Rural woman
-
మోదీ గారూ రోడ్లు కిధర్ హై
సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక సామాన్యులు ప్రశ్నించే పద్ధతులు మారాయి. ఏకంగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక గ్రామీణ మహిళవిడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. ‘మధ్యప్రదేశ్ నుంచి 29 సీట్లు ఇచ్చాం. మరి మా రోడ్ల సంగతేంటి?’ అని అడుగుతూ డొక్కు రోడ్ల మీద ఆమె ప్రయాణం చేస్తూ తీసిన వీడియో మోడి వరకు చేరేలా ఉంది.పూర్వం ప్రధానికి కార్డు ముక్క రాసి పడేసేవారు జనం. ఇవాళ ఒక వీడియో చేసి వదులుతున్నారు. కార్డు రాస్తే ఎవరికీ తెలిసేది కాదు. కాని వీడియో లక్షలాది మంది కంట పడుతోంది. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లా అటవీ ప్రాంతంతో, బొగ్గు గనుల నిక్షేపాలతో ఉంటుంది. కాని వెనుకబాటుతనం కూడా ఉంది. ‘మేం అడవుల్లో ఉంటాం. అయితే మాకు రోడ్లు అక్కర్లేదా మోదీ గారూ’ అని శివాని సాహు అనే మహిళ మోదీని ప్రశ్నించింది. ‘మధ్యప్రదేశ్ మీకు 29 సీట్లు ఇచ్చింది. ఇప్పుడైనా రోడ్లు వేయండి. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. మేము ఎం.ఎల్.ఏ, ఎం.పి, కలెక్టర్ అందరినీ కలిశాం. కాని ఏం ప్రయోజనం లేదు. వానొస్తే మా పరిస్థితి అధ్వానం. బస్సు మలుపు తిరగలేదు. పిల్లలు నడవడం కూడా వీలు కావడం లేదు. రోడ్లు వేయండి మోదీ గారూ’ అని ఆమె వేడుకుంది. అంతే కాదు ‘ ఈ వీడియో మోదీ గారికి చేరేవరకు షేర్ చేయండి’ అని కోరింది. దాంతో అందరూ షేర్ చేస్తున్నారు. ఈ వీడియో వచ్చాక సిధి జిల్లాలో పురోభివృద్ధి గురించి చర్చ నడుస్తోంది. అన్నట్టు ఇది నాటి మహా విదూషకుడు బీర్బల్ జన్మస్థలం. ఆయన మళ్లీ పుడితే ఇలాంటి ప్రభుత్వ పనితీరు చూసి ఎన్ని పరిహాసాలు ఆడేవాడో. మరెన్ని వ్యంగ్యాలు పోయేవాడో. వాతలు వేసేవాడో. -
మైండ్ హెల్త్: పల్లె మహిళే మెరుగు..
పల్లె మహిళ పట్టణ మహిళను దాటి ముందుకెళుతుందా?! ‘అవును’ అనే అంటున్నారు మానసిక నిపుణులు. సమస్యలు ఎదురైనా ఏ మాత్రం జంకక పరిష్కార దిశగా అడుగు వేయడంలో పల్లె మహిళే పట్టణ మహిళ కన్నా ముందంజలో ఉందని పెన్సిల్వేనియా ఉమెన్ హెల్త్ స్టడీ ఓ నివేదికను రూపొందించింది. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న పట్టణ–గ్రామీణ మహిళలపై వీరు చేసిన స్టడీ ద్వారా ఆసక్తికర విషయాలు తెలియ జేశారు. మానసిక సమస్యలు గ్రామీణ మహిళ కన్నా పట్టణ మహిళల్లో ఎక్కువ శాతం ఉన్నట్టు గమనించారు. దీనికి సంబంధించిన కారణాలను విశ్లేషించారు. పల్లె జీవనమే సాంత్వన ‘పట్టణ మహిళ కుటుంబంలో ఉన్నప్పటికీ మానసికంగా ఒంటరితనాన్నే ఫీలవుతుంది. వచ్చిన ఆదాయానికి, పెరుగుతున్న ఖర్చులకు పొంతన ఉండదు. ఇంటర్నెట్ వాడకం కూడా ఇందుకు కారణమే. పల్లెల్లోనూ ఈ ప్రభావం ఉన్నప్పటికీ అక్కడ శారీర శ్రమకు సంబంధించిన పనులు ఎక్కువ. దీనికి తోడు వెన్నంటి భరోసాగా ఉండే వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. తమ సమస్యలను తమలోనే దాచుకుని బాధపడరు. చుట్టుపక్కల ఇళ్ల వారిలో ఎవరికో ఒకరికి చెప్పుకుని ఊరట పొందుతారు. అక్కడ అవకాశాలు తక్కువ. అలాగే, అసంతృప్తులూ తక్కువే’ అంటారు క్లినికల్ సైకాలజిస్ట్ రాధిక. ఎప్పుడైతే సెన్సిటివ్‌గా, సమస్యలు లేకుండా పెరుగుతారో వారిలో అభద్రతా భావం ఎక్కువ అంటారు నిపుణులు. పల్లెల్లో చిన్నప్పటి నుంచే కష్టపడే తత్త్వం ఉంటుంది. ఇంటి పనులు, బయట పనులు ఒక అలవాటుగా చేసుకుపోతుంటారు. తమకు అవి కావాలనీ, ఇవి కావాలనీ అంచనాలు, ఆశలు పెద్దగా ఉండవు. శారీరకపరమైన పనుల్లో కలిగే అలసట మనసును కూడా సేద తీరుస్తుంది. వాస్తవానికి దగ్గరగా ఉండేలా చేస్తుండటం కూడా మానసిక సమస్యలను దూరం చేస్తుందంటారు నిపుణులు. యాక్సెప్టెన్సీ ఎక్కువ వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల దేనిమీదా ఎక్కువ ఆశలు పెట్టుకోరు. అవి తమ జీవిత భాగస్వామి నుంచైనా సరే. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి.. అనే విషయాల పట్ల సరైన అవగాహన ఉంటుంది. రిసోర్స్ మేనేజ్మెంట్ పల్లెవాసులకే బాగా తెలుసు. అందుకే ఎక్కువ ఒత్తిడికి లోనవరు. వారికి వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే సమస్యలే అధికం. మిగతావన్నీ వాటి ముందు చిన్నవిగానే కనిపిస్తాయి. పిల్లలకు కూడా ఆ వాస్తవాన్ని పరిచయం చేస్తారు. ఇల్లు, సమాజం నేర్పే పాఠాలు వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి. పట్టణప్రాంతాల్లో అవకాశాలు కోకొల్లలు. వాటి వల్ల వచ్చే సమస్యలు అంతే! అవి అందరికీ అందుబాటులో ఉండవు. వాటిని అందుకోవడం కోసం ఎలా పరుగులు పెట్టాలా అనే ఆలోచనతో ఉంటుంది పట్టణ మహిళ. తన చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడంతో తనను తాను తక్కువ చేసుకుంటుంది. ఫలితంగా రోజు రోజుకూ తనపై తనకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పల్లెటూరులో ఉన్నవాళ్లు కదా వాళ్లకేం తెలుసు అనేది పట్టణవాసుల అలోచన. కానీ, పల్లెటూరులో ఎప్పుడూ కష్టమే ఉంటుంది. వాటిని ఎదుర్కొనే సమర్థతా ఉంటుంది. నీడపట్టున ఉండే నగరవాసులే కష్టాన్ని ఎదుర్కోలేని సున్నితత్త్వం ఉంటుంది. పట్టణ మహిళ మారాలి పల్లెటూరులో ఉన్నప్పుడు ఏడుపు వస్తే పరిగెత్తుకెళ్లి అమ్మ ఒడిలో తలదాచుకోవడం తెలుసు. చెట్టు కింద సేద తీరడం తెలుసు. మట్టికి దగ్గరగా ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలుసు. పట్టణ జీవనంలో ఎవరికి వారే. ఎవరితోనూ పంచుకోలేని సమస్యలు. కష్టాలు వస్తే ఎదుర్కొనే ధైర్యం సన్నగిల్లుతోంది. అందుకే, ముందు ఇంట్లో మహిళ మనస్తత్వం మారాలి. నెలకు ఒకసారైనా పట్టణం వదిలి, పల్లె వాతావరణంలోకి వెళ్లగలగాలి. ఒత్తిడి దశలను దాటే మార్గాలను పల్లెలే పరిచయం చేస్తాయని గ్రహించాలి. స్వచ్ఛందంగా సమాజానికి ఏ చిన్న పని చేసినా, మానసిక సాంత్వన లభిస్తుందని గ్రహించాలి. పిల్లలకు కూడా ‘నేను పడిన కష్టాన్ని నా పిల్లలు పడకూడదు’ అనుకోకుండా వారికి మన భారతీయ మూలాలను తెలియజేయాలి. – రాధిక ఆచార్య, క్లినికల్ సైకాలజిస్ట్ -
మంచి మాట.. రేపటి కోసం...
‘ఆకాశవాణి... ఇప్పుడు మీరు వింటున్నది శుభ్ కల్(రేపటి కోసం)’ అని రేడియో నుంచి ఆమె గొంతు వినిపించినప్పుడు ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు తమ రేడియో దగ్గరికి వడివడిగా వస్తారు. రేడియోసౌండ్ పెంచుతారు. గ్రామీణ మహిళలకు చాలా ఇష్టమైన రేడియో కార్యక్రమం ఇది. ‘శుభ్ కల్’లో సినిమా పాటలు, కథలు, నాటికలు వినిపించవు. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలు వినిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు వినడానికి ఆసక్తి చూపేవారు తక్కువగా ఉంటారు. ఆసక్తికరంగా చెబితే ఎలాంటి విషయాలనైనా ఆసక్తికరంగా వింటారని నిరూపించింది 27 సంవత్సరాల వర్షా రైక్వార్. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాకు చెందిన వర్ష ‘బుందెల్‌ఖండ్ 90.4 ఎం.ఎమ్’లో రేడియో జాకీ. వర్ష నాన్న రైతు. ఆయన వరుస కరువులతో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకానొక దశలో ఊరు విడిచి వలస వెళదామని కూడా ఆలోచించాడు. చిన్నప్పుడు తండ్రిని అడిగేది ‘వర్షాలు ఎందుకు రావడం లేదు?’ ‘కరువు ఎందుకు వస్తుంది?’.. ఇలాంటి ప్రశ్నలకు ఆయన చెప్పే జవాబు ఒక్కటే...‘అంతా విధినిర్ణయం తల్లీ. మనమేమీ చేయలేము. మనం మానవమాత్రులం’ అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో...కరువు కాటకాల్లో విధి పాత్ర కంటే మానవతప్పిదాల పాత్రే ఎక్కువ ఉందని గ్రహించింది. తప్పులు మూడు విధాలుగా జరుగుతాయి. తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పులు, తెలిసీ తెలియక చేసే తప్పులు. ఈ మూడు సమూహాలను దృష్టిలో పెట్టుకొని ‘శుభ్ కల్’ కార్యక్రమానికి డిజైన్ చేసింది వర్ష. గంభీరమైన ఉపన్యాసాలు, అంత తేలిగ్గా అర్థం కాని జటిల సాంకేతిక పదజాలం కాకుండా స్థానిక భాష, యాసలతో నవ్వుతూ, నవ్విస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది వర్ష. కొన్ని స్కిట్స్‌లో రెండు పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర పర్యావరణానికి సంబంధించి మంచిపనులు చేస్తుంటుంది. రెండో పాత్ర...