
సభలో ఇదేనా మీ విజ్ఞత?
కవ్వించి అసెంబ్లీని అడ్డుకుంటారా?
విపక్షాల తీరుపై సీఎం కేసీఆర్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్, ఆత్మహత్యలు అన్నింటిపై చర్చించేందుకు మేం సిద్ధమేనని ముందే సభలో చెప్పాం. ప్రాధాన్యక్రమంలో ప్రజా సమస్యలపై కచ్చితంగా చర్చిద్దామన్నాం. సభను నలభై యాభై రోజులు జరుపుకొందామని అన్నాం. అయినా వినకపోతే ఎలా? ప్రశ్నోత్తరాలు జరక్కుండా అడ్డుకుంటే ఎలా? ఇదేనా మీ విజ్ఞత. కవ్వించి సభను అడ్డుకుంటారా? ఇదేం పద్ధతి.. కొత్త రాష్ట్రంలో తొలి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే వినాలన్న విజ్ఞత లేదు. సభను అడ్డుకోవడం విజ్ఞతే అనుకుంటే దాన్ని మీకే వదిలేస్తున్నా’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపక్షంపై మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు జరగకుండా, బడ్జెట్‌పై చర్చ ప్రారంభించేందుకు సహకరించకుండా పదే పదే అడ్డుపడిన కాంగ్రెస్, టీడీపీ సభ్యుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘సభ్యులను సస్పెండ్ చేయాలన్నది మా కోరిక కాదు.. మాకు బాధలేదా! తప్పనిసరి పరిస్థితుల్లోనే సభ్యులపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. ఆనవాయితీ ప్రకారం సాధారణ బడ్జెట్‌ను నిర్ణీత సమయంలో ఆమోదించడం రాజ్యాంగపరమైన విధి అని అన్నారు. బడ్జెట్‌పై చర్చను రెండు మూడు రోజుల్లో పూర్తి చేసుకున్న తర్వాత సమస్యలపై చర్చిద్దామని సూచించారు.
ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే ఆందోళన చేయాలి కానీ, చర్చకు తాము సిద్ధమని చెప్పినా కూడా సభను జరగనీయబోమనే ధోరణిలో వ్యవహరించడమేంటని విపక్షాలపై కేసీఆర్ మండిపడ్డారు. సభ్యులు వాయిదా తీర్మానాలు ఇవ్వొచ్చని, అయితే బిజినెస్ రూల్స్ ప్రకారం ప్రశ్నోత్తరాలు జరగాలని సూచించారు. ప్రతి సభ్యునికి మాట్లాడే అవకాశం వచ్చేలా చూడాలన్నారు. ప్రశ్నోత్తరాల్లోనూ ప్రధానమైన అంశాలు ఉన్నాయని, వాటిపై జీరో అవర్‌లో చర్చిద్దామంటే టీడీపీ సభ్యులకు అసలు ప్రశ్నోత్తరాలు జరగడమే ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తొలి ప్రశ్నే విద్యుత్‌పై ఉండటమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రానికి రావాల్సిన 1,186 మెగావాట్ల విద్యుత్‌ను ఇచ్చేందుకు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం నిరాకరిస్తున్నందున, ఆ ప్రశ్న చర్చకు రాకుండా టీడీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లాడిన అనంతరం సభలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది.