వాగ్దానం మాఫీ
- రుణాల రద్దు కష్టమని తేల్చి చెప్పిన ప్రభుత్వం
- రూ.1050 కోట్లు మాఫీ లేనట్టే!
- 20 శాతం మందికే రీషెడ్యూల్
- ఆందోళనలో జిల్లా రైతాంగం
ఊహించినట్టే జరిగింది. తప్పుడు హామీలతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం మాట మార్చింది. రుణ మాఫీ సాధ్యం కాదని చెప్పకనే చెప్పింది. రుణాల రీషెడ్యూల్‌తో చేతులు దులుపుకోవాలని చూస్తోంది. ఇందులోనూ షరతులు, ఆంక్షలంటూ వీలైనంత తక్కువ మందికి వర్తింప చేయాలని యోచిస్తోంది.
విశాఖ రూరల్: రుణమాఫీపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. గతేడాది వరదలు, కరువు మండలాల్లోని రైతులకు మాత్రమే రీషెడ్యూల్ అంటూ ప్రకటించింది. ఈ నిర్ణయం జిల్లా రైతులకు అశనిపాతమే. కనీసం 20 శాతం మందికి కూడా రీషెడ్యూల్ అమలుకాదు. ఖరీఫ్ ప్రారంభమై నారుపోతలు పూర్తయ్యాయి.. ఇప్పటికీ కొత్త రుణాలు లేవు. రుణ మాఫీ ఆశతో అన్నదాతలు ప్రైవేటు ఫైనాన్సర్ల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగు పనులు ప్రారంభించారు. తీరా ఇప్పుడు రుణాల రద్దు కష్టమని సాక్షాత్తూ సీఎం ప్రకటించడంతోదిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు.
రూ.1050 కోట్లు రుణాలు మాఫీ లేనట్టే! : గత ఖరీఫ్‌లో జిల్లాలో 1,32,375 మంది రైతులకు రూ.640 కోట్లు రుణాలు అందజేశారు. అలాగే రబీలో 14,548 మంది రైతులకు రూ.104 కోట్లు అప్పులిచ్చారు. గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హతకార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1లు మాత్రమే పంట రుణాలు కింద ఇచ్చారు. పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. దీంతో పాటు లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు 11.73 కోట్లు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చారు. వీటితో పాటు రూ.150 కోట్లు వరకు బంగారంపై రుణాలు అందించారు. రుణ మాఫీ జరిగితే అన్ని రకాల రుణాలు కలిపి మొత్తం రూ.1050 కోట్లు రద్దవుతాయని రైతులు భావించారు.
20 శాతం మందికే రీషెడ్యూల్! : జిల్లాలో గతేడాది వర్షాభావం కారణంగా 30 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ప్రభుత్వం ఒక మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. దీని ప్రకారం ఒక్క రైతుకు కూడా రీషెడ్యూల్ వర్తించే అవకాశం లేదు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో అల్పపీడనం, తుపాను కారణంగా భారీగా పంటలు నీటమునిగాయి. జిల్లాలో 34 మండలాల్లో మొత్తంగా 52,426 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
ప్రభుత్వం నిర్ణయం ప్రకారం వీరికి మాత్రమే రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశముంది. వీరిలో కూడా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రుణాలు పొంది ఉంటే వారికి కూడా రీషెడ్యూల్ వర్తించదు. అలాగే బంగారంపై రుణాలు పొందిన వారు 50 శాతానికి పైనే ఉన్నారు. దీని ప్రకారం జిల్లాలో 20 శాతం మంది రైతులకు కూడా రుణాలు రీషెడ్యూల్ జరిగే అవకాశం కనిపించడం లేదు. రీషెడ్యూలైన రైతులకు కూడా వడ్డీ భారం పడనుంది.
కొత్త రుణాలు కష్టమే.. : జిల్లాలో 2,27,400 హెక్టార్లలో పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్దేశించారు. జిల్లాలో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు, రెన్యువల్స్‌గా 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలే దని అధికారులు చెబుతున్నారు.