రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల వేలం ద్వారా తెచ్చిన రుణాల తిరిగి చెల్లింపుపై రిజర్వుబ్యాంకు స్పష్టత
వచ్చే నాలుగేళ్లలో రూ.60 వేల కోట్లకుపైగా విలువైన బాండ్లకు ముగియనున్న కాలపరిమితి
సెక్యూరిటీ బాండ్లపై నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ
కేంద్రం, సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలకు చెల్లింపులు అదనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా తెచ్చుకున్న అప్పుల తిరిగి చెల్లింపుపై రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పష్టతనిచ్చింది. 2015 జనవరి 1వ తేదీ నుంచి 2025 జనవరి 15వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం రూ.3,49,137 కోట్లను బాండ్ల వేలం ద్వారా తీసుకున్నట్టు వెల్లడించింది. గరిష్టంగా 45 ఏళ్ల కాలపరిమితితో ఈ నిధులు సమీకరించారని.. అంటే 2060 నాటికి ఈ అప్పులన్నింటినీ తీర్చాల్సి ఉంటుందని తాజాగా విడుదల చేసిన ‘ఔట్ స్టాండింగ్ స్టేట్ గవర్నమెంట్స్ సెక్యూరిటీస్’నివేదికలో తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు చేసిన అప్పుల లెక్కలను అందులో వెల్లడించింది. తెలంగాణ వచ్చే నాలుగేళ్లలో రూ.60.947.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది.
ఈ ఏడాది రూ.17 వేల కోట్ల పైమాటే..
రాష్ట్రం బాండ్ల వేలం ద్వారా సేకరించిన రుణాలను ఏ సంవత్సరంలో ఎంత తీర్చాల్సి ఉంటుందో ఆర్‌బీఐ తాజా నివేదికలో వెల్లడించింది. దాని ప్రకారం 2025లో రూ.17,150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది. 2026లో రూ.20వేల కోట్లను అప్పులకు అసలు, వడ్డీ కింద చెల్లించాలి. మొత్తమ్మీద వచ్చే నాలుగేళ్లలో రూ.60 వేల కోట్లకు పైగా చెల్లించాలి. ఇవి రిజర్వు బ్యాంకు ద్వారా బహిరంగ మార్కెట్‌లో తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ మాత్రమేనని.. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు అదనమని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
గడువు తీరిన నాటి నుంచి..
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రూపాల్లో అప్పులు తీసుకుంటుంది. అందులో ప్రధానమైనవి ఆర్బీఐ ద్వారా సేకరించే రుణాలు. ఆర్థిక శాఖ వర్గాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉండే సెక్యూరిటీ బాండ్లను ఆర్బీఐ వేదికగా బహిరంగ మార్కెట్‌లో వేలానికి పెట్టి ఈ నిధులను సమకూర్చుకుంటుంది. ఇన్ని కోట్ల విలువైన బాండ్లను వేలం వేస్తున్నామని, ఇన్ని సంవత్సరాల కాలపరిమితిలో, ఇంత వడ్డీ చెల్లించి రుణం తీరుస్తామని ఆర్బీఐకి ఇండెంట్ పెడుతుంది. ఆర్బీఐ వేలంలో పాల్గొన్న సంస్థలు.. ఆ బాండ్లను స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బాండ్ల కాలపరిమితి ముగిసిన కొద్దీ అసలు, వడ్డీ కలిపి చెల్లించి బాండ్లను విడిపించుకుంటాయి. మళ్లీ అవసరాన్ని బట్టి అవే బాండ్లను వేలానికి పెట్టి నిధులు తెచ్చుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment