Micro Finance Institutions
-
ఎంఎఫ్ఐలకు ఆర్థిక సహకారం అవసరం
సూక్ష్మ రుణ సంస్థలు (MFI) ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు వీలుగా ప్రత్యేకమైన నిధి ఏర్పాటుతోపాటు ప్రభుత్వం నుంచి సహకారం అవసరమని ఈ రంగం స్పష్టం చేసింది. పేదల రుణ అవసరాలను తీర్చడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న సూక్ష్మ రుణ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను అర్థం చేసుకునేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నాగరాజు ఒక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశం అనంతరం సా–ధన్ ఈడీ, సీఈవో జిజి మామెన్ మీడియాతో మాట్లాడారు. అనియంత్రిత సంస్థలను ఏరిపారేయాలని, అలాంటి సంస్థలు అనుసరిస్తున్న దారుణమైన రుణ వసూళ్ల విధానాలకు చెక్ పెట్టాలని సూచించినట్టు చెప్పారు. రుణాలకు ఆధార్‌ను తప్పనిసరి డాక్యుమెంట్‌గా చేయాలని కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం ఎంఎఫ్ఐలు రుణ గ్రహీతల నుంచి ఆధార్ తీసుకునేందుకు అనుమతి లేదు. పరిశ్రమకు ప్రత్యేకమైన నిధుల యంత్రాంగం ఉండాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. కరోనా సమయంలో రూ.25,000 కోట్లతో ఆర్బీఐ ప్రత్యేక విండో ప్రారంభించడాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. క్రెడిట్ గ్యారంటీని కూడా పరిశీలించాలని కోరినట్టు చెప్పారు. పెరిగిపోయిన మొండి బకాయిలు మొండి పద్దులు పెరిగిపోతుండడంతో ఎంఎఫ్ఐలు అప్రమత్త ధోరణితో వ్యవహరిస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ త్రైమాసికం చివరికి సూక్ష్మ రుణ రంగంలో రుణాల అవుట్ స్టాండింగ్ (తిరిగి రావాల్సిన మొత్తం/నికర రుణ పోర్ట్‌ఫోలియో) 4.3 శాతానికి (రూ.4.14 లక్షల కోట్లు) తగ్గినట్టు క్రెడిట్ సమాచార సంస్థ ‘క్రిఫ్ హై మార్క్’ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో మొండి బకాయిలు పెరిగిపోయినట్టు తెలిపింది.‘‘1–30 రోజుల వరకు చెల్లింపులు చేయని రుణాలు జూన్ త్రైమాసికం చివరికి 1.2 శాతంగా ఉంటే, సెప్టెంబర్ చివరికి 2.1 శాతానికి పెరిగాయి. 31–180 రోజుల వరకు చెల్లింపులు చేయని రుణాలు ఇదే కాలంలో 2.7 శాతం నుంచి 4.3 శాతానికి ఎగిశాయి’’అని వెల్లడించింది. బీహార్, తమిళనాడు, యూపీ, ఒడిశా రాష్ట్రాల్లో సూక్ష్మ రుణాల చెల్లింపుల నిలిపివేతలు ఎక్కువగా ఉన్నట్టు, పెరిగిన వసూలు కాని రుణాల్లో మూడింట రెండొంతులు ఈ రాష్ట్రాల నుంచే ఉన్నట్టు తెలిపింది. ఒకే రుణ గ్రహీత మూడు లేదా అంతకంటే ఎక్కువ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం తగ్గడాన్ని సానుకూలతగా పేర్కొంది. -
మళ్లీ ‘మైక్రో’ పడగ!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ జిల్లాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్లీ పడగ విప్పుతున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి, అధిక వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. పెద్ద నగరాలు, పట్టణాలు, సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్రాంచీలు తెరిచాయి. పేదలు, మధ్య తరగతి వారి ఆర్థిక అవసరాలు, బలహీనతలను ఆసరాగా తీసుకుని వ్యాపారం చేస్తున్నాయి. మహిళలే టార్గెట్‌గా, వారిని గ్రూపులుగా చేసి అప్పులు ఇస్తున్నాయి. ఒకరు కట్టకుంటే మిగతా వారంతా కలసి కట్టాలనే నిబంధనలు పెడుతూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఒకవేళ వాయిదాలు కట్టలేకపోతే... ‘చస్తే చావండి.. డబ్బులు మాత్రం కట్టండి’ అంటూ తీవ్రంగా వేధింపులకు దిగుతున్నాయి. ఈ మైక్రో ఫైనాన్స్‌ల వలలో చిక్కి వేలాది కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. సంపాదించే కాసింత కూడా వడ్డీలకే సరిపోవడం లేదంటూ.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. రిజర్వు బ్యాంకు నిబంధనలు అంటూ... మైక్రో ఫైనాన్స్ సంస్థలు పది నుంచి ఇరవై మంది వరకు మహిళలను గ్రూపుగా చేసి.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆధార్‌కార్డు, పాన్‌కార్డు జిరాక్స్‌లు తీసుకుని రుణాలు ఇస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకులుగా రిజిస్టర్ చేయించుకుని చట్టబద్ధంగానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా రికార్డుల్లో చూపుతున్నాయి. వివిధ పేర్లతో ముందుగానే కోతలు పెడుతున్నాయి. అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు గ్రూపులో ఒక్కో మహిళకు రూ.30వేల చొప్పున అప్పుగా ఇస్తారు. ఇందులోనూ బీమా, ప్రాసెసింగ్ ఫీజు పేరిట రూ.2 వేలు ముందే కోతపెట్టి.. రూ.28 వేలు మాత్రమే మహిళల చేతికి ఇస్తారు. ఈ అసలు, వడ్డీ కలిపి వారానికి రూ.800 చొప్పున ఏడాది పాటు చెల్లించాలి. అంటే రూ.28 వేలకుగాను.. మొత్తంగా రూ.44,800 కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ఏ వారమైనా వాయిదా సమయానికి చెల్లించకుంటే.. అదనంగా రూ.100 జరిమానా కింద వసూలు చేస్తారు. అసలు లక్ష్యం పక్కదారి పట్టి.. స్పందన, కీర్తన, ఫిన్‌కేర్, ఒరిగో, సౌత్ ఇండియా, అన్నపూర్ణ, యాక్సిస్, పిరమిల్, ఐ రిఫ్, క్రిస్, బంధన్, ఎపాక్, హోమ్ లోన్స్ ఫైనాన్స్, వెరిటాస్ మైక్రో ఫైనాన్స్, ప్యూజియన్ బ్యాంకు, ఆశీర్వాద్ బ్యాంకు, ఎఫ్‌ఎఫ్‌ఎల్, ఫెడరల్ బ్యాంకు వంటి సంస్థలు మైక్రో ఫైనాన్స్ చేస్తున్నాయి. వాస్తవానికి పేదలకు తక్కువ మొత్తంలో రుణాలు సులువుగా అందించడం, ఆర్థిక చేయూత ద్వారా పేదరికాన్ని తగ్గించడం లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ వ్యవస్థల లక్ష్యం. సూక్ష్మరుణాల ద్వారా వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి, విస్తరించడానికి తోడ్పడాలి. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. పోటాపోటీగా పాగా.. అడ్డగోలు వడ్డీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన టాప్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు తెలంగాణలోనూ పాగా వేశాయి. అవి రూ.8 వేల నుంచి రూ.50 వేల వరకు మహిళలకు రుణాలు ఇస్తున్నాయి. రుణాలు ఇచ్చే సమయంలోనే కాల పరిమితిని బట్టి 36 శాతం వరకు వడ్డీ పడుతుందని ఒప్పంద పత్రంలోనే పేర్కొంటున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కోరకంగా డాక్యుమెంట్, ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, బీమా వంటివాటి పేరిట రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు రుణంలో ముందే కోతపెడుతున్నాయి. అన్నీ కలిపి లెక్కేస్తే.. పేరుకు 36 శాతం అయినా, 50శాతం దాకా వడ్డీ పడుతున్న పరిస్థితి. పేదలు ఈ వడ్డీల భారం భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆవేదనతో ప్రాణాలు తీసుకోవడానికీ ప్రయత్నిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకే అంటూ.. 2008లోనూ ఇలాగే మైక్రో ఫైనాన్స్ వేధింపులు పెరిగిపోవడంతో.. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కఠిన చర్యలు చేపట్టారు. మైక్రో ఫైనాన్స్ వసూళ్లపై కొంతకాలం మారటోరియం విధించారు. ఈ సమస్య పరిష్కారం కోసం 2010 అక్టోబర్ 14న ఒక ఆర్డినెన్స్ తెచ్చేందుకు నాటి ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేధింపులకు పాల్పడే మైక్రో ఫైనాన్స్ నిర్వహకులకు కనీసం మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించాలని.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయితే ఇప్పుడు రూటు మార్చిన మైక్రో ఫైనాన్స్ సంస్థలు బ్యాంకుల పేరిట ఆర్బీఐ నిబంధనలంటూ దందాకు శ్రీకారం చుట్టాయి. సంపాదన.. అప్పు, వడ్డీ కిందకే పోతోంది చిన్న వ్యాపారానికి పెట్టుబడి కోసం మైక్రో ఫైనాన్స్‌లో రూ.85 వేల రుణం తీసుకున్నాం. వారానికి రూ.1,400 చొప్పున 90 వారాలు చెల్లించాలి. రోజూ గిన్నెలు విక్రయించగా వచ్చే మొత్తంలో కొంత ఇంటి అవసరాలకుపోగా మిగతా అంతా ఫైనాన్స్‌కు చెల్లిస్తున్నా. ఒక్కోసారి వ్యాపారం సాగకపోయినా వాయిదా మాత్రం చెల్లించాల్సి వస్తోంది. ఏ మాత్రం ఆలస్యమైనా జమానత్ ఉన్నవారిపై ఒత్తిడి తెస్తున్నారు. 20 ఏళ్ల నుంచి చేస్తున్న ఈ చిన్నపాటి వ్యాపారంతో సంపాదించిందంతా అప్పు, వడ్డీకే పోతోంది. – బానాల శంకర్, కమ్మర్పల్లి, నిజామాబాద్ జిల్లా అటువంటి రుణాలతో మోసపోవద్దు మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసి అధిక వడ్డీతో రుణాలు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎవరైనా భద్రత, సెక్యూరిటీ లేని సంస్థల నుంచి రుణాలు పొందేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి లోన్లతో మోసపోవద్దు. సభ్యులను బ్యాంకు సిబ్బంది లేదా తోటి సభ్యులు ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలి. – పి.సంపత్‌రావు, డీఎస్పీ, భూపాలపల్లి ఈ చిత్రంలోని వ్యక్తి పేరు దుబాసి సాయికృష్ణ (27). రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో ఉండేవారు. ఆయన భార్య రజిత పేరిట మైక్రో ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నారు. ఆ వాయిదాలు చెల్లించలేకపోవడంతో వేధింపులు ఎదురయ్యాయి. దాంతో నూతి అనిల్ అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.20వేలు అప్పు చేసి.. ఆ వాయిదాలు కట్టారు. కానీ ఈ అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో సాయికృష్ణను నిలదీసిన అనిల్.. అతడి సెల్‌ఫోన్ లాక్కుని వెళ్లాడు. సాయికృష్ణ ఈ అవమానం భరించలేక ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ కేసులో అప్పు ఇచ్చి వేధించిన నూతి అనిల్ జైలుకు వెళ్లాడు. కానీ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు బలవంతపు వసూళ్లు చేస్తున్నా చర్యలు లేవు.నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆవాల భారతి భర్త పదేళ్ల కిందే మరణించాడు. ఆమె గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ గాజులు, బొమ్మలు, దండలు అమ్ముతూ.. కొడుకు, కూతురును పోషించుకుంటోంది. ఇటీవల వ్యాపారం కోసం మైక్రో ఫైనాన్స్‌లో రూ.50 వేలు రుణం తీసుకుని వారానికి రూ.5 వేలు చెల్లిస్తోంది. గిరాకీ సరిగా లేక ఇబ్బంది ఎదురైనా రుణం వాయిదా చెల్లించాల్సి వస్తోందని.. లేకుంటే జమానత్ దారుపై ఒత్తిడి తెచ్చి వసూలు చేసుకుంటున్నారని వాపోతోంది. ఈ వాయిదాలు చెల్లించడం కోసం మరో ఫైనాన్స్‌లో రుణం తీసుకుని కడుతున్నానని... సంపాదించే కాస్త కూడా వడ్డీలకే పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
ఒక వ్యక్తికి రూ.2 లక్షలే అప్పు ఇవ్వాలి: ఎంఫిన్
మైక్రో ఫైనాన్స్ కంపెనీలు(సూక్ష్మ రుణ సంస్థలు) ఒక వ్యక్తికి రూ.2 లక్షలకు మించి అప్పు ఇవ్వకూడదని ఎంఫిన్ (మైక్రో-ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్) ఆదేశించింది. అదికూడా గరిష్ఠంగా నాలుగు సంస్థలు మాత్రమే ఈ మొత్తాన్ని సమకూర్చాలని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇష్టానుసారంగా రుణాలివ్వడంతో సాధారణ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లు ఎంఫిన్ పేర్కొంది.సూక్ష్మ రుణ సంస్థలు ఇష్టారాజ్యంగా రుణాలు జారీ చేయడం వల్ల, ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దాంతో మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద మొండి బకాయిలు పెరుకుపోతున్నాయి. మార్కెట్లోని బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలు రానివారు, కొన్ని కారణాల వల్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం కుదరని వారు సూక్ష్మ రుణ సంస్థలను సంప్రదిస్తున్నారు. దాంతో అధికవడ్డీకి ఆశపడి ఆయా సంస్థలు ప్రజలకు రుణాలిస్తున్నాయి. కానీ వాటిని తిరిగి చెల్లించే క్రమంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దానివల్ల ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దానికితోడు సంస్థలు ఇచ్చిన అప్పు రికవరీ శాతం తగ్గిపోతుంది. ఈ వ్యవహారాన్ని గుర్తించిన ఎంఫిన్ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.సూక్ష్మ రుణ సంస్థలకు నియంత్రణ వ్యవస్థగా ఎంఫిన్ వ్యవహరిస్తోంది. ఎంఫిన్ తెలిపిన వివరాల ప్రకారం..మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఒక వ్యక్తికి గరిష్ఠంగా రూ.2 లక్షలు మాత్రమే అప్పుగా ఇవ్వాలి. ఈ మొత్తాన్ని నాలుగు సంస్థల వరకు మాత్రమే సమకూర్చాలని తెలిపింది.ఇదీ చదవండి: గిఫ్ట్సిటీలో యూరోపియన్ బ్యాంక్ ప్రారంభంసూక్ష్మ రుణ సంస్థల వినియోగదార్లుగా దాదాపు రూ.3 లక్షల వార్షికాదాయం గల కుటుంబాలే అధికంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో ఈ రంగం ఎంతగానో విస్తరించింది. ప్రస్తుతం సూక్ష్మ రుణాల పరిశ్రమకు 7.8 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నారు. వీరికి జారీ చేసిన రుణాల మొత్తం రూ.4.33 లక్షల కోట్లకు పైగా ఉందని సమాచారం. -
సూక్ష్మ రుణాలు రూ.2.93 లక్షల కోట్లు
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల స్థూల రుణ పోర్ట్‌ఫోలియో జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 23.5 శాతం వృద్ధి చెంది (అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే) రూ.2,93,154 కోట్లకు చేరుకుంది. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికం చివరికి ఉన్న రూ.2.85 లక్షల కోట్ల రుణాలతో పోల్చి చూస్తే కనుక.. 2.7 శాతం పెరిగాయి. సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) స్వీయ నియంత్రణ సంస్థ ‘మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్’ (ఎంఎఫ్ఐఎన్) ఓ నివేదిక విడుదల చేసింది. రానున్న త్రైమాసికాల్లో రుణాల పోర్ట్‌ఫోలియో మరింత వృద్ధి చెందుతుందని ఎంఎఫ్ఐఎన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. నియంత్రణ పరమైన, నిర్వహణపరమైన సానుకూల వాతావరణం ఉన్నట్టు చెప్పారు. కరోనా తర్వాత జారీ చేసిన రుణాల్లో నాణ్యత 95 శాతానికి పైగా (వసూళ్లు) ఉన్నట్టు ఎంఎఫ్ఐఎన్ చైర్మన్ దేవేశ్ సచ్దేవ్ పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో శాఖల బలమైన విస్తరణకుతోడు గతంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, సానుకూల విధానాలతో ఎంఎఫ్ఐ రంగం మంచి వృద్ధిని నమోదు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
ఎంఎఫ్‌ఐల సెక్యూరిటైజేషన్ రూ.3,500 కోట్లు
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) సెక్యూరిటైజేషన్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,500 కోట్లుగా ఉందని ఇక్రా రేటింగ్స్ తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎంఎఫ్‌ఐల సెక్యూరిటైజేషన్ పరిమాణం రూ.1,460 కోట్లుగానే ఉంది. ఎంఎఫ్ఐలు తమ రుణాలను కొంత మేర సెక్యూరిటీలుగా (బాండ్లు, తదితర) మార్చి నిధుల అవసరాలను తీర్చుకోవడమే సెక్యూరిటైజేషన్. 2022 మొదటి ఆరు నెలల్లో ఎంఎఫ్‌ఐల రుణ ఆస్తుల సెక్యూరిటైజేషన్ బలంగా పుంజుకున్నట్ట ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. సెక్యూరిటీటైజేషన్ అన్నది ఎంఎఫ్‌ఐల నిధుల మార్గాల్లో ఒకటి. ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలకు ఇది కీలక నిధుల మార్గంగా ఉండడం గమనార్హం. చదవండి: 5G Spectrum Auction: కంపెనీలు తగ్గేదేలే.. రికార్డ్ బ్రేక్, తొలి రోజు రూ.1.45లక్షల కోట్లు! -
ఫైనాన్స్ కంపెనీల పరిస్థితి ఎలా ఉందంటే?
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి క్వార్టర్లో ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(హెచ్ఎఫ్సీ)ల రుణ నాణ్యత మెరుగుపడినట్లు ఇక్రా రేటింగ్స్ పేర్కొంది. కోవిడ్–19(ఒమిక్రాన్) ప్రభావం పెద్దగా లేకపోవడం, పునర్వ్యవస్థీకరించిన లోన్ బుక్ కారణంగా స్లిప్పేజీలు తగ్గడం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు నివేదికలో ఇక్రా తెలియజేసింది. వెరసి జనవరి–మార్చి(క్యూ4)లో ఎన్‌బీఎఫ్‌సీల స్థూల స్టేజ్–3 (90 రోజులకు మించి చెల్లింపులు నిలిచిపోయిన) రుణాలు 5.7 శాతం నుంచి 4.4 శాతానికి క్షీణించినట్లు వెల్లడించింది. ఇక హెచ్ఎఫ్సీల స్టేజ్–3 రుణాలు 3.6 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గాయి. ఇక్రా నివేదిక ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీల ప్రామాణిక పునర్వ్యవస్థీకృత బుక్ 2022 మార్చిలో 2.7–3 శాతానికి తగ్గింది. 2021 సెప్టెంబర్‌లో గరిష్టానికి అంటే 4.5 శాతానికి చేరింది. ఇదేవిధంగా హెచ్ఎఫ్సీల బుక్ సైతం 2.2 శాతం నుంచి 1.4–1.6 శాతానికి దిగివచ్చింది. చదవండి: క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ చెల్లింపులు: లింకింగ్ ఎలా? -
నేరాల్లో 10% తగ్గుదల..!
సాక్షి హైదాబాద్: టెక్నాలజీ వినియోగం.. నేరాలు కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాల కీలకపాత్ర.. నేరాలు నిరోధించడంలో పీడీ యాక్ట్ ప్రయోగం వంటి చర్యలు.. వెరసి హైదరాబాద్ నగరంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే అన్ని రకాలైన నేరాల్లో కలిపి దాదాపు 10 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 20 వరకు నమోదైన నేరాల గణాంకాలను సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సీపీ అంజనీకుమార్ విడుదల చేశారు. సైబర్ నేరాల సంఖ్య మాత్రం గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. తగ్గిన ‘మరణాలు’.. రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణాల సంఖ్య తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసు విభాగం స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఫలితంగా ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రులతో పాటు మృతుల సంఖ్య తగ్గింది. 2018 2019 2020 మొత్తం ప్రమాదాలు 2,431 2,496 1,738 క్షతగాత్రులు 2,435 2,649 1,793 మృతులు 293 271 237 ‘దిశ’ఉదంతం తర్వాత మహిళల భద్రతపై అన్ని విభాగాలు దృష్టి పెట్టాయి. సాధారణ సమయంలోనూ మహిళలు/యువతులపై జరిగే నేరాలను అధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. మహిళలపై నేరాలు.. 2018 2019 2020 మొత్తం కేసులు 2,286 2,354 1,908 వరకట్న హత్యలు 17 3 2 అత్యాచారం 178 281 265 కిడ్నాప్‌లు 134 95 60 ఆత్మగౌరవానికి భంగం కలిగించడం 373 448 438 వేధింపులు 1,342 1,462 1,043 శిక్షలు ఇలా.. 2018 2019 2020 విచారణ ముగిసిన కేసులు 4,245 4,947 2,688 నేరం నిరూపితమైనవి 1,471 2,092 1,964 శిక్షల శాతం 34 42 73 చోరీ అయిన సొత్తు రికవరీ.. 2018 2019 2020 చోరీ అయిన సొత్తు విలువ రూ.74.05 కోట్లు రూ.27.78 కోట్లు రూ.26.15 కోట్లు రికవరీ రూ.62.97 కోట్లు రూ.16.26 కోట్లు రూ.17.24 కోట్లు శాతం 86 59 66 సైబర్ క్రైం పెరిగింది.. ఈ సందర్భంగా అడిషపల్ సీపీ షిఖా గోయల్ మాట్లాడుతూ.. ‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ క్రైం పెరిగింది. 2019లో 1,393 సైబర్ కేసులు నమోదయితే 2020 లో 2,406 కేసులు నమోదు అయ్యాయి. ఇంటర్ నెట్ వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్ క్రైమ్‌లు రాజస్తాన్‌లోని జంతారా నుంచే జరుగుతున్నాయి. 25 శాతం ఓటీపీ మోసాలు పెరిగాయి. ఆన్లైన్ గేమింగ్ యువతను ఆకర్షిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఈ మధ్య భారీగా పెరిగాయి. 100 యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్ లో ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్ ద్వారా అప్పులు ఇచ్చి వేధింపులకు గురిచేస్తున్నారు. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో భాదితుల ఫోటోలు, అలాగే కాంటాక్ట్‌లకు మెసేజ్‌లు పంపుతున్నారు. వీరి వేధింపులకు ముగ్గురు ఆత్మ హత్య చేసుకున్నారు. ఇలాంటి యాప్‌లు ఎవరు డౌన్లోడ్ చేసుకొని మోసపోవద్దు’ అన్నారు. (చదవండి: ఆన్లైన్లో ఏం చేస్తున్నారో గమనించండి) ‘ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు చేసిన 12 రాష్ట్రాలకు చెందిన 259 మంది ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. 19 మ్యాట్రిమోని కేసులు నమోదు అయ్యాయి. ఆన్లైన్ గేమింగ్‌పై ప్రత్యేకంగా నిఘా పెట్టాం. చైనా బేస్‌గా ఆన్లైన్ గేమింగ్‌పై తెలంగాణలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఆన్లైన్ గేమింగ్ తెలంగాణలో నిషేధం. ఆన్లైన్ గేమింగ్ కేసులో 170 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశాం. చైనా దేశస్తుడిని అరెస్ట్ చేశాం. ఇప్పటి వరకు 16వందల కోట్ల ట్రాన్సక్షన్ జరిగినట్టు గుర్తించాం’ అని షిఖా గోయల్ తెలిపారు. -
మళ్లీ ‘మైక్రో’ కోరలు
కొత్తగూడెం: మైక్రోఫైనాన్స్ సంస్థలు మళ్లీ కోరలు చాస్తున్నాయి. రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న సంస్థలు పల్లెలను పట్టిపీడించేందుకు సిద్ధమవుతున్నాయి. మైక్రోఫైనాన్స్ ముసుగులో అధిక వడ్డీలు, అనేక రకాల స్కీములతో పల్లె ప్రజలను వంచించిన ఇవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. ‘మైక్రో’ ప్రతినిధులు గతంలో ఆ సంస్థల వద్ద రుణాలు తీసుకున్న వారి ఇళ్లకు వెళ్లి మళ్లీ అప్పు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా చాలామంది రుణాలు తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నా ఆ సంస్థల ప్రతినిధులు అలుపెరగకుండా ఇళ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత రుణాలు రద్దు చేశాం...కొత్త రుణాలు తీసుకోడంటూ మభ్యపెడుతున్నారు. ఐదేళ్ల క్రితం... ఐదేళ్ల క్రితం సుమారు పది వరకు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉండేవి. ఇవి గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తామని..రుణాలు ఇస్తామని గ్రామాల్లో సంచరిస్తుండేవి. మహిళలను గ్రూప్‌లుగా తయారు చేసి రుణాల పేరుతో అక్రమంగా రూ.కోట్లు వసూలు చేసేవి. తొలుత ఒక్కొక్కరికి రూ.5,000 రుణం ఇచ్చేవి. డాక్యుమెంటేషన్ చార్జీ పేరుతో దీనిలో రూ.500 కోత విధించేవి. ప్రతివారం పొదుపు పేరుతో సభ్యుల నుంచి అదనంగా కొంతమొత్తం వసూలు చేసేవి. గ్రూప్ సభ్యురాళ్లలో ఎవరైనా ఓ వారం వాయిదా చెల్లించకపోతే మిగిలిన వారిని కూడా అక్కడే కూర్చోబెట్టి ఫైనాన్స్ సంస్థల ప్రతి నిధులు వేధింపులకు పాల్పడేవారు. ఇలా పొదుపులు, ఇన్సూరెన్స్ పేరుతో కోట్లు దండుకున్నారు. ఈ దోపిడీని భరించలేక మహిళలు మైక్రోఫైనాన్స్ సంస్థల ప్రతినిధులపై తిరగబడ్డారు. మైక్రో సంస్థల ఆగడాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో అవి తోక ముడిచాయి. పాత బకాయిల వసూళ్ల కోసమేనా..? గతంలో మైక్రోఫైనాన్స్ నిర్వహించిన పలు సంస్థల ప్రతినిధులపై పోలీసుల దాడులు చేశారు. ఆయా సంస్థలను మూసివేయించారు. ఆ క్రమంలో లక్షలాది రూపాయలు ఫైనాన్స్ రూపంలో తీసుకున్న ప్రజలవద్ద ఉండిపోయాయి. ఆ పాత బకాయిలను మాఫీ చేసేశాం...కొత్త రుణాలు తీసుకోడంటూ ఆ సంస్థల ప్రతినిధులు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఏదో ఒక రకంగా పాత రుణాలను వసూలు చేయాలనే లక్ష్యంతో ఓ పథకం ప్రకారం పల్లెల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. కొత్త రుణాలు తీసుకునేందుకు ప్రజలు అయిష్టత వ్యక్తం చేస్తున్నా సంస్థ ప్రతినిధులు మాత్రం వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడం, పెట్టుబడులకు డబ్బు అవసరం ఉండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఫైనాన్స్ సంస్థలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. ఈ మైక్రో ఏజెంట్ల ఉచ్చులో పడి కొందరు గ్రామీణులు ఇప్పటికీ మోసపోతున్నట్లు తెలుస్తోంది.