రెంటికీ చెడ్డ రైతు | Not forgive the debt, not new loans | Sakshi
Sakshi News home page

రెంటికీ చెడ్డ రైతు

Published Tue, Aug 19 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

రెంటికీ చెడ్డ రైతు

రెంటికీ చెడ్డ రైతు

  • రుణమాఫీ లేదు, కొత్త రుణాలు రావు
  •  ఐదు నెలల వరకూ బకాయిలు చెల్లించలేమని బ్యాంకులకు తేల్చిచెప్పిన  చంద్రబాబు
  •  30 కాలమ్స్‌లో రైతుల వివరాలు పంపాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు
  •  వివరాల సేకరణ పేరుతో నాన్చుడు ధోరణి
  •  బకాయిలు చెల్లిస్తేనే రుణాలంటున్న బ్యాంకులు
  •  కరువు మండలాలకే రీషెడ్యూల్
  •  ఆందోళనలో అన్నదాతలు
  • సాక్షి, నెల్లూరు:  రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయింది.  రుణాలు మాఫీకాకపోగా కొత్త రుణాలు వచ్చే పరిస్థితి లేదు. ఐదు నెలల వరకూ రైతుల బకాయిలను చెల్లించలేమని సీఎం చంద్రబాబు బ్యాంకులకు తేల్చి చెప్పారు. ఈలోపు బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల జాబితా అక్రమమా? సక్రమమా? అనేది తేల్చాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఇందుకోసం 30 కాలమ్స్ ఫార్మెట్‌ను ఉపయోగించాలని చంద్రబాబు ఆదేశాలతో కలెక్టర్లు, బ్యాంకు అధికారులు ఆ పనిలో పడ్డారు. నానా రకాల కొర్రీలు పెట్టి వీలైనంత వరకూ రైతుల బకాయిల జాబితా తగ్గించాలని సీఎం మౌఖిక ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంతో కలెక్టర్లు ఆ పనిలోనే ఉన్నట్టు తెలి సింది. ఇందులో భాగంగా సోమవారం కలెక్టర్ శ్రీకాంత్ జూబ్లీ సమావేశ మందిరంలో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు.

    ఈ నెల 28 నాటికి 30 అంశాల్లో ఫార్మెట్‌లో రైతుల ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్, రైతు ఫోన్ నంబర్, పాసు పుస్తకంతో పాటు పొలం సర్వేనంబర్ తదితర 30 వివరాలతో కూడిన జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు రెండునెలలకు పైగా పట్టే పరిస్థితి ఉంది. ఐదు నెలల కిందట ప్రారంభమైన ఆధార్ ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదని, ఈ లెక్కన 30 అంశాల ఫార్మెట్ సైతం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని అధికారులే పేర్కొనడం విశేషం.

    మరోవైపు ఐదు నెలల వరకూ బ్యాంకులకు రైతుల బకాయిలు చెల్లించే పరిస్థితి ఉండదని స్వయానా ముఖ్యమంత్రే చెప్పడంతో  ఇటు ఖరీఫ్,అటు రబీతో కలిపి ఈ ఏడాది మొత్తం రైతులకు తిరిగి రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండదని సోమవారం సమావేశంలో పాల్గొన్న బ్యాంకు అధికారులే స్పష్టం చేయడం విశేషం. మరోవైపు ఆర్‌బీఐ రీషెడ్యూల్ వీలుకాదని తేల్చిచెప్పడం తెలిసిందే. దీంతో అన్నదాతలు అబోదిబోమంటున్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలను తుంగలో తొక్కి రైతులను వంచిచడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
     ప్రజల నుంచి  వ్యతిరేకత రాకుండా...

    ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా సీఎం నానా ఫీట్లు వేస్తున్నారు. రూ.1.50 లక్ష రైతులకు, రూ.లక్ష వరకు డ్వాక్రా సంఘాల రుణాలు రద్దు చేస్తానని సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. అయినా ఇది అమలుకు నోచుకోవడం లేదు. తొలుత 80 వేల కోట్ల వరకు రైతురుణాలు మాఫీ చేస్తున్నట్టు బాబు చెప్పినా అది చివరకు రూ.30 వేల కోట్లకు కుదించారు. పోనీ అదైనా చేస్తాడని ఆశించిన వారికి నిరాశ ఎదురవుతోంది.

