సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ఆత్మరక్షణ ధోరణి కాకుండా ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, ఈ సమావేశాలే తెలంగాణ రెండో శాసనసభ (2018–23) చివరి భేటీ కానుంది. ఏడాది చివరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా విపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలు తిప్పి కొట్టడంతో పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటి నుంచి తమ ప్రభుత్వ విజయాలను గట్టిగా చాటి చెప్పాలని అధికార బీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో లోపాలు, తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సంభవించిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టం తదితర అంశాలను విపక్ష పారీ్టలు ఎత్తి చూపే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఇటీవలి కాలంలో ధరణి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్నాయి. అసెంబ్లీలోనూ ఇవే అంశాలు వివిధ రూపాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉండటంతో విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహంపై అధికార పక్షం కసరత్తు చేస్తోంది.
విమర్శలు తిప్పికొట్టేలా..
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అంశంపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలపై బీఆర్‌ఎస్ శ్రేణులు క్షేత్ర స్థాయిలో ఆందోళనకు దిగి పెద్దయెత్తున ఎదురుదాడి చేశాయి. దీంతో పాటు అసెంబ్లీ వేదికగా కూడా కాంగ్రెస్ ఆరోపణలను ఎండగట్టాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ అంశంపై స్వల్పకాలిక చర్చకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ధరణి పోర్టల్ అంశంపైనా విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా ప్రశ్నోత్తరాలు లేదా ఇతర అంశాల రూపంలో అధికార పార్టీ చర్చకు పెట్టే అవకాశముంది.
ఎన్నికల ఏడాది కావడంతో రాష్ట్ర అవతరణ మొదలుకుని తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల విజయాలను చాటి చెప్పేలా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే అంశాల వారీగా బాధ్యతలు అప్పగించడంతో పాటు చర్చలు, ప్రసంగాలు సన్నద్ధం కావాల్సిందిగా కోరుతూ బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం సమాచారం ఇచి్చంది. దీంతో తొమ్మిదేళ్లలో శాఖల వారీగా వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని వివరించేందుకు అవసరమైన సమాచార సేకరణపై ఇప్పటికే మంత్రులు దృష్టి సారించారు. మరోవైపు రాష్ట్రంలో తాజాగా జరిగిన వరద నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఖరారు చేసే ఎజెండాకు అనుగుణంగా వ్యూహాలకు పదును పెట్టాలని అధికార పార్టీ శిబిరం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment