సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ దొరలాగా పోలీసులను నమ్ముకొని బతుకుతుంటే...తాను దమ్మున్న గుండెని, ప్రజలను నమ్ముకున్నానని ఆయన అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ....‘నాకు గన్‌మెన్‌లను తీసివేసి నన్ను హత్య చేయించాలని చూస్తున్నావా?. నాకు ఏమైనా జరిగితే కేసీఆర్‌తో పాటు ప్రభుత్వమే బాధ‍్యత వహించాలి. చావుకు భయపడే వ్యక్తిని కాదు. నేను చనిపోతే నా కొడుకు దగ్గరకు వెళతాను అంతే. ఇక బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో కాల్ డేటాలో 26సార్లు మాట్లాడినవారిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. నాలాంటి వాళ్లను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు. నీలాంటి పిరికిపందలాగా ఆస్పత్రిలో పోరాటం చేయలేదు. రోడ‍్డుమీద నిరాహార దీక్ష చేశాను. కోమాలోకి పోతానని తెలిసి కూడా భయపడకుండా దీక్ష చేశాను.
కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారు. అకారణంగా మా సభ్యత్వం రద్దు చేశారు. స్వామిగౌడ్‌పై దాడి చేసినందుకు మా సభ్యత్వం రద్దు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా, ఎప్పుడు ఇలా ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయడం జరగలేదు. కానీ కోర్టులో మాత్రం ప్లేట్ ఫిరాయించారు.గతంలో హరీశ్ రావు గవర్నర్ మీద దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ ...అందరినీ పిలిపించి మాట్లాడి.. వారం పాటు సస్పెండ్ చేశారు. ఇప్పటి ప్రభుత్వం మాత్రం నిబంధనలు అనుసరించకుండా నా అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం స్వామిగౌడ్‌కు మైక్ తగిలినందుకు కాదు, గవర్నర్ అడ్రస్‌ను అడ్డుకున్నందుకు ...మా సభ్యత్వం రద్దు చేశామని చెబుతున్నారు. నాకున్న నలుగురు గన్‌మెన్‌లను తీసివేశారు. పీఏని ఉపసంహరించారు. కావాలనే పాత కేసులను రీ ఓపెన్ చేయించి అరెస్ట్ వారెంట్ జారీ చేశారని తెలిసింది.’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment