TS Assembly: పచ్చదనానికి హరిత నిధి | CM KCR Announces Telangana Green Fund In Assembly | Sakshi
Sakshi News home page

TS Assembly: పచ్చదనానికి హరిత నిధి

Published Sat, Oct 2 2021 1:27 AM | Last Updated on Sat, Oct 2 2021 7:18 AM

CM KCR Announces Telangana Green Fund In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి తెలంగాణ హరిత నిధి (తెలంగాణ గ్రీన్‌ఫండ్‌)ను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెలా కొంత మొత్తాన్ని ఈ ఫండ్‌కు జమ చేయాలని కోరారు. దీనితోపాటు పలు ఇతర మార్గాల ద్వారా గ్రీన్‌ఫండ్‌కు నిధులు సమకూర్చుతామని వెల్లడించారు. శుక్రవారం శాసనసభలో హరితహారం అంశంపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘హరితనిధి’ ఏర్పాటుతోపాటు ఇతర ప్రతిపాదనలను వివరించారు.

సభలో సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..  
‘‘రాష్ట్రంలో అడవులు నాశనం అవుతున్నాయి. ప్రణాళికబద్ధంగా పచ్చదనం పెంచాల్సిన అవసరముంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది. హరితహారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు హరితనిధిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు తమ వంతుగా ఆర్థిక సాయం చేయాలి. ఈ విషయంగా అఖిలభారత సర్వీసులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో మాట్లాడాం. ప్రతినెలా జీతాల నుంచి చెల్లించేందుకు వారు అంగీకరించారు. మొత్తం 184 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల నుంచి నెలకు రూ.500 చొప్పున చెల్లించాలని కోరాం. దీనికి టీఆర్‌ఎస్‌ సభ్యులందరూ సమ్మతం తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కూడా సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాం. తెలంగాణ హరితనిధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.

గ్రీనరీలో మూడో స్థానం
ప్రపంచంలో గ్రీనరీ విషయంగా తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో రాష్ట్రం ఉంది. రాష్ట్రంలో మొత్తం 2.75 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో 66.25 లక్షల ఎకరాల మేర అటవీ భూములు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌లో ఒకప్పుడు అద్భుతమైన అడవులు ఉండేవి. ఇప్పుడు మాయమైపోయాయి. నర్సాపూర్‌ అడవులు మన కళ్ల ముందే ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాం.

ఐక్యరాజ్యసమితి కూడా దీనిని ప్రశంసించింది. గ్రామపంచాయతీల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం ప్రాధాన్యతను ప్రజలకు చెప్పాం. 19,472 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశాం. మండలానికి ఒకటి లెక్కన బృహత్‌ ప్రకృతి వనాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. 526 మండలాల్లోని 7,178 ఎకరాల్లో ప్లాంటేషన్‌ పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. పట్టణాల్లోని 109 ఏరియాల్లో మొత్తంగా 75,740 ఎకరాల్లో అర్బన్‌ ¯ఫారెస్టులు ఏర్పాటు చేస్తున్నాం. 53 అర్బన్‌ పార్కుల్లో పని బాగా జరిగింది. మిగతాచోట్ల కొనసాగుతున్నాయి.

భారీ సంఖ్యలో మొక్కలు నాటాం 
మొత్తంగా రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని హరితహారం లక్ష్యంగా పెట్టుకున్నాం. సిద్దిపేటలో 20కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకుంటే, ఇప్పటికే 20.64 కోట్ల మొక్కలు నాటాం. గ్రేటర్‌ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు టార్గెట్‌ పెట్టుకుంటే 14.5 కోట్ల మొక్కలు నాటాం. అటవీ ప్రాంతాల బయట 130కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంటే, 176.82 కోట్లు నాటాం. హైదరాబాద్‌ ఎకో సిస్టం నిర్వహణకు 188 రిజర్వు ఫారెస్ట్‌ బ్లాక్‌లున్నాయి. 1.60 లక్షల ఎకరాల భూమి ఉంది. వాటిని గోడలు, కంచెలతో రక్షిస్తున్నాం. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంచడా నికి 10% బడ్జెట్‌ను గ్రీనరీకే పెట్టాం. మొక్కల బాధ్యత సర్పంచ్‌లకు అప్పగించాం. ఎమ్మెల్యేలు గ్రామాల్లో తనిఖీలు చేసి మొక్కల పరిస్థితిని పరిశీలించాలి.

కంపా నిధులు కేంద్రానివి కావు 
కంపా నిధులు కేంద్ర ప్రభుత్వానివి కావు. 100 శాతం రాష్ట్రాల డబ్బే. నీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర అవసరాల కోసం అటవీ భూములు తీసుకుం టాం. ఇందుకోసం అడ్వాన్స్‌ కింద రాష్ట్రాలు కేంద్రానికి డబ్బు చెల్లించాలి. ఇలా తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన సొమ్ము రూ.4,675 కోట్లు. ఈ నిధులనే తిరిగి రాష్ట్రానికి విడుదల చేయాలని ప్రధాని మోదీని కలిసి కోరాం. నాలుగేళ్ల తర్వాత రూ.3,109 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.1,320 కోట్లు ఖర్చు పెట్టాం. ఉపాధి హామీ కింద రూ.3,673 కోట్లు ఖర్చు చేశాం. హెచ్‌ఎండీఏ ద్వారా రూ.367 కోట్లు, జీహెచ్‌ఎంసీ ద్వారా రూ.83 కోట్లు ఖర్చు పెట్టాం. నర్సరీల పెంపకం, కూలీలు, మొక్కల సరఫరా, నీటి రవాణాకు ఈ నిధులు వినియోగించాం. ఎక్కడా దుర్వినియోగం లేదు. ఇప్పటివరకు హరితహారం కోసం రూ.6,555 కోట్లు ఖర్చు చేశాం.

అధికారుల అత్యుత్సాహం 
పోడు భూముల విషయంగా కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అడవి మీద ఆధారపడి బతికే గిరిజనులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇటీవల ఘర్షణలు కూడా జరిగాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. అడవుల్లో జీవిస్తున్న గిరిజనులకు ఆశ్రయం కల్పించేందుకు 2005 నాటికి ఎవరెవరు, ఎక్కడ ఉన్నారో సర్వే చేశారు. ఆ ప్రకారం భూములకు పత్రాలు ఇచ్చారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అటవీ భూముల ఓనర్‌షిప్‌ మారదు. అది సుప్రీంకోర్టు తీర్పుల మేరకు రూపొందిన కేంద్ర చట్టం. మన చేతుల్లో ఏమీ లేదు. రాష్ట్రంలో 96,676 మంది గిరిజనులకు 3.08 లక్షల ఎకరాల మేర ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చాం. రైతుబంధు ప్రారంభించినప్పుడు వారికి రైతుబంధు వచ్చేది కాదు. తర్వాత వారికి కూడా ఇస్తున్నాం.

పోడు భూములపై ఢిల్లీకి అఖిలపక్షం 
పోడు భూముల వ్యవçహారాన్ని తేల్చుతామని ప్రజలకు హామీ ఇచ్చాం. తేల్చాల్సిన అవసరం ఉంది. అటవీ అధికారులు, గిరిజనుల మధ్య గొడవలు ఉండటం మంచిది కాదు. అది సమసిపోవాలి. ఈ సమస్యపై మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆధ్వర్యంలో సబ్‌ కమిటీ చేశాం. ఇప్పటికే పట్టాలిచ్చిన భూములు కాకుండా.. ఎంత భూమిలో పోడు వ్యవసాయం చేస్తున్నారో తేల్చాల్సి ఉంది. వారికి కూడా ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలిచ్చి, రైతుబంధు ఇస్తే సమస్య సమసిపోతుంది. ఇందుకోసం చట్టంలో పేర్కొన్న కటాఫ్‌ తేదీని పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. సబ్‌ కమిటీ రిపోర్టు ఆధారంగా ఈ శాసనసభ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దాం. అవసరమైతే పోడు భూముల విషయంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం. దీనితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతంలోకి వస్తున్న గిరిజనులను అడ్డుకుని, మన గిరిజనులకు రక్షణ కల్పించాల్సి ఉంది.