    మాఫీ నుంచి తప్పించుకునేందుకు బాబు నానా రకాల గారడీలకు దిగారు. ఇందులో భాగంగానే రైతుల వివరాల సేకరించాలని ఈ నెల 14న కలెక్టర్టను సీఎం ఆదేశించడం. అంతేకాదు ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 31ని అగ్రికల్చర్, కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్లు, జీఓ నంబర్ 164ను ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేశాయి. 30 కాలమ్స్‌లో వివరాలను 14 రోజుల్లో ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది.  జిల్లాలో ఇంకా 20 శాతం మందికి ఆధార్‌కార్డులు అందాల్సి ఉంది.
     
    అంత సులభం కాదు

    ఈ లెక్కన 30 కాలమ్స్ వివరాలు ప్రభుత్వానికి చేరడం ఆషామాషీ కాదు. మొత్తం వివరాలు అందిన వెంటనే వాటిలో నకిలీలు,పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఉంటే వారి వివరాలు,రెండు రేషన్ కార్డులుంటే వాటి వివరాలు ఇలా మొత్తాన్ని తేల్చి నానా రకాల కొర్రీలు పెడతారు. ఆ తర్వాత రుణమాఫీ జాబితాను ప్రభుత్వం బ్యాంకులకు అందచేయాలన్నదే ఉద్దేశం. ఈ మొత్తం తంతు పూర్తయ్యేలోపు పుణ్యకాలం కాస్తా ముగుస్తుంది. ఈ లోపు ప్రభుత్వం బ్యాంకులకు బకాయిలు చెల్లించదు. అలాగే బ్యాంకులు రైతులకు తిరిగి రుణాలు ఇవ్వవు.
     
    దీంతో రైతులు అటు ఖరీప్ ఇటు రబీ  మొత్తం ఏడాదంతా బ్యాంకు రుణాలు అందే పరిస్థితి లేకుండా పోతుంది. ప్రభుత్వం రైతుల బకాయిలను చెల్లించందే ఒక్కరూపాయి రుణం కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని సోమవారం కలెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన బ్యాంకు అధికారుల సమావేశంలో  వివిధ బ్యాంకుల అధికారులు స్పష్టం చేశారు. అలాగే  రైతులకు రీషెడ్యూల్ వర్తించే అవకాశం కూడా లేకుండా పోయింది. కేవలం  సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదై కరువు పరిస్థితులు నెలకొన్నపుడే రుణాల రీషెడ్యూల్ ఉంటుదని  రిజర్వ్‌బ్యాంకు స్పష్టంగా చెప్పింది.

    ఈ లెక్కన రాష్ట్రంలో  విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా,నెల్లూరు జిల్లాల్లో మాత్రమే 2013 ఖరీఫ్‌లో కరువు పరిస్థితులు నెలకున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఒక్క డక్కిలి, వెంకటగిరి మండలాల్లో మాత్రమే కరువు పరిస్థితి నెలకొంది. ఈ లెక్కన  కరువు మండలాల్లో మాత్రమే రుణాల రీషెడ్యూల్ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అదికూడా కేవలం పంటరుణాలు మాత్రమేనని, వాటిలో కూడా ఒక్కో రైతుకు రూ.లక్ష రుణం మాత్రమే ఇస్తామని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.

    ఈ లెక్కన ఈ ఏడాదంతా రైతులకు రుణాలు లేనట్లేనన్నది స్పష్టమౌతోంది. ఒక వేల రైతులే బకాయిలు చెల్లిస్తే వెంటనే రుణాలు ఇస్తామని వారు పేర్కొంటున్నారు. రుణమాఫీకి మెలిక పెట్టి బకాయిలు చెల్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పట్లో అంగీకరించే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలహామీని తుంగలో తొక్కి తమను వంచించిన చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement