న్యూఢిల్లీ: కొనుగోలు నిర్ణయాల్లో గ్రామీణ మహిళలదే పైచేయి. ఏదైనా వస్తువును కొనాలా? వద్దా అనే విషయాన్ని మహిళలే నిర్ణయిస్తున్నారు. దీనికి అక్షరాస్యత శాతం పెరుగుదల కారణంగా కనిపిస్తోంది. భారతదేశపు గ్రామీణ మహిళా వినియోగదారుల కొనుగోలు ప్రాధాన్యాలు వేగంగా మారిపోతున్నాయని, అలాగే వారి నిర్ణయాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడుతోందని యాక్సెంచర్ స్ట్రాటజీ తన సర్వేలో పేర్కొంది. సర్వే ప్రకారం.. గ్రామీణ మహిళా వినియోగదారులు ఇది వరకులా కాకుండా బ్రాండెడ్, అధిక నాణ్యత కలిగిన వస్తు ఉత్పత్తుల కొనుగోలుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అలాగే వీరు వారి కుటుంబ సభ్యులతో అనుసంధానమై ఉండటానికి మొబైల్ హ్యాండ్‌సెట్స్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. నమ్మిన వారి అభిప్రాయాలకు విలువనిస్తున్నారు.