రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశం మంగళవారం (ఫిబ్రవరి 6) జరగబోతోంది. మధ్యంతర బడ్జెట్ ముగిసిన వెంటనే ఈ మీటింగ్ జరగుతోంది. ఇందులో ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుంది.. ప్రతి నెలా తాము చెల్లిస్తున్న లోన్ ఈఎంఐ (EMI)లు ఏమైనా తగ్గుతాయా అని దేశవ్యాప్తంగా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు ఈ మీటింగ్ జరుగుతుంది. ఇందులో తీసుకున్న రేట్ల నిర్ణయాన్ని ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు.
మళ్లీ యథాతథమే!
ఆర్‌బీఐ ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష సమావేశంలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, గత రేటు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. రెపో రేటు అనేది ఆర్‌బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. గత డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో ఆర్‌బీఐ పాలసీ రెపో రేటును 6.5 శాతం యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.
తగ్గింపు అప్పుడే..
రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి రెపో రేటు తగ్గింపు వచ్చే జూన్‌లో ఉండవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌బీఐ చివరిసారిగా రెపో రేటును మార్చి వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగినా రెపో రేట్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment