జానాకు ఆ అర్హత ఎక్కడిది?
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డ సీఎల్పీ నేత కె.జానారెడ్డి వ్యాఖ్య లపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, సీఎల్పీ ఉప నాయకుడు జీవన్‌రెడ్డి మధ్య అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర చర్చ సాగింది. ‘‘అన్నా.. మీరు పార్టీ మారారంటే ఓ లెక్కుంది. పదవి వదులుకుని వెళ్లారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు కదా..’’ అని జూపల్లిని ఉద్దేశిస్తూ జీవన్‌రెడ్డి అన్నారు. అందుకు జూపల్లి బదులిస్తూ... ‘‘అసలు వాస్తవం మాట్లాడాలంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మాట్లాడే నైతిక అర్హత జానారెడ్డికి ఎక్కడిది? రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావు మంత్రివర్గంలో పనిచేసి, తీరా పదవులు పోతాయని తెలియగానే కాంగ్రెస్‌లో చేరలేదా..’’ అని అన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌లో మీలాంటి వారికి న్యాయం జరగలేదనే మా బాధ అని కాంగ్రెస్ మరో సభ్యుడు సంపత్ అనడంతో అంతా కలిసి నవ్వేసుకున్నారు.
ఇక్కడి దాకా లాక్కొచ్చాం..
బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన సీఎల్పీ నేత జానారెడ్డి తన సహజ ధోరణికి విరుద్ధంగా టీఆర్‌ఎస్ తీరుపై, పేరు పెట్టకుండానే సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జానా నుంచి ఇంతటి ఆగ్రహాన్ని ఊహించని పలువురు.. ‘మొత్తానికి భలే మాట్లాడారు..’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అన్నారు. దీంతో.. ‘‘నిన్నట్నుంచీ తయారు చేశాం. ఇక్కడిదాకా లాక్కొచ్చాం. ఏమైతేనేం విషయా న్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు’’ అని జీవన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
ఎంత మంది మిగిలారో లెక్కపెట్టుకోండి
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రి హరీశ్‌రావు మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడినట్లు స్పీకర్ ప్రకటించగానే... జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యేలంతా బయటకు వెళుతున్నారు. ఇదే సమయంలో వారికి మంత్రి హరీశ్ ఎదురుపడ్డారు. ‘‘అన్నా, ఎంత మంది మిగిలారో.. ఓసారి లెక్కపెట్టుకోండి..’ అని జానాను ఉద్దేశించి అనడంతో అంతా నవ్వుకున్నారు.
ఎర్రబెల్లిని అనుసరించని సొంత ఎమ్మెల్యేలు
సభ రెండుసార్లు వాయిదా పడిన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారకపోవడంతో స్పీకర్ పది మందిని సస్పెండ్ చేశారు. బయటకు రావడానికి నిరాకరించిన వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు ఎత్తుకొచ్చారు. సమావేశ మం దిరం నుంచి బయటకు వచ్చాక కూడా టీడీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ వదల్లేదు. ‘బయటకు వచ్చాక కూడా మీకేం సంబంధం’ అని ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, వెంకట వీరయ్య మార్షల్స్‌తో వాదనకు దిగారు. ఒకవైపు ఈ గలాటా జరుగుతుండగానే టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ఒక్కరే వెళ్లి స్పీకర్ కార్యాలయం ఎదుట కింద కూర్చుకున్నారు. ఎంతసేపటికీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన దగ్గరకు రాలేదు. ఈలోగా ఆరుగురు మార్షల్స్ వచ్చి ఆయను తీసుకెళ్లారు.
మార్షల్స్ హడావుడి
సభ జరగకుండా అడ్డుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారని ‘మార్షల్స్’ ముందే ఊహించినట్లు ఉంది. సభ రెండోసారి వాయిదా పడి తిరిగి ప్రారంభం కాగానే.. అసెంబ్లీ లాబీల్లో అక్కడక్కడ ఉన్న వారందరినీ అధికారులు ఒక్కచోటుకు చేర్చారు. చీఫ్ మార్షల్ గది వద్ద సిద్ధంగా ఉంచారు. అప్పటికప్పుడు వీరంతా మార్షల్ రిబ్బన్స్ కట్టుకుని.. కాసేపటికే టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు తీసుకు వచ్చారు.
- సాక్షి, హైదరాబాద్