
పల్లె మహిళ పట్టణ మహిళను దాటి ముందుకెళుతుందా?! ‘అవును’ అనే అంటున్నారు మానసిక నిపుణులు. సమస్యలు ఎదురైనా ఏ మాత్రం జంకక పరిష్కార దిశగా అడుగు వేయడంలో
పల్లె మహిళే పట్టణ మహిళ కన్నా ముందంజలో ఉందని పెన్సిల్వేనియా ఉమెన్ హెల్త్ స్టడీ ఓ నివేదికను రూపొందించింది. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న పట్టణ–గ్రామీణ మహిళలపై వీరు చేసిన స్టడీ ద్వారా ఆసక్తికర విషయాలు తెలియ జేశారు. మానసిక సమస్యలు గ్రామీణ మహిళ కన్నా పట్టణ మహిళల్లో ఎక్కువ శాతం ఉన్నట్టు గమనించారు. దీనికి సంబంధించిన కారణాలను విశ్లేషించారు.
పల్లె జీవనమే సాంత్వన
‘పట్టణ మహిళ కుటుంబంలో ఉన్నప్పటికీ మానసికంగా ఒంటరితనాన్నే ఫీలవుతుంది. వచ్చిన ఆదాయానికి, పెరుగుతున్న ఖర్చులకు పొంతన ఉండదు. ఇంటర్నెట్ వాడకం కూడా ఇందుకు కారణమే. పల్లెల్లోనూ ఈ ప్రభావం ఉన్నప్పటికీ అక్కడ శారీర శ్రమకు సంబంధించిన పనులు ఎక్కువ. దీనికి తోడు వెన్నంటి భరోసాగా ఉండే వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. తమ సమస్యలను తమలోనే దాచుకుని బాధపడరు. చుట్టుపక్కల ఇళ్ల వారిలో ఎవరికో ఒకరికి చెప్పుకుని ఊరట పొందుతారు.
అక్కడ అవకాశాలు తక్కువ. అలాగే, అసంతృప్తులూ తక్కువే’ అంటారు క్లినికల్ సైకాలజిస్ట్ రాధిక. ఎప్పుడైతే సెన్సిటివ్‌గా, సమస్యలు లేకుండా పెరుగుతారో వారిలో అభద్రతా భావం ఎక్కువ అంటారు నిపుణులు. పల్లెల్లో చిన్నప్పటి నుంచే కష్టపడే తత్త్వం ఉంటుంది. ఇంటి పనులు, బయట పనులు ఒక అలవాటుగా చేసుకుపోతుంటారు. తమకు అవి కావాలనీ, ఇవి కావాలనీ అంచనాలు, ఆశలు పెద్దగా ఉండవు. శారీరకపరమైన పనుల్లో కలిగే అలసట మనసును కూడా సేద తీరుస్తుంది. వాస్తవానికి దగ్గరగా ఉండేలా చేస్తుండటం కూడా మానసిక సమస్యలను దూరం చేస్తుందంటారు నిపుణులు.
యాక్సెప్టెన్సీ ఎక్కువ
వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల దేనిమీదా ఎక్కువ ఆశలు పెట్టుకోరు. అవి తమ జీవిత భాగస్వామి నుంచైనా సరే. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి.. అనే విషయాల పట్ల సరైన అవగాహన ఉంటుంది. రిసోర్స్ మేనేజ్‌మెంట్ పల్లెవాసులకే బాగా తెలుసు. అందుకే ఎక్కువ ఒత్తిడికి లోనవరు. వారికి వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే సమస్యలే అధికం. మిగతావన్నీ వాటి ముందు చిన్నవిగానే కనిపిస్తాయి. పిల్లలకు కూడా ఆ వాస్తవాన్ని పరిచయం చేస్తారు. ఇల్లు, సమాజం నేర్పే పాఠాలు వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి.
పట్టణప్రాంతాల్లో అవకాశాలు కోకొల్లలు. వాటి వల్ల వచ్చే సమస్యలు అంతే! అవి అందరికీ అందుబాటులో ఉండవు. వాటిని అందుకోవడం కోసం ఎలా పరుగులు పెట్టాలా అనే ఆలోచనతో ఉంటుంది పట్టణ మహిళ. తన చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడంతో తనను తాను తక్కువ చేసుకుంటుంది. ఫలితంగా రోజు రోజుకూ తనపై తనకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.
పల్లెటూరులో ఉన్నవాళ్లు కదా వాళ్లకేం తెలుసు అనేది పట్టణవాసుల అలోచన. కానీ, పల్లెటూరులో ఎప్పుడూ కష్టమే ఉంటుంది. వాటిని ఎదుర్కొనే సమర్థతా ఉంటుంది. నీడపట్టున ఉండే నగరవాసులే కష్టాన్ని ఎదుర్కోలేని సున్నితత్త్వం ఉంటుంది.
పట్టణ మహిళ మారాలి
పల్లెటూరులో ఉన్నప్పుడు ఏడుపు వస్తే పరిగెత్తుకెళ్లి అమ్మ ఒడిలో తలదాచుకోవడం తెలుసు.
చెట్టు కింద సేద తీరడం తెలుసు. మట్టికి దగ్గరగా ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలుసు. పట్టణ జీవనంలో ఎవరికి వారే. ఎవరితోనూ పంచుకోలేని సమస్యలు. కష్టాలు వస్తే ఎదుర్కొనే ధైర్యం సన్నగిల్లుతోంది. అందుకే, ముందు ఇంట్లో మహిళ మనస్తత్వం మారాలి. నెలకు ఒకసారైనా పట్టణం వదిలి, పల్లె వాతావరణంలోకి వెళ్లగలగాలి. ఒత్తిడి దశలను దాటే మార్గాలను పల్లెలే పరిచయం చేస్తాయని గ్రహించాలి. స్వచ్ఛందంగా సమాజానికి ఏ చిన్న పని చేసినా, మానసిక సాంత్వన లభిస్తుందని గ్రహించాలి. పిల్లలకు కూడా ‘నేను పడిన కష్టాన్ని నా పిల్లలు పడకూడదు’ అనుకోకుండా వారికి మన భారతీయ మూలాలను తెలియజేయాలి.
– రాధిక ఆచార్య, క్లినికల్ సైకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment