
మాఫీపై తర్వాత చెప్తాం!
కొత్త రుణాలివ్వండని బ్యాంకర్లను కోరనున్న బాబు
నేడు బ్యాంకర్ల కమిటీతో ఆంధ్రప్రదేశ్ సీఎం భేటీ
గత ఏడాది రైతులకు ఇచ్చిన రుణాల గడువు నేటితో పూర్తి
బాబు స్పష్టత ఇస్తేనే.. రైతులకు కొత్త రుణాల చాన్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణాల మాఫీకి ఇచ్చిన హామీపై చంద్రబాబు ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోగా.. గత ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇచ్చిన వ్యవసాయ రుణాలు తీర్చడానికి గడువు సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేసి.. ఈ ఏడాది రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రైతు రుణ మాఫీపై కోటయ్య కమిటీ చర్చిస్తోందని.. మాఫీ ఎంత, ఎలా, ఎప్పుడు అనే అంశాలను త్వరలో తెలియజేస్తామని బ్యాంకర్లకు బాబు నివేదిస్తారని సమాచారం. అయి తే.. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. రుణమాఫీపై ఏర్పాటైన కోటయ్య కమిటీ కూడా ఇప్పటికే కేంద్ర రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)ని కోరినా.. అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదు. గత ఖరీఫ్, రబీల్లో కరువు, తుపానుల కారణంగా పంటలు దెబ్బతిన్న మండలాల్లో రైతుల రుణాలను రీషెడ్యూలు చేయాలన్న సర్కారు విజ్ఞప్తికి ఆర్‌బీఐ అంగీకరించినప్పటికీ.. అది కేవలం రూ. 12,000 కోట్లకు మాత్రమే వర్తిస్తుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. మిగతా మండలాలకు చెందిన రైతుల రుణాలు రూ. 13,000 కోట్లకు, బంగారం కుదువపెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలు రీషెడ్యూల్ పరిధిలోకి రావని ఆ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ అంశాలన్నిటిపై సీఎం చంద్రబాబు ఇచ్చే స్పష్టతపైనే.. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు కొత్త రుణాల మంజూరు ఆధారపడి ఉంటుందని బ్యాంకర్ల కమిటీ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో తొలి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సోమవారం జరగనుంది. చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
రీషెడ్యూల్ చేస్తే రూ. 12,000 కోట్లకే..!
గత ఖరీఫ్, రబీల్లో తుపాను, కరువుల కారణంగా 575 మండలాల్లో పంటలు కోల్పోయినట్లు ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటించడంతో ఆర్‌బీఐ అప్పట్లో ఆ రైతుల రుణాల రీషెడ్యూల్‌కు అనుమతించలేదు. ఇప్పుడు ఆ రుణాలను రీషెడ్యూల్‌కు అనుమతించాలని ఆర్‌బీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినా ఇప్పటి వరకు ఆర్‌బీఐ నుంచి స్పందన లేదు. ఒకవేళ ఆ 575 మండలాల్లో రైతుల రుణాల రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ అనుమతించిన పక్షంలో రూ. 12,000 కోట్ల నుంచి రూ. 13,000 కోట్ల లోపు రుణాలు రీషెడ్యూల్ అవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో రూ. 13,000 కోట్ల పంట రుణాలు రీషెడ్యూల్ పరిధిలోకి రావని తెలిపాయి. ఇవికాక మరో రూ. 35,000 కోట్లు బంగారం కుదవ పెట్టి వ్యవసాయానికి రుణాలు తీసుకున్నారని.. వీటికి కూడా రీషెడ్యూల్ వర్తించదని ఆ వర్గాలు స్పష్టంచేశాయి. మొత్తం రూ. 48 కోట్ల వరకూ రైతు రుణాలకు రీషెడ్యూల్ వర్తించదని వివరించాయి. వీటన్నింటిపైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే స్పష్టతపైనే ఖరీఫ్‌లో రైతులకు బ్యాంకులు రుణాల మంజూరు ఆధారపడి ఉంటుందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఇక మహిళా సంఘాల రుణాల మాఫీ అంశం ఇప్పుడు ప్రాధాన్యత కాదని.. రైతుల రుణ మాఫీ అంశం ఒక కొలిక్కి వచ్చిన తరువాతనే మహిళా సంఘాల రుణాల గురించి ఆలోచిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలావుంటే.. తొలి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికను రూ. 70,000 కోట్లుగా ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇందులో కేవలం వ్యవసాయ రంగానికి రూ. 46,000 కోట్ల రుణ ప్రణాళిక ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి