పంట రుణాలను మాఫీ చేయకుండా వేధిస్తున్న సీఎం కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలను మాఫీ చేయకుండా వేధిస్తున్న సీఎం కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రాష్ట్రమే ముందుండటం బాధాకరమన్నారు. మాఫీ వడ్డీకే సరిపోతోందని, రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడంలేదని చెప్పారు.
మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇవ్వలేమని క్షమాపణ కోరిన సీఎం.. రుణమాఫీ చేయనందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. సీఎం దగ్గర ఉన్న 4,700 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులను రుణమాఫీ కోసం విడుదల చేయాలని కోరారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు.