-పినపాక): నా నియోజకవర్గం పరిధిలో 4 వేల మెగావాట్ల సామర్థ్యం క లిగిన ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.
కేసీఆర్: 4 వేల మెగావాట్ల సామర్థ్యం అని చెప్పలేనుగానీ ఖమ్మం జిల్లాలో ఎన్టీపీసీ కేంద్రం నిర్మితమవుతుంది.
రవీంద్రకుమార్ (సీపీఐ): జూరాల-పాకాల ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే మణుగూరుకు లబ్ధి కలుగుతుంది.
కేసీఆర్: ఎత్తిపోతల పథకాలకు ప్రత్యామ్నాయం చూద్దాం.
డీఎస్: అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. అందుకు ఆర్థిక వనరులు గుర్తించారా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆపకూడదు.
కేసీఆర్: రెవెన్యూ వనరులపై ఆలోచించాను. ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని పథకాలు అమలయ్యే విధంగా నా వద్ద ప్రణాళిక ఉంది. ఐదేళ్ల వరకు ఏ ఎన్నికలూ లేవు. కాబట్టి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా నిర్ణయం తీసుకుంటాను. ఐటీఐఆర్‌ను యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. 6 వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల రూపాయల వరకు కేంద్రమే దానికోసం ఖర్చు చేస్తుంది. 50 లక్షల ఉద్యోగాలు వస్తాయి.
ప్రొఫెసర్ నాగేశ్వర్ (ఎమ్మెల్సీ): ఐటీఐఆర్ ప్రాజెక్టు వల్ల 50 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగాలు కాబట్టి సామర్థ్యం ఉంటేనే ఉద్యోగాలు దొరుకుతాయి. లేకుంటే ఇతర ప్రాంతాల వారు తన్నుకెళ్లిపోతారు. కాబట్టి ఆ ప్రాజెక్టు వచ్చే లోపు మన ఇంజనీరింగ్ విద్యను అత్యంత నైపుణ్యంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రచించండి. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలి. త్వరలో ఓయూకు 100 ఏళ్లు నిండుతాయి. దాన్ని ఘనంగా నిర్వహించండి.
కేసీఆర్: ఐటీఐఆర్‌లో మన పిల్లలు ఉద్యోగం సాధించాలంటే విద్యా సామర్థ్యాన్ని పెంచాలన్న నిర్ణయం మంచిది. దీనిపై మేం కూడా అనుకున్నాం. అందరం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులమే. కాబట్టి దాన్ని ఘనంగా నిర్వహిద్దాం. యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుదాం.