కొత్త రుణాలు కష్టమే!
* రుణాల రీ-షెడ్యూల్‌తో తీవ్ర నగదు కొరత
* గతేడాది రుణాల మొత్తం రూ. 7,600 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాలు రీ-షెడ్యూల్ అయినప్పటికీ కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రధానంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల ద్వారా రీ-షెడ్యూల్ తర్వాత కొత్త రుణాలు అందే పరిస్థితి లేదు. ఇందుకు అవసరమయ్యే మొత్తాన్ని పీఏసీఎస్, ఆర్‌ఆర్‌బీలకు అందించలేమని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకేసారి మొత్తం నగదు చెల్లిస్తే తప్ప రుణ మాఫీకి రిజర్వ్ బ్యాంకు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రుణాలను రీ-షెడ్యూల్ చేసి కొత్త రుణాలు అందించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆర్‌బీఐని కోరుతున్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో ఇరు ప్రాంతాల రైతులకు పరపతి సంఘాలు, గ్రామీణ బ్యాంకుల నుంచి రూ. 7,600 కోట్ల పంట రుణాలు అందాయి. ఇప్పుడు ఇరు రాష్ట్రాలూ రుణ మాఫీ ప్రకటన చేయడంతో రైతులు బకాయిలు చెల్లించడం లేదు. దీంతో కొత్త రుణాల మంజూరుకు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి సహకరించే పరిస్థితి లేదని నాబార్డు సీజీఎం మమ్మెన్ తెలిపారు. ‘ రీ-షెడ్యూల్‌తో స్వల్పకాలిక రుణాలు కాస్తా మధ్యకాలిక రుణాలుగా మారతాయి. రూ. 7,600 కోట్లలో నాబార్డు వాటా 60 శాతం అంటే రూ. 4,560 కోట్లు. ఈ మొత్తం రైతుల నుంచి తిరిగి రాకపోతే కొత్త రుణాల కోసం పీఏసీఎస్, ఆర్‌ఆర్‌బీలకు నాబార్డు నుంచి నిధులు అందించే పరిస్థితి ఉండదు’ అని ఆయన వివరించారు.
రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్‌బీఐ ఓకే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంగీకరించింది. ఈ మేరకు సోమవారం నాడు రిజర్వ్‌బ్యాంకు రీ షెడ్యూల్‌కు సంబంధించి విధివిధానాలను కూడా ప్రకటించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఏపీలోని 13 జిల్లాలకు సంబంధించి రీషెడ్యూల్ మొత్తం సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వమే మాఫీ చేస్తే మంచిది
వరదలు,కరువు వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిందేనని.. రుణమాఫీని ప్రభుత్వమే నేరుగా చేస్తే బాగుంటుందని నాబార్డు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయ సీజీఎంజీజీ మమ్మెన్ అభిప్రాయపడ్డారు. రుణమాఫీ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. నాబార్డు 33వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.అవి..
- ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా గోదాముల నిర్మాణానికి రుణాలిస్తాం.
- రెండురాష్ట్రాల్లోని 257 మార్కెట్ కమిటీలకు నేరుగా రూ. 500 కోట్ల రుణాలను ఇవ్వనున్నాం. మార్కెట్ కమిటీలను కూడా గుర్తించాం. ఇందులో రూ.300 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు, రూ.200 కోట్లు తెలంగాణలోని మార్కెట్ కమిటీలకు ఇచ్చే అవకాశం ఉంది.
ఈ ఏడాదిలో మొత్తం రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 17,500 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.
- రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు కలిపి ప్రాంతీయ కార్యాలయం ఇక్కడే ఉంది. కొత్త రాజధాని ఏర్పాటైన తర్వాత అక్కడ నాబార్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.