ఇదంత వ్యర్థం అనుకుంటుంది. రెండు పాత్రల మధ్య స్థానిక యాసలలో జరిగే సరదా సంభాషణ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటుంది. వాదనలో చివరికి రెండో పాత్ర ఓడిపోతుంది. తన తప్పును తెలుసుకొని ‘ఇలాంటి తప్పు మీరు చేయవద్దు’ అని చెబుతుంది. ఈ కార్యక్రమంతో ప్రభావితం అయిన రాజ్పూర్ గ్రామరైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. ఈ గ్రామాన్ని మిగిలిన గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. కేవలం రేడియో కార్యక్రమానికే పరిమితం కాకుండా ‘పల్లె పల్లెకు’ అంటూ తన బృందంతో కలిసి పల్లెలకు వెళుతుంటుంది వర్ష. ఆమె వెళ్లే పల్లెలలో వాహనాలు వెళ్లలేనివి మాత్రమే కాదు కాలినడకన వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పల్లెలు ఉన్నాయి. రేడియో జాకీగా మంచి పేరు ఉండడంతో ఏ పల్లెకు వెళ్లినా వర్షను గుర్తుపట్టి ఆదరిస్తారు. ఆ ఆదరణతోనే మహిళలతో సమావేశాలు నిర్వహించి చెట్లు పెంచడం వల్ల ఉపయోగాలు, నీటి సంరక్షణ మార్గాలు, సేంద్రియ వ్యవసాయం...ఇలా ఎన్నో విషయాలను చెబుతుంది. ఆ కార్యక్రమాలు ఎంత మంచి ఫలితం ఇచ్చాయంటే మొక్కలు నాటడాన్ని మహిళలు తప్పనిసరి కార్యక్రమం చేసుకున్నారు. నీటి వృథాను ఆరికట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు. కిచెన్ గార్డెన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్య సమితి ‘వి చేంజ్ నౌ’ మూమెంట్ యంగ్క్లైమెట్ లీడర్స్‌లో వర్ష ఒకరు. ‘మన భూమిని మనమే రక్షించుకోవాలి’ అంటుంది వర్ష రైక్వార్. అందరూ వినదగిన మాటే కదా! -
ఓ లక్ష్మి స్ఫూర్తి గాథ
పెళ్లంటే ఏమిటో తెలియని వయసులోనే ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నాడు తండ్రి. పెళ్లయిన తర్వాత అతి కష్టం మీద ప్రైవేటుగా టెంత్ వరకు చదువుకుంది. ముగ్గురు పిల్లలను పెంచుకుంటూ ఎలాగో పన్నెండో తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత అనుకోకుండా అనేక మలుపులు తిరిగింది ఆమె జీవితం. మహిళా చైతన్య ఉద్యమ సారథిగా మారింది. ఆమె మూలంగా కొన్ని వేలమంది జీవితాలు బాల్యవివాహమనే చీకటిలో చిక్కుకోకుండా ఒడ్డున పడ్డాయి. ఆమె చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. అందుకు స్ఫూర్తి ఎవరో కాదు... తనకు తనే!మహారాష్ట్రలోని తుల్జాపూర్‌కు చెందిన ఓ లక్ష్మి స్ఫూర్తి గాథ ఇది. పితృస్వామ్య ఆధిపత్యం వల్ల మహిళా లోకానికి జరుగుతున్న అన్యాయం మీద గొంతు పెగల్చింది. తమకు హక్కులున్నాయనే నిజాన్ని మహిళలకు తెలియచెప్పింది. తమ జీవితంలో తమ ప్రమేయం లేకుండా జరుగుతున్న నిర్ణయాల మీద గళం విప్పుతున్నారు అక్కడి మహిళలు. లక్ష్మి చేపట్టిన మహిళా చైతన్య ఉద్యమంలో ఇప్పటి వరకు పదిహేడు వేల మంది జీవితాలు గట్టున పడ్డాయి. బాల్యవివాహపు ఊబిలో చిక్కుకోకుండా రక్షణ పొందిన వాళ్లు కొందరు, రెండవ వివాహపు కోరల్లో చిక్కకుండా తప్పించుకున్నవారు మరికొందరు. పెద్దగా చదువు లేని, ఒక సామాన్య గ్రామీణ మహిళ... ఇంత పెద్ద ఉద్యమాన్ని చేపట్టడానికి స్ఫూర్తి ఎవరని లక్ష్మిని అడిగితే ఆమె చెప్పే సమాధానం ఒక్కటే. ‘‘నా జీవితం బాల్యవివాహం అనే సుడిగుండంలో చిక్కుకుపోయింది. నన్ను నేను నిలబెట్టుకోవడానికి... నేను చేసిన పోరాటం చిన్నది కాదు. ఇంతకంటే స్ఫూర్తి ఏం కావాలి?’ అని అడుగుతుంది. లక్ష్మిది మహారాష్ట్ర, తుల్జాపూర్లో చర్మకారుల కుటుంబం. ఎనిమిదేళ్లకే పెళ్లి. వరుడు మేనమామ. తనకంటే పదమూడేళ్లు పెద్దవాడు. ‘‘ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ సంబంధాలు వెతికి పెళ్లి చేయడం కంటే చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఒక బాధ్యత తప్పుతుందని మా అమ్మానాన్నల ఆలోచన. అలా నాకు పెళ్లంటే ఏంటో తెలియని వయసులోనే పెళ్లయింది. కొంతలో కొంత మేలు ఏంటంటే... పెళ్లయిన తర్వాత బడికి వెళ్లగలగడం. అయితే తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు మెచ్యూర్ కావడంతో అక్కడితో చదువాగిపోయింది. చదువు కొనసాగించడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. భోజనం మానేసి అలకబూనాను. చచ్చిపోతానన్నా కూడా మా అత్తవారింట్లో ఎవరూ నేను చదువుకోవడానికి ఒప్పుకోలేదు. పైగా వాళ్ల మాటను మా అమ్మ చేత చెప్పించి నా నోరు నొక్కేశారు. కొన్నేళ్ల తర్వాత ప్రైవేటుగా పదో తరగతి పూర్తి చేశాను. ముగ్గురు పిల్లలను పెంచుకుంటూ అతి కష్టం మీద పన్నెండు వరకు చదివాను. కానీ నాకు సంతృప్తి కలగలేదు’’ అని గతాన్ని గుర్తు చేసుకుంది లక్ష్మి. ఆర్థిక స్వావలంబన ప్రభుత్వ సూచనతో స్వయం సహాయక బృందాల ఏర్పాటులో కూడా లక్ష్మి చురుగ్గా ఉంటోంది. అయితే ఆమె భర్త నుంచి విడిపోయిన మహిళలు, వితంతు మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వాళ్ల కోసం విడిగా బృందాలు చేసింది. వాటి పేరు ఏకల్ మహిళా సంఘటన్. అంటే సింగిల్ ఉమెన్స్ ఆర్గనైజేషన్. జిల్లా అధికారులతో మాట్లాడి సింగిల్ ఉమెన్‌కు ష్యూరిటీ అవసరం లేకుండా బ్యాంకు రుణాలు అందేటట్లు చొరవ తీసుకుంది. దాదాపు 200 మంది ఔత్సాహిక మహిళలకు శిక్షణనిచ్చింది. వారి ద్వారా మహిళలను చైతన్యవంతం చేసే మహోద్యమాన్ని విస్తృతం చేసింది. ఇలా రెండు దశాబ్దాల పాటు సాగిన ఆమె సామాజిక సహాయక ఉద్యమంలో లక్ష్మి ద్వారా ప్రత్యక్షం గా, పరోక్షంగా సహాయం పొందిన వాళ్లు పదిహేడు వేల మంది ఉన్నారని లక్ష్మిని సిఐఐ సీఈవో సీమా అరోరా ప్రశంసల్లో ముంచెత్తారు. పూల వర్షమే కాదు... లక్ష్మి జీవితంలో ఆటుపోట్లు, పోరాటాలు, ప్రశంసల పూల వానలు మాత్రమే కాదు, సూటిపోటి మాటల రాళ్లు కూడా ఉన్నాయి. ఆమె భర్త నిరక్షరాస్యుడు. గేదెలను మేపడం, సాయంత్రం మద్యం తాగి తూలుతూ రాత్రికి ఇంటికి రావడం అతడి దినచర్య. ‘ఊరిని ఉద్ధరించింది చాల’ని ఆమె మీద చెయ్యి చేసుకునేవాడు. ‘నీకింకా ముప్పై ఎనిమిదేళ్లు మాత్రమే. ఇంకా చాలా జీవితం ఉంది. ఈ ముళ్లు విడిపించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించ’మని చెప్పిన అక్కచెల్లెళ్ల లో ‘‘పిల్లల కోసం కొన్ని తప్పవ’’ంటుంది లక్ష్మి ఆవేదనగా. ముఖ్యంగా తల్లి కోసం మాత్రమే అతడిని భర్తగా భరిస్తున్నట్లు వాపోతుంటుంది. తన వైవాహిక జీవితాన్ని చూసిన ఏ తల్లిదండ్రులూ తమ పిల్లలకు బాల్యవివాహాలు చేయరు. తన కష్టం మిగిలిన ఆడపిల్లలకు ఇలాగైనా ఉపయోగపడుతోంది, మంచిదేగా... అంటుంది పంటిబిగువున దుఃఖాన్ని అదిమిపెడుతూ. కొవ్వొత్తి కూడా తాను కాలిపోతున్నానని అనుకోదు. వెలుగునిస్తున్నానని మాత్రమే అనుకుంటుంది. లక్ష్మి కూడా అంతే. ఊరి డాక్టర్ మా ఊరిలో చదువుకున్న వాళ్లు చాలా తక్కువ. రెండు వేల సంవత్సరంలో భారత్ వైద్య ప్రోగ్రామ్ ప్రారంభమైంది. వైద్య సహాయకురాలిగా పని చేయడానికి ఆ మాత్రమైనా చదివిన మహిళను నేను మాత్రమే. ఊరిలో హెచ్ఐవీ, టీబీ, ఇతర అనారోగ్యాల పాలైన వాళ్లను గుర్తించి వైద్య విభాగానికి రిపోర్టు ఇవ్వడంతో నా సర్వీస్ మొదలైంది. పంచాయితీ పెద్దల సూచనతో నాకు వైద్యంలో ప్రాథమిక నర్సింగ్ సేవల్లో శిక్షణ కూడా ఇచ్చారు. చిన్న చిన్న అనారోగ్యాలకు మందులివ్వడం, గర్భిణులను నెలనెలా పరీక్షల కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లడం వంటి పనులప్పగించారు. 300లతో మొదలైన నా జీతం ఇప్పుడు ఐదువేల రూపాయలైంది. ఒక్క సెంటు భూమి కూడా లేని నేను నా జీతం తో హాయిగా జీవిస్తున్నాను. ముగ్గురు పిల్లలను చదివిస్తున్నాను. మా ఊరిలో వాళ్లు నన్ను చిన్న డాక్టరమ్మ అంటారు. వాళ్లకు నేను చెప్పేమాట మీద మంచి గురి. అందుకే దేహానికి వైద్యంతోపాటు సామాజిక వైద్యం కూడా చేస్తున్నాను. బాల్యవివాహాలను వద్దని చెప్తూ, నా పోరాటాన్నే వివరిస్తున్నాను. చదువుతో వచ్చే జ్ఞానం, వ్యక్తిత్వం, స్వయం సాధికారతకు కూడా నన్నే మోడల్‌గా చూస్తున్నారు. దాంతో నా మాటకు విలువ పెరుగుతోంది. – లక్ష్మి -
మహిళా రైతుల శ్రమను గుర్తిద్దాం!
: దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళా శ్రామికుల్లో 74 శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయంలో పనిచేస్తున్నారు. : రెండున్నర ఎకరాల పొలంలో పురుషుడు 1,212 గంటలు పనిచేస్తే, స్త్రీ 3,845 గంటలు పని చేస్తుంది. : రెండున్నర ఎకరాల పొలంలో స్త్రీలు 557 గంటలు నాట్లు వేస్తారు. 640 గంటలు కలుపు తీస్తారు. 384 గంటలె నీటి పని చూస్తారు. : 650 గంటలు పెండ ఎరువు మోస్తారు. 984 గంటలు కుప్పలేసి నూర్చుతారు. : మహిళలకు పురుషుల కన్నా 20-25 శాతం తక్కువ వేతనాలు అందుతున్నాయి. : మూడింట రెండొంతులు పని చేస్తున్న మహిళలకు లభిస్తున్న ఆదాయం మూడింట ఒక వంతు మాత్రమే. : మన దేశం (2011 జనాభా గణన)లో మూడున్నర కోట్ల మంది మహిళలు సాగుదారులుగా నమోదయ్యారు. : తెలంగాణలో 11,50,039 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 9,84,179 మంది మహిళా సాగుదారులున్నారు. వ్యవసాయ పనులతో మమేకమయ్యే వారిలో అత్యధికులు మహిళలే. రైతు కుటుంబాల్లోని మహిళలు.. మహిళా కూలీలు.. మహిళా మత్స్యకార్మికులు.. అటవీ ఉత్పత్తులు సేకరించి జీవనం సాగించే ఆదివాసీ మహిళలు.. ఆహారోత్పత్తి ప్రక్రియ అన్ని దశల్లోనూ అనుదినం చెమట చిందించే వీరంతా మహిళా రైతులే. అయినా వీళ్లకు రైతులుగా కనీస గుర్తింపు లేకపోవడం అన్యాయం. తెల్లారితే పొలానికెళ్లి పనులు చేసే రైతు మహిళలకు భూమి హక్కు కల్పించాలని, వారి పేర్లను రెవిన్యూ రికార్డుల్లో ‘సాగుదారులు’గా రాయించడం కనీస ధర్మమని ప్రముఖ మహిళా రైతు ఉద్యమ నేత కురుగంటి కవిత అంటున్నారు. మహిళలను రైతులుగా గుర్తించి, పురుష రైతులతో సమానంగా వనరులు కల్పిస్తే పంటల ఉత్పాదకత పెరుగుతుందనడానికి రుజువులున్నాయంటున్నారు. దేశవ్యాప్తంగా 400కు పైగా రైతు సంఘాలు, మహిళా సంఘాలు, వినియోగదారులు, ఇతర పౌర సంఘాలతో కూడిన సమాఖ్య ‘ఆశా’ (అలియన్స్ ఫర్ సస్టయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్)కు ఆమె సారథ్యం వహిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు కురుగంటి గంగాభవాని (తూ.గో. జిల్లా పలివెల), రమేశ్‌ది (గుంటూరు). హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎం.ఏ. చదివిన తర్వాత ఐదేళ్లపాటు జహీరాబాద్ ప్రాంతంలో డీడీఎస్ మహిళా రైతుల అభ్యున్నతికి పనిచేశారు. తదనంతరం బెంగళూరు కేంద్రంగా ‘ఆశా’ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఏర్పాటైన జాతీయ మహిళా హక్కుల వేదిక (మకాం) ఈనెల 17 నుంచి 3 రోజుల పాటు బాపట్లలో తొట్టతొలిగా జాతీయ మహిళా రైతుల సమ్మేళనం నిర్వహించనుంది (mahilakisan.makaam@gmail.com). ఈ సందర్భంగా ఆమె ‘సాగుబడి’తో ముచ్చటించారు. ముఖ్యాంశాలు.. మహిళా రైతులంటే ఎవరు? సొంత భూమిలో గానీ, కౌలు భూమిలో గానీ వ్యవసాయ పనుల్లో పాల్గొనే రైతు కుటుంబాల్లోని మహిళలు.. మహిళా కూలీలు.. మత్స్యకార కుటుంబాల్లో మహిళలు.. పశువులను పోషించుకుంటూ పొట్టపోసుకునే మహిళలు.. అంతేకాదు, అడవుల్లో దొరికే ఉత్పత్తులను సేకరించుకుంటూ జీవించే మహిళలు.. వీరంతా మహిళా రైతులే. స్వామినాథన్ కమిషన్ ఐదో నివేదిక ఇచ్చిన తర్వాత 2007లో మన దేశంలో రైతుల కోసం మొట్టమొదటిగా ప్రత్యేక విధానం రూపొందింది. అందులో రైతు అంటే చాలా విస్తృతమైన నిర్వచనం ఉంది. సొంత భూమిలో లేదా కౌలు భూమిలో పంటలు పండించేవారు, రైతు కూలీలు, మత్స్యకారులు, పశుపోషకులు, అడవుల మీద ఆధారపడి జీవించే వాళ్లు.. వీళ్లంతా రైతులే. అయితే, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతానికెళ్లి ఈ ఇంట్లో రైతు ఎవరు అనగానే.. ఆ ఇంటామె ఎంత పని చేసినా కూడా మగవాళ్ల వైపు చూపెట్టడం సర్వసాధారణం.. రైతు అనగానే భూమిపై యాజమాన్య హక్కు ఉన్న వ్యక్తి మాత్రమే అనే తప్పుడు అభిప్రాయం ఉంది. ఎవరి పేరు మీద భూమి పట్టా ఉందో వారిని మాత్రమే రైతుగా గుర్తించడం వల్ల చాలామంది రైతులను మనం గుర్తించలేకపోతున్నాం. ఇలా గుర్తింపునకు నోచుకోలేకపోతున్న వారిలో కౌలుదారులున్నారు, మహిళా రైతులున్నారు... ‘టైమ్ పావర్టీ’ అంటే? మహిళా రైతులకున్న పెద్ద దారిద్య్రం బొత్తిగా తీరిక లేకపోవడం. పొద్దున లేచి కుటుంబంలోని బాధ్యతలు, వ్యవసాయ పనులు వాళ్లే చేయాలి. వంట చేసే బాధ్యత వాళ్లదే కాబట్టి కుటుంబంలో అందరూ సరిగ్గా తిన్నారా? లేదా? ఆహార భద్రత అందుతున్నదా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈవిడ మీదే పడుతుంది. పంటకాలమంతా మహిళా రైతులు పనిచేసినా కూడా మార్కెటింగ్ విషయం వచ్చేటప్పటికి మగ రైతులే తెరపైకి వస్తారు. అమ్ముకొని వచ్చిన తర్వాత ఆమెకి ఎంత చేతికి వస్తుందో కూడా తెలియదు. ఎంతోకొంత ఆమె చేతికొచ్చినా అది కుటుంబాన్ని నడిపించడం కోసమే ఖర్చుపెట్టాలన్నట్లుంటుంది. ఆదాయ వ్యయాలపైన ఆమెకు ఎటువంటి నియంత్రణా ఉండడం లేదు. చాలా అధ్యయనాల్లో తేలింది ఇదే.. మహిళా రైతులకు గుర్తింపు సమస్య సామాజికంగానూ, ప్రభుత్వపరంగానూ ఉందంటారా? రెండు విధాలా ఉంది. సామాజికంగా చూస్తే.. వ్యవసాయ పనుల్లో తలమునకలయ్యే ఒక మహిళ తనను తాను రైతుగా గుర్తించుకోలేకపోవడం దగ్గరి నుంచి మొదలవుతుంది సమస్య. వాళ్లు గుర్తించరు, వారి కుటుంబాల్లో మగవాళ్లు గుర్తించరు, సమాజం గుర్తించదు. ప్రభుత్వపరంగా చూస్తే.. పహాణీ రికార్డులో భూమి పట్టాదారుతోపాటు సాగుదారు ఎవరని వేరే కాలమ్ ఉంటుంది. సాధారణంగా మగ రైతే పట్టాదారై ఉంటారు. సాగుదారు కూడా ఆయన పేరే రాస్తున్నారు. సాగుదారుగానైనా ఆ రైతు భార్య పేరు రాస్తే.. ఆమె పేరిట బ్యాంకు రుణం వచ్చే అవకాశం ఉంటుంది. పంట నష్టపోతే ఆమె బీమా పరిహారం పొందే హక్కుంటుంది. పంట నూర్చాక తన పేరు మీదే అమ్ముకునే అవకాశం ఉంటుంది.. పట్టాదారుడైన రైతు భార్య పేరును రెవిన్యూ రికార్డుల్లో సాగుదారుగా రాయిస్తే మహిళా రైతుల శ్రమకు గుర్తింపు వస్తుందా? మన దేశంలో ఏ ప్రాంతంలోనైనా.. ప్రతి ఎకరంలోనూ జరిగే వ్యవసాయ పనుల్లో మగ వాళ్లకన్నా మహిళలే ఎక్కువ సేపు పనిచేస్తున్నారు. నాట్లు.. కోతలు.. విత్తనాలు జాగ్రత్త చేయడం.. ఇలా ప్రతి పనిలోనూ మహిళల పాత్రే ఎక్కువ. కొన్ని పంటల్లో అయితే పురుషులు పనిచేసే రోజుల (మేల్ డేస్) కన్నా మహిళలే ఎక్కువ రోజులు పనిచేస్తారు. అందుకే.. ఒకవేళ మహిళా రైతుల శ్రమను, వారి అస్థిత్వాన్ని కనుక మనం అధికారికంగా గుర్తించదలచుకుంటే.. భర్త పేరుతో పట్టా ఉన్నప్పుడు భార్య పేరును సాగుదారుగా రాయమంటున్నాం. ఎందుకంటున్నామంటే.. మహిళా రైతులు రోజూ పొలానికెళ్లి పనిచేస్తారు. తమ కుటుంబ ఆస్తి అయిన పొలాల్లోనే కూలి పని చేసినట్లు అయిపోతోంది. వారి శ్రమకు గుర్తింపు దొరకడం లేదు. పొలం పనులకు కూలికి వచ్చే మహిళలకైనా ఏ రోజు కూలి డబ్బు ఆ రోజు వస్తుంది. మహిళా రైతులు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వారి చేతుల్లోకి వస్తుందో లేదో కూడా తెలియదు. ఉత్తమ సేంద్రియ రైతులుగా పేరు తెచ్చుకుంటున్న వారి పొలాల్లో కూడా నిజానికి అతని భార్య లేదా తల్లి నిరంతరం పనిచేస్తుంటారు. కానీ, పేరు వీళ్లకొస్తుంది. రైతు సంఘాల పోరాటాల్లో పాల్గొనే నేతలు కూడా ఆ పని చేయగలుగుతున్నారంటే కుటుంబంలోని మహిళా రైతు క్షేత్రస్థాయిలో తెరవెనుక ఉండి అందించే తోడ్పాటే కారణం. వాళ్లకో గుర్తింపు ఇవ్వాలి. వాళ్ల పనిని తగ్గించగలగాలి. అప్పుడు తమ సాధికారత కోసం వేరే మార్గాలు వెతుక్కోగలుగుతారు.. ఇదీ మేం చెబుతున్నది. సవాలక్ష బాధ్యతల మధ్య బొత్తిగా తీరిక లేకపోవడం (సమయాభావ దారిద్య్రం లేదా టైమ్ పావర్టీ) అనేది మహిళా రైతులకున్న పెద్ద సమస్య... మహిళా రైతుల సంక్షేమం కోసం మీరు కోరుతున్నదేమిటి? భారతీయ మహిళల స్థితిగతులపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నియమించిన జాతీయ ఉన్నత స్థాయి కమిటీలో గ్రామీణ మహిళల పక్షాన నేను సభ్యురాలిగా ఉన్నాను. వివిధ రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేసి, పరిశోధన చేసి నివేదిక అందించాం. మహిళా రైతులకు సంబంధించి ముఖ్యంగా 4 అంశాలను ప్రస్తావించాను. మహిళా రైతులకు (అస్థిత్వ) గుర్తింపు ఇవ్వాలనేది ఒక మాట. వనరులపై హక్కులు ఎలాగైనా కల్పించాలనేది రెండో మాట. వీళ్లకు భూమిపై హక్కున్నా, లేకపోయినా.. మగ రైతులతో సమానంగా సేవలు పొందే హక్కుండాలి. ఇప్పుడు.. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన చేస్తున్నప్పుడు ఇది మహిళా రైతులకు ఎంత మేరకు పనికొస్తుంది అని ఆలోచిస్తున్నదా? కొత్త విత్తన రకం తయారు చేస్తున్నప్పుడో.. కొత్త యంత్రం తయారు చేస్తున్నప్పుడో ఇవి ఉపయోగమేనా అని మహిళా రైతులను అడుగుతున్నారా? విస్తరణాధికారులు గ్రామాల్లోకి వస్తే మహిళా రైతులతో మాట్లాడతారా? మహిళా రైతులకు శిక్షణ ఇస్తారా? ఇప్పుడు మగ రైతులకు అందుతున్న ఈ సంస్థాగత సేవలతో సమానంగా మహిళా రైతులకు అందించాలి. ఇక నాలుగోది.. వ్యవసాయానికి సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే అన్ని కమిటీల్లోనూ మహిళా రైతులకు చోటు కల్పించాలి. చోటు కల్పించిన వెంటనే వాళ్లు మాట్లాడలేకపోవచ్చు. కానీ, కొన్నాళ్ల తర్వాతయినా తమకు ఉపయోగపడే పనుల గురించి నోరెత్తి అడిగే పరిస్థితి వస్తుంది. మహిళా రైతుల సాధికారతతో సాగు సంక్షోభం తగ్గుతుందా? మహిళా రైతులను మగ రైతులతో పాటు సమానంగా హక్కులు కల్పించి నట్ట్టయితే పంటల ఉత్పాదకత 25-40 శాతం మేరకు పెరుగుతుందని తేల్చిచెప్పిన అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలున్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలనుకున్నా.. గ్రామీణ మహిళల అభ్యున్నతికి పాటుపడమని చెప్తున్న అధ్యయనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మహిళా రైతుల స్థితిగతులేమిటి? మహిళా రైతుల సాగుబడిలో ఉన్న కమతాల (ఫిమేల్ ఆపరేషనల్ హోల్డింగ్స్) సంఖ్య దేశవ్యాప్తంగా 12 శాతం ఉంటే.. ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 2011 నాటి వ్యవసాయ గణాంకాల ప్రకారం.. ఇది తెలంగాణలో 34 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 28 శాతంగా ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో కూడా ఇంతకన్నా తక్కువగానే ఉన్నాయి. ఈ లెక్కలు చూసి అంతాబాగుందని అనుకోలేం. వీరిలో పట్టాదారులు తక్కువ. ఆదాయాలు తగ్గిపోతుండడంతో మగవాళ్లు వ్యవసాయాన్ని వదిలేస్తుండడంతో ఆ భారం ఎక్కువగా మహిళల భుజాలపై పడుతున్న ధోరణి (ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్) తెలుగు రాష్ట్రాల్లో ప్రబలంగా కనిపిస్తోంది. కౌలు సేద్యం విస్తరించడం, చిన్న, సన్నకారు కమతాలకు వర్తించే సంక్షేమ పథకాలు ఎక్కువగా ఉండటం, మహిళా రైతులకు రాయితీ పథకాలు ఉండటం ఇందుకు దోహదం చేసి ఉంటాయి. మహిళల సాధికారత కోసం కాకుండా.. ప్రభుత్వ సబ్సిడీలను అధికంగా రాబట్టడం కోసం మహిళలకు భూమి హక్కు ఇస్తున్న పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మహిళా రైతుల సాగుబడిలో ఉన్న కమతాల సంఖ్య ఎక్కువగా ఉన్నందు వల్ల ఉత్పాదకత పెరిగిందా..? మహిళా రైతులకు భూమి హక్కుతో పాటు మగ రైతులకు సమానంగా ఇతర ప్రోత్సాహకాలు కల్పిస్తే మహిళలు ఇంకా బాగా చేయగలుగుతారు. మరింత సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం మహిళలకు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సాగుదారులుగా నమోదైన మహిళల్లో కౌలుదారులే ఎక్కువ కనిపిస్తున్నారు. వీళ్లకు భూమి హక్కు కల్పించి, ఇతర సపోర్ట్ సిస్టమ్స్ అభివృద్ధి చేయాలి. పితృస్వామిక వ్యవస్థ కల్పించిన ఆంక్షలూ తొలగాలి. ఆ పరిస్థితుల్లో పంటల ఉత్పాదకత కూడా పెరుగుతుంది. ప్రకృతి/ సేంద్రియ సేద్యం మహిళా రైతులకు తోడ్పడుతుందా? తప్పకుండా. ప్రకృతి వ్యవసాయంలో విష రసాయనాల వాడకం ఉండదు కాబట్టి, మహిళా రైతులు, కూలీలకు ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. రసాయనిక పురుగుమందులు, కలుపు మందులు చల్లిన తర్వాత చాలా రోజుల పాటు ఆ విష ప్రభావం ఉంటుంది. పొలాల్లో ఎక్కువ సేపు పనిచేసేది మహిళలే కాబట్టి వీరంతా గాలి ద్వారా, చర్మం ద్వారా విష ప్రభావానికి గురవుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పంటల జీవవైవిధ్యం ఉంటుంది కాబట్టి.. మహిళల పాత్ర వ్యవసాయంలో మరింత కీలకంగా మారుతుంది. సహజాహారంతో కుటుంబ ఆరోగ్యం బాగుపడితే మహిళలపై భారం తగ్గుతుంది. అయితే, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంటే ఇందుకోసం రూ. పది కోట్లో రూ. వంద కోట్లో ఖర్చుపెట్టడంతోనే పని పూర్తవదు. రసాయనిక ఎరువులు, విషరసాయనాల వాడకాన్ని అత్యంత కఠినంగా అదుపు చేయాలి. సిక్కిం అదే చేసింది. కేరళ ప్రభుత్వం అతి ప్రమాదకరమైన పురుగుమందుల లెసైన్స్‌లు రద్దు చేసింది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అనివార్యం. వినియోగదారుల్లో కూడా చైతన్యం కలిగించడం, ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను నిర్మించడం అంతే అవసరం. అయితే, వ్యవసాయ సంక్షోభం తీరాలంటే ప్రభుత్వాలు మొదట రైతులకు ఆదాయ భద్రత కల్పించడంపై పూర్తిస్థాయి దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంది. కురుగంటి కవిత (kavitakuruganti@gmail.com) ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
కొనుగోలు నిర్ణేతగా గ్రామీణ మహిళ!
న్యూఢిల్లీ: కొనుగోలు నిర్ణయాల్లో గ్రామీణ మహిళలదే పైచేయి. ఏదైనా వస్తువును కొనాలా? వద్దా అనే విషయాన్ని మహిళలే నిర్ణయిస్తున్నారు. దీనికి అక్షరాస్యత శాతం పెరుగుదల కారణంగా కనిపిస్తోంది. భారతదేశపు గ్రామీణ మహిళా వినియోగదారుల కొనుగోలు ప్రాధాన్యాలు వేగంగా మారిపోతున్నాయని, అలాగే వారి నిర్ణయాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడుతోందని యాక్సెంచర్ స్ట్రాటజీ తన సర్వేలో పేర్కొంది. సర్వే ప్రకారం.. గ్రామీణ మహిళా వినియోగదారులు ఇది వరకులా కాకుండా బ్రాండెడ్, అధిక నాణ్యత కలిగిన వస్తు ఉత్పత్తుల కొనుగోలుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అలాగే వీరు వారి కుటుంబ సభ్యులతో అనుసంధానమై ఉండటానికి మొబైల్ హ్యాండ్‌సెట్స్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. నమ్మిన వారి అభిప్రాయాలకు విలువనిస్తున్నారు. -
మళ్లీ ‘మైక్రో’ కోరలు
కొత్తగూడెం: మైక్రోఫైనాన్స్ సంస్థలు మళ్లీ కోరలు చాస్తున్నాయి. రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న సంస్థలు పల్లెలను పట్టిపీడించేందుకు సిద్ధమవుతున్నాయి. మైక్రోఫైనాన్స్ ముసుగులో అధిక వడ్డీలు, అనేక రకాల స్కీములతో పల్లె ప్రజలను వంచించిన ఇవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. ‘మైక్రో’ ప్రతినిధులు గతంలో ఆ సంస్థల వద్ద రుణాలు తీసుకున్న వారి ఇళ్లకు వెళ్లి మళ్లీ అప్పు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా చాలామంది రుణాలు తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నా ఆ సంస్థల ప్రతినిధులు అలుపెరగకుండా ఇళ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత రుణాలు రద్దు చేశాం...కొత్త రుణాలు తీసుకోడంటూ మభ్యపెడుతున్నారు. ఐదేళ్ల క్రితం... ఐదేళ్ల క్రితం సుమారు పది వరకు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉండేవి. ఇవి గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తామని..రుణాలు ఇస్తామని గ్రామాల్లో సంచరిస్తుండేవి. మహిళలను గ్రూప్‌లుగా తయారు చేసి రుణాల పేరుతో అక్రమంగా రూ.కోట్లు వసూలు చేసేవి. తొలుత ఒక్కొక్కరికి రూ.5,000 రుణం ఇచ్చేవి. డాక్యుమెంటేషన్ చార్జీ పేరుతో దీనిలో రూ.500 కోత విధించేవి. ప్రతివారం పొదుపు పేరుతో సభ్యుల నుంచి అదనంగా కొంతమొత్తం వసూలు చేసేవి. గ్రూప్ సభ్యురాళ్లలో ఎవరైనా ఓ వారం వాయిదా చెల్లించకపోతే మిగిలిన వారిని కూడా అక్కడే కూర్చోబెట్టి ఫైనాన్స్ సంస్థల ప్రతి నిధులు వేధింపులకు పాల్పడేవారు. ఇలా పొదుపులు, ఇన్సూరెన్స్ పేరుతో కోట్లు దండుకున్నారు. ఈ దోపిడీని భరించలేక మహిళలు మైక్రోఫైనాన్స్ సంస్థల ప్రతినిధులపై తిరగబడ్డారు. మైక్రో సంస్థల ఆగడాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో అవి తోక ముడిచాయి. పాత బకాయిల వసూళ్ల కోసమేనా..? గతంలో మైక్రోఫైనాన్స్ నిర్వహించిన పలు సంస్థల ప్రతినిధులపై పోలీసుల దాడులు చేశారు. ఆయా సంస్థలను మూసివేయించారు. ఆ క్రమంలో లక్షలాది రూపాయలు ఫైనాన్స్ రూపంలో తీసుకున్న ప్రజలవద్ద ఉండిపోయాయి. ఆ పాత బకాయిలను మాఫీ చేసేశాం...కొత్త రుణాలు తీసుకోడంటూ ఆ సంస్థల ప్రతినిధులు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఏదో ఒక రకంగా పాత రుణాలను వసూలు చేయాలనే లక్ష్యంతో ఓ పథకం ప్రకారం పల్లెల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. కొత్త రుణాలు తీసుకునేందుకు ప్రజలు అయిష్టత వ్యక్తం చేస్తున్నా సంస్థ ప్రతినిధులు మాత్రం వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడం, పెట్టుబడులకు డబ్బు అవసరం ఉండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఫైనాన్స్ సంస్థలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. ఈ మైక్రో ఏజెంట్ల ఉచ్చులో పడి కొందరు గ్రామీణులు ఇప్పటికీ మోసపోతున్నట్లు తెలుస్తోంది.