![పెండింగ్ ప్రాజెక్టులను మొదట పూర్తిచేయాలి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71433632486_625x300.jpg.webp?itok=5JQ0e4Xq)
పెండింగ్ ప్రాజెక్టులను మొదట పూర్తిచేయాలి
ముఖ్యమంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి
♦ నల్లగొండకు మంచినీరు ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు
సాక్షి,హైదరాబాద్ : రాష్ర్టంలో ఇప్పటికే 60, 70 శాతం నిర్మాణం జరిగిన నీటిపారుదల ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తిచేసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
నల్లగొండ జిల్లాలోని సొరంగం పనులు, ఇతర ప్రాజెక్టులు, కల్వకుర్తి, నెట్టంపాడు వంటి ప్రాజెక్టుల పనులు 60 శాతానికి పైగా పూర్తయినందున ముందుగా వాటిని పూర్తిచేయాలని కోరినట్లు చెప్పారు. ఉదయసముద్రం ప్రాజెక్టు నుంచి పూణే కాంట్రాక్టర్లు వైదొలగుతున్నట్లు తెలిసి ఇంజనీర్-ఇన్-చీఫ్‌కు ఫోన్ చేయగా, శనివారం నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష ఉందని చెప్పారన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌ను సంప్రదించి క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన సమీక్ష సందర్భంగా ప్రాధాన్యతా క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టాలని విజ్ఞప్తిచేసినట్లు ఆయన వెల్లడించారు.
2019లో మాదే అధికారం...
శనివారం అసెంబ్లీ ఆవరణలో కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడిన నేపథ్యంలో పానగల్లు నుంచి నీటిని అందించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించి దానిపై అధికారులను ఆదేశించారని తెలిపారు. నల్లగొండ జిల్లాకు నీళ్లు ఇచ్చినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్‌ఎస్‌లో పలువురు నాయకులు చేరుతున్నట్లు, ఆ పార్టీ ప్రముఖులను కాంగ్రెస్‌నాయకులు కలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు, కిందిస్థాయిలో ఏవో పనుల కోసం అధికారపార్టీలో చేరుతుంటారని కోమటిరెడ్డి బదులిచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు.