మళ్లీ ‘మైక్రో’ కోరలు
కొత్తగూడెం: మైక్రోఫైనాన్స్ సంస్థలు మళ్లీ కోరలు చాస్తున్నాయి. రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న సంస్థలు పల్లెలను పట్టిపీడించేందుకు సిద్ధమవుతున్నాయి. మైక్రోఫైనాన్స్ ముసుగులో అధిక వడ్డీలు, అనేక రకాల స్కీములతో పల్లె ప్రజలను వంచించిన ఇవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. ‘మైక్రో’ ప్రతినిధులు గతంలో ఆ సంస్థల వద్ద రుణాలు తీసుకున్న వారి ఇళ్లకు వెళ్లి మళ్లీ అప్పు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా చాలామంది రుణాలు తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నా ఆ సంస్థల ప్రతినిధులు అలుపెరగకుండా ఇళ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత రుణాలు రద్దు చేశాం...కొత్త రుణాలు తీసుకోడంటూ మభ్యపెడుతున్నారు.
ఐదేళ్ల క్రితం...
ఐదేళ్ల క్రితం సుమారు పది వరకు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉండేవి. ఇవి గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తామని..రుణాలు ఇస్తామని గ్రామాల్లో సంచరిస్తుండేవి. మహిళలను గ్రూప్‌లుగా తయారు చేసి రుణాల పేరుతో అక్రమంగా రూ.కోట్లు వసూలు చేసేవి. తొలుత ఒక్కొక్కరికి రూ.5,000 రుణం ఇచ్చేవి. డాక్యుమెంటేషన్ చార్జీ పేరుతో దీనిలో రూ.500 కోత విధించేవి. ప్రతివారం పొదుపు పేరుతో సభ్యుల నుంచి అదనంగా కొంతమొత్తం వసూలు చేసేవి.
గ్రూప్ సభ్యురాళ్లలో ఎవరైనా ఓ వారం వాయిదా చెల్లించకపోతే మిగిలిన వారిని కూడా అక్కడే కూర్చోబెట్టి ఫైనాన్స్ సంస్థల ప్రతి నిధులు వేధింపులకు పాల్పడేవారు. ఇలా పొదుపులు, ఇన్సూరెన్స్ పేరుతో కోట్లు దండుకున్నారు. ఈ దోపిడీని భరించలేక మహిళలు మైక్రోఫైనాన్స్ సంస్థల ప్రతినిధులపై తిరగబడ్డారు. మైక్రో సంస్థల ఆగడాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో అవి తోక ముడిచాయి.
పాత బకాయిల వసూళ్ల కోసమేనా..?
గతంలో మైక్రోఫైనాన్స్ నిర్వహించిన పలు సంస్థల ప్రతినిధులపై పోలీసుల దాడులు చేశారు. ఆయా సంస్థలను మూసివేయించారు. ఆ క్రమంలో లక్షలాది రూపాయలు ఫైనాన్స్ రూపంలో తీసుకున్న ప్రజలవద్ద ఉండిపోయాయి. ఆ పాత బకాయిలను మాఫీ చేసేశాం...కొత్త రుణాలు తీసుకోడంటూ ఆ సంస్థల ప్రతినిధులు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఏదో ఒక రకంగా పాత రుణాలను వసూలు చేయాలనే లక్ష్యంతో ఓ పథకం ప్రకారం పల్లెల్లో సంచరిస్తున్నట్లు సమాచారం.
కొత్త రుణాలు తీసుకునేందుకు ప్రజలు అయిష్టత వ్యక్తం చేస్తున్నా సంస్థ ప్రతినిధులు మాత్రం వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడం, పెట్టుబడులకు డబ్బు అవసరం ఉండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఫైనాన్స్ సంస్థలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. ఈ మైక్రో ఏజెంట్ల ఉచ్చులో పడి కొందరు గ్రామీణులు ఇప్పటికీ మోసపోతున్నట్లు తెలుస్తోంది.