అసైన్డ్‌ భూములను లాక్కోవడం లేదు 
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములను ప్రభుత్వం లాగేసుకుంటోందన్న ప్రతిపక్ష సభ్యుల విమర్శలపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. ‘‘అభివృద్ధి కార్యక్రమాల కోసం అనివార్య పరిస్థితుల్లోనే అసైన్డ్‌ భూములను తీసుకుంటున్నాం. వంద ఎకరాలను దళితులకు అసైన్‌ చేశామని అనుకుందాం. మరి ఆ భూములకు నీరివ్వాలంటే కాల్వను ఆ భూముల నుంచే తవ్వాలి. అందువల్ల కొంత భూమి తీసుకోవాల్సి వస్తుంది. పట్టా భూమి ఉన్నవారికి ఎంత పరిహారం ఇస్తామో, వీరికీ అంతే పరిహారం ఇస్తున్నాం. అనవసరంగా తీసుకున్నవి ఎక్కడైనా ఉంటే చెప్పండి. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ’’ అని స్పష్టం చేశారు.

ఆ 7 మండలాలపై ప్రధానితో గొడవపడ్డా.. 
రాష్ట్ర విభజన సమయంలో ఇష్టమున్నట్టు గీతలు గీసి భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని, తమ ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పోదెం వీరయ్య అసెంబ్లీలో ప్రస్తావించగా.. సీఎం కేసీఆర్‌ స్పందించారు. ‘‘ఏడు మండలాలను ఇష్టమొచ్చినట్టుగా ఏపీలో కలిపారు. అది ఫాసిస్ట్‌ పద్ధతి. ఈ విషయంగా ప్రధానమంత్రితోనూ గొడవపడ్డాను. గతంలో చంద్రబాబు, వెంకయ్యనాయుడులకూ చెప్పాను. ప్రస్తుతం అక్కడ వేరే ప్రభుత్వం ఉంది..’’ అని పేర్కొన్నారు.

ఇతర మార్గాల ద్వారా.. 
నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)కు ప్రభుత్వం నుంచి అందుతున్న మాదిరిగానే.. ప్రభుత్వ పనులు చేపట్టే సివిల్, ఇతర కాంట్రాక్టుల నిధుల్లోంచి విధిగా 0.1 శాతాన్ని హరిత నిధికి జమచేయాలి. దీనిద్వారా ఏటా రూ.20–30 కోట్లు వస్తాయని అంచనా. 
నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి 10 శాతాన్ని హరితనిధికి జమ చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న అన్నిరకాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతీ లావాదేవీకి రూ.50 చొప్పున హరిత నిధికి జమచేయాలి. 
వ్యాపార సంస్థల లైసెన్సు రెన్యువల్‌ సందర్భంగా రూ.1,000 జమ చేయాలి.
  

హరితనిధి ఇలా.. 
ప్రజాప్రతినిధులు, అధికారులు  (ప్రతినెలా జీతాల్లోంచి..) 
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నుంచి రూ.500  (రాష్ట్రానికి చెందిన 24 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల్లో 16 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలు హరితనిధికి ప్రతినెలా రూ.500 ఇవ్వడానికి అంగీకరించారు.) 
జిల్లా పరిషత్‌ చైర్మన్, మున్సిపల్‌ 
కార్పొరేషన్ల మేయర్ల నుంచి రూ.100 
మున్సిపల్‌ చైర్‌పర్సన్, ఎంపీపీ, జెడ్పీటీసీల నుంచి రూ.50 
మున్సిపల్‌ కార్పొరేటర్, కౌన్సిలర్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీల నుంచి రూ.10 
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల నుంచి రూ.100 చొప్పున.. 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.25

సాయపడతాం
ప్రభుత్వం ప్రతిపాదించిన హరితనిధి కోసం కాంగ్రెస్‌ శాసనసభాపక్షం నుంచి కంట్రిబ్యూషన్‌ ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో అమాయక ప్రజల భూములు పోకూడదని.. సుమారు ఆరేడు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాల విషయంగా వెంటనే తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని.. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. దళితులకు ఇచ్చిన భూములను హరితహారం కోసం తీసుకోవద్దని డిమాండ్‌ చేశారు. కాగా.. బీజేపీ నేత రాజాసింగ్‌ మాట్లాడుతూ.. హరితనిధి ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేశారు. దీంతో భట్టి, రాజాసింగ్‌ ఇద్దరికీ సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement