పనుల కోసమే సీఎంను కలిశా..
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్కు నాయకత్వ కొరత ఏమీలేదని ఆపార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఒకరు పార్టీని వీడితే వందమంది నేతలు తయారవుతారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఉద్యమ పార్టీగా ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారని, అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పనులు జరుగుతాయనే నాయకులు.. అధికారపార్టీలో చేరుతున్నారని కోమటిరెడ్డి అన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో సాగునీటి సదస్సులో పాల్గొన్నానని, పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ను కోరినట్లు చెప్పారు. శ్రీశైలం సొరంగ మార్గం, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి పూర్తిగా నిధులు కేటాయించాలని కోరామన్నారు. అంతేకానీ తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు.