సూక్ష్మ రుణ సంస్థలు (MFI) ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు వీలుగా ప్రత్యేకమైన నిధి ఏర్పాటుతోపాటు ప్రభుత్వం నుంచి సహకారం అవసరమని ఈ రంగం స్పష్టం చేసింది. పేదల రుణ అవసరాలను తీర్చడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న సూక్ష్మ రుణ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను అర్థం చేసుకునేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నాగరాజు ఒక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం సా–ధన్ ఈడీ, సీఈవో జిజి మామెన్ మీడియాతో మాట్లాడారు. అనియంత్రిత సంస్థలను ఏరిపారేయాలని, అలాంటి సంస్థలు అనుసరిస్తున్న దారుణమైన రుణ వసూళ్ల విధానాలకు చెక్ పెట్టాలని సూచించినట్టు చెప్పారు. రుణాలకు ఆధార్‌ను తప్పనిసరి డాక్యుమెంట్‌గా చేయాలని కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం ఎంఎఫ్‌ఐలు రుణ గ్రహీతల నుంచి ఆధార్ తీసుకునేందుకు అనుమతి లేదు. పరిశ్రమకు ప్రత్యేకమైన నిధుల యంత్రాంగం ఉండాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. కరోనా సమయంలో రూ.25,000 కోట్లతో ఆర్‌బీఐ ప్రత్యేక విండో ప్రారంభించడాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. క్రెడిట్ గ్యారంటీని కూడా పరిశీలించాలని కోరినట్టు చెప్పారు.
పెరిగిపోయిన మొండి బకాయిలు
మొండి పద్దులు పెరిగిపోతుండడంతో ఎంఎఫ్‌ఐలు అప్రమత్త ధోరణితో వ్యవహరిస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ త్రైమాసికం చివరికి సూక్ష్మ రుణ రంగంలో రుణాల అవుట్ స్టాండింగ్ (తిరిగి రావాల్సిన మొత్తం/నికర రుణ పోర్ట్‌ఫోలియో) 4.3 శాతానికి (రూ.4.14 లక్షల కోట్లు) తగ్గినట్టు క్రెడిట్ సమాచార సంస్థ ‘క్రిఫ్ హై మార్క్’ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో మొండి బకాయిలు పెరిగిపోయినట్టు తెలిపింది.
‘‘1–30 రోజుల వరకు చెల్లింపులు చేయని రుణాలు జూన్ త్రైమాసికం చివరికి 1.2 శాతంగా ఉంటే, సెప్టెంబర్ చివరికి 2.1 శాతానికి పెరిగాయి. 31–180 రోజుల వరకు చెల్లింపులు చేయని రుణాలు ఇదే కాలంలో 2.7 శాతం నుంచి 4.3 శాతానికి ఎగిశాయి’’అని వెల్లడించింది. బీహార్, తమిళనాడు, యూపీ, ఒడిశా రాష్ట్రాల్లో సూక్ష్మ రుణాల చెల్లింపుల నిలిపివేతలు ఎక్కువగా ఉన్నట్టు, పెరిగిన వసూలు కాని రుణాల్లో మూడింట రెండొంతులు ఈ రాష్ట్రాల నుంచే ఉన్నట్టు తెలిపింది. ఒకే రుణ గ్రహీత మూడు లేదా అంతకంటే ఎక్కువ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం తగ్గడాన్ని సానుకూలతగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment